ప్రధాన మంత్రి కార్యాలయం
ఉమ్మడి ప్రకటన : భారత-జర్మనీ 6వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు
Posted On:
02 MAY 2022 8:09PM by PIB Hyderabad
- జర్మన్ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షతన నేడు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆరవ విడత అంతర్-ప్రభుత్వ సంప్రదింపులు నిర్వహించాయి. ఇద్దరు నాయకులు కాకుండా ఉభయ దేశాల మంత్రులు, అనుబంధంలో పేర్కొన్న ఉన్నత ప్రతినిధుల ప్రతినిధివర్గాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి.
- భారతదేశం 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న వేళ భారత, జర్మనీల మధ్య ఉమ్మడి ప్రజాస్వామిక విలువలు, దేశీయ చట్టాలకు లోబడి పాలన, మానవ హక్కులు, ప్రపంచ సవాళ్లకు బహుముఖీన స్పందనతో కూడిన పరస్పర సహకారం లోతుగా పాదుకుంది. ప్రజలకు ఉమ్మడి ప్రయోజనాలతో కూడిన సేవలందిస్తున్నాయి.
- ప్రపంచ దేశాలు ఇతర దేశాల సార్వభౌమ హక్కులు, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ ఐక్యరాజ్య సమితి రూపొందించిన అంతర్జాతీయ చట్టాలకు లోబడిన నిబంధనల ఆధారిత విధానాలు అనుసరించాలని ఉభయ దేశాలు నొక్కి చెప్పాయి. వర్తమాన, భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనగల రీతిలో బహుళ అంచెల్లో సంస్కరణల రూపకల్పన, పటిష్ఠతకు; ప్రపంచ శాంతి సుస్థిరతల పరిరక్షణకు, అంతర్జాతీయ చట్టాలకు కొత్త ఉత్తేజం అందించడానికి, సంఘర్షణలకు శాంతియుత పరిష్కారాలు సాధించాలనే ప్రాథమిక సూత్రాన్ని గౌరవించేందుకు; ప్రపంచ దేశాల సార్వభౌమ, ప్రాదేశిక హక్కుల పరిరక్షణకు ఉభయ దేశాల ప్రభుత్వాలు తమ కట్టుబాటును పునరుద్ఘాటించాయి.
- కోవిడ్-19 నష్టాల నుంచి భూగోళాన్ని కాపాడేందుకు దోహదపడే విధంగా ఆర్థిక రికవరీ సాధించడం పట్ల ఇద్దరు నాయకులు తమ కట్టుబాటును ప్రకటించారు. పునరుత్పాదక ఇంధనానికి ఉత్తేజం కల్పించడం ద్వారా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల సగటు వృద్ధిని పారిశ్రామిక విప్లవ కాలం నాటి 2 డిగ్రీల సెంటిగ్రేడ్ కు, ఆ తర్వాత పారిశ్రామిక విప్లవానికి ముందు కాలంలోని 1.5 డిగ్రీల సెల్సియస్ కు తగ్గించాలన్న లక్ష్యాలకు గట్టి కట్టుబాటు ప్రకటించారు. 2030 స్థిర అభివృద్ధి లక్ష్యాలకు దీటుగా ఆర్థిక రికవరీ మరింత పటిష్ఠంగా, పర్యావరణ మిత్రంగా, వాతావరణ మిత్రంగా, భవిష్యత్త తరాలకు సమ్మిళితంగా ఉండాలని వారు నొక్కి చెప్పారు. అలాగే పారిస్ ఒప్పందానికి ఉభయ దేశాల కట్టుబాటును ప్రకటించారు.
ఉమ్మడి విలువలు; ప్రాంతీయ, బహుముఖీన ప్రయోజనాలతో కూడిన భాగస్వామ్యం
- ఐక్యరాజ్యసమితి కేంద్రంగా నిబంధనల ఆధారితమైన, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబాటు గల అంతర్జాతీయ వ్యవస్థ ప్రాధాన్యతను ఉభయ దేశాలు గుర్తించాయంటూ అందుకు సమర్థవంతమైన, సంస్కరించిన బహుళ భాగస్వామ్య వ్యవస్థ ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. వాతావరణ మార్పులు, పేదరికం, ప్రపంచ ఆహార భద్రత వంటి సవాళ్లు; తప్పుడు సమాచారం, అంతర్జాతీయ సంఘర్షణలు, సంక్షోభాలు, అంతర్జాతీయ ఉగ్రవాదం వంటి చర్యల ద్వారా ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ముప్పు నేపథ్యంలో బహుళ భాగస్వామ్య వ్యవస్థలో సంస్కరణలు తప్పనిసరి అన్న అంశం వారు మరోసారి నొక్కి చెప్పారు. “గ్రూప్ ఆఫ్ ఫోర్”లో దీర్ఘకాలిక సభ్యులుగా ఉభయ ప్రభుత్వాలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని నిర్దేశిత లక్ష్యానికి కృషి చేయదగినదిగా, సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేదిగా తీర్చి దిద్దడానికి అవసరమైన సంస్కరణలకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్న కట్టుబాటు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో పరస్పర మద్దతు అందించుకోవడానికి ఉభయ ప్రభుత్వాలు నిర్ణయించాయి. అణు సరఫరాదారుల బృందంలో సభ్యదేశంగా భారతదేశం ప్రవేశానికి గట్టి మద్దతును జర్మనీ పునరుద్ఘాటించింది.
- ఆసియాన్ కేంద్రంగా భారత-పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, సమ్మిళితంగా ఉండాల్సిన ప్రాధాన్యతను ఉభయ వర్గాలు నొక్కి వక్కాణించాయి. జర్మన్ ఫెడరల్ ప్రభుత్వం ప్రతిపాదించిన విధాన మార్గదర్శకాలు, భారతదేశం ప్రతిపాదించిన ఇయు వ్యూహాత్మక ఇండో-పసిఫిక్ సహకారం, ఇండో-పసిఫిక్ సముద్ర చొరవ రెండింటి ప్రాధాన్యతను ఉభయులు పరస్పరం గుర్తించుకున్నారు. హిందూమహాసముద్రం, దక్షిణ చైనా సముద్రం సహా అన్ని సముద్ర ప్రాంతాల్లోను అంతర్జాతీయ చట్టాలు ప్రత్యేకించి ఐక్యరాజ్యసమితి సాగర చట్ట ఒడంబడిక (అంక్లోస్), 1982 పరిధిలో అవరోధాలకు తావు లేని వ్యాపారం, నౌకారవాణా స్వేచ్ఛ రెండింటి ప్రాధాన్యతను ఉభయ దేశాలు నొక్కి చెప్పాయి. 2022 జనవరిలో జర్మనీ యుద్ధ నౌక “బైరెన్” ముంబై పోర్టుకు రావడాన్ని ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జర్మనీ పెరుగుతున్న ప్రాధాన్యతలో ఒక కీలక మైలురాయిగా ఉభయ దేశాలు అభివర్ణించాయి. అలాగే వచ్చే ఏడాది జర్మనీ పోర్టుకు భారత నౌకాదళానికి చెందిన నౌక స్నేహపూర్వక రాకను జర్మనీ ఆహ్వానించింది.
