ఆర్థిక మంత్రిత్వ శాఖ

75 జిల్లాల్లో 75 డి.బి.యు.లు జాతికి అంకితం!


"బ్యాంకింగ్ సేవలను చివరి గమ్యం చేర్చే అంశానికే ప్రాధాన్యం ఇచ్చాం: ప్రధాని"

"ఆర్థిక భాగస్వామ్యాలను డిజిటల్ భాగస్వామ్యాలతో కలిపితే సరికొత్త అవకాశాల ప్రపంచం సాధ్యం"

జర్మనీ, చైనా, దక్షిణాఫ్రికా తదితర దేశాల కంటే భారతదేశంలో ఈరోజు ప్రతి లక్ష మంది పౌరులకూ అందుబాటులోని శాఖల సంఖ్య ఎక్కువ.

"భారతదేశంలోని డిజిటల్ బ్యాంకింగ్
మౌలిక సదుపాయాలకు,

ఐ.ఎం.ఎఫ్.నుంచి దక్కిన ప్రశంసలు"

"డిజిటలీకరణతో సామాజిక భద్రతకు
భరోసా ఇవ్వడంలో భారతదేశమే అగ్రగామిగా
ప్రపంచ బ్యాంకు చెప్పింది."

"ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు అతీతంగా
బ్యాంకింగ్ ప్రక్రియ నిర్వహణ..,

'సుపరిపాలన', 'మెరుగైన సేవల పంపిణీ'కి
మాధ్యమంగా మారిన వైనం"

"దేశంలో ఆర్థిక సమ్మిళిత ప్రక్రియకు
జన్ ధన్ ఖాతాలు పునాది అయితే,..
ఆర్థిక విప్లవానికి ఆధారం ఫిన్‌టెక్"

"దేశం యావత్తూ ఇపుడు జన్ ధన్ బ్యాంక్ ఖాతాల
సాధికారతను చవిచూస్తోంది."

"దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో
ఆర్థిక వ్యవస్థ కూడా అంతే ప్రగతిశీలంగా ఉంటుంది"

Posted On: 16 OCT 2022 2:02PM by PIB Hyderabad

 దేశవ్యాప్తంగా 75 జిల్లాల‌లో ఏర్పాటు చేసిన 75 డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్ల‌ను (డి.బి.యు.లను) ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001OT9Q.jpg

