ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయండి: ఉపరాష్ట్రపతి


• ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన హామీల అమలు విషయంలో ఉపరాష్ట్రపతి సూచన

• తెలుగురాష్ట్రాల్లోని సాంస్కృతిక, పర్యాటక విభాగాలకు సంబంధించిన కార్యక్రమాల పురోగతిని ఉపరాష్ట్రపతికి పీపీటీ ద్వారా వివరించిన కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి

• అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారానే పనులు వేగవంతం అవుతాయని ఉపరాష్ట్రపతి సూచన*

Posted On: 08 AUG 2022 5:30PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టానికి సంబంధించిన హామీల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఇందుకోసం అధికారులు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్న, ప్రతిపాదిత ప్రాంతాలకు వెళ్లడం ద్వారానే పనులు వేగం పుంజుకుంటాయని ఆయన సూచించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రాజెక్టుల తాజా స్థితి గురించి తెలుసుకుంటూ మార్గదర్శనం చేస్తున్న ఉపరాష్ట్రపతి గతవారం, సంస్కృతి, పర్యాటక శాఖలకు సంబంధించిన కార్యక్రమాల పురోగతి గురించి కేంద్ర సాంస్కృతి, పర్యాటక శాఖల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డితో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు ఇవాళ ఉపరాష్ట్రపతికి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తెలియజేశారు.

కాకినాడ సీ-ఫ్రంట్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నెల్లూరు-పులికాట్-ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్-నేలపట్టు-కొత్తకూడూరు-మైపాడు-రామతీర్థం-ఇస్కపల్లి ప్రాజెక్టుతోపాటుగా కోస్టల్ సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్, గుంటూరు, అమరావతి నగరాల్లో పర్యాటక అభివృద్ధి, శ్రీశైలం, అన్నవరం, సింహాచల దేవాలయాల అభివృద్ధి, నెల్లూరులోని వేదగిరి నరసింహ స్వామి దేవాలయం, అరకు-విశాఖపట్టణం విస్టాడోమ్ (రైల్వే) ప్రాజెక్టు, తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి, పుట్టపర్తిలో సౌండ్ లైట్ షో తోపాటుగా.. ఉడాన్ పథకంలో భాగంగా విశాఖపట్టణం-రాజమండ్రి, హైదరాబాద్-విద్యానగర్ (హంపి) రూట్ల పురోగతితోపాటుగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన పనుల పురోగతిని కూలంకషంగా వివరించారు.

వీటన్నింటినీ సావధానంగా తెలుసుకున్న ఉపరాష్ట్రపతి, ఈ కార్యక్రమాలన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాల్లో అధికారుల క్షేత్రస్థాయిలో సందర్శించడం ద్వారా కార్యక్రమాలను మరింత వేగవంతం అవుతాయని, ఈ అంశాలను అధికారులు గమనించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఆయా ప్రాజెక్టుల విషయంలో తనకున్న సమాచారాన్ని, అనుభవాన్ని ఉపరాష్ట్రపతి అధికారులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

***


(Release ID: 1849937) Visitor Counter : 197


Read this release in: English , Urdu , Hindi , Tamil