- 2021 మే నెలలో పోర్టోలో జరిగిన భారత-ఇయు నాయకుల సమావేశం అనంతరం భారత, ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత లోతుగా పాదుకోవడాన్ని భారత్, జర్మనీ ఆహ్వానిస్తూ దాన్ని మరింత పటిష్ఠం చేయాలని అంగీకారానికి వచ్చాయి. భారత-ఇయు కనెక్టివిటీ భాగస్వామ్యం అమలుకు ఎదురు చూస్తున్నట్టు ప్రకటించారు. భారత-ఇయు వాణిజ్య, టెక్నాలజీ మండలి ప్రారంభం కావడం పట్ల ఉభయవర్గాలు సంతృప్తిని ప్రకటించారు. వాణిజ్యం మరింత బిగిగా అల్లుకోవడం, విశ్వసనీయ టెక్నాలజీ, సెక్యూరిటీ వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొనడంలో ఈ మండలి మరింత కీలకం కాగలదని ఉభయులు అంగీకరించారు.
- బంగాళాఖాత ప్రాంత బహుళ రంగ సాంకేతిక-ఆర్థిక సహకార అంగీకారం (బిమ్ స్టెక్) వంటి ప్రాంతీయ సంఘాలు, జి-20 వంటి బహుముఖీన వేదికల్లో ఉభయ వర్గాలు సహకారం మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని ఉభయులు నొక్కి వక్కాణించారు. భారతదేశం 2023లో జి-20కి అధ్యక్షత వహించే కాలంలో మరింత సన్నిహిత సహకారానికి ఎదురు చూస్తున్నట్టు భారత, జర్మనీ ప్రకటించాయి. జి-20 విషయంలో భారతదేశం ప్రకటించిన ప్రాధాన్యతలను జర్మనీ ఆహ్వానిస్తూ ఉమ్మడి ప్రపంచ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు శక్తివంతమైన జి-20 కార్యాచరణ రూపకల్పనకు కలిసికట్టుగా కృషి చేయడానికి అంగీకరించింది.
- జి-7 దేశాల బృందానికి, భారతదేశానికి మధ్య గల సన్నిహిత సహకారంతో పాటు జి-7కు ప్రస్తుతం జర్మనీ అధ్యక్షత వహిస్తున్న సమయంలో న్యాయబద్ధమైన ఇంధన పరివర్తన సహా భిన్న అంశాలపై సహకారాన్ని ఉభయ దేశాలు గుర్తించాయి. ప్రస్తుత జి-7 జర్మనీ నాయకత్వంలో వాతావరణ సమతూకమైన ఇంధన విధానాలు, పునరుత్పాదక ఇంధనం త్వరితగతిన విస్తరణ, సుస్థిర ఇంధనం వంటి అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లు, అందుబాటులో ఉన్న అవకాశాల ఆధారంగా న్యాయబద్ధమైన ఇంధన పరివర్తనకు మార్గాలను అన్వేషించాలని అంగీకరించారు. విభిన్న రంగాల్లోను ప్రత్యేకించి ఇంధన రంగంలోను ఉపశమనపూర్వకమైన వాతావరణ మార్పుల విధానం అనుసరించడం కూడా ఇందులో భాగం.
- ఎలాంటి కవ్వింపులు లేకుండానే రష్యన్ బలగాలు చట్టవిరుద్ధంగా ఉక్రెయిన్ పై దాడి చేయడంపై తన ఖండనను జర్మనీ పునరుద్ఘాటించింది.
ఉక్రెయిన్ సంక్షోభ కాలంలోలో తలెత్తిన మానవతా ఉల్లంఘన పట్ల జర్మనీ, భారత్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చాయి. ఉక్రెయిన్ లో అమాయకులైన పౌరుల మరణాలను ఉభయ దేశాలు తీవ్రస్వరంతో ఖండించాయి. దాడులు తక్షణం ఆపాలని వారు పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి నియమావళి ఆధారంగా నిర్మించిన అంతర్జాతీయ చట్టాలు, ప్రపంచ దేశాల సార్వభౌమత్వ, ప్రాదేశిక సమగ్రతల పట్ల గౌరవంతో కూడిన సమకాలీన ప్రపంచ నియమావళిని తక్షణం ఆచరించాలని వారు నొక్కి చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రాంతీయంగాను, ప్రపంచ స్థాయిలోను ఏర్పడుతున్న అస్థిరత ప్రభావం గురించి ఉభయులు చర్చించారు. ఈ అంశంపై సన్నిహితంగా సహకరించుకోవాలని వారు అంగీకారానికి వచ్చారు.
- ఆఫ్గనిస్తాన్ లో నెలకొన్న తీవ్ర మానవతా సంక్షోభం; లక్ష్యపూరిత ఉగ్రవాద దాడులు, మానవ హక్కులు, ప్రాథమిక హక్కుల వ్యవస్థాత్మక ఉల్లంఘన, మహిళలు, బాలికలకు విద్యావసతి నిరాకరణ సహా తలెత్తిన దౌర్జన్యపూరిత వాతావరణం పట్ల ఉభయవర్గాలు తీవ్ర ఆందోళన ప్రకటించాయి. శాంతియుత, సురక్షిత, సుస్థిర ఆఫ్గనిస్తాన్ పునరుద్ధరణకు బలమైన మద్దతు ప్రకటిస్తూ ఆఫ్గన్ ప్రజలకు మానవతాపూర్వకమైన సహాయం కొనసాగించనున్నట్టు ధ్రువీకరించాయి.
- ఆఫ్గన్ భూభాగాన్ని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేందుకు, శిక్షణకు, ఉగ్రవాద దాడుల ప్రణాళికకు, ఆర్థిక సహాయానికి కేంద్రంగా వినియోగించరాదని గట్టిగా కోరుతూ ఇందుకు సంబంధించిన యుఎన్ఎస్ సి తీర్మానం 2593 (2021) ప్రాధాన్యతను పునరుద్ఘాటించాయి. ఆఫ్గన్ పరిస్థితిపై సన్నిహిత సంప్రదింపులు కొనసాగించాలని ఉభయులు అంగీకరించారు.
- అన్ని రకాల ఉగ్రవాద చర్యలను, ఉగ్రవాద ప్రేరేపిత శక్తులు జరిపే సీమాంతర ఉగ్రవాద చర్యలను ఉభయ దేశాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల సురక్షిత ప్రదేశాలను, మౌలిక వసతులను, విచ్ఛిన్నకర ఉగ్రవాద నెట్ వర్క్ లను, ఆర్థిక సహాయ వనరులను అంతర్జాతీయ మానవతా చట్టం సహా విభిన్న అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నిర్మూలించేందుకు కృషి చేయాలని వారు అన్ని దేశాలకు పిలుపు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్ సి) 1267 ఆంక్షల కమిటీ ప్రకటించిన ఉగ్రవాద బృందాలు సహా అన్ని రకాల ఉగ్రవాద బృందాలపై సంఘటిత చర్యలు తీసుకోవాలని కూడా వారు పిలుపు ఇచ్చారు. ఉగ్రవాద బృందాలు, వ్యక్తులపై ఆంక్షల విషయంలో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడాన్ని కొనసాగించేందుకు, తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండించేందుకు, ఉగ్రవాదుల ఇంటర్నెట్ వినియోగాన్ని, సీమాంతర కదలికలను నిలువరించేందుకు కట్టుబాటు ప్రకటించాయి.
