కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

విస్తృతమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ వేదికలను అభివృద్ధి చేయడంతో పాటు, అందరికీ డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా మాత్రమే మెరుగైన డిజిటల్ భవిష్యత్తును నిర్మించవచ్చు - శ్రీ దేవుసిన్హ్ చౌహాన్


రొమేనియా లోని, బుకారెస్ట్‌ లో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ సాధికార సదస్సు 2022 లో మంత్రవర్గ రౌండ్‌ టేబుల్‌ ను ఉద్దేశించి ప్రసంగించిన - కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి

Posted On: 25 SEP 2022 7:37PM by PIB Hyderabad

ప్రతి పౌరునికి ప్రభుత్వ సేవలు అందించడంతో పాటు, డిజిటల్ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం కోసం,  విస్తృతమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ వేదికలను అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే మెరుగైన డిజిటల్ భవిష్యత్తును నిర్మించగలమని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ పేర్కొన్నారు.  ఈ రోజు రొమేనియాలోని బుకారెస్ట్‌ లో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐ.టి.యు) సాధికార సదస్సు 2022 లో భాగమైన మంత్రివర్గ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు.   "మెరుగైన డిజిటల్ భవిష్యత్తును నిర్మించడం" అనే ఇతివృత్తం పై ఈ సదస్సును ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ మాట్లాడుతూ, మెరుగైన, సమ్మిళిత డిజిటల్ భవిష్యత్తును సులభతరం చేయడం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వ సమగ్ర విధానం గురించి ప్రముఖంగా పేర్కొన్నారు.   అవసరమైన చెక్‌-బాక్స్‌లన్నింటిని ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు.  టెలికాం మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణలను కేంద్ర సహాయ మంత్రి ఉటంకిస్తూ,  2023 నాటికి దేశం లోని మొత్తం 6,40,000 గ్రామాలకు మొబైల్ సేవలను, 2025 నాటికి ఆప్టికల్ ఫైబర్ సేవలను విస్తరించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలియజేశారు.   1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిన ఇటీవల విజయవంతమైన 5జి స్పెక్ట్రమ్ వేలం పరిశ్రమ నుండి చాలా ఉత్సాహభరితమైన ప్రతిస్పందనను సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు.  ఇది పౌర కేంద్రీకృత, పరిశ్రమలకు అనుకూలమైన ప్రజా విధానాల ఫలితం. అదేవిధంగా, భారతదేశ భవిష్యత్తు పట్ల వారి సానుకూల దృక్పథానికి సూచిక కూడా.  

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం విజయం గురించి శ్రీ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు.   ఆధార్ మరియు ఆధార్ ను ఉపయోగించి చేసే చెల్లింపుల విధానం (ఏ.ఈ.పి.ఎస్) సాధించిన విజయాన్ని ఆయన ఉదహరించారు.  ఏ.ఈ.పి.ఎస్. ద్వారా ప్రతిరోజూ 400 మిలియన్ల లావాదేవీలు జరుగుతున్నాయని, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఆర్థిక చేరికకు ఇది ఒక చక్కటి ఉదాహరణ అని, ఆయన సభకు వివరించారు.  అనుసంధానం లేని వారిని చేరుకోవడానికి, భారతదేశం మారుమూల మరియు గ్రామీణ ప్రాంతాల్లో 5,70,000 కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసిందని, ఇవి వివిధ ప్రభుత్వాల నుండి పౌరులకు (జి.2.సి) మరియు ఇతర పౌర-కేంద్రీకృత ఈ -సేవలను అందజేస్తాయని ఆయన వివరించారు.  భారతదేశం తన అత్యుత్తమ విధానాలను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని, ఆయన చెప్పారు.   ఐ.టి.యు. మండలి లో భారతదేశం తిరిగి ఎన్నిక కావడానికి, అదేవిధంగా, రేడియో రెగ్యులేషన్ బోర్డు సభ్యురాలిగా శ్రీమతి ఎం. రేవతి ఎన్నికకు కూడా సభ్య దేశాల మద్దతును శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ అభ్యర్థించారు. 

ఆ తర్వాత, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కూడా కామన్వెల్త్ టెలికాం ఆర్గనైజేషన్ అధినేతను ఉద్దేశించి ప్రసంగించారు.  జీవితంలోని అన్ని అంశాల్లో, ఐ.సి.టి. యొక్క భారీ వ్యాప్తి భారతదేశంలో బహుముఖ మార్పులకు దారితీస్తోందని ఆయన అన్నారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని  భారత ప్రభుత్వ "అంత్యోదయ" సిద్ధాంత భావానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.  సామాజిక-ఆర్థిక పిరమిడ్‌ లో దిగువన ఉన్న వ్యక్తులను ఉద్ధరించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇందుకోసం టెలికాం కీలక పాత్ర పోషిస్తుంది.  ఐ.టి.యు. లక్ష్యాల సాధనకు 1869 నుంచి భారతదేశం సహకారం అందిస్తోందని పేర్కొంటూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-2030 ని నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆయన హామీ ఇచ్చారు.   మేము “వసుదేవ కుటుంబం” సూత్రాన్ని నమ్ముతామనీ, అందువల్ల మేము మొత్తం మానవాళి సంక్షేమం కోసం పని చేస్తున్నామనీ ఆయన చెప్పారు.  డిజిటల్ విభజనను తగ్గించడంలో భారతదేశం తన నైపుణ్యాన్ని సి.టి.ఓ. దేశాలకు అందిస్తుందని కూడా, ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.  సి.టి.ఓ. దేశాల మధ్య మరింత సహకారానికి శ్రీ చౌహాన్ పిలుపు నిచ్చారు.

*****(Release ID: 1862267) Visitor Counter : 119


Read this release in: English , Urdu , Hindi , Marathi