హోం మంత్రిత్వ శాఖ
సి.ఐ.ఎస్.ఎఫ్. 53వ ఆవిర్భావ దినోత్సవం
Posted On:
06 MAR 2022 3:52PM by PIB Hyderabad
దేశ ఆర్థిక ప్రగతికోసం కర్మయోగిలా
సి.ఐ.ఎస్.ఎఫ్. విశేష సేవలు!
ఆవిర్భావ దినోత్సవంలో అమిత్ షా ప్రశంసలు...
సి.ఐ.ఎస్.ఎప్. లేనిదే దేశంలో 2.5 ట్రిలియన్ డాలర్ల
ఆర్థిక ప్రగతే లేదన్న కేంద్ర హోమ్ మంత్రి..
ధైర్యసాహసాలకు, విశేష సేవలకు గుర్తింపుగా
సి.ఐ.ఎస్.ఎఫ్. అధికారులకు, సిబ్బందికి
పలు పతకాలు, అవార్డులు ప్రదానం..
'సెంటినెల్-2022' మ్యాగజైన్ ఆవిష్కరణ..
ఆర్థిక ప్రగతి ప్రయాణ వ్యవధిని వందేళ్లవరకూ
ప్రధాని మోదీ నిర్దేశించారని ప్రకటన..
ఈ -అమృత కాలం-లో భవిష్యత్తుకోసం కూడా
ప్రణాళికలు రూపొందించుకోవాలని,
రానున్న పాతికేళ్లలో మన తీర్మానాలను
నిజం చేసుకోవాలని సూచన...
దేశ స్వావలంబనకోసం ప్రధాని నిర్దేశించిన
లక్ష్యందిశగా ముందుకు సాగాలి...
25ఏళ్ల భవిష్యత్తుకు దీటుగా సి.ఐ.ఎస్.ఎఫ్. సన్నద్ధతకు
5ఐదేళ్ల ప్రణాళిక అవసరం
దేశ ఆర్థికాభివృద్ధి వేగానికి దీటుగా
ఐదేళ్ల రోడ్ మ్యాప్ ప్రాతిపదికతో
పాతికేళ్ల కార్యాచరణ ప్రణాళిక..
ప్రధానమంత్రి మోదీ సారథ్యంలో కసరత్తు..
2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను,
5 ట్రిలియన్ల స్థాయికి చేర్చడంలో
ఎదురయ్యే సవాళ్లకు దీటుగా సి.ఐ.ఎస్.ఎఫ్.ను
సన్నద్ధం చేయడం అవసరం...
ప్రైవేటు భద్రతా ఏజెన్సీలతో కలసి
సి.ఐ.ఎస్.ఎఫ్. వ్యూహం ప్రాతిపదికగా
మిశ్రమ భద్రతా నమూనాను సృష్టించాలి...
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వందే భారత్ పథకం కింద
స్వదేశానికి తిరిగివచ్చే తోటి భారతీయులకు
విమానాశ్రయాల్లో సి.ఐ.ఎస్.ఎఫ్ జవాన్లు
ఆప్యాయంగా స్వాగతించిన తీరు అభినందనీయం..
కోవిడ్ నేపథ్యంలో విధినిర్వహణలో
ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ సిబ్బందికి
దేశప్రజల తరఫున, సి.ఐ.ఎస్.ఎఫ్. తరఫున నివాళి..
బహుముఖ నైపుణ్యం, సామర్థ్యాల్లో
సి.ఐ.ఎస్.ఎఫ్. ప్రపంచంలోనే
మేటి పారిశ్రామికా భద్రతా సంస్థ..
సిబ్బంది అందుకున్న పతకాలు, అవార్డులే
సి.ఐ.ఎస్.ఎఫ్. చిత్తశుద్ధికి, ధైర్య సాహసాలకు ప్రతీకలు..
354 కీలక ప్రాంతాల్లో, 1,64,000మంది సిబ్బందితో
భద్రతా విధుల్లో సి.ఐ.ఎస్.ఎఫ్. నిమగ్నం..
ఎంతో కీలకమైన 65 విమానాశ్రయాలు, ఓడరేవులు, అణు కేంద్రాలు, అంతరిక్ష సంస్థలు,
బొగ్గు, చమురు, ఉక్కు ఉత్పాదనా కేంద్రాలకు
సి.ఐ.ఎస్.ఎఫ్.తో భద్రత..
గత 22 ఏళ్లుగా దేశంలోని ప్రముఖ దేశీయ,
అంతర్జాతీయ విమానాశ్రయాల భద్రతను
సి.ఐ.ఎస్.ఎఫ్.కు అప్పగించడం అభినందనీయం...
సి.ఐ.ఎస్.ఎఫ్. బాధ్యత త్వరలోనే
మరింత పెరిగే అవకాశం..
మెట్రోరైలు వ్యవస్థ భద్రత కూడా
సి.ఐ.ఎస్.ఎఫ్.కే అప్పగింత..
ఢిల్లీ మెట్రో భద్రతలో సి.ఐ.ఎస్.ఎఫ్. కీలకపాత్ర
ఎంతో అభినందనీయం...
సి.ఐ.ఎస్.ఎఫ్.లో మహిళా సిబ్బంది నిష్పత్తి
పెంచేందుకు చర్యలు అవసరం..
జమ్ము కాశ్మీర్.నుంచి,
నక్సల్ ప్రభావిత ప్రాంతాలవరకూ
భద్రతా విధుల్లో అన్నిచోట్లా
సి.ఐ.ఎస్.ఎఫ్. పనితీరు అద్భుతం..
సి.ఎ.పి.ఎఫ్. ఆయుష్మాన్ భారత్ పథకం
సి.ఐ.ఎస్.ఎఫ్.లో 100శాతం అమలు భేష్!
గృహవసతి మెరుగుదలకు,
జవాన్ల ఇతర సంక్షేమ పథకాలకు
మరింత ప్రాధాన్యం అవసరం.
మొక్కలు నాటే కార్యక్రమంలో,.. 2020, 2021లో
పూర్తి లక్ష్యాలను సాధించిన సి.ఐ.ఎస్.ఎఫ్.
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సి.ఐ.ఎస్.ఎఫ్.) 53వ ఆవిర్భావ దినోత్సవం ఘజియాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోమ్, సహకారశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిబ్బంది కవాతు వందనాన్ని కేంద్ర హోమ్ మంత్రి స్వీకరించారు. విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి, విశేష సేవలందించిన సి.ఐ.ఎస్.ఎఫ్. జవాన్లకు పలు పతకాలను, అవార్డులను అమిత్ షా ప్రదానం చేశారు. 'సెంటినెల్'-2022 పేరిట ప్రచురించిన సి.ఐ.ఎస్.ఎఫ్. మ్యాగజైన్.ను ఆవిష్కరించారు. సి.ఐ.ఎస్.ఎఫ్. డైరెక్టర్ జనరల్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సి.ఎ.పి.ఎఫ్.) డైరెక్టర్ జనరల్, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు, సి.ఐ.ఎస్.ఎఫ్. అధికారులు, జవాన్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, దేశ పారిశ్రామికాభివృద్ధి యావత్తుకూ ఈ రోజు చాలా ప్రముఖమైన దినమని అన్నారు. 2.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లతో కూడిన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పయనంలో సి.ఐ.ఎస్.ఎఫ్. ఒక మౌన కర్మయోగిలా తన విశేష సేవలందిస్తూ వస్తోందని అన్నారు. సి.ఐ.ఎస్.ఎఫ్. సేవలు లేకుండానే, 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పయనాన్ని సాగించడం సాధ్యంకాదని ఆయన అన్నారు. భారతదేశపు పారిశ్రామికాభివృద్ధి, పారిశ్రామికోత్పత్తి సురక్షితంగా, సజావుగా సాగాలంటే ఒక ప్రత్యేక భద్రతా బలగం అవసరమని సి.ఐ.ఎస్.ఎఫ్. ఏర్పాటు చేసినపుడే ఎంతో ముందుచూపుతో ఊహించారని అన్నారు. ఆ దార్శనిక లక్ష్య సాధనకు సి.ఐ.ఎస్.ఎఫ్. శక్తివంచన లేకుండా పనిచేస్తూ వస్తోందని, ఈ నేపథ్యంలో జవాన్లనుంచి డైరెక్టర్ జనరల్ వరకూ యావత్తు సి.ఐ.ఎస్.ఎఫ్. సిబ్బందికీ తాను అభినందనలు తెలుపుతున్నానని అమిత్ షా పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తోటి భారతీయ పౌరులు కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వందేభారత్ అభియాన్ పథకం కింద స్వదేశం తిరిగివచ్చినపుడు ప్రతి విమానాశ్రయంలోనూ సి.ఐ.ఎస్.ఎఫ్. జవాను ఎంతో వినయంతో, ప్రేమానురాగాలతో స్వాగతం పలికేవారని ఆయన అన్నారు. తమ విధుల నిర్వహణలో ఎందరో సి.ఐ.ఎస్.ఎఫ్. జవాన్లు కోవిడ్ సోకి ప్రాణాలను కూడా కోల్పోయారన్నారు. వందే భారత్ పథకం అమలులో ముందువరుసలో నిలిచి ప్రజలకు సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వారికి, దేశ పారిశ్రామిక ఉత్పత్తి సజావుగా సాగించేలా చూస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశ ప్రజల తరఫున, యావత్ భద్రతాదళం దరఫున వారికి నివాళులర్పిస్తున్నానని ఆయన అన్నారు. “ఆపరేషన్ గంగా” పథకం ప్రస్తుతం కొనసాగుతోందని, యుద్ధపీడిత ఉక్రెయిన్ దేశంనుంచి స్వదేశానికి తిరిగివచ్చే మన విద్యార్థులకు సి.ఐ.ఎస్.ఎఫ్. సిబ్బంది స్వాగతం పలుకుతున్నారని ఆయన అన్నారు. నిర్దేశించిన లక్ష్యాల సాధనలో సి.ఐ.ఎస్.ఎఫ్. అన్ని విధాల శక్తివంచన లేకుండా కృషి చేస్తోందన్నారు. ప్రపంచంలో బహుముఖ నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలు కలిగిన విభిన్నమైన భద్రతా బలగం సి.ఐ.ఎస్.ఎఫ్. మాత్రమేనని అన్నారు. పూర్తిగా ప్రభుత్వ సిబ్బందితో ఎంతో శక్తి సామర్థ్యాలతో తమ విధులను నిర్వర్తించే విభిన్నమైన సుశిక్షిత దళం సి.ఐ.ఎస్.ఎఫ్. మాత్రమేనన్నారు.
సి.ఐ.ఎస్.ఎఫ్. సిబ్బంది సాధించిన అనేక పతకాలు, అవార్డులే సి.ఐ.ఎస్.ఎఫ్. సిబ్బంది చిత్తశుద్ధికి, దైర్యసాహసాలకు నిదర్శనాలుగా, ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 354 సున్నిత కీలక ప్రాంతాల్లో 1,64,000మంది సిబ్బందితో సి.ఐ.ఎస్.ఎఫ్. బాధ్యతలు నిర్వహిస్తోందని, భద్రతాపరంగా సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన 65 విమానాశ్రయాల్లో, ఓడరేవుల్లో, అణుశక్తి కేంద్రాల్లో, అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో, బొగ్గు, చమురు, ఉక్కు ఉత్పాదనా క్షేత్రాల్లో, సముద్ర తీరానికి సమీపంలో ఉన్న జలాల్లోని చమురు ఉత్పత్తి ప్లాంట్లలో సి.ఐ.ఎస్.ఎఫ్. తన విధులు నిర్వహిస్తోందని కేంద్రమంత్రి అన్నారు. గత 22 సంవత్సరాలుగా, భద్రతాపరంగా ఎంతో కీలకమైన జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రతా విధుల నిర్వహణ బాధ్యతను సి.ఐ.ఎస్.ఎఫ్.కు అప్పగించడం అభినందనీయమని అమిత్ షా అన్నారు. అతి తక్కువ వ్యవధిలోనే సి.ఐ.ఎస్.ఎఫ్. పరిధి, బాధ్యత మరింత విస్తృతం కాబోందని ఆయన అన్నారు.
దేశంలో తొలిసారిగా మెట్రో రైళ్ల వ్యవస్థను ప్రారంభించినపుడు ఆ వ్యవస్థ భద్రతను కూడా సి.ఐ.ఎస్.ఎఫ్.కు అప్పగించారని, లండన్ మెట్రోలో పేలుళ్లు జరిగిన సమయంలో ఈ చర్య తీసుకున్నారని ఆయన చెప్పారు. ఢిల్లీ మెట్రో వ్యవస్థను సజావుగా నిర్వహించడంలో సి.ఐ.ఎస్.ఎఫ్. పాత్ర ఎంతో అభినందనీయమని అన్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలన్నింటిలోకీ, సి.ఐ.ఎస్.ఎఫ్.లో మాత్రమే మహిళా సిబ్బంది సంఖ్యను పెంచడానికి వీలుంటుందని అన్నారు. ఎందుకంటే, విమానాశ్రయాల్లో, మెట్రో రైలు వ్యవస్థల్లో మహిళా ప్రయాణుకులకు సౌకర్యాలను ప్రతి రోజూ పెంచవలసి వస్తోందని ఆయన చెప్పారు. సి.ఐ.ఎస్.ఎఫ్.లో మహిళల నిష్పత్తిని 94:6నుంచి 80:20కి పెంచే విషయంలో ప్రత్యేకంగా ఆలోచించి, తగిన చర్యలు తీసుకోవాలని సి.ఐ.ఎస్.ఎఫ్. డైరెక్టర్ జనరల్.కు సూచిస్తున్నట్టు చెప్పారు. జమ్ము కాశ్మీర్.లోగానీ, లేదా మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో గానీ సి.ఐ.ఎస్.ఎఫ్.ను ఎక్కడ తరలించినా, సిబ్బంది ఎంతో మెరుగైన పనితీరును ప్రదర్శించారని, విధి నిర్వహణలో ఎన్నో ధైర్యసాహసాలను ప్రదర్శించారని ఆయన అన్నారు. సదరు విధుల్లో వారికి తగిన శిక్షణ లేకున్నా వారు తమ విధుల నిర్వహణలో ఎన్నోసార్లు తమ శక్తి సామర్థ్యాలను రుజువుచేసుకున్నారని కేంద్రమంత్రి అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ గా అమృత్ మహోత్సవ్ పేరిట ఈ సంవత్సరం వేడుకలు నిర్వహించుకుంటున్నామని, 75సంవత్సరాల స్వాతంత్ర్యం అంటే ఏ దేశానికైనా అది గొప్ప విజయమేనని అమిత్ షా అన్నారు. అమృత్ మహోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారని, స్వాతంత్ర్యంకోసం ప్రాణాలతో పాటుగా సర్వస్వం కోల్పోయిన యోధులను గురించి ప్రస్తుత యువతరానికి తెలియజెప్పడంతోపాటుగా, దేశం సాధించవలసిందేమిటో ఈ ఏడాదే తీర్మానించుకోవలసిన అవసరం ఉందని ప్రధాని భావించారని అమిత్ షా అన్నారు. 75 సంవత్సరాలనుంచి వందేళ్ల వరకూ నిర్దేశించుకున్న వ్యవధిని ప్రజలకు అమృత కాలంగా ప్రధానమంత్రి పేర్కొన్నారని అమిత్ షా తెలిపారు. ఈ కాలంలో మనం తీర్మానాలను కష్టపడి నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని అన్నారు.
సి.ఐ.ఎస్.ఎఫ్. ఇకపై కొత్త పరిణామాలను, సవాళ్లను ఎదుర్కొనబోతున్నదని కేంద్రమంత్రి అన్నారు,. ఆర్థిక వ్యవస్థను 2.5 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల స్థాయినుంచి 5 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల స్థాయికి చేర్చే పయనంలో దేశవ్యాప్తంగా తయారీ రంగంలో, ప్రైవేటు రంగంలో అనేక భారీ సంస్థలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోందని ఆయన అన్నారు. రక్షణ, అంతరిక్ష పరిశోధన డ్రోన్ల తయారీతోపాటుగా ప్రతి రంగంలోనూ ప్రైవేటు పారిశ్రామిక ఉత్పాదన పెరిగే అవకాశం ఉందని అన్నారు. దేశాన్ని స్వావలంబనతో తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సి.ఐ.ఎస్.ఎఫ్. ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను తయారుచేసుకోవాలని ఆయన అన్నారు. తదుపరి 25 సంవత్సరాల అవసరాలకు తగినట్టుగా సి.ఐ.ఎస్.ఎఫ్.ను రూపొందించడమే లక్ష్యంగా ప్రణాళిక ఉండాలన్నారు. దీనితో పాటుగా 25 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను కూడా తయారు చేయాలని ఆయన సూచించారు.
సి.ఐ.ఎస్.ఎఫ్.కు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించి లక్ష్యసాధనకు తగినట్టుగా శతాబ్ది సంవత్సరంలోగా సంస్థను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రైవేటు భద్రతా కార్యకలాపాలు దేశంలో వేగంగా పెరుగుతున్నాయని, అందుకోసం ప్రభుత్వం కూడా తగిన నిబంధనలను రూపొందించిందని ఆయన చెప్పారు. వారికి శిక్షణ ఇచ్చే బాధ్యతను, పారిశ్రామిక కేంద్రాలకు భద్రత కల్పించడంలో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను సి.ఐ.ఎస్.ఎఫ్. తీసుకోగలదా... ఈ అంశానికి సంబంధించి 1,000మంది సిబ్బందితో కూడిన ఉత్పాదనా కేంద్రాలతో, 5,000మంది, 10,000మందితో కూడిన సిబ్బందితో కూడిన ఉత్పాదనా కేంద్రాలను నమూనాలుగా తీసుకువి పరీక్షించాల్సి ఉందన్నారు. దీనికి తోడుగా, ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన భద్రతా నమూనాలను కూడా రూపొందించవచ్చని అమిత్ షా అన్నారు. ఇలాంటి ప్రక్రియల ద్వారా ప్రైవేటు భద్రతా ఏజెన్సీల సామర్థ్యాన్ని కూడా పెంచాల్సిన అసరం ఉందని, ఎందుకంటే, దేశంలోని మొత్తం పారిశ్రామిక రంగం భద్రతను సి.ఐ.ఎస్.ఎఫ్. మాత్రమే చూసుకోజాలదని ఆయన అభిప్రాయపడ్డారు.
సి.ఐ.ఎస్.ఎఫ్. రూపొందించిన వ్యూహం ఆధారంగా మనం సమ్మిళిత భద్రతా నమూనాను తయారు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రహోమ్ మంత్రి అన్నారు. మొదటగా, పూర్తి సమ్మిళిత పద్ధతిలో రూపొందించిన సంపూర్ణమైన బ్లూ ప్రింట్.ను తయారు చేయడం ద్వారా ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు, సి.ఐ.ఎస్.ఎఫ్.లతో కూడిన భద్రతను అందించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత క్రమేణా ఇదే భద్రతా వ్యవస్థను చివరకు ప్రైవేటు భద్రతా ఏజెన్సీలకే అప్పగించవచ్చని ఆయన అన్నారు. కొన్ని పారిశ్రామిక సంస్థల్లో ప్రైవేటు భద్రతా సంస్థలు పనిచేయాలని, ఈ విషయంలో సి.ఐ.ఎస్.ఎఫ్. తన ప్రమేయాన్ని మరింత వేగంగా పెంచాలని కేంద్రమంత్రి సూచించారు. మన సరిహద్దు ప్రాంతాలకు, పారిశ్రామిక కేంద్రాలకు డ్రోన్ల ముప్పు క్రమేపీ పెరుగుతున్నట్టుగా కనిపిస్తోందని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, సమస్య పరిష్కారానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.), సరిహద్దు భద్రతా దళం (బి.ఎస్.ఎఫ్.) వంటి సంస్థలతో కలసి సి.ఐ.ఎస్.ఎఫ్. పనిచేయాల్సి ఉందని ఆయన చెప్పారు. డ్రోన్ల వ్యతిరేక (యాంటీ డ్రోన్) నమూనాలు, డ్రోన్ల వ్యతిరేక (యాంటీ డ్రోన్) సాంకేతిక పరిజ్ఞానంపై డి.ఆర్.డి.ఒ., బి.ఎస్.ఎఫ్. ఇప్పటికే పనిచేస్తూ ఉన్నాయన్నారు. పారిశ్రామిక భద్రత లక్ష్యంగా వివిధ తయారీ కేంద్రాల భద్రతకోసం యాంటీ డ్రోన్ యూనిట్లను వినియోగింగలిగే సామర్థ్యాన్ని సి.ఐ.ఎస్.ఎఫ్.కు కల్పించే విషయంలో మనం మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
శిక్షణలో ముఖ్యమైన భాగాన్ని పూర్తి చేయడానికి సి.ఐ.ఎస్.ఎఫ్. మాత్రమే బాధ్యత వహించవలసి ఉంటుందని, దీనితో పాటుగా సైబర్-ఫిజికల్ వ్యవస్థతో కూడిన నమూనాను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సి.ఎ.పి.ఎఫ్.కు) ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 100శాతం వర్తింపజేయడంలో సి.ఐ.ఎస్.ఎఫ్. చేసిన కృషి అభినందనీయమని అమిత్ షా అన్నారు. ఇక జవాన్ల సంక్షేమానికి సంబంధించి గృహవసతి మెరుగుపరచడం, తదితర సంక్షేమ కార్యకలాపాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 2020, 2021 సంవత్సరాల్లో లక్ష్యాలకు మించిన రీతిలో మొక్కలు నాటే కార్యక్రమంలో సి.ఐ.ఎస్.ఎఫ్. పాల్గొందని ఆయన అన్నారు.
---సి.ఐ.ఎస్.ఎఫ్. లేనిదే దేశంలో పారిశ్రామిక భద్రత, పారిశ్రామిక ఉత్పత్తి శాంతియుతంగా, సజావుగా జరగబోదని నేను చెప్పగలను. రానున్న కాలాల్లో ఎదురయ్యే సవాళ్లను కూడా గుర్తించి, వాటిని ఎదుర్కొనేందుకు తగినట్టుగా మనం సన్నద్ధం కావలసిన అవసరం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, సి.ఐ.ఎస్.ఎఫ్. తన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇందుకోసం ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఆలాగే, దేశంలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ పరిణామానికి దీటుగా ముందుకు సాగేందుకు 25ఏళ్ల కార్యాచరణ ప్రణాళికనూ తయారుచేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఈ రెండు ప్రణాళికలనూ ఈ ఏడాదే సిద్ధంచేసుకోవాలి. సి.ఐ.ఎస్.ఎఫ్. మన దేశానికి ఎంతో గర్వకారణం. ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమైన దేశం, ప్రపంచం అభిప్రాయం కూడా ఇదే. మీ సేవలను మేం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.--అని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
***
(Release ID: 1803565)
Visitor Counter : 303