    ఈ సందర్భంగా జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, 75 డిజిట‌ల్ డి.బి.యు.లు, దేశ పౌరుల‌ ఆర్థిక సమ్మిళత ప్రక్రియను మరింత బలోపేతం చేస్తాయని, పౌరుల, ఖాతాదార్ల బ్యాంకింగ్ అనుభ‌వాన్ని మరింతగా పెంపొందిస్తాయ‌ని చెప్పారు. "సామాన్య పౌరులకు సౌకర్యవంతమైన జీవితాన్ని అందించే దిశగా డి.బి.యుల ఏర్పాటు ఒక పెద్ద ముందడుగు" అని ప్రధానమంత్రి అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో, కనీస మౌలిక సదుపాయాలతో గరిష్టస్థాయిలో సేవలను అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని, ఎటువంటి లిఖితపూర్వకమైన పని ప్రమేయం లేకుండా సేవలన్నీ డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞాన రూపంలో జరుగుతాయని ప్రధాన మంత్రి తెలిపారు. బలమైన, సురక్షితమైన బ్యాంకింగ్ వ్యవస్థను అందించడంతోపాటు బ్యాంకింగ్ పద్ధతిని కూడా ఈ వ్యవస్థ సులభతరం, సరళతరం చేస్తుందని ఆయన అన్నారు. “చిన్న,చిన్న పట్టణాలు, గ్రామాలలో నివసించే వ్యక్తులు రుణాలు పొందేందుకు డబ్బును బదిలీ చేయడం వంటి ప్రయోజనాలను పొందేందుకు ఇవి దోహదపడతాయి. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల ఏర్పాటు ఆ దిశగా మరో పెద్ద ముందడుగు, సామాన్యుల జీవితాన్ని మరింత సులభతరం చేయడానికి ఈ వ్యవస్థ దేశంలో కొనసాగుతోంది. సామాన్య పౌరుడిని సాధికారంగా తీర్చిదిద్దడం, వారిని శక్తివంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం“ అని ఆయన అన్నారు. ఫలితంగా చివరి వ్యక్తి ప్రయోజనాన్ని కూడా, మొత్తం ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ ప్రజల సంక్షేమం లక్ష్యంగా పలు విధానాలను రూపొందించామని ప్రధాని చెప్పారు. ప్రభుత్వం ఏకకాలంలో పనిచేసిన రెండు రంగాలను గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.  మొదటిది, బ్యాంకింగ్ వ్యవస్థను సంస్కరించడం, బలోపేతం చేయడం, పారదర్శకంగా రూపొందించడం,... రెండవది ఆర్థిక సమ్మిళితం చేయడం... బ్యాంకులకు వెళ్లడానికి గతంలో ప్రజలు అనుసరించిన సంప్రదాయ పద్ధతులను ప్రధాని గుర్తు చేస్తూ, బ్యాంకులను మరింతగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లడం ద్వారా బ్యాంకింగ్ విధానాన్ని ప్రభుత్వం సమూలంగా మార్చివేసిందన్నారు. "బ్యాంకింగ్ సేవలు చిట్టచివరి చివరి గమ్యానికి, చివరి ఖాతాదారుకు చేర్చే పద్ధతులకు మేం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం" అని ప్రధాని చెప్పారు. పేదలు బ్యాంకులకు వెళతారని భావించిన గతకాలంతో పోల్చితే, బ్యాంకులే పేదల ముంగిటికి వెళ్తున్న దృశ్యం ఇపుడు కనిపిస్తోందని. ఎంతో భారీ పరివర్తనకు ఇది సూచన అని, పేదలకు, బ్యాంకులకు మధ్య దూరం గణనీయంగా తగ్గిందని ఆయన అన్నారు. "భౌతిక దూరాన్ని మాత్రమే కాక, మానసిక దూరాన్ని  కూడా మేం తొలగించాం." అని వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్‌తో సుదూర ప్రాంతాలను అనుసంధానం చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, ఈ రోజు దేశంలోని 99 శాతానికి పైగా గ్రామాలలో 5 కి.మీ పరిధిలో బ్యాంకు శాఖ, బ్యాంకింగ్ అవుట్‌లెట్ లేదా ‘బ్యాంకింగ్ మిత్ర’ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. "సాధారణ పౌరులకు బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి విస్తృతమైన తపాలా కార్యాలయాల వ్యవస్థ కృషి చేసింది. ఇండియా పోస్ట్ బ్యాంక్‌ల ఏర్పాటు ద్వారా ఇది జరిగింది." అని ఆయన చెప్పారు. జర్మనీ, చైనా మరియు దక్షిణాఫ్రికా వంటి దేశాలతో పోల్చితే ఈ రోజు భారతదేశంలో ప్రతి లక్ష మంది పౌరులకు అందుబాటులో ఉన్న బ్యాంకు శాఖల సంఖ్య ఎక్కువగా ఉంది," అని ప్రధాని అన్నారు.

   జన్ ధన్ యోజన పథకంపై మొదట్లో మొదట్లో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ,  “జన్ ధన్ బ్యాంక్ ఖాతాల శక్తి,, సాధికారత అంటే ఏమిటో ఈరోజు దేశం యావత్తూ చవిచూస్తోంది” అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రభుత్వం చాలా తక్కువ ప్రీమియంతో బలహీన వర్గాలకు బీమా సదుపాయం అందించడానికి ఈ ఖాతాల వ్యవస్థ వీలు కల్పించిందన్నారు. “ఏమీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే పేదలకు రుణాల అందించేందుకు ఈ పథకం అవకాశం కల్పించింది. లబ్ధిదారుల ఖాతాలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ సౌకర్యాన్ని అందించింది. ఇళ్లు, మరుగుదొడ్లు, గ్యాస్ సబ్సిడీతో పాటుగా రైతులకు పథకాల ప్రయోజనాలను సజావుగా, నిరాటంకంగా అందజేయడంలో ఈ ఖాతాలదే కీలకపాత్ర’’ అని ఆయన చెప్పారు.

