ప్రధాన మంత్రి కార్యాలయం
గాంధీనగర్ లో డిజిటల్ ఇండియా వీక్ 2022ని ప్రారంభించిన ప్రధానమంత్రి
డిజిటల్ ఇండియా వారోత్సవం 2022 ప్రధాన థీమ్ : నవభారత సాకేంతిక దశాబ్ది (టెకేడ్) ఉత్ప్రేరకం
“డిజిటల్ ఇండియా భాషిణి”, “డిజిటల్ ఇండియా జెనెసిస్”, “ఇండియా స్టాక్.గ్లోబల్” ప్రారంభించిన ప్రధానమంత్రి;
“ మై స్కీమ్”, “మేరీ పెహచాన్” అంకితం
స్టార్టప్ కార్యక్రమానికి చిప్ లు అందించేందుకు 30 సంస్థల సంఘటనను ప్రారంభిస్తున్నట్టు ప్రకటన
“నాలుగో పారిశ్రామిక విప్లవం - ఇండస్ర్టీ 4.0లో ప్రపంచానికి భారత్ మార్గదర్శకం చేస్తోంది”
“ఆన్ లైన్ ఆచరించడం ద్వారా ఎన్నో లైన్లను చెరిపివేసిన భారత్”
“డిజిటల్ ఇండియా ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటికి, ఫోన్లను పౌరుల చేతికి తెచ్చింది”
“పూర్తిగా ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం భారత ఫిన్ టెక్”
“మన డిజిటల్ సొల్యూషన్ లో పరిధి, భద్రత, ప్రజాస్వామిక విలువలు ఉన్నాయి”
“వచ్చే మూడు నాలుగు సంవత్సరాల కాలంలో ఎలక్ర్టానిక్స్ తయారీని $ 300 డాలర్లకు చేర్చడం భారతదేశం లక్ష్యం”
“చిప్ ల సేకరణ నుంచి చిప్ ల ఉత్పత్తిదారుగా మారాలన్నది భారతదేశం కోరిక”
Posted On:
04 JUL 2022 7:05PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ “నవభారత సాంకేతిక దశాబ్ది (టెకేడ్) ఉత్ప్రేరక శక్తి” అనే థీమ్ తో నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా వారోత్సవం 2022ని గాంధీనగర్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా టెక్నాలజీని మరింతగా అందుబాటులోకి తేవడం, జీవన సౌలభ్యం కోసం సేవల లభ్యతను ప్రక్షాళనం చేయడం, స్టార్టప్ వ్యవస్థను ఉత్తేజితం చేయడం లక్ష్యంగా చేపట్టిన పలు డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించారు. చిప్స్ టు స్టార్టప్ (సి2ఎస్) కార్యక్రమం కింద మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన 30 సంస్థల సంఘటన ఆవిర్భావాన్ని కూడా ఆయన ప్రకటించారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్టార్టప్ లు, ఇతర భాగస్వామ్య వర్గాల సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ 21వ శతాబ్దిలో నిరంతరం ఆధునికీకరణ సాధిస్తున్న భారతదేశం చిత్రాన్ని ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించినట్టయితే మానవతా వృద్ధికి అది ఎలా ఉపయోగపడుతుందనేది డిజిటల్ ఇండియా మనకి చూపించింది. “ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం మారుతున్న కాలం పాటుగా విస్తరిస్తూ ఉండడం నాకు ఆనందదాయకం” అని ప్రధానమంత్రి అన్నారు.
“కాలానికి అనుగుణంగా దేశం ఆధునిక టెక్నాలజీ అనుసరించకపోతే కాలం దాన్ని వదిలి ముందుకు సాగిపోతుంది. మూడో పారిశ్రామిక విప్లవంలో ఈ నిర్లక్ష్యం బాధిత దేశం భారత్, కాని నేడు నాలుగో పారిశ్రామిక విప్లవం ఇండస్ర్టీ 4.0లో భారతదేశమే ప్రపంచానికి మార్గదర్శకం చేస్తోంది” అని ప్రధానమంత్రి అన్నారు. ఇందులో ముందువరుసలో నిలిచినందుకు గుజరాత్ ను ఆయన అభినందించారు.
