యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలి


గ్రామీణ, స్వదేశీ క్రీడల సంరక్షణకు,
ప్రోత్సాహానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి..

ఖేలో ఇండియా ప్రారంభోత్సవంలో
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు..

ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడోత్సవం-2021
బెంగుళూరులో ఘనంగా ప్రారంభం...

-వైరస్ మహమ్మారి సవాళ్ల మధ్య క్రీడల నిర్వహణ
నవభారత క్రీడా తృష్ణకు, దృఢదీక్షకు ప్రతీక-
క్రీడల్లో, జీవితంలో విజయ సాధనకు

పరిపూర్ణ కృషి, వందశాతం అంకిత భావం అవసరం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశం

Posted On: 24 APR 2022 8:40PM by PIB Hyderabad

   ఖేలో ఇండియా పేరిట విశ్వవిద్యాలయ క్రీడోత్సవం-2021 ఈరోజు బెంగుళూరులో వైభవంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ క్రీడోత్సవాన్ని ప్రారంభించారు. ఖేలో ఇండియా విశ్వవిద్యాయ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశాన్ని వర్చువల్ పద్ధతిలో పంపించారు.

  కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్,  కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, సహాయమంత్రి నిశీత్ ప్రమాణిక్, క్రీడాశాఖ కార్యదర్శి శ్రీమతి సుజాతా చతుర్వేది తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

   ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, క్రీడా కార్యకలాపాలను గ్రామస్థాయి వరకూ ప్రోత్సహించవలసిన అవసరం ఉందని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పరిపాలనా సంస్థలు కలసికట్టుగా కృషిచేసి,. సమన్వయ కృషితో అట్టడుగు స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  ఈ కృషితో భారతీయ క్రీడా కార్యకలాపాలు నూతన శిఖరాలను చేరుకుంటాయని ఆయన అన్నారు. కళాశాల ప్రవేశాల్లో క్రీడాకారులకు కొన్ని అదనపు మార్కులు ఇవ్వాలని, వివిధ శాఖల్లో ప్రమోషన్లు ఇవ్వాలని ఆయన సూచించారు. ఇలాంటి ప్రోత్సాహకాలతో దేశంలో క్రీడలకు మంచి ఊపు లభిస్తుంది,”  అని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

 

 

మనమంతా పాత మూలాలకు తిరిగి చేరుకోవాలని, దేశీయ క్రీడలకు, గ్రామీణ క్రీడలకు భాగస్వామ్య వర్గాలవారంతా అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సారి ఖేలో ఇండియా క్రీడల్లో తొలిసారిగా యోగాసనాలు, మల్ల కంబ వంటి స్వదేశీ క్రీడాంశాలతో పాటుగా, మొత్తం 20 క్రీడాంశాల్లో పోటీలు జరగడం సంతోషదాయకమని అన్నారు.మన గ్రామీణ, స్వదేశీ క్రీడలకు రక్షణ కల్పించి, వాటిని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ఈ క్రీడలు మన సంప్రదాయాల్లోకి చొచ్చుకుపోయాయి. మన సాంస్కృతిక వారసత్వంలో అవి ఒక భాగంగా నిలిచిపోయాయి,” అని వెంకయ్యనాయుడు అన్నారు.

 

 

ఖేలో ఇండియా క్రీడోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో సందేశమిచ్చారు. దేశంలోని యువజన ఉత్సాహానికి బెంగుళూరు నగరం ప్రతీకగా నిలుస్తుందని, ప్రొఫెషనల్ క్రీడాకారులకు గర్వకారణమని ఆయన అన్నారు. ఇక్కడ క్రీడల, స్టార్టప్ కంపెనీల సంగమం కొనసాగడం చాలా గణనీయమైన పరిణామమని ఆయన అన్నారు.ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడోత్సవం బెంగుళూరులో జరగడం సుందరమైన ఈ నగరం శక్తిని, ప్రత్యేకతను మరింత ద్విగుణీకృతం చేస్తుంది.” అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. వైరస్ మహమ్మారి రూపంలో ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ క్రీడల నిర్వహణకు నిర్వాహకులు, నిర్వాహక సంస్థ నిర్ణయం తీసుకోవడం నవభారత దృఢ దీక్షను, క్రీడాతృష్ణను తెలియజేస్తోందని అన్నారు. ప్రతి రంగంలోనూ యవజనుల ఉత్సాహం నూతన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తోందని ప్రధానమంత్రి తన సందేశంలో అభిప్రాయపడ్డారు.

