పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

కొల్హాపూర్ విమానాశ్రయం లో అంతర్జాతీయ సౌకర్యాలతో మరింత సామర్థ్యం గల నూతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం

Posted On: 18 AUG 2022 3:17PM by PIB Hyderabad

 2023 మార్చి 31 నాటికి సిద్ధం కానున్న టెర్మినల్ బిల్డింగ్

నూతన సౌకర్యాలతో పారిశ్రామిక నగరానికి రవాణా సౌకర్యం, పర్యాటక రంగ అభివృద్ధికి దోహదం

హైదరాబాద్, ఆగస్టు 18:

కొల్హాపూర్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్న  సంఖ్య గణనీయంగా పెరగడంతో విమానాశ్రయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఎయిర్ పోర్ట్స్  అథారిటీ ఆఫ్  ఇండియా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నది.మరింత ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా   విమానాశ్రయంలో  అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నూతనంగా టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రన్ వే ని పటిష్టం చేసి పొడవు పెంచుతున్నారు. ఎప్రాన్, ఐసోలేషన్ బే లను నిర్మిస్తున్నారు. 

ఉడాన్ పథకం కింద ఆర్సీఎస్ సేవలు ప్రారంభించేందుకు కొల్హాపూర్ విమానాశ్రయం ఎంపిక అయ్యింది. ప్రస్తుతం కొల్హాపూర్ నుంచి హైదరాబాద్, బెంగళూరు,ముంబై, తిరుపతి కి విమాన సర్వీసులు నడుస్తున్నాయి. రోజంతా విమాన సర్వీసులను నిర్వహించేందుకు వీలుగా ఇటీవల విమానాశ్రయం ఏరోడ్రోమ్ లైసెన్స్ స్థాయి పెంచబడింది. 

4000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో గంటకు 300 మంది ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించేందుకు వీలుగా దీనిని నిర్మిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలతో  10 చెక్-ఇన్ కౌంటర్లు దీనిలో ఏర్పాటవుతాయి. ఇంధనాన్ని ఆదా చేసేందుకు  నాలుగు నక్షత్రాల రేటింగ్ తో  GRIHA విద్యుత్ ఉపకరణాలు భవనంలో ఏర్పాటు అవుతాయి. స్థానిక సంస్కృతి, వారసత్వ సంపదకు అద్దం పట్టే విధంగా భవనాన్ని కళాత్మకంగా తీర్చి దిద్దడం జరుగుతుంది. మహారాజా ప్యాలెస్, భవాని మండపం, కొల్హాపూర్ పనహాల కోట లాంటి వారసత్వ సంపద తరహాలో భవనం ప్రవేశ ద్వారాల రూపకల్పన జరుగుతుంది.  

ఇప్పటికే 60% అభివృద్ధి పనుల నిర్మాణం పూర్తయింది. 2023 మార్చి 31 నాటికి మొత్తం నిర్మాణం పూర్తవుతుందని అంటున్నారు. సౌకర్యాలను కల్పించే పనులు పూర్తయ్యాయి. వీటితో పాటు విమానాశ్రయంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం జరుగుతోంది. 110 కార్లు, 10 బస్సులను నిలిపేందుకు వీలుగా పార్కింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. 

పంచగంగ నది ఒడ్డున కొల్హాపూర్ నగరం ఉంది. సహ్యాద్రి పర్వతాలు  మధ్య ఉన్న కొల్హాపూర్ లో  చరిత్ర ప్రసిద్ధి కలిగిన కోటలు, దేవాలయాలు, కొల్హాపూర్ రాజవంశీయులు  భవనాలు ఉన్నాయి. మహారాష్ట్రలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించిన ప్రాంతాలలో కొల్హాపూర్ ఒకటి, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, పంచదార, వస్త్రాలు ఇక్కడ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. 

ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయంతో కొల్హాపూర్ ప్రాంతంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల మరికొన్ని రవాణా సౌకర్యం కలగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. స్థానిక ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలు మరింత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి. 

***



(Release ID: 1853067) Visitor Counter : 123