జల శక్తి మంత్రిత్వ శాఖ
స్థుస్థిర నీటి సరఫరాయే లక్ష్యం,.. ప్రజాసంఘాలకు యాజమాన్యం!
ఇదే మనముందున్న అసలు కర్తవ్యం..
జైపూర్ లో జలజీవన్ మిషన్,11రాష్ట్రాల భేటీలో
కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పిలుపు...
జలజీవన్ మిషన్ కోసం 2022-23లో
8 రాష్ట్రాలకు,3కేంద్ర పాలితప్రాంతాలకు
కేంద్ర గ్రాంటుగా రూ. 32,608 కోట్ల కేటాయింపు
స్వచ్ఛ భారత్ (గ్రామీణ్) కింద రూ. 2,167కోట్లు..,
2022-23లో తాగునీరు, పారిశుద్ధ్యం కోసం
15వ ఆర్థిక సంఘం టైడ్ గ్రాంటు కింద
రూ. 7,632 కోట్ల కేటాయింపు...
Posted On:
08 APR 2022 5:38PM by PIB Hyderabad
జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.), స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) పథకాలపై ఈరోజు రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగిన 11 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాంతీయ సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అధ్యక్షత వహించారు. గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, డయ్యూ డామన్, దాద్రా-నాగర్ హవేళీ, జమ్ము కాశ్మీర్, లడఖ్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ‘ప్రతి ఇంటికీ నీటి సరఫరా’ అన్న లక్ష్యాన్ని గోవా, డయ్యూ-డామన్, దాద్రా-నాగర్ హవేళీ ఇప్పటికే సాధించగా, పంజాబ్ 99శాతం వరకూ లక్ష్యాన్ని సాధించింది. పథకం అమలులో హిమాచల్ ప్రదేశ్ 93శాతం లక్ష్యాన్ని సాధించగా, మిగిలిన రాష్ట్రాలన్నీ లక్ష్యసాధనలో వివిధ దశల్లో ఉన్నాయి.
ప్రారంభోపన్యాసంలో కేంద్ర మంత్రి షెఖావత్ స్ఫూర్తిదాయంగా ప్రసంగించారు. రాజస్థాన్ లోని నీటి ఎద్దడి ప్రాంతమైన జోధపూర్ జిల్లాలో తన వ్యక్తిగత అనుభవాన్ని కేంద్రమంత్రి ప్రస్తావించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తమ కుటుంబ సభ్యులకోసం సుదూర ప్రాంతాలనుంచి నీటిని మోసుకువస్తూ పడిన ప్రయాసనను తాను స్వయంగా చూశానని అన్నారు. ఇలాంటి పరిస్థితిని మెరుగుపరిచేందుకు జలజీవన్ మిషన్ పథకాన్ని ఏకకాల పరిష్కారంగా, ఏకైక అవకాశంగా ప్రతినిధులందరూ గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పథకం అమలులో వేగం, మనం ఎదుర్కొనే సవాలుకు దీటుగా ఉండాలని అన్నారు. మౌలిక సదుపాయాలపరంగా సవాళ్లు ఎదురైనా, దీర్ఘకాలిక సుస్థిర నీటి సరఫరా సేవలు అందేలా, ప్రజాసమూహాల, సంఘాల యాజమాన్యాన్ని నిర్మించడం మన ముందున్న కర్తవ్యమమని ఆయన అన్నారు. తగినంత పరిణామంలో నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలతో, క్రమం తప్పకుండా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామపంచాయతీ లేదా పానీ సమితుల ద్వారా స్థానిక ప్రజానీకంలో యాజమాన్య భావనను కలిగించేందుకు వారికి, ప్రారంభ దశలోనే ప్రణాళిక స్థాయినుంచి ప్రమేయం కల్పించాలని ఆయన అన్నారు,
“2019 ఆగస్టు 15వ తేదీన జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించే నాటికి, దేశంలోని 16.75శాతం గ్రామీణ ఇళ్లకు మాత్రమే నీటి కుళాయిల కనెక్షన్లు ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి వైరస్ వ్యాప్తితో గత రెండున్నరేళ్లలో అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు 6.16కోట్ల మేర నీటి కుళాయిలను ఏర్పాటు చేయగలిగాం. గ్రామాల్లోని 9.40 కోట్ల ఇళ్లకు (అంటే, 49శాతం ఇళ్లకు) పరిశుభ్రమైన తాగునీటి ప్రయోజనాలు అందుతున్నాయి.” అని ఆయన అన్నారు.
