బొగ్గు మంత్రిత్వ శాఖ
2022-23 మొదటి త్రైమాసికంలో 79% పెరిగి 27.7 మిలియన్ టన్నులకు చేరుకున్న క్యాప్టివ్ & కమర్షియల్ బొగ్గు బ్లాక్‌ల ఉత్పత్తి
గత సంవత్సరం వేలం వేయబడిన రెండు గనులు 1.57 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
12 కొత్త గనులు ఈ సంవత్సరం ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం
Posted On:
07 JUL 2022 3:52PM by PIB Hyderabad
2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బొగ్గు బ్లాకుల నుండి ఉత్పత్తిని బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి & నామినేటెడ్ అథారిటీ 6 జూలై 2022న సమీక్షించారు. మొదటి త్రైమాసికంలో సాధించిన బొగ్గు ఉత్పత్తి 27.7 మిలియన్ టన్నులు, ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో అదే కాలంలో ఉత్పత్తి చేయబడిన 15.5 మిలియన్-టన్నుల బొగ్గు కంటే 79% ఎక్కువ.
అధిక వృద్ధిని సాధించడంలో బొగ్గు బ్లాక్‌ల కేటాయింపుదారుల కృషిని మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో బొగ్గు బ్లాకుల నుండి 32 మిలియన్ టన్నుల లక్ష్య ఉత్పత్తిని సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేసింది. వాణిజ్య వేలం సంస్కరణల క్రింద 2021లో వేలం వేయబడిన రెండు గనులు మొదటి త్రైమాసికంలో 1.57 మిలియన్ టన్నుల ఉత్పత్తిని ప్రారంభించాయని తెలిపింది.
ప్రస్తుతం, మొత్తం 36 క్యాప్టివ్ మరియు కమర్షియల్ గనులు ఉత్పత్తిలో ఉన్నాయి. ఈ సంవత్సరంలో కనీసం 12 కొత్త గనులు ఉత్పత్తిని ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. దేశంలో బొగ్గు డిమాండ్‌ను తీర్చేందుకు ఇది గణనీయంగా దోహదపడుతుంది.
ఇంకా, ప్రాజెక్ట్ నిర్వాహకులు తాము చేసిన ప్రయత్నాలను, ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా పంచుకున్నారు. సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని బొగ్గు మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.
****
(Release ID: 1840047)