రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) తన 38వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది
మహిళా ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడంలో ఆర్ పి ఎఫ్ (RPF) పాత్రను రైల్వే శాఖ సహాయ మంత్రి ప్రశంసించారు
3 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ పి ఎఫ్ సిబ్బంది కుటుంబ సభ్యుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు స్కిల్ అప్-గ్రేడేషన్ శిక్షణా కేంద్రాన్ని లక్నోలోని 3వ బెటాలియన్ ఆర్ పి ఎస్ ఎఫ్ (RPSF) ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీమతి దర్శన విక్రమ్ జర్దోష్ ప్రకటించారు.
Posted On:
20 SEP 2022 5:38PM by PIB Hyderabad
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పి ఎఫ్) లక్నోలోని జగ్ జీవన్ రామ్ ఆర్ పి ఎఫ్ అకాడమీలో తొలిసారిగా కేంద్ర స్థాయిలో కవాతు నిర్వహించడం ద్వారా 38వ రైజింగ్ డేని 2022 సెప్టెంబర్ 20న జరుపుకుంది. న్యూఢిల్లీ వెలుపల ఆర్పీఎఫ్ జాతీయ స్థాయి పరేడ్ నిర్వహించడం ఇదే తొలిసారి. లక్నోలోని ఆర్‌పిఎఫ్ కేంద్రీకృత శిక్షణా సంస్థ మరియు సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా రిక్రూట్ చేయబడిన ఫోర్స్ అధికారుల అల్మా మేటర్ అయిన జగ్జీవన్ రామ్ ఆర్‌పిఎఫ్ అకాడమీ ని వేదికగా ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేంద్ర రైల్వేలు మరియు జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శన విక్రమ్ జర్దోష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పరేడ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ శ్రీ బ్రిజ్ లాల్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసు, వివిధ ప్రభుత్వ శాఖలు, రైల్వే శాఖల ఉన్నతాధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రైల్వే శాఖ సహాయ మంత్రి 23 మంది ఆర్‌పిఎఫ్ సిబ్బందికి 'విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీసు పతకం', 'విశిష్ట సేవకు భారత పోలీసు పతకం', 'సర్వోత్తమ్ జీవన్ రక్షా పదక్', 'ఉత్తమ్ జీవన్ రక్షా పదక్' మరియు 'జీవన్ రక్షా పదక్'లను ప్రదానం చేశారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కదులుతున్న రైలు ముందుకు దూకిన ఓ మహిళను కాపాడుతూ విధి నిర్వహణలో తన ప్రాణాలను అర్పించిన ఆర్పీఎఫ్ ఎన్సీఆర్ హెడ్ కానిస్టేబుల్ దివంగత శ్రీ జ్ఞాన్ చంద్‌కు మరణానంతరం సర్వోత్తమ్ జీవన్ రక్షా పదక్ అవార్డును ప్రదానం చేశారు. కన్నీళ్లతో నిండిన కళ్లతో, గర్వంతో ఛాతీ ఉప్పొంగగా శ్రీ జ్ఞాన్ చంద్‌ని గుర్తు చేసుకున్నారు.
ముఖ్య అతిథి అకాడమీ క్యాంపస్‌లో 100 అడుగుల ఎత్తైన స్మారక జాతీయ పతాకాన్ని ఎగురవేసారు, రైలు గమనం లో రక్షణ శిక్షణ కోసం ఇంజిన్‌తో కూడిన రైల్వే కోచ్‌ను ఆవిష్కరించి అంకితం చేశారు. ఎయిర్ కండిషన్ తో పునరుద్ధరించబడిన అకాడమీ ప్రధాన హాల్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ పి ఎఫ్ త్రైమాసిక ఇ-మ్యాగజైన్ "రైల్ సైనిక్" ప్రత్యేక "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" సంచికను విడుదల చేసారు.
రైల్వే శాఖ సహాయ మంత్రి తన ప్రసంగంలో కార్యక్రమానికి తరలివచ్చిన జనసందోహం, సిబ్బంది పటిష్టత, కవాతును ప్రశంసించారు. మహిళా ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించచడంలో ఆర్‌పిఎఫ్ పాత్రను ఆమె ప్రశంసించారు. సుదూర రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు భద్రత కల్పించినందుకు మేరీ సహేలీ బృందాలపై ఆమె ప్రశంసలు కురిపించారు. ఏదైనా సంస్థ పనితీరును మెరుగుపరచడంలో శిక్షణ అలాగే నైపుణ్యాన్ని పెంచడం యొక్క ప్రముఖ పాత్రను ఆమె వివరించారు మరియు ఆర్‌పిఎఫ్ లో శిక్షణా సౌకర్యాలను మెరుగుపరచడానికి 55 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
లక్నో ప్రాంగణంలో 3వ బెటాలియన్ ఆర్‌పిఎస్ఎఫ్,ఆర్‌పిఎఫ్ సిబ్బంది కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మహిళలకు రూ. 3 కోట్లతో నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్ అప్-గ్రేడేషన్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీమతి జర్దోష్ ప్రకటించారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా 75 ప్రదేశాలలో మహిళా ఆర్‌పిఎఫ్ రైలు ఎస్కార్టింగ్ సిబ్బంది కోసం రెస్ట్ షెల్టర్ కమ్ మొబిలైజేషన్ హాల్స్‌ను నిర్మిస్తామని ఆమె ప్రకటించారు.
డైరెక్టర్ జనరల్,ఆర్‌పిఎఫ్, శ్రీ సంజయ్ చందర్, మంత్రికి స్వాగతం పలికారు మరియు ప్రయాణీకులకు భద్రత మరియు సురక్షితమైన రైలు ప్రయాణాన్ని అందించడానికి ఫోర్స్ చేపట్టిన వివిధ కొత్త కార్యక్రమాలను వివరించారు. మానవశక్తిని సరైన రీతిలో వినియోగించుకునేలా ఆర్‌పిఎఫ్ తన పనిలోని వివిధ రంగాలలో సాంకేతికతను ఉపయోగించుకుంటుందని ఆయన పేర్కొన్నారు. నిరుపేద ప్రయాణికులు, వృద్ధులు మరియు పిల్లలకు సహాయం అందించడంలో ఈ దళం ముందంజలో ఉంది. రైళ్లు మరియు స్టేషన్లలో మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల రవాణా, హవాలా డబ్బు తరలింపు, నిషేధిత వన్యప్రాణులు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడంలో ఆర్‌పిఎఫ్ ప్రశంసనీయమైన పని చేస్తోంది. 2047 వరకు కొనసాగే అమృత్‌కాల్‌లోకి మనం ప్రవేశించామని, ఈ సమయంలో భారతదేశాన్ని అర్హమైన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మన హృదయంతో మరియు ఆత్మతో పనిచేయాలని ఆయన సూచించారు.
విజన్ 2047 అటువంటి ఉన్నతమైన ఆదర్శం వైపు ప్రయాణానికి మార్గదర్శి. సంస్థ కు చెందిన 2047 విజన్ లక్ష్యాన్ని ఆయన ప్రస్తావించారు, ఇందులో సంస్థ యొక్క ప్రతిస్పందన, లక్ష్యాన్ని చేరుకోవడం మరియు ప్రభావాన్ని పెంచడానికి నూతన ఆవిష్కరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, వనరుల సద్వినియోగం ప్రధానాంశాలు. సిబ్బంది యొక్క లక్ష్యం సేవా హి సంకల్ప్ అని, కానిస్టేబుల్ నుండి డీ జీ వరకు సభ్యులందరూ సంస్థ సేవా నిబద్ధతను బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆయన నొక్కిచెప్పారు.
రైల్వే ఆస్తులకు భద్రత కల్పించేందుకు 1957లో పార్లమెంటు చట్టం ద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. తదనంతరం, 1966లో రైల్వే ఆస్తులను చట్టవిరుద్ధంగా సొంతం చేసుకున్న నేరస్థులను విచారించడానికి, అరెస్టు చేయడానికి మరియు విచారణ చేయడానికి ఆర్‌పిఎఫ్ కు అధికారం ఇవ్వబడింది. సంవత్సరాలుగా ఆర్‌పిఎఫ్ కు "ఏన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ది యూనియన్" హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించారు. చివరకు 20 సెప్టెంబర్ 1985న పార్లమెంటు ద్వారా ఆర్‌పిఎఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా ఈ హోదాను ఇచ్చారు. అందువల్ల ఆర్‌పిఎఫ్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20ని ఆర్‌పిఎఫ్ రైజింగ్ డేగా జరుపుకుంటారు.
రైజింగ్ డే అనేది ఆర్‌పిఎఫ్ అభివృద్ధి లో ఒక ముఖ్యమైన మైలురాయి అందుకే ఆర్‌పిఎఫ్ సభ్యులు దీనిని పండుగ స్ఫూర్తితో జరుపుకుంటారు, వారు తమ ఆనందాన్ని ప్రజలతో పంచుకుంటారు. ప్రజలకు సేవ చేయడానికి అలాగే మొత్తం ప్రజా ప్రయోజనాల కోసం పని చేయడానికి వారి నిబద్ధతను పునరుద్ఘాటిస్తారు.
ఇంతకుముందు రైజింగ్ డేను జోనల్, డివిజనల్ మరియు బెటాలియన్ స్థాయిలలో కవాతులు మరియు ఇతర కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా జరుపుకునే వారు. అయితే, ఈ ఏడాది నుంచి కేంద్ర స్థాయిలో ఒకే ఒక కవాతు నిర్వహించి బలగాల జాతీయ స్వభావానికి ప్రతీకగా నిర్ణయించారు.
***
(Release ID: 1860989)
Visitor Counter : 161