ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి యుపి సందర్శన; బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం
296 కిలోమీటర్ల నిడివి గల ఈ నాలుగు లేన్ల ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ వ్యయం రూ.14,850 కోట్లు
బుందేల్ ఖండ్ ప్రాంతంలో అనుసంధానత, పారిశ్రామికాభివృద్ధికి ఉత్తేజం ఈ ఎక్స్ ప్రెస్ వే
“యుపి ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలకు అనుసంధానత కల్పిస్తున్నాయి”
“ఉత్తర ప్రదేశ్ లోని ప్రతీ ఒక్క మారుమూల ప్రాంతం కొత్త కలలు, కొత్త సంకల్పాలతో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంది”
“దేశవ్యాప్తంగా యుపి గుర్తింపు మారుతోంది, పలు అభివృద్ధి చెందిన రాష్ర్టాల కన్నా మెరుగైన పనితీరు ప్రదర్శిస్తోంది”
“ప్రాజెక్టులు నిర్ణీత కాలం కన్నా ముందుగానే పూర్తి చేస్తూ మేం ప్రజల తీర్పును, వారు మాపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తున్నాం”
“మనం స్వాతంత్ర్య సమర యోధులను గుర్తుంచుకోవాలి, రాబోయే నెల రోజుల్లో పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొత్త సంకల్పాలకు అనువైన వాతావరణం కల్పించాలి”
“దేశానికి హాని చేసేది ఏదైనా దేశాభివృద్ధిని కుంటుబరుస్తుంది, అలాంటి వైఖరికి మనం దూరంగా ఉండాలి”
“డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉచితాలు అందించే తరహా దగ్గర దారులు అనుసరించడంలేదు;
Posted On:
16 JUL 2022 1:56PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుందేల్ ఖండ్ ఎక్స్ వేను ఉత్తర ప్రదేశ్ లో జలౌన్ జిల్లాలోని ఒరాయ్ తహసీల్ కు చెందిన కేథేరి గ్రామం వద్ద ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా అక్కడ హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ బుందేల్ ఖండ్ ప్రజల శ్రమించి పని చేసే స్వభావం, సాహసం, సాంస్కృతిక ఔన్నత్యం గురించి ప్రధానమంత్రి గుర్తు చేశారు. “ఈ భూమి ఎందరో పోరాట యోధులను తయారుచేసింది. ఈ ప్రాంతంలోని ప్రజల రక్తంలో దేశం పట్ల అంకిత భావం పొంగి పొరలుతూ ఉంటుంది. ఈ ప్రాంతానికి చెందిన కుమారులు, కుమార్తెల శక్తి, శ్రమించే స్వభావం ఎప్పుడూ దేశానికి కాంతులు నింపుతూనే ఉన్నాయి” అన్నారు.
కొత్త ఎక్స్ ప్రెస్ వే అందించే తేడా గురించి వివరిస్తూ “ఇది చిత్రకూట్-ఢిల్లీ మధ్య దూరాన్ని 3-4 గంటల మేరకు తగ్గిస్తుంది, కాని అది అందించే లాభం అంతకన్నా ఎంతో అధికంగా ఉంటుంది. ఈ ఎక్స్ ప్రెస్ వే ఈ ప్రాంతం మీదుగా నడిచే వాహనాల వేగం పెంచడమే కాదు, బుందేల్ ఖండ్ ప్రాంత పారిశ్రామికాభివృద్ధిని కూడా వేగవంతం చేస్తుంది” అన్నారు.