  కలసికట్టుగా పనిచేయాలన్న స్ఫూర్తిని కలిగి ఉండటమే విజయానికి తొలి మంత్రమని ప్రధానమంత్రి అన్నారు.కలసికట్టుగా ఒక బృందంగా పనిచేయాలన్న స్ఫూర్తి మనకు క్రీడల ద్వారానే లభిస్తుంది. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడోత్సవంలో ఇది మనకు స్వయంగా అనుభవంలోకి వస్తుంది. ఇదే స్ఫూర్తి, జీవితాన్ని కొత్తగా విశ్లేషించగలిగే మార్గాన్ని తెలియజేస్తుంది. అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పరిపూర్ణత్వంతో కూడిన దృష్టి, వందశాతం అంకిత భావం క్రీడల్లో విజయానికి ఎంతో కీలకం. క్రీడారంగం నుంచి నేర్చుకున్న పాఠాలు ఎవరినైనా జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి. నిజానికి క్రీడలు, జీవితానికి అండగా నిలిచే సిసలైన వ్యవస్థ అని మోదీ పేర్కొన్నారు. క్రీడలకు, నిజ జీవితానికి ఉన్న ఇతర పోలికలను ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. తృష్ణ, సవాళ్లు, ఓటమినుంటి పాఠాలు నేర్వడం, ఈ క్షణంలో జీవించగలిగే నిజాయితీని, సామర్థ్యాన్ని కలిగి ఉండటం.. ఇవన్నీ క్రీడల్లో, నిజ జీవితంలో ఉమ్మడిగా ఉండే స్వభావాలని అన్నారు. విజయాన్ని సమంజసంగా స్వీకరించడం, పరాజయంనుంచి పాఠాలు నేర్చుకోవడం ముఖ్యమైన కళ, దీన్ని మనం క్రీడారంగంలోనే నేర్చుకోగలం. అని ఆయన అన్నారు. 

ఖేలో ఇండియా విశ్వవిద్యాలయం క్రీడల ప్రారంభోత్సవంలో  కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ మాట్లాడుతూ,  క్రీడోత్సవానికి వచ్చిన 4,000మంది క్రీడాకారులకు సాంకేతిక పరిజ్ఞాన నగరమైన బెంగళూరు సుస్వాగతం పలుకుతోందని అన్నారు. "ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడోత్సవం-2021ను బెంగుళూరులో నిర్వహించడం మాకు సంతోషదాయకం, గౌరవప్రదంగా భావిస్తున్నాం. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభోత్సవంలో భాగస్వాములు కావడం మా సంతోషాన్ని మరింత ఇనుమడింప చేస్తోంది. మా ఆతిథ్యాన్ని రుజువు చేసుకునేందుకు, జాతిపట్ల, సంస్కృతి పట్ల మా అంకితభావాన్ని ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా విశ్వవిద్యాల క్రీడోత్సవం మాకు గొప్ప అవకాశాన్ని  అందించింది. ఖేలో ఇండియా పథకం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మన క్రీడా ప్రపంచానికి కొత్త ఊపును తీసుకువచ్చారు." అని ఆయన అన్నారు.

 

   కేంద్ర క్రీడలు, యవజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూరు మాట్లాడుతూ, "ఖేలో ఇఁడియా పేరిట తొలి విశ్వవిద్యాలయ క్రీడోత్సవం ఒడిశాలో జరిగినపుడు ప్రజల్లో గొప్ప గౌరవభావం, ఉత్సాహం తొణికిసలాడింది. ఆ తర్వాత మన జీవితాలపై కొవిడ్ ప్రభావం పెరిగింది. అనంతరం ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడోత్సవం-2021 కోసం మనం దాదాపు రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. రెండేళ్ల తర్వాత విశ్వవిద్యాలయ క్రీడోత్సవం కోసం మనం తొలిసారిగా ఏకమయ్యాం. ఈ సారి కూడా నాకు యువజనుల్లో అదే తరహా తృష్ణ, ఉత్సాహం కనిపిస్తోంది. దాదాపు 200 విశ్వవిద్యాలయానుంచి సుమారు 4,000మంది క్రీడాకారులు పాల్గొనడంతో కర్ణాటకలోనే ఇది బహుళ క్రీడాంశాల అతిపెద్ద ఉత్సవంగా నిలిచింది. క్రీడోత్సవానికి ఆతిథ్యం ఇస్తున్న జైన్ విశ్వవిద్యాలయాన్ని నేను సందర్శించాను. ఈ పోటీల్లో పాల్గొనబోయే 500మందికి పైగా క్రీడాకారులను స్వయంగా కలుసుకున్నాను. ఈ  క్రీడోత్సవం కోసం ప్రపంచ స్థాయి క్రీడా సదుపాయాలను కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలోనే ఉత్తమమైన స్థాయిలో ఈ క్రీడా సదుపాయాలు ఉన్నాయి." అన్నారు.

    కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రతిబింబించే ప్రదర్శన, మల్ల కంబ, యోగాసన, వీక్షకులను ఆకట్టుకునే దృశ్యశ్రవణ ప్రదర్శన వంటివి, 2వ ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. బెంగుళూరులోని శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియంలో 2022 ఏప్రిల్ 22 (ఆదివారం రోజున) ఈ క్రీడలు ఉత్సాహభరిత వాతావరణంలో మొదలయ్యాయి.

     ఈ క్రీడల్లో ఆతిథ్య విశ్వవిద్యాలయమైన జైన్ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒలింపిక్ స్టాండర్డ్ టైమ్ విజేత శ్రీహరి నటరాజ్ క్రీడాకారులందరి తరఫున ప్రమాణం చేశాడు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు క్రీడలను ప్రారంభించిన వెంటనే శ్రీహరి నటరాజ్ తన ప్రమాణం తీసుకున్నాడు.  ప్రముఖ క్రీడాకారులైన విమల్ కుమార్, అంజు బాబీ జార్జి, రీత్ అబ్రహాం, అశ్వినీ నాచప్ప, మాలతీ హొల్లా, బి.ఆర్. బీడు, ఎ.బి. సుబ్బయ్య, ఎస్.వి. సునీల్, వి.ఆర్. రఘునాథ్ తదితరులు ప్రారంభోత్సవంలో పాలు పంచుకున్నారు. కె.వై. వెంకటేశ్, ఎస్.ఎం. శశికాంత్ నాయక్, సహానా ఎస్.ఎం.,..మణికండన్, తాన్యా హేమంత్, ఫర్మాన్ బాషా కూడా ఈ క్రీడల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

 

ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడోత్సవం 2021 గీతం ప్రధాన ఆకర్షణ..

  ప్రారంభోత్సవ వేడుకలకు హాజరైన 2,500మంది వీక్షకులను డోళ్లు కుణితా వంటి అనేక సంప్రదాయ జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. పాప్ సంగీతకారుడు, కంపోజర్ అయిన చందన్ షెట్టీ రూపొందించిన క్రీడల గేయం నాట్య రూపకం వీక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  కేరళ చందే, నాసిక్ డోళ్లు, పజాబీ డోళ్లు వంటి వాయుద్య కారుల ప్రదర్శన పది రోజుల క్రీడోత్సవానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన కళాకారులు ఈ ప్రదర్శనలో పాలుపంచుకున్నారు. స్వదేశీ విధానంలో యువత నైపుణ్యాలను ప్రదర్శించే 12వ శతాబ్దపు సంప్రదాయ క్రీడాంశమైన మల్లకంబను ఈ సంవత్సరం ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడోత్సవంలో చేర్చారు. ప్రారంభోత్సవంలో ఈ క్రీడాంశాన్ని కూడా ప్రదర్శించారు. కింగ్స్ యునైటెడ్ సంస్థకు చెందిన యువత ప్రదర్శించిన అద్భుతమైన వ్యాయామ విద్యా విన్యాసాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. స్టేడియం బయట ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై ప్రారంభోత్సవ దృశ్యాలను పలువురు క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. క్రీడల ప్రారంభోత్సవాన్ని దూదర్శన్ స్పోర్ట్స్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేశారు. ఆకాశవాణి, రేడియో సిటీ ద్వారా ప్రత్యక్ష వ్యాఖ్యానం కూడా ప్రసారమైంది. 

 

****



(Release ID: 1819668) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Hindi , Odia