సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కోటి రిజిస్ట్రేషన్ల మైలురాయిని చేరుకున్న ‘ఎంఎస్‌ఎంఇ’ మంత్రిత్వశాఖ పోర్టల్‌ ‘ఉద్యమ్’

Posted On: 02 AUG 2022 5:09PM by PIB Hyderabad

   కేంద్ర సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ఉద్యమ్‌‘ పోర్టల్‌ ఇవాళ కోటి రిజిస్ట్రేషన్ల మైలురాయిని చేరుకుంది. పెట్టుబడులు, యంత్రాగారాలు-యంత్ర పరికరాలు, వార్షిక వ్యాపార పరిమాణం ఆధారంగా 2020 జూలై 1న ‘ఎంఎస్‌ఎంఇ’ల నిర్వచనాన్ని సవరించబడింది. దీని ప్రకారం తయారీ, సేవాప్రదాన పరిశ్రమల మధ్య వ్యత్యాసాన్ని ఈ నిర్వచనం తొలగించింది. దీనికి అనుగుణంగా ఏర్పాటు చేయబడిన ‘ఉద్యమ్‌’ పోర్టల్‌ ‘సీబీడీటీ, జీఎస్‌టీఎన్‌’ సమాచార భాండాగారానికి అనుసంధానించబడింది. ఎలాంటి పత్రాల సమర్పరణతో నిమిత్తం లేకుండా ఇది పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా పనిచేస్తుంది. తద్వారా ‘ఎంఎస్‌ఎంఇ’లకు వాణిజ్య సౌలభ్యం దిశగా ముందడుగు పడింది.

   ఈ నేపథ్యంలో కేంద్ర ‘ఎంఎస్‌ఎంఇ’ శాఖ మంత్రి శ్రీ నారాయణ్‌ రాణే, సహాయమంత్రి భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ మాట్లాడుతూ- ‘ఉద్యమ్‌’ కింద రిజిస్ట్రేషన్ల అవసరాన్ని నొక్కి చెప్పారు. మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టే పథకాల ప్రయోజనం పొందడమే కాకుండా ప్రాధాన్య రంగాలకు ఆర్థిక సహాయం అందించే బ్యాంకులవద్ద ‘ఎంఎస్‌ఎంఇ’లకు ఇదొక గుర్తింపుగా ఉపయోగపడుతుందని తెలిపారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), ఎగుమతులు, ఉపాధి కల్పనలలో ‘ఎంఎస్‌ఎంఇ’లు పోషిస్తున్న కీలక పాత్ర గురించి కూడా శ్రీ రాణే ప్రముఖంగా ప్రస్తావించారు.

   కేవలం 25 నెలల వ్యవధిలోనే మొత్తం కోటి ‘ఎంఎస్‌ఎంఇ’లు ‘ఉద్యమ్‌’ పోర్టల్‌ కింద స్వచ్ఛందంగా నమోదు చేసుకోగా, వాటిద్వారా 7.6 కోట్ల మందికి ఉపాధి లభించిందని, వీరిలో 1.7 కోట్లమంది మహిళలు కూడా ఉన్నారని ఆయన ప్రకటించారు.

   ‘ఎంఎస్‌ఎంఇ’ మంత్రిత్వ శాఖ ‘ఉద్యమ్‌’ సమాచార పంపిణీ కోసం పర్యాటక మంత్రిత్వ శాఖతోపాటు ‘ఎన్‌ఎస్‌ఐసి’తోనూ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో భాగంగా ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్ కోసం ‘డిజి లాకర్’ సదుపాయం కూడా ప్రారంభించబడింది.

 

***(Release ID: 1847608) Visitor Counter : 224