మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
యువ రచయితల మెంటరింగ్ కు పిఎం పథకం - యువ 2.0 - ప్రారంభం
Posted On:
02 OCT 2022 5:54PM by PIB Hyderabad
విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ ఉమ్మడిగా యువ రచయితల మెంటరింగ్ కు ప్రధానమంత్రి పథకం యువ 2.0ని ప్రారంభించాయి. ఈ పథకం కింద యువ, ఔత్సాహిక రచయితల్లో (30 సంవత్సరాల లోపు వారు) చదవడం, పుస్తకాలు రచించడం అలవాట్లను ప్రోత్సహించి పుస్తక సంస్కృతిని అలవరుస్తుంది. ప్రాజెక్ట్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా భారత రచనలను ప్రోత్సహిస్తుంది. యువ తొలి విడత చూపిన అద్భుత ప్రభావాన్ని, ఆ కార్యక్రమంలో ఆంగ్లం, 22 భారతీయ భాషలకు చెందిన యువ, ఔత్సాహిక రచయితలు భారీ సంఖ్యలో పాల్గొన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని యువ 2.0 పథకం చేపట్టారు.
భారత ప్రజాస్వామ్యం గురించి అర్ధం చేసుకుని దాన్ని ప్రచారం చేయడానికి యువతను ప్రోత్సహంచాలన్న ప్రధానమంత్రి విజన్ ఆధారంగా యువ 2.0 (యువ, వర్థమాన, బహుముఖీన రచయితలు) ప్రారంభించారు. ప్రజాస్వామ్యంపై (సంస్థలు, సంఘటనలు, ప్రజలు, రాజ్యాంగ విలువలు -పూర్వ, వర్తమాన, భవిష్యత్) నవ దృక్పథంతో కూడిన సృజనాత్మక రచనలు ప్రోత్సహించడం ఇండియా @ 75లో (ఆజాదీ కా అమృత్ మహోత్సవ్) భాగంగా ప్రారంభించిన ఈ యువ 2.0 కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఆ రకంగా ఈ పథకం భారతీయ వైభవం, సంస్కృతి, జ్ఞాన వ్యవస్థకు సంబంధించిన విభిన్న అంశాలపై రచనలు చేయడానికి సహాయకారిగా ఉంటుంది.
యువ మనసులను సాధికారం చేయాలని, యువ పాఠకులు/ అభ్యాసకులు భవిష్యత్ ప్రపంచంలో నాయకత్వ పాత్రలు పోషించేందుకు అనుకూలమైన అధ్యయన వాతావరణం కల్పించాలని ఎన్ఇపి 2020 నొక్కి చెబుతోంది. 66% యువజనాభాతో భారతదేశం చార్టుల్లో అగ్రస్థానంలో ఉంది. సామర్థ్యాల నిర్మాణానికి తద్వారా జాతి నిర్మాణానికి ఈ ప్రతిభను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవసి ఉంది. ఈ యువ సృజనాత్మక రచయితల్లో కొత్త తరానికి సమర్థవంతమైన మార్గదర్శకం చేయడం లక్ష్యంగా అత్యున్నత స్థాయిలో కృషి చేయాల్సిఉంది. ఈ కోణంలో సృజనాత్మక ప్రపంచానికి పునాది వేయడంలో యువ 2.20 ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది.
విధానాల అమలు విభాగం అయిన విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహణలోని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా మెంటర్ షిప్ పథకం దశలవారీగా అమలుపరుస్తుంది. ఈ స్కీమ్ కింద రచించిన పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురిస్తుంది. అంతే కాదు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ను ప్రోత్సహించేందుకు సాంస్కృతిక, సాహితీ విలువలు గల పుస్తకాలను ఇతర భాషల్లో అనువాదం చేయిస్తుంది. ఎంపికైన ఈ యువ రచయితలు ప్రపంచంలోని ఉత్తమ రచయితలతో సంభాషించడమే కాకుండా సాహితీ ఉత్సవాల్లో కూడా పాల్గొనే అవకాశం పొందుతారు.
భారత ప్రజాస్వామ్యం పూర్వం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించి వివిధ కోణాలపై ఈ యువ రచయితలు రచనలు చేసేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. అంతే కాదు, ఆకాంక్షాపూరితులైన యువకులు తమకు తాము వివిధ అంతర్జాతీయ వేదికలపై భారత ప్రజాస్వామ్య విలువల గురించి సమగ్ర విశ్లేషణ అందించడంతో పాటు తమను తాము సంసిద్ధం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. 21వ శతాబ్ది అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు దీటైన రచనలు అందించగలిగే యువ రచయితలను తయారుచేయడం, భారత సాహిత్య రాయబారుల రూపకల్పన లక్ష్యంగా ఈ స్కీమ్ రూపొందించారు. పుస్తక ప్రచురణలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానంలోఉండడంతో పాటు భారీ దేశీయ సాహితీ గని కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రపంచ యవనికపై భారతదేశం తన ప్రాచీన వైభవాన్ని ప్రకటించుకోవడం తప్పనిసరి.
యువ 2.0 (యువ, వర్థమాన, బహుముఖీన రచయితలు) ఈ దిగువ విధంగా ఉంది.
- 2022 అక్టోబర్ 2వ తేదీన స్కీమ్ ప్రకటన
- 2022 అక్టోబర్ 2 నుంచి 2022 నవంబర్ 30 మధ్య కాలంలో https://www.mygov.in/ ద్వారా జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్ష ద్వారా 75 మంది రచయితల ఎంపిక
- 2022 డిసెంబర్ 1 నుంచి 2023 జనవరి 31 మధ్యలో తుది గడువు నాటికి అందిన ప్రతిపాదనల
- 2023 ఫిబ్రవరి 28న విజేతల ప్రకటన
- ఎంపికైన యువ రచయితలకు 2023 మార్చి 1 నుంచి 2023 ఆగస్టు 31 తేదీల మధ్య కాలంలో ప్రముఖ రచయితలు/ మెంటార్లతో శిక్షణ
- ఈ మెంటర్ షిప్ కింద ప్రచురించిన తొలి విడత రచనలు 2023 అక్టోబర్ 2వ తేదీన విడుదల
***
(Release ID: 1864694)
Visitor Counter : 377