భారీ మౌలిక వసతులు, సౌకర్యాలు పెద్ద నగరాలు, దేశంలోని ఎంపిక చేసిన ప్రాంతాలకే పరిమితం అనే రోజులు పోయాయి, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ స్ఫూర్తితో ఇప్పుడు మారుమూల ప్రాంతాలు, నిర్లక్ష్యానికి గురైన ప్రదేశాలు కూడా కనివిని ఎరుగని కనెక్టివిటీ పొందుతున్నాయి అని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఎక్స్ ప్రెస్ వేతో ఈ ప్రాంతంలో అభివృద్ధి, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలెన్నో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ లోని కనెక్టివిటీ ప్రాజెక్టులు గతంలో నిర్లక్ష్యం చేసిన పలు ప్రాంతాలకు అనుసంధానత కల్పిస్తున్నాయని తెలిపారు. ఉదాహరణకి బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేని తీసుకుంటే ఇది చిత్రకూట్, బంగా, మహోబా, హమీర్ పూర్, జలౌన్, ఔరియా, ఎటావా జిల్లాల ద్వారా సాగుతుందన్నారు. ఎక్స్ ప్రెస్ వేలు రాష్ట్రంలోని ప్రతీ ఒక్క మూలను కలుపుతున్నాయంటూ “ఉత్తర ప్రదేశ్ లోని ప్రతీ ఒక్క మారుమూల ప్రాంతం కొత్త కలలు, కొత్త సంకల్పాలతో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పారు. ఈ డబుల్ ఇంజన్ సర్కారు పునరుజ్జీవించిన శక్తితో ఆ దిశలో పయనిస్తోంది” అన్నారు.
రాష్ట్రంలో వైమానిక అనుసంధానత మెరుగుపరిచే చర్యల గురించి ప్రస్తావిస్తూ ప్రయాగ్ రాజ్, కుశినగర్ లలో కొత్త ఎయిర్ పోర్టు టెర్మినల్స్ అందుబాటులోకి వచ్చాయని, నోయిడాలోని జెవార్ ప్రాంతంలో కొత్త విమానాశ్రయ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఇంక ఎన్నో నగరాలకు విమానయాన అనుసంధాన సౌకర్యం ఏర్పడనున్నదని చెప్పారు. ఇది టూరిజం, ఇతర అభివృద్ధి అవకాశాలు అందిస్తుందన్నారు.
ఈ ప్రాంతంలోని పలు కోటల చుట్టూ పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయాలని, కోటలకు సంబంధించిన వేడుకలు ఏర్పాటు చేయాలని, పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి సూచించారు.
ఒకప్పటి యుపిలో సరయు కాల్వ ప్రాజెక్టు పూర్తి కావడానికి 40 సంవత్సరాలు పట్టింది, గోరఖ్ పూర్ ఎరువుల ఫ్యాక్టరీ 30 సంవత్సరాల పాటు మూతబడింది, అర్జున్ డామ్ ప్రాజెక్టు పూర్తి కావడానికి 12 సంవత్సరాలు పట్టింది, అమేథి రైఫిల్ ఫా్యక్టరీ కేవలం ఒక బోర్డుతోనే మూలన పడి ఉంది, రాయబరేలి రైల్ కోచ్ ఫ్యాక్టరీ కేవలం రైలు కోచ్ లకు రంగులు వేసే పనికే పరిమితం కావలసివచ్చింది అని ప్రధానమంత్రి విమర్శించారు. కాని ఇప్పుడు ఎన్నో అభివృద్ధి చెందిన రాష్ర్టాల కన్నా మెరుగైన పనితీరు ప్రదర్శించే విధంగా యుపిలో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోంది, దేశవ్యాప్తంగా యుపి ఇమేజ్ మారుతోంది అని ప్రధానమంత్రి అన్నారు.
పరిపాలనలో వేగం గురించి శ్రీ మోదీ ప్రస్తావిస్తూ గతంలో ఏడాదికి 50 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం జరిగేదని, ఇప్పుడది 200 కిలోమీటర్లకు పెరగడమే ఇందుకు తార్కాణమని చెప్పారు. అలాగే ఉత్తర ప్రదేశ్ లోని కామన్ సర్వీస్ కేంద్రాల సంఖ్య 2014లో 11,000 ఉండగా ఇప్పుడది 1.30 లక్షలకు చేరిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య 12 నుంచి 35కి పెరిగిందని, మరో 14 వైద్య కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు.