- అన్ని దేశాలు మనీ లాండరింగ్ నిరోధక అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించవలసిన, ఉగ్రవాద ఆర్థిక సహాయానికి వ్యతిరేకించవలసిన ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ ఇందులో ప్రపంచ సహకారాన్ని పటిష్ఠం చేసే ఎఫ్ఏటిఎఫ్ సహా ప్రపంచ సహకార వ్యవస్థ నియమావళిని పాటించాలని, ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.
- ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక పునరుద్ధరించి పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు, ఈ దిశగా సంప్రదింపులు సత్వరం ముగించేందుకు ఉభయ దేశాలు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించాయి. ఇందులో ఐఏఇఏ ప్రధాన పాత్రను జర్మనీ, భారత్ ప్రశంసించాయి.
- భద్రతా సహకారం మరింత లోతుగా పాదుకునేందుకు కృషి చేయాలని, ఇందుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సహాయపడే ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని ఉభయ వర్గాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రపంచ భద్రతా సవాళ్లను దీటుగా ఎదుర్కొనే వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా ఉభయులు ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారం మరింత లోతుగా విస్తరించుకోవాల్సిన అవసరం ఉభయులు గుర్తించారు. భద్రత, రక్షణ అంశాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత ముమ్మరం చేసుకోవాలని అంగీకారానికి వచ్చారు. ఇయు వ్యవస్థ పరిధిలో ద్వైపాక్షికంగాను, ఇతర భాగస్వాములతో కలిసి ఈ విభాగంలో పరిశోధన, ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తి కార్యకలాపాలు చురుగ్గా చేపట్టాలని ఉభయ వర్గాలు నిర్ణయించాయి. సైబర్ రంగంలో ద్వైపాక్షిక సంప్రదింపులు క్రమం తప్పకుండా కొనసాగించాలని, రక్షణ టెక్నాలజీ సబ్ గ్రూప్ (డిటిఎస్ జి) తిరిగి సమావేశపరచాలని ఉభయులు అంగీకరించారు. రక్షణ వస్తువులు సహా అత్యున్నత సాంకేతిక వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు మద్దతు ఇవ్వాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి.
హరిత, స్థిర అభివృద్ది భాగస్వామ్యం
- భూగోళ పరిరక్షణకు, ఏ ఒక్కరూ వెనుకబడి ఉండిపోకుండా చూసుకుంటూ అందరి సమ్మిళిత వృద్ధికి ఉమ్మడి బాధ్యత వహించాలని ఉభయ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలను పారిశ్రామిక తిరుగుబాటు కాలం నాటి 2 డిగ్రీల సెల్సియస్ కు నిలువరిస్తూ తదుపరి దశలో పారిశ్రామిక తిరుగుబాటు ముందు కాలం నాటి 1.5 డిగ్రీల సెల్సియస్ కు కుదించేందుకు పారిస్ ఒప్పందం, ఎస్ డిజిల పరిధిలో వాతావరణ కార్యాచరణ ప్రణాళిక, భారత-జర్మన్ స్థిర అభివృద్ది సహకారం ప్రాధాన్యతను ఉభయ దేశాల నాయకులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రంగాల్లో ఉభయ దేశాలు ప్రకటించిన కట్టుబాట్ల అమలును వేగవంతం చేస్తూ హరిత, స్థిర అభివృద్ధికి భారత-జర్మనీ దేశాల భాగస్వామ్యంపై ఉమ్మడి ప్రకటనను అమలుపరిచేందుకు ఎదురు చూస్తున్నట్టు వారు ప్రకటించారు. పారిస్ ఒప్పందం, ఎస్ డిజిల అమలులో ద్వైపాక్షిక, త్రైపాక్షిక, బహుముఖీన సహకారం మరింత ముమ్మరం చేసుకునేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుంది. గ్లాస్గోలో సిఓపి26 సమయంలో భారత, జర్మనీ ప్రకటించిన ఎస్ డిజి లక్ష్యాలు, వాతావరణ టార్గెట్ల కాలపరిమితికి లోబడి 2030 నాటికి వాటిని సాధించే దిశగా ఉమ్మడిగా కృషి చేయడంతో పాటు ఆయా లక్ష్యాల సాధనలో అనుభవాలు పంచుకోవాలని నిర్ణయించాయి. ఈ భాగస్వామ్యం కింద ప్రకటించిన అదనపు కట్టుబాట్లను నిర్దేశిత కాలపరిమితి 2030 లోగా పూర్తి చేసేందుకు భారతదేశానికి 10 బిలియన్ యూరోల ఆర్థిక, సాంకేతిక సహకారం అందించేందుకు జర్మనీ సంసిద్ధత ప్రకటించింది. వాతావరణ కార్యాచరణ, స్థిర అభివృద్ధి విభాగాల్లో ప్రకటించిన ఆశావహమైన లక్ష్యాలను సాధించేందుకు; ఈ విభాగంలో భారత-జర్మనీ పరిశోధన, అభివృద్ధి విస్తరణకు, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మరిన్ని వనరులు సమకూర్చుకునేందుకు ఈ చర్యలు మద్దతు ఇస్తాయి. వర్తమాన, భవిష్యత్ కట్టుబాట్లను తుచ తప్పకుండా అమలుపరచాల్సిన ప్రాధాన్యతను భారత, జర్మనీ నొక్కి చెప్పాయి.
- భాగస్వామ్యానికి మరింత ఉన్నత స్థాయి రాజకీయ భాగస్వామ్యం సాధించే దిశగా అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల వ్యవస్థ (ఐజిసి) పరిధిలో ద్వైవార్షిక మంత్రివర్గ సంప్రదింపుల యంత్రాంగం ఏర్పాటు చేసుకునేందుకు ఉభయులు అంగీకరించారు. వాతావరణ కార్యాచరణ ప్రణాళిక, స్థిర అభివృద్ధి, ఇంధన పరివర్తన, అభివృద్ధి సహకారం, త్రైపాక్షిక సహకారం విభాగాల్లో ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక కార్యాచరణలు మంత్రివర్గ యంత్రాంగం పరిధిలో ఈ భాగస్వామ్యం మరింతగా విస్తరించడానికి దోహదపడతాయి.
- ఇంధన పరివర్తన, పునరుత్పాక ఇంధనం, స్థిర పట్టణాభివృద్ధి, హరిత రవాణా యంత్రాంగం, సర్కులర్ ఎకానమీ, వాతావరణ కార్యాచరణ ప్రణాళిక, వాతావరణ మార్పుల పరిష్కారం; జీవ వైవిధ్య పరిరక్షణ, స్థిర వినియోగం; వాతావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల స్థిర వినియోగం విభాగాల్లో చేపట్టాల్సిన చర్యలను గుర్తించేందుకు ఉభయ వర్గాలు కృషి చేస్తాయి. అలాగే ఈ భాగస్వామ్య లక్ష్యాల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించుకుంటాయి.
- భారత-జర్మనీ హరిత, స్థిర అభివృద్ధి భాగస్వామ్యం కింద ఉభయ వర్గాలు అంగీకారానికి వచ్చిన చర్యలు...