“2019 అక్టోబరు 2వ తేదీనాటికి దేశంలోని అన్ని జిల్లాలనూ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాలుగా ప్రకటించడం మనజాతికే గర్వకారణం. సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్.డి.జి.-6) కింద నిర్దేశిత లక్ష్యం కంటే ముందుగానే ఈ ఫలితం సాధించాం. ప్రజల భాగస్వామ్యంతో మరుగునీటి జలాల నిర్వహణ లక్ష్యాన్ని సాధించేందుకు సుజలాం రెండవ దశ ప్రచారోద్యమం ప్రారంభించాం. ఈ ఉద్యమం కింద మురుగునీటి నిర్వహణకోసం ప్రజా సంఘాలను, పంచాయతీలు, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు వంటి పలు సంస్థలను సమీకరించాం. మురుగునీరు, వ్యర్థ జలాలు ఏదైనా ఒక చోట నిలిచిపోయేందుకు ఆస్కారం ఇస్తే, అది మౌలిక సదుపాయాలపరంగా పెద్ద సవాలుగా పరిణమిస్తుంది. ఈ ముగురునీటి నిర్వహణ స్థానిక స్థాయిలో జరిగేలా మనం పంచాయతీలతో, ప్రజలతో కలసి మమేకమై పనిచేయాలి. ప్రతి ఇంటికీ వ్యక్తిగతంగాను, ప్రజాసంఘాల స్థాయిలోనూ సోక్ పిట్లు నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలి.” అని కేంద్రమంత్రి షెఖావత్ అభిప్రాయపడ్డారు.
రాజస్థాన్ భూగర్భ జలాల శాఖ మంత్రి డాక్టర్ మహేష్ జోషీ తమ రాష్ట్రం తరఫున సమావేశంలో ప్రాతినిధ్యం వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ సింగ్ చౌహాన్, గుజరాత్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బ్రిజేష్ కుమార్ మెర్జా, హర్యానా సహకార, ఎస్.సి., బి.సి. సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బన్వరీ లాల్, మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దేవేంద్ర సింగ్ బాబ్లీ, పర్యావరణం, వాతావరణ మార్పులు, నీటి సరఫరా పారిశుద్ధ్యం, ప్రజా పనులు, ఉపాధిహామీ శాఖ మంత్రి గులాబ్ రావు పాటిల్, పంజాబ్ రెవెన్యూ, జలవనరుల శాఖ మంత్రి బ్రహ్మ శంకకర్ శర్మ, ఇంకా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. అన్ని రాష్ట్రాల మంత్రులు సమావేశంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ నీటి సరఫరా జరగాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తాము అనుసరించబోయే ప్రణాళికను, దీర్ఘకాలిక సుస్థిర నీటి సరఫరా పథకాల అమలులో తాము తీసుకొనబోయే చర్యలను వారు వివరించారు.
కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి వాణీ మహాజన్ తన ప్రారంభోపన్యాసం ఇస్తూ, నీటి సరఫరా పథకాలను కాలబద్ధంగా గడువులోగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఏ ఒక్కరూ నీటి సరఫరాకు నోచుకోని పరిస్థితి రాకుండా తీసుకోవలసిన నివారణ చర్యలను తెలిపారు. ప్రజా సంఘాలతో భాగస్వామ్యాన్ని నిర్మించుకుని కలసికట్టుగా పనిచేయడం అనే జలజీవన్ మిషన్ సిద్ధాంతాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. వివిధ భాగస్వామ్య వర్గాల మధ్య, అంటే స్వయం సహాయక బృందాలు (ఎస్.హెచ్.జి.లు), గ్రామాల సంఘాలు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య సహకారం పెంపొందించుకునే మార్గాలను ఆమె సూచించారు. పనులను వేగవంతంగా నిర్వహించేందుకు టెండరింగ్ ప్రక్రియను సజావుగా చేపట్టాలని, తగినంత సిబ్బందిని నియోగించాలని, థర్డ్ పార్టీ సంస్థలచే నాణ్యతా ప్రమాణాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయించాలని సూచించారు. అప్పుడే ప్రణాళికా వ్యవధి, సమీక్షా వ్యవధిని మరింత సమర్థవంతంగా వినియోగపడతాయని అన్నారు. భాగస్వామ్య రాష్ట్రాల్లోని మెజారిటీ రాష్ట్రాలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నవే కాబట్టి, నీటి వనరుల పటిష్టత, సుస్థిరత్వం కోసం కలసికట్టుగా పనులు చేపట్టాలని అన్నారు. నీటికి మరింత విలువను జోడించే చర్యల్లో భాగంగా నీటి వినియోగ చార్జీలను ప్రోత్సహించే అంశాన్ని పరిశీలించాలని ఆమె రాష్ట్రాలకు సూచించారు.