  భారతదేశపు డిజిటల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని ప్రధాన మంత్రి అన్నారు.  “భారతదేశం డిజిటల్ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల తీరును అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ (ఐ.ఎం.ఎఫ్.) అభినందించింది. మనదేశంలోని పేదలు, రైతులు, శ్రామికులకే ఈ ఘనత చెందుతుంది, వారు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తూ,  ఆ పరిజ్ఞానాన్ని తమ జీవితంలోనే భాగంగా చేసుకున్నారు” అని ఆయన అన్నారు. "యు.పి.ఎ. చెల్లంపుల వ్యవస్థ,.. భారతదేశానికి కొత్త అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్థిక భాగస్వామ్యాలను, డిజిటల్ భాగస్వామ్యాలతో కలిపినప్పుడు, అవకాశాలతో కూడిన సరికొత్త ప్రపంచం అందుబాటులోకి వస్తుంది. యు.పి.ఐ. వ్యవస్థ వంటి భారీ స్థాయి నిదర్శనం మన కళ్లముందు ఉంది. ప్రపంచంలోనే ఈ తరహా టెక్నాలజీ అమలుకావడం ఇదే తొలిసారి. ఇందుకు భారతదేశం గర్విస్తోంది.“ అని ప్రధాని అన్నారు. ఈ రోజున దేశంలో 70 కోట్ల స్వదేశీ రూపే కార్డులు పని చేస్తున్నాయని, విదేశీ సంస్థల ద్వారా సేవలను పొందిన గతకాలంతో పోల్చినపుడు ఇది పెనుమార్పేనని ఆయన తెలపారు.

   "సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థలతో కూడిన ఈ కలయిక పేదప్రజల గౌరవాన్ని, ఆర్థిక స్థోమతను మెరుగుపరుస్తుంది. మధ్యతరగతి పౌరులకు సాధికారతను అందిస్తుంది.  అదే సమయంలో డిజిటల్ పరిజ్ఞానపరంగా దేశంలో నెలకొన్న అంతరాలను కూడా తొలగిస్తోంది" అని ప్రధాని అన్నారు. అవినీతి నిర్మూలనలో ప్రత్యక్ష నగదు బదలీ (డి.బి.టి.) వ్యవస్థ పాత్ర ఎంతో కీలకమని ఆయన ప్రశంసించారు. డి.బి.టి. ద్వారా వివిధ పథకాల కింద 25 లక్షల కోట్ల రూపాయలకు పైగా బదిలీ జరిగిందన్నారు. తదుపరి విడత ప్రత్యక్ష ప్రయోజనాన్ని రేపు రైతులకు బదిలీ చేస్తామని తెలిపారు.  “ఈ డి.బి.టి. వ్యవస్థను, భారతదేశం డిజిటల్ సాంకేతిక శక్తిని ఈ రోజు ప్రపంచం యావత్తూ అభినందిస్తోంది. ప్రపంచస్థాయి నమూనా వ్యవస్థగా దీన్ని పరిగణిస్తున్నారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా సామాజిక భద్రతకు భరోసా కల్పించడంలో భారతదేశం అగ్రగామిగా నిలిచిందని ప్రపంచ బ్యాంక్ చెప్పుకునే స్థాయికి మనం చేరుకున్నాం.”, అని ప్రధాన మంత్రి అన్నారు. ఆర్థిక సాంకేతికత (ఫిన్‌టెక్) అనేది భారతదేశ విధానాలకు, కృషికి గుండెకాయ వంటిదని, దేశభవితను రూపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఫిన్‌టెక్ సామర్థ్యాన్ని డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు (డి.బి.యు.) మరింత విస్తరింపజేస్తాయని అన్నారు. "జన్‌ ధన్ ఖాతాలు దేశంలో ఆర్థిక సమ్మిళిత వ్యవస్థకు పునాది వంటివి అయితే,  ఫిన్‌టెక్ అనేది ఆర్థిక విప్లవానికి పునాది అవుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు.  ఈ తరహా టెక్నాలజీ  ప్రపంచంలోనే ఇదే మొదటిది కావడం ఇది భారతదేశానికి గర్వకారణమని అన్నారు.

