ఉప రాష్ట్రపతి సచివాలయం
దేశం విషయంలో అందరూ ఒక్కటి కావాలి – ఉపరాష్ట్రపతి
• మనల్ని మనం తక్కువ చేసుకునే ధోరణిని విడనాడాలి
• మన దేశ వైభవోపేతమైన వాస్తవ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముంది
• విదేశీ దండయాత్రలు, బ్రిటిషర్ల విధానాతో దేశం చాలా నష్టపోయింది
• అమెరికా యాత్రికుడు శ్రీ విల్ దురంత్ రాసిన ‘ద కేస్ ఫర్ ఇండియా’ తెలుగు అనువాదం ‘భారతదేశం పక్షాన’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
• బ్రిటీష్ చీకటి పాలనలో మన ప్రజలు ఎదుర్కొన్న దుస్థితిని నిజమైన దృష్టితో పరికించిన ఈ రచనను ప్రతి భారతీయుడూ చదవాలని సూచన
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2022 3:53PM by PIB Hyderabad
మనల్ని మనం తక్కువ చేసిన ధోరణిని పక్కన పెట్టి, దేశం కోసం అందరూ ఒక్కటై గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. పాశ్చాత్య దేశాల వారు, పాశ్చాత్య భావజాలంలో కూరుకు పోయిన కొంత మంది భారతదేశ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారని, అందుకే పెద్ద ఎత్తున దేశ వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితి ఆందోళనకరమని, దేశ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
అమెరికా యాత్రికుడు శ్రీ విల్ దురంత్ రాసిన ‘ద కేస్ ఫర్ ఇండియా’ పుస్తకం తెలుగు అనువాదం ‘భారతదేశం పక్షాన’ పుస్తకాన్ని బుధవారం విజయవాడలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి, అహింసలు భారతీయుల రక్తంలోనే ఉన్నాయని, మనపై జరిగిన దండయాత్రను ప్రతిఘటించడమే తప్ప మన బలప్రదర్శన కోసం ఇతరులను కవ్వించే వ్యక్తిత్వం భారతీయులది కాదన్నారు. ‘ప్రపంచానికి నాగరికత నేర్పిన వేదభూమి మన భారతదేశం. వసుధైవ కుటుంబ భావనతో ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా భావించి, అందరితో శాంతి, సోదర భావం కోరుకున్న దేశం మనది’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.
భారతదేశం నేటి వరకు ఏనాడూ విస్తరణ కాంక్షతో, సరిహద్దులను పెంచుకోవాలనే లక్ష్యంతో విదేశాలపై దండయాత్రలు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదన్న ఉపరాష్ట్రపతి, చరిత్రను తిరగేస్తే భారతదేశాన్ని దోచుకునేందుకే విదేశీ దండయాత్రలు జరిగిన విషయం స్పష్టంగా గమనించవచ్చన్నారు. విస్తరణ కాంక్ష లేనందునే భారతదేశం మొదట్నుంచి విశ్వశాంతి కోసం ప్రయత్నిస్తోందన్నారు. బయటి దేశాల్లో రంగు మొదలుకుని అనేక వివక్షలు కొనసాగుతుంటే, భారతదేశం మాత్రం ప్రజాస్వామ్య మార్గంలో శాంతియుతంగా ముందుకు సాగుతోందని తెలిపారు. భాష పేరుతో, ప్రాంతం పేరుతో వివిధ రకాలుగా ప్రజల్ని చీల్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, ప్రజలు వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఎంతో మంది విదేశీ యాత్రికుల భారతదేశం గురించి తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చారని, ఇందులో అమెరికాకు చెందిన శ్రీ విల్ దురంత్ కూడా ఒకరని ఉపరాష్ట్రపతి అన్నారు. ‘దేశంలోని నలు దిక్కులా పది, పన్నెండు నగరాలను సందర్శించిన ఆయన, గతంలో తాను విన్నవిధంగా భారతీయ సంపద, సంస్కృతీ సంప్రదాయాల ఘనత ఎక్కడా కనిపించక ఆశ్చర్యపోయిన విషయాన్ని ఈ మనకు పుస్తకం తెలియజేస్తుంది’ అని అన్నారు.
ఆంగ్లేయులు స్వేచ్ఛా ప్రియులని, మర్యాదస్తులని అప్పటి దాకా నమ్మిన శ్రీ విల్ దురంత్ భారతీయుల పట్ల ఆంగ్లేయులు వ్యవహరిస్తున్న తీరును చూసి విస్మయం చెందారన్నారు. తన పరిశోధనను పక్కన పెట్టి, ఒక మానవతావాదిగా నిర్భయంగా, నిజాయితీగా తను చూసిన భారతదేశ స్థితిగతులను వివరిస్తూ 1930లో ఈ పుస్తకాన్ని ప్రచురించిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ పుస్తకం చదివిన వారికి ఆశ్చర్యంతోపాటు బ్రిటీష్ వారు మన దేశాన్ని ఉద్ధరించారనుకుని భావిస్తున్న వారి బూజు పట్టిన అభిప్రాయాలు పటాపంచలు అవుతాయన్నారు.
న్యాయం చెయ్యమని ఎవరిని అడగాలో తెలియని స్థితిలో, అడగాలన్న స్పృహ కూడా లేని పరిస్థితులలో ఉన్న భారతీయులను చూసి రచయిత శ్రీ విల్ దురంత్ గారు నిశ్చేష్టులయ్యారంటేనే నాటి పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చన్నారు. ప్రతి భారతీయుడూ మరీ ముఖ్యంగా యువత ఈ పుస్తకాన్ని చదివి నిజాలను తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. భారతదేశ ఘనమైన చరిత్రను పాశ్చాత్యులు సృష్టించిన అసత్యాలు, అర్ధసత్యాలు దృష్టికోణంలో కాకుండా, నిజమైన భారతీయ దృష్టి కోణంలో తిరిగి లిఖించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత చక్కటి పుస్తకాన్ని అనువదించిన రచయిత్రి శ్రీమతి నాదెళ్ల అనురాధ గారిని, ప్రచురణకకర్త శ్రీ అశోక్ గారిని ఉపరాష్ట్రపతి అభినందించారు.
మన భాషను, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, మాతృభాషలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సూచించారు. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో సాగాలని, పరిపాలన, కోర్టు వ్యవహారాలు సైతం ఆయా భాషల్లో సాగించేందుకు చొరవ మరింత పెరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు భాషా సంఘం పూర్వ అధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, సిద్ధార్ధ అకాడమి అధ్యక్షులు డా. చదలవాడ నాగేశ్వరరావు, స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యదర్శి శ్రీ చుక్కపల్లి ప్రసాద్, అలకనంద ప్రచురణకర్త శ్రీ డి. అశోక్ కుమార్, రచయిత్రి శ్రీమతి నాదెళ్ళ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1802375)
సందర్శకుల సూచీ సంఖ్య : : 191