ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దృశ్య మాధ్యమం లో జరిగిన - భారత, యు.ఎ.ఇ. దేశాల సదస్సు

Posted On: 18 FEB 2022 8:00PM by PIB Hyderabad

గౌరవనీయులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు అబుదాబి రాజు గౌరవనీయులు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఈ ఉదయం దృశ్య మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు.  అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు నిరంతరంగా వృద్ధి చెందుతూ ఉండడం పట్ల ఇరువురు నేతలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.

"భారత, యు.ఏ.ఈ. దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడం : కొత్త సరిహద్దులు, కొత్త మైలురాయి" అనే శీర్షికతో గౌరవనీయులైన భారత  ప్రధాన మంత్రి మరియు అబుదాబి రాజు ఈ సందర్భంగా భవిష్యత్  ప్రణాళికతో కూడిన ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు  భారత, యు.ఏ.ఈ. దేశాల మధ్య భవిష్యత్తు-ఆధారిత భాగస్వామ్యం కోసం కేంద్రీకృత ప్రాంతాలు, ఫలితాలను గుర్తిస్తూ, ఈ ప్రకటన ఒక ప్రణాళికను తెలియజేస్తుంది.   ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, వాతావరణ చర్యలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, నైపుణ్యాలు, విద్య, ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ, భద్రత తో సహా విభిన్న రంగాల్లో నూతన వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణలను క్రియాశీలంగా ప్రోత్సహించడం ఈ భాగస్వామ్య లక్ష్యం.

భారత, యు.ఏ.ఈ. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సి.ఈ.పి.ఎ) పై, భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు యు.ఏ.ఈ. ఆర్థిక మంత్రి, గౌరవనీయులు అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి, సంతకం చేసి, గౌరవనీయులైన ఈ ఇద్దరు నాయకుల దృశ్య మాధ్యమ సమక్షంలో, ఒకరి కొకరు అందజేసుకోవడం అనేది దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన ఈ సదస్సు లో ఒక ప్రధానమైన అంశం.   ఈ ఒప్పందం -  భారత, యు.ఏ.ఈ. వ్యాపారాలకు మెరుగైన మార్కెట్ ను అందుబాటులోకి తీసుకువచ్చి, తగ్గిన సుంకాలతో సహా గణనీయమైన ప్రయోజనాలను కల్పిస్తుంది.  ప్రస్తుతం 60 బిలియన్ల అమెరికా డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, సి.ఈ.పి.ఎ. వచ్చే ఐదేళ్ళలో వంద బిలియన్ల అమెరికా డాలర్ల స్థాయికి పెంచుతుందని అంచనా. 

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరియు యు.ఏ.ఈ. 50వ వ్యవస్థాపక వార్షికోత్సవం సందర్భంగా ఇరువురు నేతలు ఒక సంయుక్త స్మారక స్టాంపు ను కూడా విడుదల చేశారు.  ఈ సదస్సు సందర్భంగా భారత, యు.ఏ.ఈ. దేశాలకు చెందిన సంస్థలు సంతకం చేసిన రెండు ఎం.ఓ.యు. లను కూడా ప్రకటించారు.  అందులో ఒకటి -  ఏ.పి.ఈ.డి.ఏ. మరియు డి.పి. వరల్డ్ & అల్ దహ్రా మధ్య ఆహార భద్రతా కారిడార్ ఏర్పాటుకు సంబందించిన ఎం.ఓ.యు. కాగా;  రెండోది - భారతదేశానికి చెందిన గిఫ్ట్ సిటీ మరియు అబుదాబి గ్లోబల్ మార్కెట్ మధ్య ఆర్థిక ప్రాజెక్టులు, సేవలలో సహకారానికి సంబంధించిన ఎం.ఓ.యు.  వీటితో పాటు, వాతావరణ చర్యల పై సహకారానికి సంబంధించి ఒకటి; విద్యకు సంబంధించి ఒకటి చొప్పున ఇరుపక్షాలు మరో రెండు ఎం.ఓ.యు. లపై కూడా సంతకాలు చేశాయి. 

కోవిడ్ మహమ్మారి సమయంలో భారతీయ సమాజాన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు అబుదాబి రాజుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.  త్వరలో భారతదేశాన్ని సందర్శించవలసిందిగా కూడా ప్రధానమంత్రి ఆయనను ఆహ్వానించారు.

*****


(Release ID: 1799705) Visitor Counter : 213