   “ఈ సాంకేతికత, ఆర్థిక వ్యవస్థల కలయికతో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ కరెన్సీని ప్రారంభించాలన్న ప్రభుత్వ ప్రకటనను ప్రధాని ప్రస్తావిస్తూ, “రాబోయే కాలపు డిజిటల్ కరెన్సీ అయినా, లేదా ప్రస్తుతం అమలులో ఉన్న డిజిటల్ లావాదేవీలైనా  ఆర్థిక వ్యవస్థతో పాటు, అనేక ముఖ్యమైన అంశాలు ముడిపడి ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పొదుపు, భౌతిక కరెన్సీ నిర్వహణలో అవాంతరాల తొలగింపు, పర్యావరణ ప్రయోజనాలను ఈ వ్యవస్థ అందించే ముఖ్య సేవలుగా ప్రధాని పేర్కొన్నారు. కరెన్సీ ప్రింటింగ్ కోసం కాగితాన్ని, ఇంక్‌ను మనం దిగుమతి చేసుకుంటున్నామని, డిజిటల్ ఎకానమీని అవలంబించడం ద్వారా స్వావలంబనతో కూడిన భారతదేశ నిర్మాణానికి మనం దోహదపడుతున్నామని, అలాగే కాగితం వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేకూర్చుగలుగుతున్నామని ప్రధాని అన్నారు.

   ఆర్థిక లావాదేవీలకు అతీతంగా నేడు బ్యాంకింగ్ వ్యవస్థ మారిందని, ‘సుపరిపాలన’ను, ‘మెరుగైన సేవల బట్వాడా’ను అందించే మాధ్యమంగా తయారైందని, ప్రధాని అన్నారు. నేడు, ప్రైవేట్ రంగం, చిన్న తరహా పరిశ్రమల వృద్ధికి ఈ వ్యవస్థ అపారమైన అవకాశాలను కల్పించిందన్నారు. కొత్త స్టార్టప్ సానుకూల వ్యవస్థను సృష్టించని ఉత్పాదనగానీ, సాంకేతిక పరిజ్ఞానంతో తయారుకాని సేవల బట్వాడా కానీ ఈ రోజున దేశంలో దాదాపుగా కనిపించదని అన్నారు. "మన ఆర్థిక వ్యవస్థకు, మన స్టార్టప్ ప్రపంచానికి, మేక్ ఇన్ ఇండియా-స్వావలంబనకు  ఈరోజు డిజిటల్ ఎకానమీ అనేది గొప్ప బలం" అని అన్నారు. “ఈ రోజు మన చిన్న పరిశ్రమలు, మన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎం.ఎస్.ఎం.ఇ.లు) కూడా గవర్నమెంట్ ఇ మార్కెట్ ప్లేస్ (జి.ఇ.ఎం.) వంటి వ్యవస్థ ద్వారా ప్రభుత్వ టెండర్లలో పాల్గొంటున్నాయి. వాటికి కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఇప్పటి వరకు రూ.2.5 లక్షల కోట్ల విలువైన ఆర్డర్లను జి.ఇ.ఎం.పై అందుబాటులో ఉంచారు. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల ద్వారా మరిన్ని కొత్త అవకాశాలు ఇప్పుడు పుట్టుకొస్తాయి” అని ప్రధాని అన్నారు.

   “బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే, ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా అంతే ప్రగతిశీలంగా ఉంటుంది” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. 2014వ సంవత్సరానికి ముందు ఉన్న ‘ఫోన్ బ్యాంకింగ్’ వ్యవస్థ నుంచి దేశం గత ఎనిమిదేళ్లలో డిజిటల్ బ్యాంకింగ్‌కు మారిందని, ఫలితంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిరంతరంగా పురోగమిస్తున్నదని అన్నారు.  2014కు ముందు బ్యాంకులు తమ పనితీరును మధింపు చేసుకునేందుకు ఫోన్‌ కాల్స్‌పై ఆధారపడేవని, ప్రధాని గుర్తు చేశారు. ఫోన్ బ్యాంకింగ్ రాజకీయాల వల్ల బ్యాంకులకు భద్రత లేకుండా పోయిందని, వేల కోట్ల కుంభకోణాలకు బీజంపడటంతో దేశ ఆర్థిక వ్యవస్థకు భద్రత తగ్గిందని అన్నారు. ఆ వ్యవస్థను ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఎలా పూర్తిగా మార్చిందో  ప్ర‌ధాన మంత్రి వివరించారు. పార‌ద‌ర్శ‌క‌త‌పై ప్రభుత్వం ప్ర‌ధానంగా దృష్టిని సారించినట్టు తెలిపారు.  “నిరర్థక ఆస్తుల (ఎన్‌.పి.ఎ.ల) గుర్తింపులో పారదర్శకతను తీసుకువచ్చిన తరువాత, లక్షల కోట్ల రూపాయలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి తీసుకురాగలిగాం. బ్యాంకులకు తిరిగి పెట్టుబడులను అందించగలిగాం. ఉద్దేశపూర్వకంగా, కావాలనే బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు రుణాలను ఎగవేసేవారిపై చర్యలు తీసుకున్నాం. అవినీతి నిరోధక చట్టాన్ని కూడా సంస్కరించాం. పారదర్శకమైన, శాస్త్రీయ వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా పనిచేశాం." అని అన్నారు.