- భారత-జర్మనీ హరిత హైడ్రోజెన్ టాస్క్ ఫోర్స్ అందించిన సూచనలకు అనుగుణంగా భారత-జర్మనీ ఇంధన ఫోరమ్ (ఐజిఇఎఫ్) మద్దతుతో భారత-జర్మన్ హరిత హైడ్రోజెన్ రోడ్ మ్యాప్ రూపకల్పన
- ఆధునిక సోలార్ ఇంధన, పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తూ వాటితో ముడిపడి ఉన్న విద్యుత్ గ్రిడ్ లు, స్టోరేజి వసతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఇంధన పరివర్తనకు దోహదపడే ఇండో-జర్మన్ పునరుత్పాదక ఇంధన భాగస్వామ్య వ్యవస్థ రూపకల్పన. సోలార్ టెక్నాలజీల్లో సర్కులర్ ఎకానమీ మద్దతు వ్యవస్థలకు కూడా ఈ భాగస్వామ్యం అవకాశం కల్పిస్తుంది. అత్యున్నత నాణ్యత గల ప్రాజెక్టుల తయారీ, నిధుల లభ్యత ఆధారంగా 2020-2025 మధ్య కాలంలో ఈ విభాగంలో భారతదేశానికి 1 బిలియన్ యూరోల రాయితీ రుణాలు సహా ఆర్థిక, సాంకేతిక సహకారం అందించేందుకు జర్మనీ సంసిద్ధత ప్రకటించింది.
- గ్రామీణ జనాభా, చిన్నకారు రైతులకు ఆదాయం, ఆహార భద్రత, వాతావరణ స్థితిస్థాపకత, భూసారం మెరుగుదల, జీవవైవిధ్యం, అడవుల పునరుద్ధరణ, జల వనరుల లభ్యత విభాగాల్లో ప్రయోజనం కల్పించే విధంగా వ్యవసాయ వాతావరణ, ప్రకృతి వనరుల స్థిర నిర్వహణ సహకారం ఏర్పాటు చేసుకోవడం, ఈ విభాగంలో భారత అనుభవాలను ప్రపంచంతో కూడా పంచుకోవడం. అత్యున్నత నాణ్యత గల ప్రాజెక్టుల తయారీ, నిధుల లభ్యత ఆధారంగా 2025 నాటికి ఈ విభాగంలో భారతదేశానికి 300 మిలియన్ యూరోల రాయితీ రుణాలు సహా ఆర్థిక, సాంకేతిక సహకారం అందించేందుకు జర్మనీ సంసిద్ధత ప్రకటించింది.
- లే-హర్యానా ట్రాన్స్ మిషన్ లైన్, కర్బన రహిత లదాఖ్ ప్రాజెక్టు వంటి హరిత ఇంధన కారిడార్లకు మరింత సహకారం విస్తరణ
- పేదరిక నిర్మూలనపై పోరాటం; జీవ వైవిధ్య సంరక్షణ, పునరుద్ధరణ; వాతావరణ మార్పుల క్షీణత నిరోధం వంటివి నివారించుకునే కీలక ప్రయత్నాల్లో భాగంగా బాన్ చాలెంజ్ కింద అటవీ భూముల పునరుద్ధరణలో మరింత లోతైన సహకారం. రాజకీయ భాగస్వామ్యాలు, సంప్రదింపులు మరింత ముమ్మరంగా చేపట్టేందుకు, ఆరోగ్యవంతమైన వాతావరణ వ్యవస్థను పెంచడానికి ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి దశాబ్ది పర్యావరణ వ్యవస్థ 2021-2030ని ఆమోదిస్తూ దానికి అనుగుణంగా పర్యావరణ క్షీణత, నష్టాల నివారణకు చర్యలు చేపట్టడం.
- వాయుకాలుష్య ప్రదేశాల తగ్గింపు చర్యలు సహా హరిత టెక్నాలజీలను విజయవంతంగా, స్థిరంగా వినియోగించుకోగల పరిస్థితులు కల్పించడంలో మరింత లోతైన సహకారం
- వర్థమాన దేశాలు ఎస్ డిజి, వాతావరణ లక్ష్యాలు సాధించేందుకు మద్దతు ఇచ్చే విధంగా స్థిరమైన, దీర్ఘకాలిక మన్నిక గల, సమ్మిళిత ప్రాజెక్టుల రూపకల్పనకు వ్యక్తిగత బలాలు, అనుభవాల ఆధారిత వ్యవస్థల అభివృద్ధిలో త్రైపాక్షిక సహకారం కోసం కలిసికట్టుగా కృషి చేయడం
- హరిత, సుస్థిర అభివృద్ధికి భారత-జర్మన్ భాగస్వామ్యం దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులో ఉన్న కార్యక్రమాల పురోగతిని ఉభయ దేశాలు ఆహ్వానించాయి.\
- 2006లో ప్రారంభించిన భారత-జర్మన్ ఇంధన ఫోరమ్ కింద భాగస్వామ్యంలో చేపట్టిన ప్రధాన ప్రాజెక్టుల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా విస్తరించుకోవడం, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం
- ii. 2019లో ఢిల్లీలో సమావేశమైన భారత-జర్మన్ పర్యావరణ ఫోరమ్ (ఐజిఇఎన్ విఎఫ్) పరిధిలో సహకారం మరింతగా విస్తరించుకోవడం.ఉభయ దేశాల ఫెడరల్ వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుని ప్రాంతీయ, పురపాలక అధికార యంత్రాంగాల బాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కృషి
- సిబిడి సిఓపి 15లో నిర్దేశించుకున్రన శక్తివంతమైన లక్ష్యాలకు అనుగుణంగా 2020 అనంతర ప్రపంచ జీవ వైవిధ్య ప్రణాళికకు ఉభయ దేశాలు 2021 ఫిబ్రవరిలో వర్చువల్ గా నిర్వహించిన జాయింట్ కార్యాచరణ బృంద సమావేశంలో ప్రకటించిన అంగీకారాలకు కట్టుబడుతూ మరింత వాస్తవిక సహకారం పెంపొందించుకునే దిశగా కృషి
- వేస్ట్, సర్కులర్ ఎకానమీ విభాగంలో కృషి చేస్తున్రన జాయింట్ వర్కింగ్ గ్రూప్ సృష్టించిన మంచి అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉభయ దేశాల మధ్య సహకారం మరింతగా విస్తరించుకోవడానికి అంగీకరించారు. వ్యర్థాల నివారణకు ప్రత్యేకించి ప్లాస్టిక్ నిర్మూలనకు మరింత గట్టిగా కృషి చేస్తూ దాని కింద నిర్దేశించుకున్న ఆశావహమైన లక్ష్యాలు, కార్యక్రమాల అమలుకు అవసరమైన మద్దతు చర్యల విషయంలో ప్రత్యేకించి ఎస్ డిజి లక్ష్యాలు 14.1లో నిర్దేశించిన సాగర పర్యావరణంలో భాగస్వాములు కావడంతో పాటు ఎస్ డిజి 8.2 (టెక్నాలజీ ఆధునీకరణ, నవ్యత), 11.6 (ముసినిపల్, ఇతర వ్యర్థాల నిర్వహణ), 12.5 (వ్యర్థాల రీ సైక్లింగ్, తగ్గింపు) విభాగాల్లో భారత-జర్మనీ పర్యావరణ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకుంటారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణ కోసం చట్టబద్ధమైన ప్రపంచ వ్యవస్థ రూపకల్పనకు యుఎన్ఇఏలో మరింత సన్నిహితంగా సహకరించుకునేందుకు కూడా భారత-జర్మనీ దేశాలు అంగీకరించాయి.
