ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఈశాన్య భారతదేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 'సింపో ఎన్ ఈ ' వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ,జి.కిషన్ రెడ్డి

Posted On: 24 SEP 2022 3:22PM by PIB Hyderabad

ఈశాన్య భారతదేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన  'సింపో ఎన్ ఈ ' కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ఈరోజు   కేంద్ర పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ  మంత్రి శ్రీ,జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు సమావేశం జరుగుతుంది. ప్రారంభ కార్యక్రమంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ లోక్ రంజన్, ఎనిమిది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సీనియర్ అధికారులు, పర్యాటక అభివృద్ధి సంస్థల సీనియర్ అధికారులు, పర్యాటక సంస్థల ప్రతినిధులతో సహా పర్యాటక రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2022 సెప్టెంబర్ 24, 27 తేదీల్లో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ  'సింపో ఎన్ ఈ 'ని నిర్వహిస్తోంది. వర్చువల్ విధానంలో జరిగే సమావేశంలో ఈశాన్య భారతదేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి గల అవకాశాలు, ఇంత కాలం ఎక్కువ గుర్తింపు పొందని పర్యాటక ప్రాంతాలకు గుర్తింపు సాధించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ కార్యక్రమాన్ని సమావేశం చర్చించి పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తారు. పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే వివిధ ఆలోచనలు, సూచనలను వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, సామాజిక మాధ్యమాలను ప్రభావితం చేయగల వ్యక్తులు, పర్యాటక సంస్థల ప్రతినిధులు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రతినిధుల  నుంచి స్వీకరించి, చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తారు.  ఈశాన్య భారతదేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పర్యాటక రంగంతో సంబంధం ఉన్న వివిధ వర్గాలతో విస్త్రుత్వంగా చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు  'సింపో ఎన్ ఈ 'పేరిట సమావేశాలు నిర్వహించాలని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించిందిరుచికర  ఆహారం, సంస్కృతి, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, వారసత్వం మరియు వాస్తుశిల్పం కలిగి ఉన్న   . ఈశాన్య భారతదేశం ప్రపంచంలో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.  ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని పెంపొందించడానికి అనేక  అవకాశాలు ఉన్నాయి.దీనిని గుర్తించిన శ్రీ కిషన్ రెడ్డి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 'సింపో ఎన్ ఈ ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ కిషన్ రెడ్డి ఈశాన్య భారతదేశాన్ని పర్యాటకుల స్వర్గ ధామంగా వర్ణించారు."ఈశాన్య భారతదేశం ప్రకృతి సౌందర్యం, విశిష్ట సంస్కృతుల అరుదైన సమ్మేళనం మరియు  సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతం.  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  దార్శనిక నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం వేగంగా  అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి  కట్టుబడి ఉంది.." అని కిషన్ రెడ్డి అన్నారు. ఈశాన్య ప్రాంత పర్యాటక సామర్థ్యాన్ని గుర్తించి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు  'సింపో ఎన్ ఈ ' సహకరిస్తుందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. 

ఈశాన్య ప్రాంతంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి సాధించేందుకు గల అవకాశాలను  'సింపో ఎన్ ఈ ' కార్యక్రమం ద్వారా గుర్తిస్తామని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ లోక్ రంజన్ అన్నారు. ఈశాన్య ప్రాంత పర్యాటక రంగ అభివృద్ధిలో  'సింపో ఎన్ ఈ 'ఒక పెద్ద అడుగు గా ఉంటుందని అన్నారు. సమావేశంలో పాల్గొన్న వారు అందించే సూచనలు, సలహాలు, అభిప్రాయాలను మంత్రిత్వ గుర్తించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుందని అన్నారు. 

ఈశాన్య ప్రాంత మండలి  కార్యదర్శి శ్రీ కె. మోసెస్ చలై  ప్రసంగిస్తూ 'సింపో ఎన్ ఈ ' ద్వారా  ఈశాన్య ప్రాంతంలో తదుపరి స్థాయి పర్యాటక వృద్ధికి కేంద్ర ప్రభుత్వం  కృషి చేస్తోందని అన్నారు. ఇటీవలి సంవత్సరాలలో పర్యాటకం పుంజుకుందని పేర్కొన్న శ్రీ మోసెస్  సాంకేతికత మరియు డిజిటలైజేషన్‌తో ఈ ప్రాంతంలో పర్యాటకం గణనీయమైన అభివృద్ధి సాదిస్తుందని అన్నారు. 

 ఈశాన్య ప్రాంత హస్తకళలు, చేనేత అభివృద్ధి సంస్థ ఎండీ బ్రిగేడియర్ ఆర్.కె.సింగ్ (రిటైర్డ్) పర్యాటక రంగంతో సంబంధం ఉన్న వారందరి సహకారంతో ఈశాన్య ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు. ఈశాన్య ప్రాంత హస్తకళలు, కళాకారుల నైపుణ్యం మరియు గొప్పతనాన్ని ప్రదర్శించే ప్రత్యేక టూరిజం ఎక్స్‌పోలను నిర్వహిస్తామని అన్నారు. 

ఈశాన్య ప్రాంత ఆర్థిక సంస్థ సీఎండీ శ్రీ.పీ.వీ.ఎస్.ఎల్. ఎన్ మూర్తి మాట్లాడుతూ పర్యాటక రంగంలో ఏర్పాటైన అంకుర సంస్థలు ఈశాన్య ప్రాంత పర్యాటక రంగం రూపురేఖలు మార్చాయని అన్నారు. 

ఈ రోజు జరిగిన సమావేశంలోషిల్లాంగ్‌కు చెందిన జానపద సంగీత బృందం  'సమ్మర్‌సాల్ట్' పాల్గొంది.ఈశాన్య ప్రాంత అభివృద్ధిలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని  బృందం సభ్యుడు కిట్  షాంగ్‌ప్లియాంగ్ పేర్కొన్నారు. సంగీతానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 

ద్విచక్ర వాహనాలపై ఈశాన్య ప్రాంతంలో పర్యటిస్తున్న టీమ్ వాండరర్స్ సభ్యులు తమ అనుభవాలను వివరించారు. బృందం సభ్యుడు శ్రీ పవన్ సలహాలు అందించారు. 

సమావేశంలో  వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, సామాజిక మాధ్యమాలను ప్రభావితం చేయగల వ్యక్తులు, పర్యాటక సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ పర్యాటక శాఖ అధికారులు, స్థానిక పర్యాటక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

పర్యాటకులు, పర్యాటక సంస్థలు ఎదుర్కొంటున్న రవాణా, మౌలిక సదుపాయాల సమస్యలకు పరిష్కార మార్గాల రూపకల్పన, వివిధ పర్యాటక ప్రాంతాలపై మరింత ప్రచారం కల్పించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు  'సింపో ఎన్ ఈ ' ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుంది. 

'సింపో ఎన్ ఈ ' ముగింపు సమావేశం 2022 సెప్టెంబర్ 27 న జరుగుతుంది. సమావేశంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ.బి.ఎల్.వర్మ పాల్గొంటారు. 

  

***



(Release ID: 1862006) Visitor Counter : 232