 రుణాల కోసం సాంకేతికత, విశ్లేషణల వినియోగాన్ని ప్రోత్సహిస్తూనే, ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐ.బి.సి.) సహాయంతో ఎన్.పి.ఎ. సంబంధిత సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేశామని అన్నారు.  డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు, ఫిన్‌టెక్ వినూత్న వినియోగం వంటి కొత్త కార్యక్రమాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ కోసం ఇప్పుడు కొత్త స్వయం ఛోదిత యంత్రాంగాన్ని సృష్టిస్తున్నట్టు చెప్పారు. వినియోగదారులకు ఎంత స్వయంప్రతిపత్తి ఉందో, బ్యాంకులకు కూడా అదే సౌలభ్యం, పారదర్శకత ఉందని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భాగస్వామ్యవర్గాల వారికి ప్రధాని విజ్ఞప్తి చేశారు.

   చిన్న వ్యాపారాలు, వాణిజ్య సంస్థల యజమానులు పూర్తిగా డిజిటల్ లావాదేవీల వైపు మారిపోవాలని ప్రధాని తన ప్రసంగం చివర్లో విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా చిన్నతరహా వ్యాపారులు డిజిటల్‌ వ్యవస్థకు మారేందుకు 100 మంది చొప్పన వ్యాపారులను తమతో అనుసంధానం చేసుకోవాలని ఆయన బ్యాంకులకు సూచించారు. "మన బ్యాంకింగ్ వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను భావి సవాళ్లకు సిద్ధంగా ఉండేలా తయారు చేసేందుకు ఈ చర్య దోహదపడుతుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను." అని ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

    కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ,.. భారతదేశంలోకి డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు, మరింత విస్తృతంగా సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ అమృత్ కాలంలో దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డి.బి.యు.లను) షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు,..  ఏర్పాటు చేస్తున్నాయన్నారు. వాషింగ్టన్ డి.సి.నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె డిజిటల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సొంత కంప్యూటర్ లేనివారు, ల్యాప్‌టాప్ లేనివారు, స్మార్ట్‌ఫోన్ కూడా లేని వ్యక్తులు బ్యాంకింగ్ సేవలను పొందగలిగే అవకాశాన్ని డి.బి.యు.లు కల్పిస్తాయని అన్నారు. వారు బ్యాంకింగ్ సేవలను, కాగితరహితంగా, డిజిటల్‌ పద్ధతిలో పొందవచ్చని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేనివారు కూడా ఈ కాగిత రహిత సేవలను పొందేందుకు వీలుగా ఒక పద్ధతి అందుబాటులో ఉందని అన్నారు.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002GCGB.jpg

అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్నివినియోగించుకోవడం తమ ప్రభుత్వ ప్రత్యేకత అని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. “రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ.) గవర్నర్  పేర్కొన్నట్టుగా, కాగిత రహిత కార్యకలాపాలు ప్రతి రోజూ 24 గంటలూ, వారంలో 7రోజులూ అందుబాటులో ఉంటాయి. నగదు డిపాజిట్ సౌకర్యాలు, లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్, లేదా రికరింగ్ డిపాజిట్లు, డిపాజిట్‌ను తెరవడం తదితర సేవలన్నింటినీ పొందవచ్చు. జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ క్రెడిట్ లింక్ స్కీమ్‌లు సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటాయి, ఎం.ఎస్.ఎం.ఇ.లు, రిటైల్ రుణ వినియోగదారులు ప్రయోజనం పొందవచ్చు.“ అని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ డి.బి.యు.ల ద్వారా ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించవచ్చని, భారత ఆర్థిక వ్యవస్థను మరింతగా డిజిటలీకరణ చేయడంలో ఆర్థిక సమ్మిళిత ప్రక్రియ, డిజిటల్ బ్యాంకింగ్ మరో అడుగు ముందుకు వెళ్లాయని అన్నారు. “ఆర్థిక అక్షరాస్యతను, బ్యాంకు ఖాతాదారుల కోసం డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి, మీ పరిసరాల్లోని చిన్న వ్యాపార యూనిట్ల కోసం ప్రతిరోజూ కనీసం కొంత సమయం కేటాయించాలని ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతినిధులందరినీ నేను కోరుతున్నాను“ అని కేంద్రమంత్రి సీతారామన్ అన్నారు. “డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రాచుర్యం పొందడం మనకు చాలా ముఖ్యం, అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది వినియోగదారునికి తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతి. ఈ పద్ధతి సురక్షితంగా కూడా ఉంటుంది. బ్యాంకింగ్ ఏజెంట్లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, బ్యాంక్ మేనేజర్లు, అధికారులందరూ ఈ ఆలోచనలను ప్రోత్సహించాలి, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ సాధికారతను సాధించవచ్చు.“ అని అన్నారు. ఈ వ్యవస్థను చాలా సమర్థవంతంగా తీర్చిదిద్దిన రిజర్వ్ బ్యాంకును, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్‌ను (ఐ.బి.ఎ.ను) ఆమె అభినందించారు. భారతదేశంలో మరింత వేగవంతమైన డిజిటల్ బ్యాంకింగ్‌ ప్రక్రియను అందించడంలో డి.బి.యు.లు ఎంతగానో దోహదపడతాయని, నగదు రహితంగా, సమ్మిళితంగా మన ఆర్థిక వ్యవస్థ పయనించడానికి ఇవి సహాయపడతాయని కేంద్రఆర్థిక మంత్రి అన్నారు.

    రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ ఈ సందర్భంగా,  ప్రసంగిస్తూ, మనమంతా స్వాతంత్ర్య అమృతోత్సవాలను ('ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను) జరుపుకుంటున్న తరుణంలో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డి.బి.యు.లను) ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడం నిజంగా చారిత్రాత్మకమని అన్నారు. ప్రభుత్వం,రిజర్వ్ బ్యాంకు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, భాగస్వామ్య బ్యాంకులు సమైక్యంగా చూపించిన చొరవతోనే ఇది సాధ్యమైదని ఆయన అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BY2G.jpg

    దేశంలో బ్యాంకింగ్ సేవలను అందించడానికి డిజిటల్ బ్యాంకింగ్ ఒక ప్రాధాన్య ఛానెల్‌గా ఇటీవలి సంవత్సరాలలో ఆవిర్భవించిందని రజర్వ్ బ్యాంకు గవర్నర్ చెప్పారు. బ్యాంకింగ్ సేవల కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత మెరుగ్గా అందుబాటులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంకు అనేక ప్రగతిశీల చర్యలు తీసుకుంటోందని అన్నారు. దేశంలో 75 డి.బి.యుల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం 2022-23సంవత్సరపు బడ్టెట్‌లో ప్రకటన చేసిన తర్వాత, భారతీయ బ్యాంకుల సంఘం (ఐ.బి.ఎ.),  బ్యాంకింగ్ నిపుణులను సంప్రదించిన తర్వాత అవసరమైన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంకు జారీ చేసిందని అన్నారు. ఈ చొరవపట్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని వాణిజ్య బ్యాంకులు చాలా సానుకూలంగా స్పందించాయని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. మన స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని 75 జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఆరు నెలల వ్యవధిలోనే 75 డి.బి.యు.లు ఏర్పాటయ్యాయని అన్నారు.  డిజిటల్ వ్యవస్థలో ఎంతో సామర్థ్యంగా డి.బి.యు.లు పనిచేస్తాయని, అవాంతరాలు లేనిరీతిలో బ్యాంకింగ్ లావాదేవీలను సులభతరం చేయడం ద్వారా ఖాతాదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయని, కాగితరహింగా, సమర్థవంతమైన, సురక్షితమైన వాతావరణంలో బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా ఆర్థిక సమ్మిళిత ప్రక్రియను ప్రోత్సహించడానికి ఈ చర్య దోహదపడుతుందని చెప్పారు. డి.బి.యు.లు అందించే నిర్దిష్ట ఆర్థిక సేవలలో పొదుపు పథకాలు, రుణ సదుపాయం, పెట్టుబడి, బీమా వంటివి ఉన్నాయని అన్నారు.

   ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రక్రియనుంచి, రుణాల బట్వాడా వరకూ అన్ని సదుపాయాలను, ఎం.ఎస్.ఎం.ఇ. రుణాల పూర్తిస్థాయి ప్రాసెసింగ్‌ ప్రక్రియను ఈ డి.బి.యు.లు సమర్థంగా అందిస్తాయని అన్నారు. "గుర్తించిన నిర్దిష్ట ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించిన సేవలను కూడా డి.బి.యు.లు అందిస్తాయి. ఈ యూనిట్లలోని ఉత్పత్తులు,  సేవలను స్వీయ-సేవ-సహాయక మోడ్‌లు అనే రెండు పద్ధతుల్లో ఇవి అందిస్తాయి. డి.బి.యులను విస్తరింపజేసేందుకు బ్యాంకుల డిజిటల్ బిజినెస్ ఫెసిలిటేటర్లు, బిజినెస్ కరస్పాండెంట్ల సేవలను 24 గంటలూ, సంవత్సరంలో 365 రోజులూ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు." అని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సూచించారు.

   ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి; వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు; కేంద్ర, రాష్ట్రాల మంత్రులు; రిజర్వ్ బ్యాంకు గవర్నర్I; కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు; పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు; భారత ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ డి.బి.యు.లకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్లు-ముఖ్య కార్యనిర్వహణాధి కారులు, వివిధ బ్యాంకుల అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 75 డి.బి.యు.లవద్ద నియమించిన అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి అనుసంధానమై పాల్గొన్నారు.

 

డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు (డి.బి.యు.లు) గురించి

    ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ.సి.టి.) మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని వారు డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బ్యాంకింగ్ సేవలను పొందేందుకు ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు (డి.బి.యు.లు) వీలు కల్పిస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం లేని వారు డిజిటల్ బ్యాంకింగ్‌ను అవలంబించడానికి కూడా ఈ యూనిట్ల ప్రతినిధులు సహాయపడతారు. డి.బి.యులలో, ఉత్పత్తులు, సేవలను వినియోగదారులకు రెండు పద్ధతుల్లో అందిస్తారు.:

 • స్వీయ సేవా  పద్ధతి

 • డిజిటల్ సహాయక పద్ధతి

ఈ దిగువన పేర్కొన్న అంశాలకు సంబంధించి డి.బి.యు.లు సాంప్రదాయ శాఖలకు భిన్నంగా ఉంటాయి:

నగదు డిపాజిట్, ఉపసంహరణ సహా వివిధ బ్యాంకింగ్ సేవలను 24 గంటలూ అవి అందిస్తాయి.

సేవలను డిజిటల్‌ పరిజ్ఞానరూపంలో అందిస్తారు.  

 • కనెక్టివిటీ లేదా కంప్యూటింగ్ పరికరాలు లేని వ్యక్తులు డి.బి.యు.లనుంచి కాగిత రహిత పద్ధతిలో వివిధ రకాల బ్యాంకింగ్ లావాదేవీలు చేయవచ్చు.

సహాయక మోడ్‌లో బ్యాంకింగ్ లావాదేవీల కోసం వినియోగదారులకు సహాయం చేయడానికి,  మార్గనిర్దేశం చేయడానికి బ్యాంక్ సిబ్బంది అందుబాటులో ఉంటారు

 • డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతను అందించడానికి, డిజిటల్ బ్యాంకింగ్‌ను అవలంబించడానికి తగిన అవగాహన కల్పించడంలో ఈ వ్యవస్థ దోహదపడుతుంది.

   డి.బి.యు.ల వ్యవస్థ ద్వారా అందించే సేవలలో,..  సేవింగ్స్ ఖాతా తెరవడం, ఖాతాలో ఉన్న సొమ్మును సరిచూసుకోవడం, పాస్‌బుక్ ప్రింటింగ్ సదుపాయం., నిధుల బదిలీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి, రుణ దరఖాస్తులు, జారీ చేసిన చెక్కులకు సంబంధించి స్టాప్-పేమెంట్ సూచనలు, క్రెడిట్/డెబిట్ కార్డ్‌లకోసం దరఖాస్తు, ఖాతా స్టేట్‌మెంట్ వీక్షణ వంటి బ్యాంకింగ్ సౌకర్యాలు ఈ వ్యవస్థలో ఉన్నాయి. ఖాతా, పన్నులు చెల్లించడం, బిల్లులు చెల్లించడం, నామినేషన్లు చేయడం మొదలైనవి కూడా డి.బి.యు.ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ క్రెడిట్ లింక్ పథకాలకు ఆన్‌బోర్డింగ్, స్మాల్ టికెట్ ఎం.ఎస్.ఎం.ఇ./రిటైల్ లోన్‌ల సంపూర్ణ ప్రాసెసింగ్‌ ప్రక్రియలను కూడా డి.బి.యు.లు సులభతరం చేస్తాయి.

   నేపథ్యం

    ఆర్థిక సమ్మిళిత ప్రక్రియను మరింత వేళ్లూనుకునేలా చేసే కృషిలో మరో చర్యగా,75 డి.బి.యు.లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జాతికి అంకితం చేశారు. 75వ స్వాతంత్ర్యం వచ్చిన 75 వార్షికోత్సవాల జ్ఞాపకార్థం 75 జిల్లాల్లో 75 డిబియులను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి 2022-23వ సంవత్సరపు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. డిజిటల్ బ్యాంకింగ్ ప్రయోజనాలు దేశంలోని ప్రతి మారుమూలకు చేరేలా, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చేరువ చేసే లక్ష్యంతో డి.బి.యు.లను తీర్చిదిద్దారు. దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 12 ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఈ కృషిలో పాల్గొంటున్నాయి.

   ప్రజలకు సేవింగ్స్ ఖాతాలు తెరవడం, బ్యాలెన్స్-చెక్ చేసుకోవడం, పాస్‌బుక్‌ల ప్రింటింగ్, నిధుల బదిలీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి, రుణ దరఖాస్తులు, చెల్లింపులను నిలిపివేయడం వంటి అనేక రకాల డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలను డి.బి.యు.లు ప్రజలకు అందిస్తాయి. జారీ చేసిన చెక్కులు, క్రెడిట్/డెబిట్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేయడం, ఖాతా స్టేట్‌మెంట్లను వీక్షించడం, పన్నులు-బిల్లులు చెల్లించడం, నామినేషన్లు చేయడం మొదలైన పనులను కూడా ఇవి నిర్వర్తిస్తాయి. బ్యాంకింగ్ ఉత్పత్తులు, ఖర్చుకు తగిన సేవలు, అనుకూలమైన యాక్సెస్, మెరుగైన డిజిటల్ అనుభవాన్ని ఖాతాదార్లు పొందేలా డి.బి.యు.లు దోహదపడతాయి.  డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతను వ్యాప్తి చేస్తాయి. సైబర్ సెక్యూరిటీ అంశాలపై అవగాహన, రక్షణ ఏర్పాట్లపై ఖాతాదార్ల అవగాహనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే,  ఖాతాదార్లకు నేరుగా లేదా బిజినెస్ ఫెసిలిటేటర్లు/కరస్పాండెంట్‌ల ద్వారా డి.బి.యు.లు అందించే వ్యాపారం సేవలు, వాటినుంచి ఉత్పన్నమయ్యే కస్టమర్ ఫిర్యాదులకు సంబంధించి తగిన సహాయం అందించడానికి, సమస్యల పరిష్కరించడానికి తగినన్ని డిజిటల్ ఏర్పాట్లు కూడా ఖాతాదార్లకు అందుబాటులో ఉంటాయి.

 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (డి.బి.యు.ల) జాబితాను చూడటానికి ఇక్కడ క్లిక్ క్లిక్ చేయండి .

*** 



(Release ID: 1868388) Visitor Counter : 242