- హరిత పట్టణ రవాణా వ్యవస్థ అభివృద్ధి కోసం 2019లో కుదిరిన భారత-జర్మనీ భాగస్వామ్యం విశేషంగా అభివృద్ధి చెందడానికి వీలుగా సహకార పోర్ట్ ఫోలియోను ఇప్పటికే అభివృద్ధి చేశారు. దీని కింద మెట్రో వ్యవస్థలు, లైట్ మెట్రో వ్యవస్థలు, ఇంధన పొదుపుతో కూడిన తక్కువ కాలుష్యం వెదజల్లే రవాణా సాధనాలు, విద్యుత్ బస్సులు, మోటార్ రహిత రవాణా వ్యవస్థ వంటి స్థిర రవాణా వ్యవస్థల అభివృద్ధికి, అనుసంధానానికి అవసరమైన మద్దతు చర్యలను వేగవంతం చేస్తారు. 2031 నాటికి ఈ భాగస్వామ్యం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు వీలుగా స్థిర రవాణా వ్యవస్థల అభివృద్ధికి కృషి చేస్తారు.
- నగరాల స్థాయిలో ఎస్ డిజి స్థానికీకరణను శక్తివంతం చేయడం; రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఎస్ డిజిల అమలుకు అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు అనుగుణంగా డేటా ఆదారిత నిర్ణయాలతో ముందుకు సాగడానికి ఉద్దేశించిన దేశంలో ప్రప్రథమ ఎస్ డిజి అర్బన్ ఇండెక్స్, డాష్ బోర్డు (2021-22) అభివృద్ధిలో నీతి ఆయోగ్, బిఎంజడ్ సహకరించుకుంటాయి.
- అంతర్జాతీయ స్మార్ట్ సిటీల నెట్ వర్క్ పరిధిలో పట్టణాభివృద్ధికి విజయవంతమైన భాగస్వామ్యం మరింతగా విస్తరించుకోవాలన్న ఆకాంక్ష ఉభయ వర్గాలు పునురుద్ధరించాయి. అలాగే స్మార్ట్ సిటీల విభాగంలో బహుముఖీన అనుభవాలు పంచుకునేందుకు మ్యూచువల్ స్మార్ట్ సిటీ ఆన్లైన్ సింపోజియం 2022 సంవత్సరంలో నిర్వహించేందుకు అంగీకారానికి వచ్చారు.
- స్థిర పట్టణాభివృద్ధి విభాగంలో ఏర్పాటైన జాయింట్ ఇండో-జర్మన్ వర్కింగ్ గ్రూప్ కింద క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించేందుకు ఉభయులు అంగీకరించారు. పారిస్ ఒప్పందం, అజెండా 2030లో నిర్దేశించిన స్థిర, స్థితిస్థాపక నగరాల అభివృద్ధిలో ఆ వర్కింగ్ గ్రూప్ సాధించిన పురోగతిని ప్రశంసించారు.
- 2021మార్చిలో చివరిగా సమావేశమైన వ్యవసాయం, ఆహార పరిశ్రమలు, వినియోగదారుల సంరక్షణ వ్యవహారాల జాయింట్ వర్కింగ్ గ్రూప్ నిర్మాణాత్మక పాత్రను ఉభయ వర్గాలు పునరుద్ఘాటించాయి. ఇప్పటివరకు సాధించిన ఫలితాల పట్ల సంతృప్తి ప్రకటించడంతో పాటు స్థిర వ్యవసాయ ఉత్పత్తి, ఆహార భద్రత, వ్యవసాయ శిక్షణ, నైపుణ్యాల అభివృద్ది, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్ మెంట్, వ్యవసాయ లాజిస్టిక్స్ విభాగాల్లో ప్రస్తుత ఎంఓయుల కింద సహకారం మరింతగా విస్తరించుకోవాలని నిర్ణయించారు.
- రైతులు స్థిర వ్యవసాయ ఉత్పత్తి సాధనకు మౌలిక ప్రాతిపదికగా అత్యున్నత నాణ్యత గల విత్తనాలు అందుబాటులోకి తేవడానికి ప్రారంభించిన ప్రధాన ప్రాజెక్టు తుది దశ అమలు విజయవంతంగా ప్రారంభం కావడాన్ని ఉభయ ప్రభుత్వాలు ప్రశంసించాయి. భారత వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిని ఆధునీకరించి పటిష్ఠం చేయడానికి అనుగుణమైన సంస్కరణల కోసం 2021 ఆగస్టులో రెండో ద్వైపాక్షిక సహకార ప్రాజెక్టు ప్రారంభమైన విషయం కూడా వారు గుర్తు చేసుకున్నారు.
- ఆహార భద్రత విభాగంలో ప్రస్తుత సహకార ఒప్పందాల పరిధిలో కార్యక్రమాల అభివృద్ధికి ఉభయ వర్గాలు సంసిద్ధత ప్రకటించాయి.
- భారత వ్యవసాయ రంగంలో ఉన్న నైపుణ్య లోపాలను సరిదిద్ది, రైతులు, వేతన కార్మికుల నైపుణ్యాలు పెంచడం లక్ష్యంగా ఆచరణీయ నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు వ్యవసాయంలో ఇండో-జర్మన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు జర్మన్ అగ్రి బిజినెస్ అలయన్స్ (జిఏఏ), భారత వ్యవసాయ నైపుణ్య మండలి (ఎఎస్ సిఐ) మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉభయులు ఆమోదించారు.
- మరింత స్థిరమైన ఆహార వ్యవస్థల అభివృద్ధికి టెక్నాలజీ, పరిజ్ఞానం బదిలీ కీలకమని ఉభయ వర్గాలు అంగీకరిస్తూ ఇందులో భాగంగా బండెస్ ఇన్ స్టిట్యూట్ ఫర్ రిస్క్ ఎవర్టింగ్ (బిఎఫ్ ఆర్), ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిధిలో ప్రత్యేక సహకార ప్రాజెక్టుల రూపకల్పనను పరిశీలించవచ్చునని నిర్ణయించారు.
- ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఏ) : భారత, జర్మనీ వ్యూహాత్మక ప్రాధాన్యతల బలాబలాలను ఉపయోగించుకుంటూ సోలార్ విభాగంలో దానికి అనుసంధానిత ప్రపంచ సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకునే మద్దతు చర్యల్లో సహకారాన్ని మరింత లోతుగా విస్తరించుకునేందుకు ఉభయ వర్గాలు అంగీకరించాయి.
- వైపరీత్యాలను తట్టుకునే మౌలిక వసతుల విభాగంలో సహకారం, ఇన్సురెజిలియెన్స్ లో ప్రపంచ భాగస్వామ్యం : వాతావరణ, వైపరీత్య రిస్క్ ల సమయంలో రిస్క్ నివారక ఆర్థిక సహకార, బీమా సొల్యూషన్లు అభివృద్ధి చేసుకునే విభాగంలో సహకారం పటిష్ఠం చేసుకోవాలని ఉభయ వర్గాలు నిర్ణయించాయి. ఇన్సురెజిలియెన్స్ ప్రపంచ భాగస్వామ్యంలో సభ్యదేశంగా చేరగలమన్న భారతదేశం ప్రకటనను జర్మనీ ఆహ్వానించింది.
