రక్షణ మంత్రిత్వ శాఖ
విజయవంతంగా తొలి ఆటానమస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ ను ప్రయోగించిన డిఆర్‌డిఒ
Posted On:
01 JUL 2022 2:31PM by PIB Hyderabad
తొలి అటానమస్ ఫ్లైయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ ను 01 జులై 2022న కర్ణాటకలోని చిత్రదుర్గ్‌లో గల ఏరోనాటికల్ టెస్ట్‌రేంజ్ నుంచి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) విజయవంతంగా ప్రయోగించింది. పైకి ఎగరడం, మార్గ గమనం (వే పాయింట్ నావిగేషన్), సులభంగా దిగడం సహా పూర్తి స్వయంప్రతిపత్తితో పరిపూర్ణమైన యానాన్ని ఈ విమానం ప్రదర్శించింది. భవిష్యత్తులో మానవరహిత విమానాల అభివృద్ధికి కీలకమైన సాంకేతికలను ప్రదర్శించడం ద్వారా ఈ విమానం ఒక ప్రధానమైన మైలురాయిగా నిలువడమే కాక, ఇది వ్యూహాత్మక రక్షణ సాంకేతికతలలో స్వావలంబన దిశగా ఒక ముఖ్యమైన అడుగు.
ఈ మానవరహిత వైమానిక వాహనాన్ని బెంగళూరులోని డిఆర్‌డిఒకు చెందిన ప్రధాన పరిశోధనా ప్రయోగశాల ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎడిఇ) రూపకల్పన చేసి, అభివృద్ధి చేసింది. ఇది చిన్న టర్బోఫ్యాన్ ఇంజిన్‌తో పని చేస్తుంది. విమానానికి ఉపయోగించిన ఎయిర్‌ఫ్రేమ్, అండర్ క్యారేజ్, మొత్తం విమాన నియంత్రణ, విమానానికి బిగించిన ఉపకరణాలు (ఏవియానిక్స్ సిస్టమ్స్)ను దేశీయంగా అభివృద్ధి చేశారు.
ఈ సందర్భంగా డిఆర్‌డిఒను అభినందిస్తూ, ఇది స్వయంప్రతిపత్తిగల విమాన దిశలో ప్రధాన విజయమని, కీలకమైన సైనిక వ్యవస్థల పరంగా ఆత్మనిర్భర్ భారత్‌కు మార్గాన్ని సుగమం చేస్తుందని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ఈ వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి, పరీక్షలలో కలిసి పనిచేసిన బృందాల కృషిని రక్షణ ఆర్&డి విభాగం కార్యదర్శి, డిఆర్‌డిఒ చైర్మన్ డాక్టర్ జి. సతీష్‌రెడ్డి ప్రశంసించారు.
****
(Release ID: 1838875)
Visitor Counter : 278