8-10 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు గుర్తు చేసుకుంటూ జనన ధ్రువీకరణ, బిల్లు చెల్లింపులు, పాఠశాల ప్రవేశాలు, ఫలితాలు, బ్యాంకుల ముందు భారీ లైన్లలో నిలబడాల్సిన స్థితి ఉండేదని, ఆన్ లైన్ అనుసరించడం ద్వారా ఆ సమస్యలను భారతదేశం అధిగమించిందని ప్రధానమంత్రి తెలిపారు. జీవన ధ్రువీకరణ, రిజర్వేషన్, బ్యాంకింగ్ వంటి పలు సేవలు అందరికీ ధరల్లో అందుబాటులోకి వచ్చి వేగవంతం అయ్యాయి. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో గత 8 సంవత్సరాల కాలంలో రూ.23 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో బదిలీ అయ్యాయన్నారు. అవినీతి నిర్మూలనలో డిజిటల్ ఇండియా పాత్ర గురించి ప్రస్తావిస్తూ “టెక్నాలజీ వినియోగం ద్వారా రూ.2.23 లక్షల కోట్లు మోసగాళ్ల చేతుల్లోకి పోకుండా ఆదా అయ్యాయి” అని ప్రధానమంత్రి చెప్పారు. డిజిటల్ ఇండియా ద్వారా పరిపాలన, ఫోన్లు పౌరుల ముంగిటికి వచ్చాయని ఆయన తెలిపారు. 1.25 లక్షలకు పైబడిన కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణ స్టోర్లు ఇ-కామర్స్ ను గ్రామీణ భారతం ముంగిటికి తీసుకెళ్లాయన్నారు. అలాగే టెక్నాలజీ వినియోగం ద్వారా గ్రామీణ ఆస్తులకు సంబంధించిన పత్రాలు అందరికీ తేలిగ్గా అందుతున్నట్టు చెప్పారు.
గత ఎనిమిది సంవత్సరాల కాలంలో డిజిటల్ ఇండియా సృష్టించిన శక్తి చివరికి కరోనా వంటి ప్రపంచ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడిందని ప్రధానమంత్రి చెప్పారు. “కేవలం ఒకే ఒక క్లిక్ తో కోట్లాది మంది మహిళలు, రైతులు, కార్మికుల బ్యాంకు ఖాతాల్లోకి వేలాది కోట్ల రూపాయలు బదిలీ చేయగలిగాం. ఒక జాతి ఒక రేషన్ కార్డు సహాయంతో 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచితంగా రేషన్ అందించగలిగాం” అని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ సహాయ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించగలిగామని ఆయన తెలిపారు. కోవిన్ వేదిక ద్వారా 200 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు ఇవ్వడం, సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగిందని ప్రధానమంత్రి అన్నారు.
“భారత ఫిన్ టెక్ ప్రజల చేత, ప్రజలే, ప్రజల కోసం చేపట్టిన వాస్తవమైన సొల్యూషన్. వాస్తవానికి టెక్నాలజీయే ప్రజల చేత అనుసరించే ప్రక్రియ. ప్రజల కోసం ప్రజలే టెక్నాలజీని భాగం చేసుకున్నారు. ప్రజల సౌలభ్యం కోసం ప్రజలే డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు” అని ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచ స్థాయిలో 40 శాతం డిజిటల్ లావాదేవీలు భారతదేశంలోనే జరుగుతున్నాయి అంటూ “మన డిజిటల్ సొల్యూషన్ల పరిధి, భద్రత, ప్రజాస్వామిక విలువ ఇది” అని ఆయన చెప్పారు.
వచ్చే 4-5 సంవత్సరాల కాలంలో పరిశ్రమ 4.0కి అవసరం అయిన 14-15 లక్షల మంది యువతను సిద్ధం చేసేందుకు నైపుణ్యాల కల్పన, పాత నైపుణ్యాలకు మెరుగులు, కొత్త నైపుణ్యాలు అందించడంపై దృష్టి సారించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. “అంతరిక్షం, మ్యాపింగ్, డ్రోన్లు, గేమింగ్, యానిమేషన్ వంటి రంగాలన్నీ భవిష్యత్తులో డిజిటల్ టెక్నాలజీని విస్తరింపచే స్తాయి. అవి ఇన్నోవేషన్ కు ద్వారాలు తెరిచాయి. వర్తమాన దశాబ్దిలో రాబోయే సంవత్సరాల్లో ఇన్-స్పేస్, కొత్త డ్రోన్ విధానం భారత సాంకేతిక పరిజ్ఞానానికి కొత్త శక్తిని అందిస్తాయి” అన్నారు.
“వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల కాలంలో ఎలక్ర్టానిక్స్ తయారీని $300 బిలియన్ కన్నా పై స్థాయికి చేర్చడం లక్ష్యంగా నేడు భారతదేశం కృషి చేస్తోంది, చిప్ ల సేకరణ దేశం స్థాయి నుంచి చిప్ తయారీ కేంద్రంగా మారాలని భారతదేశం భావిస్తోంది. సెమీ కండక్టర్ల తయారీని పెంచడంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి” అని ప్రధానమంత్రి తెలిపారు.
డిజిటల్ ఇండియా ప్రచారం తనకు తాను కొత్త కోణాలు జత చేస్తుంది, పౌరులకు సేవలు అందిస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు.
కొత్తగా ప్రారంభమైన కార్యక్రమాల వివరాలు
“డిజిటల్ ఇండియా భాషిణి” వాయిస్ ఆధారిత సేవలు సహా ఇంటర్నెట్, డిజిటల్ సేవలు అందరికీ తేలిగ్గా అందుబాటులోకి రావడానికి దోహదపడడంతో పాటు భారతీయ భాషల్లో కంటెంట్ సృష్టికి సహాయకారిగా ఉంటుంది. ఎఐ-ఆధారిత భాషా టెక్నాలజీ సొల్యూషన్ల వల్ల బహుభాషా డేటాసెట్లు అందుబాటులోకి వస్తాయి. భాషాదాన్ పేరిట క్రౌడ్ సోర్సింగ్ ఆధారిత చొరవతో ఈ తరహా డేటా సెట్లు నిర్మించేందుకు కూడా డిజిటల్ ఇండియా భాషిణి సహాయకారిగా ఉంటుంది.
