వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

‘మేక్‌ ఇన్‌ ఇండియా’ దిశగా ఆస్ట్రేలియా వ్యాపార సంస్థలకు శ్రీ పీయూష్‌ గోయల్‌ ఆహ్వానం; రెండుదేశాల అంకుర సంస్థల మధ్య మరిన్ని ఒప్పందాలకు పిలుపు


పశ్చిమ ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య సారూప్యంతో మరింత
లోతైన ఆర్థిక సంబంధాలకు ఒక అవకాశం: శ్రీ గోయల్;

భారత-ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వాములుగా ‘క్వాడ్‌’ కోసం
కృషితోపాటు ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం,

ప్రశాంతత, ప్రగతి ప్రాంతంగా నిర్వహించడంలో ఉత్పాదక-పంపిణీ
ప్రతిరోధకత దిశగా ఉమ్మడి చర్యలు చేపడతాయి: శ్రీ గోయల్;

అంతరిక్ష రంగం.. సుస్థిరతలో ఆస్ట్రేలియాతో మరింతగా
ఒప్పందాలు కుదుర్చుకోవాలని శ్రీ గోయల్ పిలుపు;

రెండు దేశాల ప్రజలను క్రికెట్ మరింత దగ్గర చేసింది..
జన భాగస్వామ్యం లేని వ్యాపార వృద్ధి అసాధ్యం: శ్రీ గోయల్

Posted On: 08 APR 2022 6:14PM by PIB Hyderabad

   స్ట్రేలియా వ్యాపార సంస్థలు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్యం-పరిశ్రమలు, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం-ప్రజాపంపిణీ, జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రెండు దేశాల్లోని అంకుర సంస్థలు పరస్పరం ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆయన సూచించారు. ఆస్ట్రేలియాలో అద్భుత ఆవిష్కరణలు, పరిశోధన, సరికొత్త ధోరణులుండగా భారతదేశంలో అపార ప్రతిభాశక్తి ఉన్నదని వీటిని ప్రపంచవ్యాప్తం చేయాలని నొక్కిచెప్పారు. ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు పెట్టుబడులు వేగంగా ప్రవహించగలవని ఆశాభావం వ్యక్తం చేస్తూ- రెండు దేశాల మధ్య సంబంధాల విస్తరణలో పశ్చిమ ఆస్ట్రేలియా ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి రోజర్‌ కుక్‌ ఇవాళ పెర్త్‌ నగరంలో నిర్వహించిన వాణిజ్యపరమైన విందు సమావేశంలో శ్రీ గోయల్‌ ప్రసంగిస్తూ- “పశ్చిమ ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య సారూప్యంతో మరింత లోతైన ఆర్థిక సంబంధాలకు అవకాశం కల్పిస్తోంది” అన్నారు.

   వ్యూహాత్మక భాగస్వామ్యాల నిర్మాణంలో భారత్‌ ప్రయత్నాల గురించి మంత్రి వివరిస్తూ- ‘క్వాడ్‌’, ఉత్పాదక-పంపిణీ ప్రతిరోధకత చర్యలలో ఇదొక భాగంగా మారిందన్నారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలను పీడిస్తున్న కల్లోలాలను ప్రస్తావిస్తూ- రెండు బలమైన ప్రజాస్వామ్యాలు, రెండు మిత్రదేశాలు కలసికట్టుగా ఉమ్మడి శ్రేయస్సు కోసం కృషి చేయడమే కాకుండా పరస్పర విశ్వాసం, నమ్మకంతో ముందుకు వెళ్లడంద్వారా ‘ఐక్యత’పై ప్రపంచానికి బలమైన సందేశం ఇచ్చినట్లు కాగలదని శ్రీ గోయల్ నొక్కి చెప్పారు. “సంయుక్త భౌగోళిక-రాజకీయ శక్తిని మరింత బలోపేతం చేయడమే కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం, ప్రశాంతత, ప్రగతి నిలయంగా నిర్వహించడానికి మనం కృషి చేద్దాం” అని ఆయన చెప్పారు.

