ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టుల పురోగతి గురించి కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తో ఉపరాష్ట్రపతి సమీక్ష


విశాఖ రైల్వే జోన్ సహా పలు ప్రాజెక్టుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్న ఉపరాష్ట్రపతి

Posted On: 01 AUG 2022 7:48PM by PIB Hyderabad

పునర్ వ్యవస్థీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతి గురించి గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

నూతనంగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్ధి విషయంలో రవాణా సౌకర్యాలు కీలకమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, నూతన రైల్వే ప్రాజెక్టులతో పాటు ప్రస్తుతం ముందుకు సాగుతున్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ప్రధానంగా విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. డీపీఆర్ మీద వచ్చిన సలహాలు, సూచనల పరిశీలన కోసం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిన అంశాన్ని కేంద్ర మంత్రి ఉపరాష్ట్రపతికి వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఎదురయ్యే పరిపాలనా, సాంకేతిక సమస్యలను వీలైనంత త్వరగా అధిగమించి, రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా నడికుడి – శ్రీకాళహస్తి రైలు మార్గం పనుల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. వీటితో పాటు గూడూరు విజయవాడ మూడో లైను, గుంటూరు-అమరావతి-విజయవాడ రైల్వేలైను తదితర అంశాల గురించి ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సమస్యలను పరిష్కరించుకుని ముందుకు సాగాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన అనేక ప్రాజెక్టుల గురించి ఉపరాష్ట్రపతి ఎప్పటికప్పుడు ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారితో పార్లమెంట్ లోని తమ చాంబర్ లో సమీక్ష నిర్వహించారు.

***



(Release ID: 1847182) Visitor Counter : 167


Read this release in: English , Urdu , Hindi , Punjabi