సమావేశంలో చర్చను కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ అరుణ్ బరోకా ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ్ బరోకా మాట్లాడుతూ, జలజీవన్ మిషన్ పథకం ప్రస్తుత స్థితిని స్థూలంగా వివరించారు. రాష్ట్రాల వారీగా పథకం పనుల తాజా పరిస్థితిని, పనుల ప్రణాళికా ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను, ప్రతి ఇంటికీ నీటి సరఫరా సర్టిఫికేషన్ ప్రక్రియను, నీటి కుళాయిల అమర్చే ప్రక్రియ ప్రగతిని, తదితర అంశాలను బరోకా ప్రస్తావించారు. గ్రామ నీటి సరఫరా పారిశుద్ధ్య కమిటీలు, పానీ సమితులు వంటి సంస్థలకు ప్రమేయం కల్పించడం, కలుషిత నీటి నమూనాల సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు, క్షేత్రస్థాయి పరీక్షా కిట్ల (ఎఫ్.టి.కె.ల) ద్వారా నీటి నమూనాల పరీక్షలు, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు పథకం వర్తింపు, జాతీయ జలజీవన్ మిషన్ (ఎన్.జె.జె.ఎం.) ద్వారా బహుళ శాఖల జరిపిన వివిధ క్షేత్రస్థాయి పర్యటనల్లో అందిన నివేదికలు తదితర అంశాలను అరుణ్ బరోకా ప్రస్తావించారు. పథకం అమలులో తాము ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లను ఆయా రాష్ట్రాల మంత్రులు, సీనియర్ అధికారులు తెలియజేశారు. సమస్యల పరిష్కారంతో ముందుకు ఎలా వెళ్లాలో అన్న విషయంపై విపులంగా చర్చించారు. ఇక స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) పథకం రెండవ దశ అమలులో ఎదురైన అంశాలపై సమావేశం తదుపరి భాగంలో చర్చించారు.
ప్రజారోగ్యం, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వం మరోసారి తన చిత్తశుద్ధిని స్పష్టం చేస్తూ, 2022-23వ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో జలజీవన్ మిషన్ పథకానికి నిధుల కేటాయింపును రూ. 60,000 కోట్లకు పెంచింది. 2021-22వ సంవత్సరపు బడ్జెట్లో జలజీనవన్ మిషన్ కు రూ. 45,0000కోట్లు కేటాయించారు. ఇక స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) పథకానికి 2022-23వ సంవత్సరంలో రూ. 7,192కోట్లు కేటాయించారు.
జలజీవన్ మిషన్ పథకం కింద 2022-23వ సంవత్సరానికి 8 రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 32,609కోట్లను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయింపు జరిపింది. (గోవాకు – రూ. 48 కోట్లు, గుజరాత్.కు – రూ. 3,452 కోట్లు, హర్యానాకు – రూ. 1,099 కోట్లు, హిమాచల్ ప్రదేశ్.కు – రూ. 1,280 కోట్లు, మహారాష్ట్రకు – రూ. 7,415 కోట్లు, పంజాబ్.కు – రూ. 1,693 కోట్లు, రాజస్థాన్.కు – రూ. 11,752 కోట్లు, ఉత్తరాఖండ్.కు – రూ. 1,502 కోట్లు, జమ్ము-కాశ్మీర్.కు – రూ. 2,875 కోట్లు, లడఖ్.కు – రూ. 1,493 కోట్లు కేటాయించారు.). స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) పథకం కింద ఈ రాష్ట్రాలకు రూ. 2,167కోట్లను తాత్కాలికంగా కేటాయించారు. (గోవా – రూ. 29 కోట్లు, గుజరాత్ – రూ. 206 కోట్లు, హర్యానా – రూ. 224 కోట్లు, హిమాచల్ ప్రదేశ్– రూ. 152 కోట్లు, మహారాష్ట్ర – రూ. 786 కోట్లు, పంజాబ్ – రూ. 82 కోట్లు, రాజస్థాన్ – రూ. 365 కోట్లు, ఉత్తరాఖండ్ – రూ. 65 కోట్లు, దాద్రా, నాగర్ హవేళీ – రూ. 5 కోట్లు, జమ్ము కాశ్మీర్ – రూ. 243 కోట్లు లడఖ్ – రూ. 11 కోట్లు కేటాయించారు.).
దీనికి తోడు, 15వ ఆర్థిక సంఘం కింద గ్రామీణ స్థానిక సంస్థలకు, పంచాయతీరాజ్ సంస్థలకు 2022-23వ సంవత్సరానికి మొత్తం రూ. 27,908కోట్లను కేటాయించారు. ఇంకా వచ్చే ఐదేళ్ల వరకూ అంటే 2025-26 వరకూ రూ. 1.45లక్షల కోట్లు తప్పనిసరిగా కేటాయింపు జరిగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య రాష్ట్రాల్లో నీటి సరఫరా పనులు, పారిశుద్ధ్య సంబంధ కార్యక్రమాల నిర్వహణకోసం 2022-23వ సంవత్సరానికి టైడ్ గ్రాంటుగా రూ. 7,632కోట్ల కేటాయింపు జరిగింది.
