వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పశు సంతతికి పెద్ద ఊరట కల్పిస్తూ, వాటికి సోకే లంపీ చర్మవ్యాధికి దేశీయ వాక్సిన్‌ను ఆవిష్కరించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తోమర్.
మావనవ వనరుల తోపాటు పశుసంతతి భారతదేశానికి గల గొప్ప ఆస్థి- శ్రీ తోమర్
భారత వెటనరీ పరిశోధన సంస్థతో కలిసి వాక్సిన్ ను తయారు చేసిన నేషనల్ ఎక్వైన్ రిసెర్చ్ సెంటర్
Posted On:
10 AUG 2022 6:27PM by PIB Hyderabad
దేశంలోని పశుసంతతికి పెద్ద ఊరట కలిగిస్తూ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ,పశువులకు సంక్రమించే లంపీ చర్మవ్యాధి బారి నుంచి వాటిని రక్షించడానికి దేశీయంగా రూపొందించిన లంపీ ప్రో వాక్ ఇండ్‌ను ఈ రోజు ఆవిష్కరించారు. ఈ వాక్సిన్ ను ఇజ్జత్ నగర్, బరెలి లోని ఇండియన్ వెటనరీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ తో కలసి హర్యానాలోని హిస్సార్ లో గల నేషనల్ ఎక్వైన్ రిసెర్చ్ సెంటర్ తయారు చేసింది. లంపీ చర్మవ్యాధిని రూపుమాపడంలో ఈ వాక్సిన్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అన్నారు. మానవ వనరులతోపాటు పశుసంతతి భారతదేశ అతి పెద్ద ఆస్తి అని అంటూ దీనిని కాపాడుకుని సుసంపన్నం కావలసిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐసిఎఆర్) ద్వారా వాక్సిన్ ను అభివృద్ధి చేయడం ద్వారా మరో కొత్త కోణం ఆవిష్కృతమైనట్టు తోమర్ తెలిపారు. ఎక్వైన్ రిసెర్చ్ సెంటర్ , వెటనరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన శాస్త్రవేత్తలు లంపీ చర్మవ్యాధికి వాక్సిన్ రూపొందించడం పట్ల వారికి తోమర్ అభినందనలు తెలిపారు. స్వల్ప వ్యవధిలో పరిమిత ట్రయల్స్‌తో నూరుశాతం సమర్ధతతో అన్ని ప్రమాణాలకు అనుగుణంగా లంపీ చర్మవ్యాధికి వాక్సిన్‌ను రూపొందించడాన్ని శాస్త్రవేత్తలు సవాలుగా స్వీకరించడం తనకు సంతోషం కలిగించిందని అన్నారు.
ఈ వాక్సిన్ ను పెద్దమొత్తంలో తయారు చేసి పశువులను లంపీ చర్మవ్యాధినుంచి విముక్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను శ్రీ తోమర్ ఆదేశించారు. దేశంలో 30 కోట్ల పశు సంతతి ఉందని , మూగజీవాల బాధను అర్ధం చేసుకుని వాటికి ఉపశమనం కలిగించేందుకు అవసరమైన అన్ని చర్యలు సత్వరం తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
గతంలో కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో మన శాస్త్రవేత్లు కరోనానుండి ప్రజలను రక్షించేందుకు వాక్సిన్ ను రూపొందించారని, ఇది మన దేశం మొత్తానికే కాక,ఇతర దేశాలకు ఎంతో ప్రయోజనం కలిగించిందని అన్నారు.
మత్స్య, పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ శాఖమంత్రి శ్రీ పురుషోత్తమ్ రూపాల , కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శ్రీ కైలాస్ చౌదరి, మత్స్య, పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి శ్రీ జతీంద్రనాథ్ స్వెయిన్, ఐసిఎఆర్ డైరక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్, డిప్యూటి డైరక్టర్ జనరల్ డాక్టర్ బి.ఎన్. త్రిపాఠి, ఇండియన్ వెటనరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్ డాక్టర్ త్రివేణి దత్, నేషనల్ ఎక్వైన్ రిసెర్చ్ సెంటర్, డైరక్టర్ డాక్టర్ యష్‌పాల్ , ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1850741)
Visitor Counter : 187