- ఎస్ డిజిల సాధన, వాతావరణ లక్ష్యాలకు అవసరమైన పిపిపి భాగస్వామ్యాల అభివృద్ధి, ప్రైవేటు రంగం నుంచి నిధుల సమీకరణకు వ్యవస్థాత్మక యంత్రాంగం ప్రాధాన్యతను ఉభయులు గుర్తించారు. అందుకు అనుగుణంగా ఆయా విభాగాల్లో ఇన్నోవేషన్, పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వ-ప్రైవేటు పెట్టుబడి భాగస్వామ్యాల్లో భారత, జర్మన్ ప్రైవేటు రంగ సహకారాన్ని మరింతగా పెంచుకునేందుకు ఉభయ వర్గాలు అంగీకరించాయి.
- ఎస్డిజి 6 సాధన, 2030 నాటికి స్థిర అభివృద్ది అజెండాకు అనుగుణంగా రూపొందించుకున్న జల ఆధారిత లక్ష్యాలు, టార్గెట్ల మద్దతు చర్యల ప్రాధాన్యతను నొక్కి చెబుతూ అందులో భాగంగా యుఎన్ 2023 వాటర్ కాన్ఫరెన్స్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను ఉభయ వర్గాలు ప్రశంసించాయి.
వాణిజ్య, పెట్టుబడి, డిజిటల్ పరివర్తన భాగస్వామ్యం
- నిబంధనల ఆధారిత వ్యవస్థ కట్టుబాటుకు జరుగుతున్న కృషిని, బహిరంగ, సమ్మిళిత, స్వేచ్ఛా వాణిజ్య వవస్థ ప్రాధాన్యతను జర్మనీ, భారత్ ప్రశంసించాయి. ఇందుకు అనుగుణంగా డబ్ల్యుటిఓ ప్రధాన కేంద్రంగా, ప్రపంచ ట్రేడింగ్ వ్యవస్థను అనుసంధానం చేసే కీలక స్తంభంగా బహుముఖీన వాణిజ్య యంత్రాంగం ఏర్పాటు ప్రాధాన్యతను ఉభయ దేశాలు నొక్కి చెప్పాయి. డబ్ల్యుటిఓ పటిష్ఠతకు దోహదపడే సిద్ధాంతాలు, విధులు ప్రత్యేకించి రెండెంచెల అప్పిలేట్ వ్యవస్థను, దాని స్వయం ప్రతిపత్తిని కాపాడుకునే దిశగా డబ్ల్యుటివో వ్యవస్థలో సంస్కరణలకు ఉభయులు తమ కట్టుబాటును ప్రకటించారు.
- భారత, జర్మనీ కీలక వాణిజ్య, పెట్టుబడి భాగస్వాములనే అంశం ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందం, భౌగోళిక సూచీల ఒప్పందం రూపకల్పనకు త్వరలో భారత, యూరోపియన్ యూనియన్ మధ్య జరగనున్న చర్చలకు తమ బలమైన మద్దతును ప్రకటిస్తూ ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణకు ఇలాంటి ఒప్పందాల ప్రాధాన్యం ఎంతో ఉన్నదని వారు నొక్కి చెప్పారు.
- సుస్థిర, సమ్మిళిత ఆర్థిక రికవరీకి ఐక్యరాజ్య సమితి వ్యాపార, మానవ హక్కుల మార్గదర్శకాలు; ఒఇసిడి జారీ చేసిన బహుళజాతి సంస్థల మార్గదర్శకాల అమలు కీలకమని జర్మనీ, ఇండియా నొక్కి చెప్పారు. ఎలాంటి వైపరీత్యాలనైనా తట్టుకోగల విధంగా సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు, అవి మరింత వైవిధ్యభరితంగా, బాధ్యతాయుతంగా, స్థిరంగా నిలిచేందుకు కృషి చేయాలని ఉభయ దేశాలు నిర్ణయించాయి. అంతర్జాతీయ పర్యావరణ, కార్మిక, సామాజిక ప్రమాణాలకు కట్టుబడుతూనే ఆర్థిక ప్రయోజనాలందించే విధంగా సరఫరా వ్యవస్థలను కలిసికట్టుగా అభివృద్ధి చేయడం తమ ప్రాధాన్యత అని ప్రకటించాయి.
- దశాబ్దిలోఅతి పెద్ద ఉద్యోగ, సామాజిక సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో స్థిరమైన కార్మిక మార్కెట్ అభివృద్ధికి ఉభయులు కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా మాత్రమే వైపరీత్యాలను తట్టుకోగల, సమ్మిళిత, లింగ సమానత్వ, వనరుల సమృద్ధితో కూడిన రికవరీ సాధ్యమవుతుందని ప్రకటించాయి. ఉపాధి, హుందాతో పని వ్యవస్థలను అభివృద్ధి చేయడం, పని చేసే వయసులోని జనాభా రేపటి కోసం పని చేసేందుకు వీలుగా నైపుణ్యాల అభివృద్ది విధానాలు రూపొందించడం, పేదరికం, అసమానతల తగ్గింపునకు, స్థిర భవిష్యత్తుకు దోహదపడే స్పందనపూర్వకమైన సామాజిక రక్షణ వ్యవస్థలను ఏర్పాటును ప్రోత్సహించడం లక్ష్యాలుగా ప్రకటించాయి.
- భారతదేశం 2017లో ఐఎల్ఓ 138, 182 నిబంధనలకు ధ్రువీకరించడాన్ని జర్మనీ స్వాగతించింది. ఎస్ డిజి 8.7 లక్ష్యానికి అనుగుణంగా బాలకార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని ఉభయులు నొక్కి చెప్పారు. ఈ రంగాల్లో తమ సహకారం పటిష్ఠం చేసుకునేందుకు నిర్ణయించారు. ప్రజలకు హుందాతో కూడిన పని కల్పన, కొత్త పని ప్రదేశాల్లో తగినంత సామాజిక రక్షణ వంటి విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ విధానాలు పరస్పరం మార్పిడి చేసుకోవడాన్ని ఆహ్వానించారు.
- టెక్నాలజీ, ఆర్థిక, సామాజిక పరివర్తనకు డిజిటల్ పరివర్తన కీలకం అన్న విషయం ఉభయ వర్గాలు ఆమోదించాయి. ఇంటర్నెట్ గవర్నెన్స్, వర్థమాన టెక్నాలజీలు, డిజిటల్ వ్యాపార నమూనాల్లో సహకార విస్తరణకు ఇండో-జర్మన్ డిజిటల్ చర్చలు కీలక సాధనమని పేర్కొన్నారు. అలాగే పారిశ్రామిక చోదక ఇండో-జర్మన్ డిజిటల్ నిపుణుల బృందం ఏర్పాటు వంటి చర్యలకు మద్దతు ప్రకటించారు.
- పన్నుల విభాగంలో సహకారం విస్తరణకు రెండు స్తంభాల పరిష్కార వ్యవస్థగా 2021 అక్టోబర్ 8వ తేదీన కుదిరిన ఒఇసిడి ఇంక్లూజివ్ ఫ్రేమ్ వర్క్ ఆన్ బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ (బిఇపిఎస్) ను ఉభయ దేశాలు స్వాగతించాయి. పరిష్కారం అనేది సరళంగాను, ప్రాసెస్ సమ్మిళితంగాను ఉండాలని, అంతర్జాతీయ పన్ను వ్యవస్థలో అట్టడుగు వర్గాల సంక్షేమానికి ఎలాంటి హాని కలగకుండానే అందరికీ స్వేచ్ఛ గల వ్యాపార వ్యవస్థ ఏర్పడాలన్న ఉమ్మడి ఆకాంక్షను ఉభయ ప్రభుత్వాలు ప్రకటించాయి. ఎవరూ ఇతరుల ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా పన్ను ప్రణాళికలు చేయకుండాబహుళజాతీ సంస్థలు తమ పన్నులు సక్రమంగా చెల్లించేందుకు అది దోహదపడాలన్నారు. ఈ రెండు స్తంభాల సమర్థవంతమైన అమలుకు ఉమ్మడి సంసిద్ధతను జర్మనీ, ఇండియా ప్రకటించాయి. ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం త్వరిత గతిన పూర్తి చేసేందుకు కట్టుబాటు ప్రకటించాయి.
- ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడి విభాగానికి సంబంధించి వర్తమాన, భవిష్యత్ ఇన్వెస్టర్లకు కీలక రిఫరెన్స్ గా నిలిచే ఇండో-జర్మన్ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం ఫార్మాట్ ను విజయవంతంగా అమలు చేయడానికి సంసిద్ధతను ఉభయులు ప్రకటించారు. ఈ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం ప్రతీ అర్ధసంవత్సరానికి ఒక సారి సమావేశం అయ్యేలా చూడడం ద్వారా నిరంతర సంప్రదింపులకు వీలు కల్పించాలని నిర్ణయించారు. వ్యాపార సరళీకరణకు సంబంధించి కంపెనీలు, ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలపై చర్చించాలని కూడా నిర్ణయించారు.
- కార్పొరేట్ మేనేజర్లకు శిక్షణ కార్యక్రమం (“మేనేజర్ ప్రోగ్రాం”) అమలు చేయడం ద్వారా ద్వైపాక్షిక ఆర్థిక సహకారం ప్రోత్సహించేందుకు ఉభయవర్గాలు సంసిద్ధత ప్రకటించాయి.
- పారిశ్రామిక ఎగ్జిక్యూటివ్ లకు శిక్షణ కార్యక్రమాల అమలుకు ఉమ్మడి కృషిని కొనసాగించడం కోసం కుదిరిన ఉమ్మడి ప్రకటనను వారు ఆహ్వానించారు. ద్వైపాక్షిక వాణిజ్యం అభివృద్ధిలో మరింత స్థిరమైన ఫలితాల సాధనలో సహకరించుకోవాలని, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ల మధ్య వ్యక్తిగత, వ్యాపార బంధం పటిష్ఠతను, ఉభయ దేశాల మధ్య పరస్పర విశ్వానం మరింత లోతుగా నిలదొక్కుకునేలా చేయడానికి అవసరమైన ప్రోత్సాహం అందించాలని నిర్ణయించాయి.
- ప్రామాణికీకరణ, కట్టుబాటు, మార్కెట్ గూఢచర్యం విభాగాల్లో కృషిని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా గ్లోబల్ ప్రాజక్ట్ క్వాలిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (జిపిక్యుఐ) పరిధిలో ఇండో-జర్మన్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును జర్మనీ, ఇండియా ప్రశంసించాయి. వర్కింగ్ గ్రూప్ 8వ వార్షిక సమావేశంలో భాగంగా 2022లో కుదిరిన కార్యాచరణ ప్రణాళిక డిజిటలైజేషన్, స్మార్ట్, స్థిర వ్యవసాయం, సర్కులర్ ఎకానమీ వంటి కొత్త విభాగాల్లో సహకారానికి అవకాశాలను గుర్తించిన విషయం వారు ప్రస్తావించారు.
- స్టార్టప్ ల విభాగంలో సహకారం మరింత పటిష్ఠం చేసుకోవాలన్న ఆకాంక్షను ఉభయ ప్రభుత్వాలు ప్రకటిస్తూ స్టార్టప్ ఇండియా, జర్మన్ యాక్సిలరేటర్ (జిఎ) రెండింటి మధ్య ప్రస్తుత భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. 2023 నుంచి భారత మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రాంకు మద్దతును మరింతగా పెంచాలన్ని జిఏ ఆకాంక్షను, రెండు దేశాల స్టార్టప్ వ్యవస్థల మధ్య సహకార విస్తృతికి జిఏతో ఉమ్మడి భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలన్న స్టార్టప్ ఇండియా ప్రతిపాదనను ఉభయదేశాలు ఆహ్వానించాయి.
రాజకీయ, విద్య విభాగాలు; సైంటిఫిక్ సహకారం; కార్మిక శక్తి, ప్రజల చలనశీలతకు భాగస్వామ్యం
- విద్యార్థులు, విద్యావేత్తలు, వృత్తి నిపుణుల చురుకైన భాగస్వామ్యాన్ని పెంపొందించడలో భాగంగా పరస్పర క్రియాశీల సందర్శనలను ఉభయ ప్రభుత్వాలు ఆహ్వానించాయి. ఉన్నత విద్యా వ్యవస్థలను అంతర్జాతీయం చేయాలని; మరింత ఇన్నోవేషన్, పరిశోధనకు అనుగుణంగా అనుసంధానతలు ఏర్పాటు చేయాలని; వృత్తి విద్య, శిక్షణకు ద్వంద్వ వ్యవస్థలు పటిష్ఠం చేసుకోవాలని ఉభయ వర్గాలు అంగీకరించాయి.
- విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఉభయ దేశాల మధ్య విస్తరించిన భాగస్వామ్యం పట్ల ఉభయ దేశాలు సంతృప్తిని ప్రకటిస్తూ ఆ సహకారం మరింత విస్తరించుకోవాలని నిర్ణయించాయి. జర్మన్ విశ్వవిద్యాలయాల్లో ఎంపిక చేసిన భారత విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అభ్యాసం చేసేందుకు డిజిటల్ ప్రిపరేటరీ కోర్సుల రూపకల్పన పట్ల రెండు ప్రభుత్వాలు ప్రశంసలు అందించాయి. విద్యార్థులను పరస్పరం మార్చుకోవడాన్ని ప్రోత్సహించేందుకు, స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత ఉన్నత విద్యా సంస్థల్లో జర్మన్ విద్యార్థుల ప్రవేశాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం సంసిద్ధతను ప్రకటించింది. భారత, జర్మన్ విశ్వవిద్యాలయాల మధ్య విశ్వవిద్యాలయ స్థాయిలో సహకారానికి ఉదాహరణకు జాయింట్ డిగ్రీలు, ద్వంద్వ డిగ్రీలు ప్రవేశపెట్టే అవకాశాలు అన్వేషించేందుకు మద్దతు ప్రకటించాయి.
- ఇండో-జర్మన్ వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ధి భాగస్వామ్యానికి ఉభయ దేశాల విద్యావేత్తలు-పారిశ్రామిక నాయకుల మధ్య సహకారం కీలకమని గుర్తించాయి. .జర్మన్ ఇండస్ర్టియల్ ఎకోసిస్టమ్ లో భారత పరిశోధకులకు అవకాశాలు కల్పించడం కోసం పారిశ్రామిక ఫెలోషిప్ లు ప్రారంభించేందుకు ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (ఐజిఎస్ టిసి) చేపట్టిన చొరవను ఉభయులు ఆహ్వానించారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్టుల్లో లాటరల్ ప్రవేశానికి వీలుగా విమెన్ ఇన్వాల్వ్ మెంట్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ (వైజర్) కార్యక్రమం ప్రారంభించడాన్న, ఇండో-జర్మన్ ఎస్ అండ్ టి సహకారంలో భాగంగా కెరీర్ ప్రారంభ ఫెలోషిప్ లు ప్రవేశపెట్టడానికి మద్దతు ప్రకటించాయి.