ఆర్థిక పరిస్థితి
రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం
|
2021-22లో..
|
2022-23లో..
|
కేటాయింపు
|
రాష్ట్రాలు,/ కేంద్రపాలిత ప్రాంతం తీసుకున్న నిధులు
|
తాత్కాలిక కేటాయింపు
|
గోవా
|
46
|
23
|
48
|
గుజరాత్
|
3,411
|
2,558
|
3,452
|
హర్యానా
|
1,120
|
560
|
1,099
|
హిమాచల్ ప్రదేశ్
|
1,263
|
2,013
|
1,280
|
జమ్ము-కాశ్మీర్
|
2,747
|
604
|
2,875
|
లడఖ్
|
1,430
|
341
|
1,493
|
మహారాష్ట్ర
|
7,064
|
1,667
|
7,415
|
పంజాబ్
|
1,656
|
402
|
1,693
|
రాజస్థాన్
|
10,181
|
2,345
|
11,752
|
ఉత్తరాఖండ్
|
1,444
|
1,083
|
1,502
|
మొత్తం
|
30,361
|
11,595
|
32,608
|
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) పథకం రెండవ దశకు 2020వ సవంత్సరం ఫిబ్రవరినెలలో ఆమోదం లభించింది. బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాల ఏర్పాటుపై, ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని కేంద్రీకరిస్తూ మొత్తం రూ. 1,40,881కోట్ల కేటాయింపుతో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) రెండవదశ పథకాన్ని ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కేటాయింపులతో ఈ విధంగా నిధులను సమీకరణ, ఏకీకరణ జరపడం ఒక వినూత్న నమూనాగా చెప్పవచ్చు. కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ బడ్జెట్ కేటాయింపులు, సంబంధిత రాష్ట్రాల వాటానే కాక, మిగిలిన నిధులను 15వ ఆర్థిక సంఘం టైడ్ గ్రాంట్లను గ్రామీణ స్థానిక సంస్థలకు సర్దుబాటు చేశారు. అలాగే, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.), కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) నిధులు, రెవెన్యూ జనరలేషన్ నమూనాల తదితర మార్గాల ద్వారా కూడా మిగిలిన నిధులను సర్దుబాటు చేశారు. ప్రత్యేకించి ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాల నిర్వహణకోసం ఈ నిధుల సర్దుబాటు చేశారు.
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) రెండవ దశ ప్రారంభంలో దాదాపు 69లక్షల ఇళ్లకు ప్రయోజనం చేకూరింది. ఇందులో భాగంగా, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం జరిగింది. లక్షా 28వేలకు పైగా సామాజిక మరుగుదొడ్లను నిర్మించారు. దేశ వ్యాప్తంగా 56,000గ్రామాలు తాము బహిరంగ మలవిసర్జన రహిత స్థాయిని (ఒ.డి.ఎఫ్. ప్లస్. స్థాయిని) సాధించినట్టుగా ప్రకటించుకున్నాయి. అప్పటికే, 63వేలకు పైగా గ్రామాలకు ఘనవ్యర్థాల నిర్వహణా ఏర్పాట్లను వర్తింపజేశారు. ఏకంగా 39,000కు పైగా గ్రామాలు ద్రవ వ్యర్థాల నిర్వహణా ఏర్పాట్లను సమకూర్చుకున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) రెండవ దశ పథకం కింద 14లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, 22,00కు పైగా సామాజిక పారిశుద్ధ్య భవన సముదాయాల నిర్మాణం జరిగింది. 12,000పైగా గ్రామాలను ఒ.డి.ఎఫ్. స్థాయి గ్రామాలుగా ప్రకటించారు.
ఇక, పనుల నాణ్యత, అమలు చేయాల్సిన స్థలం, శిక్షణ, సామర్థ్యాల నిర్మాణానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ కార్యకలాపాలు, నీటి నాణ్యతా పర్యవేక్షణ, నిఘా, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సుస్థిర నీటి వనరులు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ వంటి అంశాలపై భోజన విరామం అనంతరం జరిగిన సమావేశంలో సబ్జెక్టు నిపుణులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు చర్చించారు. అభివృద్ధి రంగానికి చెందిన నిపుణులు తమ అధ్యయనంలో కనుగొన్న అంశాలను అధికారులతో పంచుకున్నారు. అనంతరం, ఆయా రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన అంశాలపై చర్చించడానికి బ్రేకౌట్ సెషన్లు కూడా నిర్వహించారు.
*****
(Release ID: 1815136)
Visitor Counter : 178