   భారత-ఆస్ట్రేలియా ఆర్థిక సహకార-వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని శ్రీ గోయల్‌ అన్నారు. ఈ మేరకు సహకారం-స్నేహ సంబంధాలపై చర్చలు అద్భుతరీతిలో సాగాయని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కింద విద్య, పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతిక పరిజ్ఞానం, తయారీ వగైరా రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించబడుతుందని ఆయన చెప్పారు. అదే సమయంలో అంతరిక్ష రంగం, సుస్థిరతల విషయంలోనూ ఒప్పందాలను మరింత లోతుకు తీసుకెళ్లాల్సి ఉందని పిలుపునిచ్చారు. సవాళ్లు ఎదురైన సమయాల్లోనూ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతూ వచ్చాయన్నారు. ఆస్ట్రేలియాను తమ నివాసంగా మార్చుకున్న భారతీయ సంతతికి చెందిన ప్రతి వ్యక్తిపై ఆస్ట్రేలియా పౌరులు చూపుతున్న ప్రేమాభిమానాలకుగాను వారికి కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య సోదరభావానికి ఇది వాస్తవ ప్రతిబింబమని ఆయన అన్నారు.

   ఆస్ట్రేలియా పర్యటనలో అనేక ఒప్పందాలు సఫలం కావడంపై మంత్రి మాట్లాడుతూ- “మన ద్వైపాక్షిక సంబంధాలకు ఈ ‘ఏక్తా’ (ఈసీటీఏ) ఒక మేలిమలుపు.. పరస్పర అవసరాలు తీర్చడంలో మన ఆర్థిక వ్యవస్థలకు విశేష సామర్థ్యం ఉంది” అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలను ఉటంకించారు. ప్రధానమంత్రి దార్శనికతను రెండు ఆర్థిక వ్యవస్థల నడుమ అనుబంధం స్పష్టంగా ప్రతిబింబిస్తున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. బహుళ రంగాల్లో అనేక సంబంధాల వృద్ధికి దోహదపడే ఈ ఒప్పందాన్ని ఒక ముఖ్యమైన మైలురాయిగా మంత్రి అభివర్ణించారు. “మన సుదీర్ఘ పయనంలో ఇది ఆరంభం మాత్రమే… ఇది కదం తొక్కడంతో ఆగకుండా సుదీర్ఘ పరుగుగా మారుతుందని నేను ఆశిస్తున్నాను” అన్నారు.

   భారత-ఆస్ట్రేలియా ‘ఈసీటీఏ’ ఒక సమతూకపు, పారదర్శక, సమానత్వంతో కూడిన ఒప్పందమని, దీనిద్వారా అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని శ్రీ గోయల్‌ అన్నారు. ఈ మేరకు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030నాటికి ‘ఈసీటీఏ’ 100 బిలియన్‌ అమెరికా డాలర్ల స్థాయికి చేర్చగల అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలో అధికశాతం అనుభవిస్తున్న శ్రేయస్సును పొందడం కోసం నాణ్యమైన జీవనాన్ని ఆకాంక్షించే భారీ భారత జనాభా ఎదురుచూస్తున్నదని మంత్రి నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో ఇది ఆస్ట్రేలియాకు అందివచ్చిన అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు “శ్రేయస్సుతోపాటు మార్కెట్‌ పరిమాణ శ్రేణులకు అనుగుణంగా పరస్పర సున్నితాంశాలు, స్థాయులను గౌరవిస్తూ ఉమ్మడి కృషిని కొనసాగించాలి” అని చెప్పారు.

   ఈ ఒప్పందం కింద 45 బిలియన్‌ అమెరికా డాలర్ల ఆరంభ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్య నిర్దేశాన్ని శ్రీ గోయల్‌ ప్రస్తావిస్తూ- తన పర్యటనలో ఆస్ట్రేలియా సమాజం, వ్యాపార సంస్థలతో చర్చల ద్వారా ఆర్థిక సహకారానికి అపార అవకాశాలున్నట్లు తనకు అవగతమైందని పేర్కొన్నారు. అందువల్ల ఈ లక్ష్యాన్ని సులువుగానే చేరుకోగలమన్న విశ్వాసం కలిగిందని తెలిపారు. ఆస్ట్రేలియా, భారత ప్రజలు సదా సహజ భాగస్వాములని, వారి మధ్య సంబంధాలు అంతే సహజంగా వృద్ధి చెందాయని శ్రీ గోయల్‌ అన్నారు. ఒకానొక సమయంలో రెండు దేశాలూ భౌగోళికంగా చేరువగానే ఉండేవని ఆయన గుర్తుచేశారు. అలాగే కామన్‌వెల్త్‌లో సభ్యదేశాలుగా పారదర్శక ప్రభుత్వాలు, చటబద్ధ పాలనగల శక్తిమంతమైన ప్రజాస్వామ్యాలుగా భారత్‌, ఆస్ట్రేలియా వర్ధిల్లుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా క్రికెట్‌పై అమిత క్రీడాసక్తి రెండు దేశాలనూ మరింత చేరువ చేసిందని చమత్కరించారు.