“డిజిటల్ ఇండియా జెనెసిస్” (ఇన్నోవేటివ్ స్టార్టప్ లకు కొత్తతరం మద్దతు) - జాతీయ స్థాయి డీప్ టెక్ స్టార్టప్ వేదిక. ఇది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో విజయవంతమైన స్టార్టప్ లను గుర్తించి, మద్దతు ఇచ్చి, వృద్ధి చేసేందుకు సహాయపడుతుంది. ఈ స్కీమ్ కోసం రూ.750 కోట్లు కేటాయించారు.
“ఇండియాస్టాక్.గ్లోబల్” - ఆధార్, యుపిఐ, డిజిలాకర్, కోవిడ్ వ్యాక్సినేషన్, ప్రభుత్వ ఇ-మార్కెట్ (జెమ్) దీక్ష, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం వంటి కీలక ప్రాజెక్టులకు ప్రపంచ రిపోజిటరీ. ఇలాంటి టెక్నాలజీ కోసం అన్వేషించే ఇతర దేశాలకు విస్తృత పరిధిలో జనాభాకు అవసరమైన డిజిటల్ పరివర్తన ప్రాజెక్టులు అందించడంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుతుంది.
“మై స్కీమ్” - ప్రభుత్వ స్కీమ్ లు అందుబాటులోకి తేవడానికి అవసరం అయిన సేవల డెలివరీ వేదిక ఇది. వినియోగదారులు తమకు అర్హత గల స్కీమ్ లను అన్వేషించుకునేందుకు ఉపయోగపడే ఒక స్టాప్ సెర్చ్, డిస్కవరీ పోర్టల్ ఇది. ఒకే సిటిజెన్ లాగిన్ లో జాతీయ స్థాయిలో సంతకం చేసేందుకు ఉపయోగపడే వేదిక “మేరీ పెహచాన్”ను కూడా ఆయన అంకితం చేస్తారు. బహుళ ఆన్ లైన్ అప్లికేషన్లు లేదా సర్వీసుల కోసం నేషనల్ సింగిల్ సైన్ ఆన్ (ఎన్ఎస్ఎస్ఓ) ఇది.
సి2ఎస్ - సెమీ కండక్టర్ల చిప్ ల తయారీలో బ్యాచిల్, మాస్టర్స్, పరిశోధన స్థాయిల్లో ప్రత్యేక నైపుణ్యాలు గల మానవ వనరులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇది. దేశంలో సెమీ కండక్టర్ డిజైన్ లో పాల్గొంటున్న స్టార్టప్ ల వృద్ధికి చోదకశక్తిగా నిలుస్తుంది. ఇది సంస్థాగత స్థాయిలో మెంటరింగ్ సేవలు అందిస్తుంది. ఆ రంగంలోని సంస్థలకు ఆధునిక డిజైనింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంచుతుంది. దేశంలో శక్తివంతమైన సెమీ కండక్టర్ డిజైనింగ్ వ్యవస్థ నిర్మించేందుకు ఉద్దేశించిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లో ఇది ఒకటి.
డిజిటల్ ఇండియా వారోత్సవం 2022 సందర్భంగా గాంధీనగర్ లో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా వార్షికోత్సవం కూడా నిర్వహిస్తారు. ఆధార్, యుపిఐ, కోవిన్, డిజిలాకర్ వంటి డిజిటల్ వేదికలు పౌరులకు జీవన సౌలభ్యం ఎలా అందిస్తున్నాయో ప్రదర్శిస్తుంది. భారత సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటి చెబుతుంది. ఆ రంగంలో సహకారాలకు, వ్యాపారావకాశాలను అన్వేషిస్తుంది. కొత్త తరానికి భారత టెకేడ్ అందించే అవకాశాలు ప్రదర్శిస్తుంది. స్టార్టప్ లు, ప్రభుత్వ నేతలు, పరిశ్రమ ప్రతినిధులు, విద్యావేత్తలు ఇందులో పాల్గొటారు. ప్రజల జీవన సౌలభ్యం కోసం భారతదేశంలోని యునికార్న్ లు, స్టార్టప్ లు అభివృద్ధి చేసిన డిజిటల్ సొల్యూషన్లు ప్రదర్శించే 200 పైగా స్టాల్స్ తో డిజిటల్ మేళా కూడా నిర్వహిస్తారు. జూలై 7-9 తేదీల మధ్యన వర్చువల్ విధానంలో ఇండియా స్టాక్ నాలెడ్జ్ ఎక్స్ఛేంజి కూడా నిర్వహిస్తారు.
(Release ID: 1839500)
Visitor Counter : 260
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam