వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఈ - కామర్స్‌ను బలోపేతం చేసి చిన్న వ్యాపారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ కామర్స్ (ఓఎండీసీ) దోహదపడుతుంది - శ్రీ పీయూష్ గోయల్
ట్రిలియన్ డాలర్ల పరిశ్రమగా దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం అభివృద్ధి చెందేందుకు కృషి జరగాలి... శ్రీ గోయల్
సుస్థిర అభివృద్ధి సాధన అంశంలో ఎదురవుతున్న సవాలుకు పరిష్కారాలను కనుగొనేందుకు చేసే ప్రయత్నాలు నూతన అవకాశాలను అందుబాటులోకి తెస్తాయి – శ్రీ గోయల్
భారతదేశంలో ట్రిలియన్ డాలర్ల కంపెనీలను నెలకొల్పవచ్చు – శ్రీ గోయల్
వినూత్న ఆలోచనలతో సంస్థలను నెలకొల్పాలని ఔత్సాహికులకు సూచించిన – శ్రీ గోయల్
Posted On:
19 MAR 2022 1:00PM by PIB Hyderabad
ఈ - కామర్స్‌ను బలోపేతం చేసి చిన్న వ్యాపారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ కామర్స్ (ఓఎండీసీ) తోడ్పడుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, జౌళిశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. బిట్స్ పిలానీ ఈ రోజు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం వరుసగా ఐదో సారి ఏర్పాటు చేసిన సదస్సు ను శ్రీ గోయల్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ గోయల్ ఈ-కామర్స్ తో పాటు చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ కామర్స్ (ఓఎండీసీ) సమాన అవకాశాలను కల్పిస్తుందని అన్నారు. సమావేశానికి ముందు బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి శ్రీ శ్రీ నానాజీ దేశ్‌ముఖ్‌కు శ్రీ గోయల్ నివాళులు అర్పించారు. శ్రీ నానాజీ దేశ్‌ముఖ్ దేశానికి ఎనలేని సేవలు అందించి అందరికి ఆదర్శంగా నిలిచారని శ్రీ గోయల్ అన్నారు.
' నాయకులు వారిని అనుసరించే వారి మధ్య ఉండే తేడాను ఆవిష్కరణలు గుర్తు చేస్తాయి" అంటూ స్టీవ్ జాబ్స్ చేసిన వ్యాఖ్యలను శ్రీ గోయల్ గుర్తు చేశారు. బిట్స్ పిలానీ లో విద్యను అభ్యసించిన విద్యార్థులు చలన చిత్ర రంగం, రచనా రంగం, వ్యాపార రంగం, సేవా రంగాలలో స్థిరపడి రాణించి గుర్తింపు సాధించారని మంత్రి పేర్కొన్నారు.
' జ్ఞానమే అత్యున్నత ఆయుధం ' అన్న దృఢ విశ్వాసంతో బిట్స్ పిలానీ పనిచేస్తున్నదని శ్రీ గోయల్ అన్నారు.విజ్ఞానం తో ముడిపడిన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా బిట్స్ పిలానీ విద్యా విధానం ఉందని అన్నారు. ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకత రంగాల్లో బిట్స్ పిలానీ విద్యార్థులు ప్రపంచంలో తమకంటూ ఒక పేరు, గుర్తింపు పొందారని మంత్రి అన్నారు, భారతదేశంలోని యునికార్న్‌లలో 10% యునికార్న్‌లను బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులు స్థాపించారని వివరించారు. అంకుర సంస్థల స్థాపన, అభివృద్ధి అంశాలలో ప్రయోగశాలలు, మార్గదర్శకత్వం , ఇంక్యుబేటర్లు మరియు నిధులు నాలుగు ముఖ్యమైన అంశాలుగా ఉంటాయని శ్రీ గోయల్ అన్నారు.
కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న సమయంలో విద్యార్థులు వినూత్నంగా ఆలోచించే విధంగా ప్రోత్సహించే విద్యా కార్యక్రమాలను బిట్స్ అమలు చేస్తున్నదని శ్రీ గోయల్ అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా విద్యా భోధన జరగాలని అన్నారు. విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఇటీవల అమలులోకి తెచ్చిన తెచ్చిన నూతన విద్యా విధానంలో ఇదే అంశానికి ప్రాధాన్యత లభించిందని శ్రీ గోయల్ అన్నారు. బిట్స్ పిలానీ అనుసరిస్తున్న విద్యా విధానాన్ని అనుసరించి ఉద్యోగాల కోసం ఎదురు చూసే విద్యార్థులను కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా విద్యార్థులను తీర్చిదిద్దాలని శ్రీ గోయల్ ఇతర విద్యా సంస్థలకు సూచించారు.
దేశాభివృద్ధికి అంకుర సంస్థలు అత్యంత కీలకమని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచంలో అంకుర సంస్థల స్థాపన రంగంలో ప్రపంచంలో భారతదేశం మూడవ స్థానంలో ఉందని శ్రీ గోయల్ పేర్కొన్నారు. డీపీఐఐటీ లో నమోదైన అంకుర సంస్థల సంఖ్య గత ఐదేళ్ల కాలంలో 500 నుంచి 65,000 వరకు పెరిగిందని వివరించారు. దేశంలో 90కి పైగా యునికార్న్‌లు ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
'ఒక ఆలోచన జీవితాన్ని మార్చివేస్తుంది' అని స్పష్టం చేసిన శ్రీ గోయల్ ఈ సందర్భంగా యూఎస్ బీ సృష్టికర్త వడోదరకు చెందిన శ్రీ అజయ్ బట్ ను ప్రస్తావించారు. ఎక్కడికైనా సులువుగా సమాచారాన్ని తీసుకుని వెళ్లేందుకు శ్రీ అజయ్ బట్ అభివృద్ధి చేసిన యూఎస్బీ సహాయపడుతుందని అన్నారు.
వ్యవస్థాపక రంగం అనేక సవాళ్లు, అంతరాయాలతో కూడుకుని ఉంటుందని శ్రీ గోయల్ అన్నారు. దేశంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. గతంలో ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసే విధానం, డిజిటల్ ఆరోగ్య సంప్రదింపులు పొందడం , యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయని తెలిపిన మంత్రి ప్రస్తుతం ఈ సమస్యలు పరిష్కారం అయ్యాయని అన్నారు.
వైఫల్యాలతో నిరాశ చెందవద్దని పారిశ్రామికవేత్తలకు మంత్రి సలహా ఇచ్చారు. వ్యాపారంలో వైఫల్యం అనేది ఒక భాగంగా ఉంటుందని గుర్తించి ముందుకు సాగాలని అన్నారు. ప్రశాంతంగా ఆలోచించి, విజయం సాధించేందుకు మరింత కృషి చేసి వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని బిట్స్ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని శ్రీ గోయల్ అన్నారు.
అభివృద్ధి సాధించేందుకు అవసరమైన శక్తి, సౌకర్యాలను భారతదేశం కలిగి ఉందని శ్రీ గోయల్ అన్నారు. తాత్కాలిక అభివృద్ధి కాకుండా శాశ్వత అభివృద్ధి సాధన దిశగా దేశం అడుగులు వేస్తున్నదని అన్నారు. ఆత్మ నిర్భరత సాధించిన భారతదేశం ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని శ్రీ గోయల్ అన్నారు.
ఆర్థిక, వ్యవసాయ సాంకేతిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న భారతదేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఐటీ +ఐటీ + ఐటీ ( సమాచార సాంకేతికత + భారత మేధస్సు + రేపటి భారతదేశం) మంత్రంతో పురోగతి సాధిస్తున్నదని అన్నారు. ఐటీ, అనుబంధ రంగాలను ట్రిలియన్ డాలర్ల పరిశ్రమగా అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు.
డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడంలో భారతదేశం అగ్రగామిగా ఉందని శ్రీ గోయల్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ల వ్యాప్తి మరియు తక్కువ ధర అంతరాయం లేని డేటా ను అందించేందుకు ఆవిష్కరణలు పునాది వేశాయని మంత్రి అన్నారు. ఇండియాస్టాక్, హెల్త్స్టాక్, లాజిస్టిక్స్ స్టాక్, కోవిన్ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు కలిగిన భారతదేశంలో తదుపరి ట్రిలియన్ డాలర్ల కంపెనీలను ఏర్పాటు చేయవచ్చునని ఆయన అన్నారు.
ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసే అంశంలో భారరతదేశాన్ని అనుసరిస్తున్నాయని శ్రీ గోయల్ అన్నారు. భారతదేశంలో గతంలో ఎన్నడూ సాగని విధంగా వేగంగా, విస్తృతంగా సాగుతున్న డిజిటలైజేషన్ పై పీహెచ్డీ చేయవచ్చునని శ్రీ గోయల్ అన్నారు.
అంకుర సంస్థల స్థాపన, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను శ్రీ గోయల్ వివరించారు. వీటికి అవసరమైన సౌకర్యాలు, నిధులు అందిస్తున్న కేంద్రం మూడు సంవత్సరాలపాటు ఆదాయం పన్ను మినహాయింపు ఇచ్చిందని అన్నారు. వీటితోపాటు, కొత్త ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ల కోసం పరీక్ష వ్యవధిని తగ్గించడం , సీడ్ ఫండ్ స్కీమ్ లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. యువత సాలలు సాకారం అయ్యేలా చూసేందుకు గతంలో ఎదురైన సమస్యలు పరిష్కరించి ప్రోత్సహిస్తుందని అన్నారు.
దేశంలో అంకుర సంస్థల రంగం విస్తరించిందని శ్రీ గోయల్ అన్నారు.జాతీయ స్టార్టప్ అవార్డు గ్రహీతలు కొచ్చి, లక్నో, సోనిపట్ వంటి చిన్న నగరాలకు చెందిన వారు కావడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
నూతన రంగాలపై దృష్టి సారించాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శ్రీ గోయల్ సూచించారు. వైవిధ్యంతో , కొత్త వ్యాపారాలను అన్వేషించి అగ్రి-ప్రెన్యూర్‌లను (అగ్రి సెక్టార్ ఎంటర్‌ప్రెన్యూర్స్), టెక్స్-ప్రెన్యూర్స్ (టెక్స్‌టైల్స్), ఎడ్యు - ప్రెన్యూర్స్ (ఎడ్యుకేషన్)గా మారాలని అన్నారు. మెటావర్స్, వెబ్ 3, AI, 5G వంటి సైబర్ సెక్యూరిటీ వంటిఅంశాలపై దృష్టి సారించి నూతన ఆవిష్కరణలు చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు.
వ్యక్తిగతంగా లేదా అందరూ కలిసి ఈ సాంకేతికతలను ఉపయోగించుకునే మార్గాల గురించి ఆలోచించాలని శ్రీ గోయల్ కోరారు . సుస్థిరత మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇది అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పు, స్థిరమైన చలనశీలత, నీటి నిర్వహణ మొదలైన రంగాల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో పెద్ద వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉంటాయని అన్నారు.
' ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా మారవచ్చు ' అన్న ఎలోన్ మస్క్‌ని మాటలను శ్రీ గోయల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కలలను సాకారం చేసుకునే ధైర్యం ఉన్నవారిదే భవిష్యత్తు అన్న వాస్తవాన్ని విద్యార్థులు గుర్తించాలని అన్నారు . ఆవిష్కరణలు దేశంలోని ప్రతి మూలకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చేరాలని ఆయన అన్నారు.
నేటి అంకుర సంస్థలు రేపటికి అగ్రగామి సంస్థలు గా నిలుస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తూ కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి యువ పారిశ్రామికవేత్తలు కృషి చేయాలని కోరారు.
***
(Release ID: 1807447)
Visitor Counter : 206