ఆర్థిక మంత్రిత్వ శాఖ

హర్యానా మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఫార్మాస్యూటికల్ తయారీదారులు మరియు పంపిణీదారులపై దాడులు, సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ

Posted On: 08 JUL 2022 3:51PM by PIB Hyderabad

రియల్ ఎస్టేట్ అభివృద్ధి, ఫార్మాస్యూటికల్ తయారీ, పంపిణీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ పై ఆదాయం పన్ను శాఖ 29.06.2022 న దాడి చేసి సోదాలు నిర్వహించింది. హర్యానా మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఉన్న సంస్థకు చెందిన 25 ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. 

సంస్థ పాల్పడిన చట్టవిరుద్ధ కార్యక్రమాలకు సంబంధించిన రుజువులను అధికారులు విడి కాగితాలు, డిజిటల్ డేటా రూపంలో గుర్తించారు. ఈ పత్రాలు, సమాచారాన్ని పరిశీలించిన అధికారులు సంస్థ నగదు రూపంలో ఫార్మాస్యూటికల్ ఔషధాలను విక్రయించి లెక్కల్లో చూపలేదని అధికారులు నిర్ధారించారు. నగదు రూపంలో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయడం, వేతనాలు చెల్లించడం, ఇతర ఖర్చులు చేసిందని అధికారులు గుర్తించారు. ఆఫ్ఘనిస్తాన్‌కు ఔషధాలను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని  హవాలా రూపంలో నగదుగా వచ్చిన ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా విడి కాగితాలపై ఉంచినట్టు లావాదేవీల్లో సంబంధం ఉన్న సంస్థ అధికారి అంగీకరించారు. హవాలా రూపంలో దాదాపు 25 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ సమాచారాన్ని విశ్లేషించిన  ఆదాయం పన్ను శాఖ అధికారులు  ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.   యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ (ఏపీఐ రంగంలో లావాదేవీలు నిర్వహిస్తున్న  ఫార్మా సంస్థ లో 94 కోట్ల రూపాయల విలువ చేసే మిగులు నిల్వలను అధికారులు గుర్తించారు. 

లెక్కలు చూపని నగదును స్థిరాస్తి కొనుగోలు, ఔషధాల తయారీ సౌకర్యాల విస్తరణలో పెట్టుబడి పెట్టినట్లు అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సంస్థ అనుబంధ సంస్థలు పుస్తకాల్లో చూపకుండా నగదు రూపంలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. సదరు లావాదేవీల్లో మూలధన లాభాలను దాచి పెట్టేందుకు సంస్థ సెక్యూరిటీ మార్కెట్ లో నకిలీ దీర్ఘ కాల/ స్వల్పకాలిక మూలధన నష్టాలు చూపించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సంస్థ బినామీల పేరిట స్థిరాస్తులను కొనుగోలు చేసిందని అధికారుల సోదాల్లో వెల్లడయింది. 

ఇంతవరకు లెక్కలు చూపని 4.2 కోట్ల రూపాయల  నగదు, నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలు/బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. 

***



(Release ID: 1840237) Visitor Counter : 119


Read this release in: English , Urdu , Hindi , Marathi