నేడు జరుగుతున్న అభివృద్ధి క్రమానికి రెండు ప్రధాన కోణాలున్నాయంటూ అవే ఇరాదా, మర్యాద (ఉద్దేశం, మర్యాద) అని ప్రధానమంత్రి చెప్పారు. తాము దేశానికి వర్తమానానికి అవసరం అయిన కొత్త సదుపాయాలు కల్పించడమే కాదు, భవిష్యత్తుకు కూడా సదుపాయాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లో పూర్తవుతున్న ప్రాజెక్టులు పూర్తిగా “మర్యాద”కు (గడువు) లోబడినవేనన్నారు. ఇందుకు చక్కని ఉదాహరణ బాబా విశ్వనాథ్ ధామ్ పునర్నిర్మాణం, గోరఖ్ పూర్ ఎయిమ్స్, ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే, బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేలని ఆయన తెలిపారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ప్రజా తీర్పును, వారు తమపై ఉంచిన విశ్వాసాన్ని తాము గౌరవిస్తున్నట్టు శ్రీ మోదీ చెప్పారు. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ప్రజలను కోరారు. మనం స్వాతంత్ర్య సమర యోధులను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, రాబోయే ఒక నెల రోజుల కాలంలో కొత్త సంకల్పాలకు అనుకూలమైన వాతావరణం కల్పించుకోవాలని ఆయన సూచించారు.
ఏ నిర్ణయం లేదా ఏ విధానం ప్రధాన లక్ష్యం అయినా దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేయడమే కావాలని ప్రధానమంత్రి అన్నారు. దేశానికి హానికరమైనది ఏదైనా అభివృద్ధిని కుంటుపరుస్తుందని, అలాంటి వైఖరిని మనం విడనాడాలని ఆయన సూచించారు. “అమృతకాలం” అత్యంత అరుదైన అవకాశమని, దేశాభివృద్ధి కోసం లభించిన ఈ అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదని చెప్పారు.
ఉచితాలు ప్రకటించి ఓట్లు అభ్యర్థించే సంస్కృతి అత్యంత ప్రమాదకరమని ప్రధానమంత్రి హెచ్చరించారు. ఈ ఉచితాల సంస్కృతి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఈ ఉచితాల సంస్కృతి మీకు కొత్త ఎక్స్ ప్రెస్ వేలు లేదా కొత్త రక్షణ కారిడార్లు అందుబాటులోకి తీసుకురాలేకపోయిందని ఆయన గుర్తు చేశారు. సగటు మనిషికి ఉచితాలు అందించడం ద్వారా తాము ఓట్లు దండుకోవచ్చునని ఈ ఉచితాల సంస్కృతికి అలవాటు పడిన వారు భావిస్తారని ఆయన చెప్పారు. సామూహికంగా ఈ ఆలోచనను ఓడించాలని, దేశ రాజకీయాల నుంచి ఉచితాల సంస్కృతిని తొలగించాలని ఆయన పిలుపు ఇచ్చారు. నేటి ప్రభుత్వం ఈ ఉచితాల సంస్కృతిని దూరంగా పెట్టి ప్రజలకు పక్కా గృహాలు, రోడ్లు, మౌలిక వసతులు, ఇరిగేషన్, విద్యుత్ ప్రాజెక్టులు అందించడంపై దృష్టి పెట్టిందని చెప్పారు. “డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉచితాలనే దగ్గర దారులు వదిలి కష్టించి పని చేయడం ద్వారా ఫలితాలు చూపిస్తున్నాయి” అన్నారు.
దేశంలో నెలకొన్న సమతూకమైన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఇప్పుడు అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైన, చిన్న నగరాలకు విస్తరించిందని, అది సామాజిక న్యాయాన్ని అందిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. ఆధునిక మౌలిక వసతులు నిర్లక్ష్యానికి గురైన తూర్పు భారతానికి, బుందేల్ ఖండ్ ప్రాంతానికి చేరాయని, అది కూడా సామాజిక న్యాయానికి దారి తీసిందని తెలిపారు. అభివృద్ధి క్రమంలో భాగస్వాములు కాని వెనుకబడిన జిల్లాలు కూడా ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంటున్నాయంటూ ఇది కూడా సామాజిక న్యాయమని చెప్పారు. పేదలకు మరుగుదొడ్లు, గ్రామాలకు రోడ్లు, టాప్ ల ద్వారా నీటి వసతి సామాజిక న్యాయమని తెలిపారు. బుందేల్ ఖండ్ ఎదుర్కొంటున్న మరో సవాలును కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. ప్రతీ ఒక్క ఇంటికీ కుళాయిల ద్వారా నీరందించేందుకు ప్రారంభించిన జల్ జీవన్ కార్యక్రమం గురించి ప్రధానమంత్రి వివరించారు.