   భారత-ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థలు పోటీదారులుగా కాకుండా పరస్పరం అద్భుత పూరకాలుగా ఉంటున్నాయని శ్రీ గోయల్‌ అభివర్ణించారు. ఈ సహకారానికి నిదర్శనంగా కొన్ని అంశాలను ఉదాహరిస్తూ- ఆస్ట్రేలియా గొర్రెల ఉన్నితో భారత్‌లో అల్లిన లేదా రూపొందిన వస్త్రాలు ప్రపంచానికి అద్భుత ఉత్పత్తులు కాగలవన్నారు. ఆ మేరకు భారత ప్రజానీకానికి.. ముఖ్యంగా యువతరానికిగల విశేష  ప్రతిభాశక్తితో ఆస్ట్రేలియా లబ్ధిపొందే అవకాశాలు అపారంగా ఉంటాయన్నారు. ఆస్ట్రేలియా నేడు ప్రపంచంలోని అనేక దేశాలకు ముడిపదార్థాలు, మధ్యంతర ఉత్పత్తుల సరఫరాదారుగా ఉన్నదని మంత్రి గుర్తుచేశారు. వీటిని సంపూర్ణ ఉత్పత్తులుగా మలచి ప్రపంచానికి అందించడంలో భారత్‌ తన విస్తృత, నిపుణ మానవశక్తిని సమకూర్చగలదని పేర్కొన్నారు.

   ఈ కార్యక్రమం అనంతరం పర్యాటక రంగంపై పెర్త్‌ నగరంలో నిర్వహించిన మరో సమావేశంలో శ్రీ గోయల్‌ కీలకోపన్యాసం  చేశారు. భారత-ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో విద్యపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ మేరకు రెండు దేశాలూ తమతమ విద్యా వ్యవస్థలకు పరస్పర గుర్తింపునివ్వాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు చేరువచేసే కృషిద్వారా ద్వంద్వ పట్టాల ప్రదానానికిగల మార్గాలను ఉభయ పక్షాలూ అన్వేషించాలని సూచించారు. ఇక ‘ఈసీటీఏ’కి రెండు దేశాల ప్రజలతోపాటు మాధ్యమాల నుంచి కూడా విశేష ఆదరణ, మద్దతు లభించిందని మంత్రి చెప్పారు. ఆస్ట్రేలియాకుగల అరుదైన భూ-ఖనిజ సానుకూలాంశాన్ని మంత్రి ప్రస్తావిస్తూ- రాబోయే కాలంలో ఇది అత్యంత కీలకం కాగలదని పేర్కొన్నారు. తద్వారా సాంకేతిక పరిజ్ఞానం వికాసంతోపాటు లక్షలాది ఉద్యోగాల సృష్టికి వీలుంటుందన్నారు. ముఖ్యంగా మెరుగైన భవిష్యత్తును ఆకాంక్షిస్తున్న భారత విస్తృత, యువ నిపుణ జనాభాకు ఇది ఎంతగానో కలసివచ్చే అంశమని తెలిపారు.

   క్రికెట్‌ స్వర్గంగా పేరున్న ‘డబ్ల్యూఏసీఏ’ మైదానం గురించి ప్రస్తావిస్తూ- ఈ క్రీడలో భారత-ఆస్ట్రేలియా ఆటగాళ్లు భీకరంగా పోరాడటం సహజమే అయినా వాస్తవానికి ఈ ఆటపైగల అమితాసక్తి రెండు దేశాలనూ మరింత చేరువ చేసిందని మంత్రి గుర్తుచేశారు. క్రికెట్‌ క్రీడ ఉభయ దేశాల ప్రజల మధ్య సామీప్యం పెంచిందని, కాబట్టి ప్రజా భాగస్వామ్యం లేకపోతే వ్యాపారాలు వృద్ధి చెందడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. స్నేహసంబంధాలకు దేశాధినేతల కట్టుబాటు ఒకస్థాయి కాగా- అంతర్గతంగా ప్రజల మధ్య ఐక్యత, పరస్పర నమ్మకంతోపాటు కలసికట్టుగా ఉండటంవల్ల లభించే ప్రయోజనాలు అందులో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు.

 

***



(Release ID: 1815139) Visitor Counter : 114


Read this release in: English , Urdu , Marathi , Hindi