- సైన్స్ సహకారంలో కీలక మైలురాయిగా డార్మస్టాట్ లో ఇంటర్నేషనల్ ఫెసిలిటీ ఫర్ యాంటిప్రోటాన్ అండ్ అయాన్ రీసెర్చ్ (ఫెయిర్) ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు.
- ఆంగ్ల భాషలో నేడు సంతకాలు చేసిన ముసాయిదా ఒప్పందానికి అనుగుణంగా భారత, జర్మనీ దేశాల మధ్య మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్య సమగ్ర ద్వైపాక్షిక ఒప్పందం రూపకల్పనపై చర్చలను త్వరగా ముగించాలన్న నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఆ ఒప్పందం త్వరితంగా పూర్తి చేసి అమలుపరిచేంఉదకు చర్యలు తీసుకోవాలని అంగీకరించారు. విద్యార్థులు, వృత్తినిపుణులు, పరిశోధకులు రెండు వైపులా రాకపోకలు సాగించేందుకు, అక్రమ వలసల సవాలును సమర్థవంతంగా అమలుపరిచేందుకు ఇది దోహదపడుతుందని అంగీకరించారు.
- జర్మన్ ఫెడరల్ ఉపాధి ఏజెన్సీ, కేరళ ప్రభుత్వాల మధ్య నిపుణులైన ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సంరక్షణ పనివారి ప్లేస్ మెంట్ కోసం కుదిరిన ఒప్పందాన్ని ఉభయ ప్రభుత్వాలు ఆహ్వానించాయి. ఇది ఆతిథ్య దేశం, ఆరిజిన్ దేశం, వ్యక్తిగత స్థాయిలో ప్రయోజనం కలిగించే “త్రైపాక్షిక గెలుపు విధానం”గా నిలుస్తుందని ప్రకటించారు. భారత, జర్మనీ కార్మిక మార్కెట్లు, వలసదారుల ప్రయోజనానికి దీటుగా కేరళ రాష్ట్రంతో కుదిరిన ఈ ప్లేస్ మెంట్ ఒప్పందాన్ని ఇతర రాష్ర్టాలకు కూడా విస్తరించుకోవాలన్న లక్ష్యాన్ని ఆహ్వానించారు.
- విధినిర్వహణ సంబంధిత ప్రమాదాలు, వ్యాధుల నుంచి సామాజిక రక్షణ కల్పించేందుకు, కార్మికుల ఆరోగ్య రక్షణకు, భద్రత విభాగాల్లో కృషి చేసేందుకు జర్మన్ సోషల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (డిజియువి), నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ సి) మధ్య కుదిరిన ఒప్పందాన్ని; వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య, సామాజిక రక్షణ విభాగంలో సహకారానికి జర్మన్ సోషల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (డిజియువి), డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీ అడ్వైస్ సర్వీస్ అండ్ లేబర్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియా (డిజిఎఫ్ఏఎస్ఎల్ఐ) మధ్య కుదిరిన ఎంఓయును ఉభయ ప్రభుత్వాలు ఆహ్వానించాయి.
- భారత-జర్మనీ మధ్య కుదిరిన సాంస్కృతిక మార్పిడి, విద్యా సహకార ఒప్పందాన్ని కూడా రెండు ప్రభుత్వాలు ఆహ్వానిస్తూ ఇందులో గోథె ఇన్ స్టిట్యూట్, జర్మన్ ఆకాడమిక్ ఎక్స్ఛేంజి సర్వీస్ (డిఏఏడి), యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ), ఇతర సంబంధిత సంస్థల కీలక పాత్రను ప్రశంసించాయి. విద్యా కార్యక్రమాలు, సంప్రదింపుల పరంగా ఇలాంటి కాంటాక్టుల ఏర్పాటులోజర్మన్ రాజకీయ వ్యవస్థల పాత్రను గుర్తించాయి.
ప్రపంచ ఆరోగ్యం లక్ష్యంగా భాగస్వామ్యం
- కోవిడ్-19 మహమ్మారి కారణంగా కీలక పరీక్ష ఎదుర్కొన్న బహిరంగ సమాజాల స్థితిస్థాపకత, బహుముఖీన సహకర పునరుద్ధరణకు బహుముఖీన స్పందన అవసరమని గుర్తించిఉభయ ప్రభుత్వాలు సురక్షితమైన వైద్య సరఫరా వ్యవస్థల ఏర్పాటుకు, ఆరోగ్య ఎమర్జెన్సీలు తట్టుకునేలా ప్రపంచ సంసిద్ధతను పటిష్ఠం చేయడానికి, భవిష్యత్ రిస్క్ లు తగ్గించడానికి, అందరూ ఒకే ఆరోగ్య విధానం అనుసరించేందుకు సహకరించుకోవాలని ఉభయ దేశాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. అంతర్జాతీయ ఆరోగ్య కార్మికులకు దిశానిర్దేశం చేసే, సమన్వయ వ్యవస్థగా ప్రపంచ ఆరోగ్య సంస్థను సంస్కరించేందుకు, భవిష్యత్ లో ఎదురయ్యే మహమ్మారులను దీటుగా ఎదుర్కొనేలా దాన్ని పటిష్ఠం చేసేందుకు ఉభయ దేశాలు కట్టుబాటును ప్రకటించాయి. ఆర్థిక రికవరీకి మద్దతు ఇవ్వడంలో భాగంగా వ్యాపార వర్గాలు, పర్యాటకుల స్వేచ్ఛాయుత కదలికలకు అనుమతి ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. కోవిడ్-19 వ్యాక్సిన్లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల పరస్పర గుర్తింపులో సహకారం విస్తరించుకోవాలని నిర్ణయించాయి.
- అత్యధిక సాంద్రత గల పాథోజెనిక్ క్రిముల పరీక్ష కోసం యుపిలోని బందాలో బయో-సేఫ్టీ లెవెల్ IV లేబరేటరీ (బిఎస్ఎల్-4) ఏర్పాటులో సాంకేతిక మద్దతు అందించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సిడిసి) ఆఫ్ ఇండియా, రాబర్ట్ కోచ్ ఇన్ స్టిట్యూట్ (ఆర్ కెఐ) మధ్య కుదిరిన భాగస్వామ్యాన్ని ఉభయ వర్గాలు ఆహ్వానించాయి.
- వైద్య ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారం పటిష్ఠతకు కుదిరిన అంగీకారానికి అనుగుణంగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ), భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలతో ఫెడరల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ డ్రగ్స్ అండ్ మెడికల్ డివైసెస్ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ (పిఇఐ) చేసిన జాయింట్ డిక్లరేషన్ ను ఉభయ ప్రభుత్వాలు ఆహ్వానించాయి.
- ఆరవ ఐజిసి సందర్భంగా జరిగిన చర్చలపై ఉభయ దేశాల నాయకులు సంతృప్తిని ప్రకటిస్తూ ఇండో-జర్మన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు సంపూర్ణ కట్టుబాటు ప్రకటించారు. తనకు, 6వ ఐజిసికి వచ్చిన భారత ప్రతినిధివర్గానికి అందించిన హృదయపూర్వకమైన స్వాగతసత్కారాల విషయంలో జర్మన్ చాన్సలర్ షోల్జ్ కు ప్రధానమంత్రి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం రాబోయే ఐజిసి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పారు.
(Release ID: 1822623)
|