జల శక్తి మంత్రిత్వ శాఖ

పది కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయిల ద్వారా నీరు సరఫరా


గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాల్లో 52% కుటుంబాలకు కుళాయి ద్వారా నీరు
నీటి కష్టాల నుంచి పది కోట్ల గృహాలకు చెందిన బాలికలు, మహిళలకు విముక్తి

Posted On: 19 AUG 2022 3:03PM by PIB Hyderabad

జల్ జీవన్ మిషన్ (జేజేఎం) మరో మైలురాయిని అధిగమించింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేడుకలు జరుగుతున్న సమయంలో జల్ జీవన్ మిషన్ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న 10 కోట్ల కుటుంబాలకు కుళాయిల ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేయడం ప్రారంభించింది. జల్ జీవన్ పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15న ప్రారంభించారు. పథకం ప్రారంభమయ్యే సమయానికి దేశంలో 3.23 కోట్ల గ్రామీణ గృహాలు మాత్రమే పైపుల ద్వారా మంచి నీరు పొందుతున్నాయి. 2022 ఆగస్టు 19 వ తేదీ నాటికి కుళాయి కనెక్షన్ కలిగి ఉన్న గ్రామీణ గృహాల సంఖ్య 10 కోట్లకు చేరుకుంది.  

తాజా సమాచారం ప్రకారం మూడు రాష్ట్రాలు ( గోవా, తెలంగాణ, హర్యానా) మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ( పుదుచ్చేరి, డామన్ డయ్యు,దాద్రా నగర్ హవేలీ, అండమాన్ నికోబార్ ప్ర్రావులు) తమ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలకు పూర్తిగా పైపుల ద్వారా మంచి నీరు సరఫరా చేస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో 99.93% గృహాలు, గుజరాత్ రాష్ట్రంలో  97.03%, బీహార్ లో  95.51% హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో  94.88% గ్రామీణ గృహాలు కుళాయిల ద్వారా రక్షిత మంచి నీరు పొందుతున్నాయి. త్వరలో ఈ రాష్ట్రాలలో కూడా పూర్తి స్థాయిలో అన్ని గ్రామీణ గృహాలకు కుళాయిల ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా అవుతుంది. 2022 ఆగస్టు 17వ తేదీన  గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు లు " హర్ ఘర్ జల్" సర్టిఫికెట్ పొందిన రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు గ్రామ సభల ద్వారా అవసరాల మేరకు సురక్షిత మంచి నీటిని పొందుతున్నాయి. 

ప్రతి గ్రామీణ గృహానికి క్రమ పద్దతిలో   దీర్ఘకాలిక ప్రాతిపదికన నిర్దేశించిన నాణ్యతతో తగిన పరిమాణంలో త్రాగు నీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో జల్ జీవన్  మిషన్ ఏర్పాటయింది.కోవిడ్ -19 మహమ్మారి వంటి అనేక అవాంతరాలు,  క్లిష్ట  వాతావరణ పరిస్థితులు, దూరం  కఠినమైన భౌగోళిక పరిస్థితులు, కొండలు, అడవులు మొదలైన సవాళ్లను అధిగమిస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు  రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. హెలికాప్టర్లు, పడవలు, ఒంటెలు, ఏనుగులు మరియు గుర్రాలపై పైపులు మరియు ఇతర పరికరాలు రవాణా చేయబడ్డాయి. 

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా దేశంలో 8.67 లక్షల (84.35%) పాఠశాలలు మరియు 8.96 లక్షల (80.34%) అంగన్‌వాడీ కేంద్రాలకు  కుళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.  దేశంలో 117 ఆకాంక్షాత్మక జిల్లాల్లో మిషన్ ప్రారంభించిన సమయానికి, కేవలం 24.32 లక్షల (7.57%) కుటుంబాలకు మాత్రమే కుళాయి నీరు అందుబాటులో ఉండేది. ఈ సంఖ్య  ఇప్పుడు 1.54 కోట్లకు (48.00%) పెరిగింది. తెలంగాణలో మూడు ఆకాంక్షాత్మక జిల్లాలు (కొమరం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి మరియు భద్రాద్రి కొత్తగూడెం) మరియు పంజాబ్ (మోగా), హర్యానా (మేవాట్) మరియు హిమాచల్ ప్రదేశ్ (చంబా)లో  100% నీటి సరఫరా కుళాయిల ద్వారా జరుగుతోంది. 

గ్రామీణ ప్రజలకు జల్ జీవన్ మిషన్  సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను అందించింది.  కుళాయి ద్వారా ఇళ్లకు నీటి సరఫరా జరగడం తో  ప్రజలు, ముఖ్యంగా మహిళలు మరియు యువతులకు నీటి కష్టాల నుంచి విముక్తి కలిగింది. గతంలో  రోజువారీ గృహ అవసరాలకు అవసరమయ్యే వారు పెద్ద పెద్ద  బకెట్లలో  నీటిని మోసుకెళ్లడం జరిగేది.జల్ జీవన్ మిషన్ అమలుతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతోకాలం నుంచి ఎదురవుతున్న  కష్టాలు తగ్గుతాయి. అలా పొదుపు చేసే సమయాన్ని ఆదాయ కల్పన కార్యకలాపాలకు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు పిల్లల చదువుకు తోడ్పడేందుకు ఉపయోగించవచ్చు.

దీర్ఘ కాలంలో పథకం విజయవంతంగా అమలు జరిగేలా చూసేందుకు నీటి   పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకాల ప్రణాళిక, అమలు, కార్యకలాపాలు మరియు నిర్వహణ అంశాల్లో  సమాజ భాగస్వామ్యం తో అమలు జరుగుతున్నాయి.  దేశంలో మొత్తం 5.08 లక్షల గ్రామ నీరు, పారిశుద్ధ్య కమిటీలు (VWSC)/ పానీ సమితులను ఏర్పాటు చేశారు. అలాగే, తాగునీటి వనరుల పెంపుదల, కలుషిత నీటిని శుద్ధి చేసి పునర్వినియోగం మరియు గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థల సాధారణ  నిర్వహణ  ప్రణాళికలను వివరించే 4.78 లక్షల గ్రామీణ కార్యాచరణ ప్రణాళికలు  సిద్ధం చేయబడ్డాయి.

  నీటి నాణ్యత అంశానికి  జల్ జీవన్  మిషన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. జల్ జీవన్ మిషన్ లో భాగంగా  దేశంలో మొత్తం 2,070 నీటి పరీక్షా ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. అన్ని సౌకర్యాలతో ఏర్పాటైన   ప్రయోగశాలలు ఎంపానెల్  చేయబడ్డాయి.  ఇప్పటి వరకు 4.51 లక్షల గ్రామాల్లో నీటి పరీక్షా ప్రయోగశాలల ద్వారా 64 లక్షలకు పైగా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నీటి నాణ్యత పరీక్షా ల్యాబ్‌లు నామమాత్రపు ధరలకు నీటి నమూనాలను పరీక్షించడానికి ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 10.8 లక్షల మంది గ్రామీణ మహిళలు కూడా ఫీల్డ్ టెస్టింగ్ కిట్‌లను (ఎఫ్‌టికె) ఉపయోగించడానికి శిక్షణ పొందారు. 1.7 లక్షల గ్రామాల్లో శిక్షణ పొందిన మహిళలు ఫీల్డ్ టెస్టింగ్ కిట్‌లను ఉపయోగించి  58 లక్షల నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. 

***



(Release ID: 1853406) Visitor Counter : 155