స్పెషల్ సర్వీస్ మరియు ఫీచర్ లు
రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.9 శాతంగా నిర్ణయించిన ఆర్‌బీఐ
2022-23లో జీడీపీ వృద్ధి 7.0 శాతంగా ఉంటుందని అంచనా;
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు త్వరలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం;
ఆఫ్‌లైన్ చెల్లింపు సంధాన సంస్థలపై నియంత్రణకు ప్రతిపాదన
प्रविष्टि तिथि:
30 SEP 2022 12:55PM by PIB Hyderabad
రెపో రేటు 5.9 శాతానికి పెంపు
వాణిజ్య బ్యాంకులకు భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఇచ్చే రుణాలపై రెపో రేటు మరోసారి 50 బేసిస్ పాయింట్లు పెరిగింది. ప్రపంచ ఆర్థిక వాతావరణ ప్రతికూలత ప్రభావం, దేశీయ ఆర్థిక కార్యకలాపాల పునరుజ్జీవనం, ఇబ్బందికర అధిక ద్రవ్యోల్బణ స్థాయిని పరిగణనలోకి తీసుకుని విధాన రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.40 శాతం నుంచి 5.9 శాతంగా ఆర్‌బీఐ నిర్ణయించింది.
దీనివల్ల ప్రామాణిక డిపాజిట్ సదుపాయం (ఎస్‌డీఎఫ్)పై వడ్డీ రేటు 5.65 శాతానికి, అత్యవసర పరిమిత రుణ సౌకర్యం (ఎంఎస్‌ఎఫ్)పై వడ్డీ రేటు 6.15 శాతానికి సర్దుబాటు అవుతుంది. ద్రవ్యోల్బణం నిర్దిష్ట నియంత్రణ పరిమితికి లోబడి ఉండేలా శ్రద్ధ వహించడంతోపాటు సదుపాయ ఉపసంహరణపై దృష్టిపెట్టాలని ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు (గవర్నర్ ప్రకటనను https://youtu.be/cb1it7TU8bk లో చూడవచ్చు).
అదనపు చర్యలు
మరో నాలుగు అదనపు చర్యలపై గవర్నర్ తెలిపిన వివరాలు కిందివిధంగా ఉన్నాయి:
- బ్యాంకుల ద్వారా రుణ-నష్టంపై కేటాయింపు దిశగా ప్రకటించబోయే అంచనా నష్టం-ఆధారిత విధానంపై చర్చా పత్రం
బ్యాంకులు ప్రస్తుతం వాటిల్లిన నష్టం విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఆ మేరకు ఆర్థిక ఒత్తిడి వాస్తవంగా ఎదురైన తర్వాత కేటాయింపులు చేస్తాయి. అయితే, ఇకపై ఈ పద్ధతికి బదులు మరింత వివేచనపూర్వక విధానం అమలులోకి వస్తుంది. దీని ప్రకారం బ్యాంకులు ముందస్తు అంచనాలను బట్టి రుణ-నష్ట నివారణకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.
2. సందేహాస్పద ఆస్తుల చట్రం (ఎస్‌ఎస్‌ఏఎఫ్) సెక్యూరిటకీకరణపై చర్చా పత్రం విడుదల
సందేహాస్పద ఆస్తుల సెక్యూరిటీకరణ కోసం సవరించిన చట్రం విధివిధానాలు 2021 సెప్టెంబరులో జారీ చేయబడ్డాయి. దీనికి అనుగుణంగా ఒక చట్రాన్ని ప్రవేశపెట్టాలని ఇప్పుడు నిర్ణయించబడింది. ఇది ఇప్పటికేగల ‘ఏఆర్‌సీ’ మార్గంతోపాటు ‘ఎన్‌పీఏ’ల సెక్యూరిటీకరణకు ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పరుస్తుంది.
3. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఖాతాదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బి)లో ప్రస్తుతం నిర్దిష్ట అర్హతలుగల ఖాతాదారులకు మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం అనుమతించబడింది. అయితే, డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే లక్ష్యంతో ఈ అర్హతలను క్రమబద్ధీకరిస్తూ త్వరలోనే సవరించిన మార్గదర్శకాలు జారీచేయబడతాయి.
4. ఆఫ్‌లైన్ చెల్లింపు సంధాన సంస్థలపై నియంత్రణకు ప్రతిపాదన
ఆన్‌లైన్ చెల్లింపుల సంధాన సంస్థ (పీఏ) సంస్థలు 2020 మార్చి నుంచి ఆర్‌బీఐ నిబంధనల పరిధిలో చేర్చబడ్డాయి. ఈ నేపథ్యంలో సదరు నిబంధనలను సమీప, ముఖాముఖి లావాదేవీలను నిర్వహించే ఆఫ్‌లైన్ ‘పీఏ’లకూ వర్తింపజేయాలని నిర్ణయించబడింది. ఈ చర్యతో డేటా ప్రమాణాల నియంత్రణపరంగా సమన్వయ, సమపరిణామం సాధ్యం కాగలదని అంచనా.
2022-23కు అంచనా వృద్ధి 7.0 శాతం
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 2022-23లో వృద్ధిని 7.0 శాతంగా కేంద్రీయ బ్యాంకు (ఆర్‌బీఐ) అంచనా వేసినట్లు గవర్నర్ తెలిపారు. కాగా, నష్టభయాలపై విస్తృత సమతూకంతో ఇది రెండో త్రైమాసికంలో 6.3 శాతంగా, మూడో త్రైమాసికంలో 4.6 శాతం; 2022-23 నాలుగో త్రైమాసికంలో 4.6 శాతంగా నమోదు కాగలదని అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి 7.2 శాతంగా అంచనా వేయబడింది.
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వాతావరణం సవాళ్లతో నిండి ఉన్నప్పటికీ, భారతదేశంలో మాత్రం ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు. “ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ అంచనాలకన్నా తక్కువగానే నమోదైంది. అయితే, ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే బహుశా ఇదే అత్యధికం” అని ఆయన చెప్పారు.
ద్రవ్యోల్బణం
మన దేశంలో జూలై నాటికి 6.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఆగస్టులో 7.0 శాతానికి చేరిందని ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. ప్రపంచ భౌగోళిక-రాజకీయ పరిణామాలు దేశీయ ద్రవ్యోల్బణ పయనంపై భారీ ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నడుమ ద్రవ్యోల్బణం పెరుగుదల చలనానికి తగినట్లుగా విధాన వడ్డీరేట్లు, ద్రవ్యలభ్యత పరిస్థితులపై ద్రవ్య విధానం తన క్రమబద్ధీకృత చర్యలను ముందుకు తీసుకెళ్లాలని ఆర్‌బీఐ గవర్నర్ వివరించారు. ఆ మేరకు ద్రవ్య విధానం అప్రమత్తంగా, చురుగ్గా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
గవర్నర్ పూర్తి ప్రకటనను ఇక్కడ చదవండి; అభివృద్ధి-నియంత్రణ విధానాలపై ప్రకటనను ఇక్కడ; ద్రవ్య విధాన ప్రకటనను ఇక్కడ చదవండి.
***
(रिलीज़ आईडी: 1864208)
आगंतुक पटल : 204