పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
అమరులైన సమరవీరులకు జ్యోతిరాదిత్య ఘన నివాళి!
గ్వాలియర్‌లోని లక్మీభాయీ కీ ఛత్రీవద్ద
ఫోటో ఎగ్జిబిషన్‌కు కేంద్రమంత్రి శ్రీకారం...
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్,
విభజన భయానక స్మృతి దినం నిర్వహణ
Posted On:
14 AUG 2022 2:41PM by PIB Hyderabad
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75సంవత్సరాలవుతున్న సందర్భంగా జరుపుకుంటున్న
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, విభజన భయానక స్మృతి దినం కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర పౌర విమానయాన, ఉక్కుశాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా గ్వాలియర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్వాలియర్‌లోని మహారాణీ లక్ష్మీ బాయీ కీ ఛత్రీ కట్టడంలో ఛాయా చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సారథ్యం వహించారు.
మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రధ్యుమ్న సింగ్ తోమర్, గ్వాలియర్ లోక్‌సభ సభ్యుడు వివేక్ నారాయణ్ షెజ్వాకర్, గ్వాలియర్ నగర మేయర్ శోభా సికర్వార్, మధ్యప్రదేశ్ రాష్ట్ర విత్తన, వ్యవసాయ అభివృద్ధి మండలి అధ్యక్షుడు మున్నాలాల్ గోయల్, మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి భగత్ సింగ్ కుశ్వాహ్, మధ్యప్రదేశ్ లఘు ఉద్యోగ్ నిగమ్ చైర్‌పర్సన్ ఇమార్తి దేవి, పౌర విమానయాన మంత్రిత్వశాఖకు, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు, జిల్లా పరిపాలనా యంత్రాంగం అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, చరిత్రలో ఇతర దేశాలపై ఎప్పుడూ దాడి చేయనిది దేశం భారతదేశం మాత్రమేనని, అయితే విదేశాలనుంచి మనదేశం అనేక దాడులను ఎదుర్కొందని అన్నారు. ఈ దాడులకు మనదేశ ప్రజలు ఏమాత్రం తలొగ్గలేదని, ఎన్నో ధైర్య సాహసాలను, ప్రతిఘటనను ప్రదర్శిస్తూ వచ్చారని, ఏ విదేశాన్నీ మన భూభాగంపై నిలువనీయలేదని అన్నారు. “మన జాతీయ పతాకం (త్రివర్ణ పతాకం),.. మన త్యాగానికి, సాంస్కృతిక ఆధిపత్యానికి ప్రతీక, మన దేశ సాంస్కృతిక విభిన్నత్వానికి పరిపూర్ణమైన నిదర్శనం. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా మనం రేపు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం. భారతదేశాన్నిమరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు ఈ తరుణంలో మనం మరోసారి ప్రతిన బూనాలి.” అని ఆయన పిలుపునిచ్చారు.
దేశ వికభజనతో తలెత్తిన భయానక పరిణామాలను గురించి సింధియా ఈ సందర్భంగా ప్రస్తావించారు. “విభజనతో మనం నేర్చుకున్న పాఠాలను భావితరాలవారికి తెలియజెప్పాలి. మహా విపత్తులాంటి ఇలాంటి పరిణామంపై అప్పుడే వారికీ అవగాహన ఏర్పడుతుంది. భారతదేశం ఒక పెద్ద ఉపఖండం. ప్రపంచంలోని మరే దేశం కూడా ఉపఖండం కాదు. కొందరి స్వార్థం, క్రూర పన్నాగాల కారణంగానే భారతదేశం విభజన జరిగింది. విభజనతో అనేక కుటుంబాలు ఛిద్రమైపోయాయి. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రజలు సొంతదేశంలోనే శరణార్ధులుగా మిగిలిపోయారు. ఈ రోజున మనం ప్రారంభించిన ఈ ఛాయాచిత్ర ప్రదర్శన మన పెద్దల బాధలను, వేదనను ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ ఛాయాచిత్ర ప్రదర్శను తిలకించాలని నేను కోరుకుంటున్నాను. మన దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న భాగస్వాములు అందరికీ నేను ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను.” అని సింధియా అన్నారు.
భారతదేశం 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో 2022, ఆగస్టు 14న గ్వాలియర్‌లోని మహారాణి లక్ష్మీ బాయీ కీ ఛత్రీ కట్టడంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ఛాయాచిత్ర ప్రదర్శనను చేపట్టింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా నేతృత్వంలో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా ఆయన జాతీయ (త్రివర్ణ) పతాకాన్ని ఆవిష్కరించారు. మహారాణి లక్ష్మీబాయి సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. పలువురు స్వాతంత్ర్య సమరయోధులను, స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరవీరుల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. పలువురు సమరయోధులను ఆయన సముచిత రీతిన సత్కరించారు.
75వ స్వాతంత్ర్యవార్షికోత్సవం సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట దేశవ్యాప్తంగా వేడులను భారత ప్రభుత్వం, ప్రజలు ఎంతో ఉత్సాహంతో నిర్వహిస్తూ వస్తున్నారు. త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటి ముంగిటికీ తీసుకెళ్లేందుకు, ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట భారీ ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్నారు.
****
(Release ID: 1851967)
Visitor Counter : 205