బుందేల్ ఖండ్ నదుల్లోని నీటికి అధిక శాతం మంది ప్రజలకు అందించేందుకు చేపట్టిన రతౌని డామ్, భవాని డామ్, మజగాం-చిల్లీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.అలాగే కెన్-బెత్వా లింక్ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోని ప్రజల జీవితాన్ని మారుస్తుందన్నారు.
ప్రతీ జిల్లాలోనూ 75 అమృత సరోవరాలు ఏర్పాటు చేసే కృషికి బుందేల్ ఖండ్ ప్రజలు కూడా తమ వంతు కృషి చేయాలన్న అభ్యర్ధన ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
చిన్నతరహా, కుటీర పరిశ్రమలను పటిష్ఠం చేయడానికి చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఆటబొమ్మల పరిశ్రమ విజయం ఇందుకు తార్కాణమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ప్రభుత్వం, హస్త కళాకారులు, పరిశ్రమ, పౌరుల కృషితో ఆటబొమ్మల దిగుమతి గణనీయంగా తగ్గిందని ఆయన చెప్పారు. దీని వల్ల పేదలు, నిరాదరణకు గురవుతున్న వారు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దళితులు, మహిళలు లబ్ధి పొందుతారన్నారు.
క్రీడారంగానికి బుందేల్ ఖండ్ అందించిన సేవల గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రాంతం పుత్రుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరిటనే దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం ఉన్నదన్న విషయం గుర్తు చేశారు. అలాగే ఈ ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్ అండర్-20 వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో దేశానికి ప్రశంసలు తెచ్చి పెట్టిన విషయం ప్రస్తావించారు.
బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే
దేశవ్యాప్తంగా కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రోడ్డు మౌలిక వసతుల మెరుగుదల ఇందులో ప్రధానం. 2020 ఫిబ్రవరి 29వ తేదీన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం ఈ దిశగా ప్రధానమైన చర్య. ఈ ప్రాజెక్టు 28 నెలల కాలపరిమితిలో పూర్తి కావడమే నవభారతంలో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనం.
ఉత్తర ప్రదేశ్ ఎక్స్ ప్రెస్ వేస్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఉపెడా) ఆధ్వర్యంలో రూ.14,850 కోట్ల వ్యయంతో చేపట్టిన 296 కిలోమీటర్ల నిడివి గల నాలుగు లేన్ల ఈ బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను తదుపరి కాలంలో అవసరాలకు అనుగుణంగా ఆరు లేన్లుగా విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. చిత్రకూట్ జిల్లాలోని భరత్ కూప్ వద్ద గోండా గ్రామం దగ్గర ఎన్ హెచ్-5లో ప్రారంభమయ్యే ఈ ఎక్స్ ప్రెస్ వే ఎటావా జిల్లాలోని కుద్రేల్ గ్రామం వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేలో కలుస్తుంది. ఇది చిత్రకూట్, బందా, మహోబా, హమీర్ పూర్, జలౌన్, ఔరియా, ఎటావా జిల్లాల మీదుగా సాగుతుంది.
బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ఈ ప్రాంతంలో అనుసంధానత పెంచడంతో పాటు ఆర్థికాభివృద్ధికి భారీ ఉత్తేజం అందిస్తుంది. తద్వారా స్థానిక ప్రజలకు వేలాది ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఎక్స్ ప్రెస్ వే వెంబడి బందా, జలౌన్ జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయింది.
(Release ID: 1842260)
Visitor Counter : 65
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam