వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

తోళ్ల పారిశ్రామిక రంగం అభివృద్ధికి రూ. 1,700కోట్ల పెట్టుబడి!


-ఐ.ఎఫ్.ఎల్.డి.పి. కొనసాగింపునకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం-

సుస్థిర సాంకేతికతకు, పర్యావరణ రక్షణకు మరింత ప్రోత్సాహం..

తోళ్ల పారిశ్రామిక రంగం సమీకృత అభివృద్ధిపై మరింత నిశితంగా దృష్టి...

స్వదేశీ మార్కెట్, ఎగుమతి అవసరాలకుతగినట్టుగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు...

ఐ.ఎఫ్.ఎల్.డి.పి. కింద రూపుదిద్దుకోనున్న10 భారతీయ ఫుట్.వేర్ డిజైన్ స్టూడియోలు..

భారతీయ బ్రాండ్ల ప్రోత్సాహానికి మరింత ప్రాధాన్యం..


ఐ.ఎఫ్.ఎల్.డి.పి. కింద మూడేళ్లలో 3.24లక్షల మందికి నైపుణ్య శిక్షణ

Posted On: 05 FEB 2022 6:30PM by PIB Hyderabad

   భారతీయ పాదరక్షలు, తోలు పారిశ్రామిక రంగం అభివృద్ధి కార్యక్రమాన్ని (ఐ.ఎఫ్.ఎల్.డి.పి.ని) 2021-22వ సంవత్సరంనుంచి కొనసాగించేందుకు రూ. 1,700కోట్ల పెట్టుబడితో ఆమోదం లభించింది. ఇదివరకు ఈ కార్యక్రమాన్ని భారతీయ పాదరక్షలు, తోలు అనుబంధ వస్తువుల అభివృద్ధి కార్యక్రమంగా (ఐ.ఎఫ్.ఎల్.ఎ.డి.పి.గా) దీన్ని పేర్కొనే వారు. ఐ.ఎఫ్.ఎల్.డి.పి. కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గం గత నెల 19వ తేదీన ఆమోదం తెలిపింది.

 తోళ్ల పారిశ్రామిక రంగానికి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, తోళ్ల పారిశ్రామిక రంగం కారణంగా ఎదురయ్యే పర్యావరణపరమైన సమస్యలకు పరిష్కారం, ఉద్యోగాలు, ఉపాధి కల్పన, ఉత్పాదన పెంపుదల వంటి పలు లక్ష్యాలతో ఐ.ఎఫ్.ఎల్.డి.పి.ని చేపట్టారు.

ఐ.ఎఫ్.ఎల్.డి.పి. కింద ఈ కింద పేర్కొన్న ఉపపథకాలకు 2021-26 కాలానికిగాను ఆమోదం లభించింది:-

  1. సుస్థిర సాంకేతికత, పర్యావరణ రక్షణకు ప్రోత్సాహం (ప్రతిపాదిత పెట్టుబడి రూ. 500కోట్లు):- దీనికి కింద ఏర్పాటు చేసే ప్రతి కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం ప్రత్యేక సంస్థను (స్పెషల్ పర్పస్ వెహికిల్.ను) ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థ కింద దేశంలోని వాయవ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్లాంట్.కు అయితే, మొత్తం వ్యయంలో 80శాతాన్ని సహాయంగా అందిస్తారు. లబ్ధిదారు లేదా సంబంధిత పరిశ్రమ మాత్రం 20శాతం ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో అయితే, స్పెషల్ పర్పస్ వెహికిల్ ద్వారా 70శాతం వ్యయాన్ని సహాయంగా అందిస్తారు. లబ్ధిదారు, లేదా సంబంధిత పరిశ్రమ 30శాతం భరించాల్సి ఉంటుంది. అయితే, మొత్తం ప్రాజెక్టు వ్యయం పరిమితి రూ. 200కోట్లను మించరాదు.
  2. తోళ్ల పారిశ్రామిక రంగం సమగ్ర అభివృద్ధి (ఐ.డి.ఎల్.ఎస్.) ఉప పథకం (ప్రతిపాదిత పెట్టుబడి రూ. 500కోట్లు):- ఈ ఉపపథకం కింద 2020వ సంవత్సరం జనవరి ఒకటవ తేదీన లేదా ఆ తర్వాత వివిధ రంగాలవారీ యూనిట్లు చేపట్టే అధునికీకరణ, సామర్థ్యాల విస్తరణ, సాంకేతిక పరిజ్ఞాన నవీకరణ కార్యక్రమాలకోసం సహాయం అందిస్తారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎం.ఎస్.ఎం.ఇ.లకు) అయితే 30శాతం, ఇతర కేటరిగీ యూనిట్లకైతే 20శాతం చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఇక ఈశాన్య ప్రాంతాల్లో ఎం.ఎస్.ఎం.ఇ.లకు ప్లాంటు వ్యయంలో 40శాతం మొత్తంగా ఆర్థిక సహాయాన్ని ఇతరయూనిట్లకు 30శాతం వ్యయాన్ని అందిస్తారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటైన ప్లాంటుకైతే అదనంగా 5శాతం ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. గరిష్టంగా మొత్తం రూ. 15కోట్ల వరకూ ఈ సహాయం అందుతుంది.
  3. సంస్థాగత సదుపాయాల ఏర్పాటు (ప్రతిపాదిత పెట్టుబడి రూ. 200కోట్లు):- ఈ పథకం కింద అంతర్జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణా కేంద్రం, క్రీడా సముదాయం, సంప్రదాయ విద్యుద్దీపాల స్థానంలో ఎల్.ఇ.డి. విద్యుద్దీపాల ఏర్పాటు, పాదరక్షల నమూనా, అభివృద్ధి సంస్థల (ఎఫ్.డి.డి.ఐ.ల) ఆవరణల్లో బాలికల హాస్టల్ నిర్మాణం చేపట్టడం, తదితర పనులను ప్రతిపాదించారు.
  4. మెగా లెదర్ ఫుట్.వేర్, యాక్సెసరీస్ క్లస్టర్ల అభివృద్ధి (ఎం.ఎల్.ఎఫ్.ఎ.సి.డి.) ఉపపథకం (ప్రతిపాదిత పెట్టుబడి రూ. 300కోట్లు):- ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, తోళ్ల పరిశ్రమ, పాదరక్షల తయారీ రంగం వాణిజ్య అవసరాలకు, అలాగే స్వదేశీ మార్కెట్ అవసరాలకు, ఎగుమతుల అవసరాలకు తగినట్టుగా ఉత్పాదన వ్యవస్థలను సమీకృతం చేయడం వంటి లక్ష్యాలతో ఈ ఉపపథకం రూపొందించారు. ఈ కార్యక్రమం కింద ప్రాజెక్టు వ్యయంలో 50శాతాన్ని క్రమానుగతంగా అందిస్తారు. ఈశాన్య ప్రాంతాల్లో అయితే, ప్రాజెక్టు వ్యయంలో 70శాతాన్ని సహాయంగా అందిస్తారు. భూమి అభివృద్ధి, కీలకమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, మానవ వనరుల అభివృద్ధి (హెచ్.ఆర్.డి.), సామాజిక మౌలిక సదుపాయాలు, ఉత్పాదనా సదుపాయాలు వంటి అంశాల ప్రాతిపదికపై ఈ సహాయం అందిస్తారు. సత్వర ప్రాతిపదికన వినియోగించుకోవడానికి వీలుగా ఉన్న షెడ్లు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయం, పరిశోధన అభివృద్ధి పరమైన మద్దతు, ఎగుమతి సేవలు వంటి వాటికోసం ఈ సహాయం అందిస్తారు.  భూమి ఖర్చు వ్యయాన్ని మినహాయించి, రూ. 125కోట్ల పరిమితికి మించకుండా ప్రభుత్వం ఈ సహాయాన్ని అందిస్తుంది.
  5. తోళ్ల పరిశ్రమ, పాదరక్షల తయారీ రంగంలో భారతీయ బ్రాండ్లకు ప్రోత్సాహం (ప్రతిపాదిత పెట్టుబడి రూ. 100కోట్లు):- రానున్న మూడేళ్లలో పది భారతీయ బ్రాండ్లకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఈ ఉప పథకాన్ని ప్రతిపాదించారు. ఒక్కో బ్రాండుకు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 50శాతం చొప్పున భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో బ్రాండుకు రూ. 10కోట్ల రూపాయల చొప్పున పరిమితిని మించకుండా ఈ సహాయం అందిస్తారు. ఈ ఉప పథకాన్ని అమలు చేసే అధీకృత ఏజెన్సీని వివిధ సంస్థలనుంచి ఎంపిక చేయాలని ప్రతిపాదించారు. నేషనల్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్.ఐ.డి.), నేషనల్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్.ఐ.ఎఫ్.టి.), ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐ.బి.ఇ.ఎఫ్.), ఇండియన్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఐ.ఐ.ఎఫ్.టి.), లేదా ఇదే స్థాయి ఇతర సంస్థలనుంచి అధీకృత ఏజెన్సీలను ఎంపిక చేస్తారు.
  6. నమూనా రూపకల్పన స్టూడియోల అభివృద్ధి (ప్రతిపాదిత పెట్టుబడి రూ. 100కోట్లు):-ఇది కొత్త ఉపపథకం. దీని కింద పది భారతీయ డిజైన్ స్టూడియోల అభివృద్ధికోసం సహాయం అందిస్తారు. మార్కెటింగ్/ఎగుమతుల అనుసంధానం, కొనుగోలుదారు-విక్రేతల సమావేశాలకు ఏర్పాట్లు, అంతర్జాతీయ కొనుగోలుదార్లకోసం డిజైన్ల ప్రదర్శన వంటి కార్యకలాపాలను ఈ స్టూడియోలు చేపడతాయి. వివిధ వాణిజ్య ప్రదర్శనలకు అనుసంధాన కర్తలుగా పనిచేస్తాయి.  పలు రకాల విస్తృత సేవలందించే ‘వన్ స్టాప్-షాప్' కేంద్రాలుగా ఈ డిజైన్ స్టూడియోలు పనిచేస్తాయి: నమూనా రూపకల్పన, సాంకేతిక సహాయం, నాణ్యతా నియంత్రణ తదితర సేవలను ఇవి అందిస్తాయి. ఈ కార్యకలాపాలను అమలు చేసే సంస్థలుగా ఎఫ్.డి.డి.ఐ., సి.ఎల్.ఆర్.ఐ., ఎన్.ఐ.డి., ఎన్.ఐ.ఎఫ్.టి., ఐ.బి.ఇ.ఎఫ్., ఐ.ఐ.ఎఫ్.టి.లతో పాటుగా, ఇదే స్థాయి సంస్థలు వ్యవహరిస్తాయి. ఈ కార్యక్రమాల అమలుకోసం ఏదైనా, భారీస్థాయి పారిశ్రామిక సంస్థ, లేదా పారిశ్రామిక గ్రూపులు కూడా ఏజెన్సీలుగా పనిచేస్తాయి.

ఇదివరకటి ఐ.ఎఫ్.ఎల్.ఎ.డి.పి. విజయాలు 2017-21

  ఇదివరకటి ఐ.ఎఫ్.ఎల్.ఎ.డి.పి. కింద, ఉపపథకాల వారీగా చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలను (ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు) ఈ దిగువన చూడవచ్చు.:-

 (ఎ) 2017-18నుంచి 2019-20 వరకూ మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా ఒక ఉప పథకాన్ని అమలు చేశారు. ఈ కార్యక్రమం కింద 3,24,722 మంది నిరుద్యోగులకు ప్రాథమిక నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఇప్పించారు. ఆలా శిక్షణ పొందిన 2,60,880మందికి తోళ్ల పరిశ్రమ, పాదరక్షల తయారీ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించారు. 2019-20వ సంవత్సరంలో 1,2947మంది కార్మికులకు నైపుణ్యాల నవీకరణలో శిక్షణ ఇచ్చారు. ఇక కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కారణంగా 2020-21వ సంవత్సరంలో ఎలాంటి శిక్షణా నిర్వహించలేకపోయారు.

 (బి) 2017-18నుంచి 2020-21వరకూ తోళ్ల పారిశ్రామిక రంగం సమీకృత అభివృద్ధి...ఈ ఉప పథకం కింద, తోళ్ల పారిశ్రామిక రంగం, పాదరక్షల తయారీలో రంగంలోని 714 యూనిట్ల ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞాన నవీకరణకోసం రూ. 307.84 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని అందించారు.

  (సి) మెగా లెదర్ ఫుట్.వేర్-యాక్సెసరీస్ క్లస్టర్ల ఉప పథకం- కోల్కతా నగరంలోని లెదర్ కాంప్లెక్స్.లో మెగా లెదర్ ఫుట్.వేర్-యాక్సెసరీస్ క్లస్టర్ (ఎం.ఎల్.ఎఫ్.ఎ.సి.) ఏర్పాటు కోసం రూ. 178.84 కోట్ల రూపాయల ప్రాజెక్టుకును తోళ్ల పారిశ్రామిక విభాగం ఆమోదించింది. భారత ప్రభుత్వం నుంచి, రూ. 89.42కోట్ల సహాయం అందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం,.. కాన్పూర్ నగర్.లో ఉన్న రమాయి పూర్.లో ఎం.ఎల్.ఎఫ్.ఎ.సి. ఏర్పాటుకోసం తాత్కాలిక ప్రాతిపదికన ప్రతిపాదించిన రూ. 451కోట్ల ప్రాజెక్టుకు ‘సూత్రప్రాయంగా’ ఆమోదం ఇప్పటికే లభించింది.

  (డి) లెదర్ టెక్నాలజీ ఆవిష్కరణ-పర్యావరణ అంశాల ఉపపథకం-ఈ ఉప పథకం కింద,.. తమిళనాడులోని దిండిగల్, రాణీపేట, అంబూరు, వణియంబాడి, వేలూరు, పల్లవరం, తిరుచ్చి, ఈరోడ్ జిల్లాల్లో, పంజాబ్ లోని జలంధర్ జిల్లాలో, కోల్కతాలోని బంటాలా ప్రాంతంలో మొత్తం 12 కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (సి.ఇ.టి.పి.ల) నిర్మాణానికి ఆమోదం లభించింది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం, పది సి.ఇ.టి.పి. ప్రాజెక్టులకు రూ. 132కోట్ల ఆర్థిక సహాయం విడుదలైంది. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ. 284కోట్ల మేర సహాయాన్ని భారత ప్రభుత్వం అందిస్తోంది. రానున్న సంవత్సరాల్లో మిగిలిన రూ. 152కోట్లు విడుదల అవుతుంది.

   (ఇ) సంస్థాగత సదుపాయాల ఏర్పాటుకు ఉపపథకం- నోయిడా, చెన్నై, హైదరాబాద్, జోధపూర్, పాట్నా, కోల్కతా, రోహ్తక్ ప్రాంతాల్లోని 7 పాదరక్షల నమూనా-అభివృద్ధి సంస్థ (ఎఫ్.డి.డి.ఐ.)ల ఆవరణలను రూ. 129.62కోట్ల వ్యయంతో ప్రతిభా కేంద్రాలుగా (సి.ఒ.ఇ.లుగా) తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఉప పథకాన్ని ఆమోదించారు. ప్రాజెక్టు వ్వయంలో 30శాతం ఆర్థిక సహాయానికి సంబంధించి మొదటి విడతగా రూ. 38.88కోట్ల నిధులను ఎఫ్.డి.డి.ఎ.కి విడుదల చేశారు. మిగిలిన రూ. 90.76కోట్ల మొత్తాన్ని రానున్న సంవత్సరాల్లో విడుదల చేస్తారు.

  (ఎఫ్) తోళ్ల పారిశ్రామిక రంగం, పాదరక్షల తయారీలో భారతీయ బ్రాండ్లకు ప్రోత్సాహం-ఆర్థిక సహాయం కోసం ఐదు దరఖాస్తులు తోళ్ల పారిశ్రామికాభివృద్ధి శాఖకు అందాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల పరిణామ ప్రక్రియకు సంబంధించి ‘అధీకృత ఏజెన్సీ’ నియామకం ఇంకా జరగలేదు. మార్గదర్శక సూత్రాల్లో ఎలాంటి ప్రత్యేకమైన పద్ధతిని ప్రస్తావించకపోవడమే ఇందుకు కారణం. అందుకే ఈ పథకం విషయంలో ఇంకా ముందడుగు పడలేదు.

   (జి) తోలు పారిశ్రామిక రంగం, పాదరక్షలు, అనుబంధ ఉత్పత్తుల తయారీ రంగంలో అదనపు ఉపాధి కల్పనా ప్రోత్సాహక ఉప పథకం- ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకోసం ఆన్.లైన్ పోర్టల్.ను ప్రారంభించారు. ఈ ఉప పథకం కింద అధీకృత ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఎఫ్.డి.డి.ఐ.కి, ఇప్పటివరకూ మొత్తం 48 దరఖాస్తులు అందాయి. ఆర్హత కలిగిన 48 యూనిట్ల దరఖాస్తులను భౌతికంగా పరిశీలించిన అనంతరం రూ. 92,27,971/-తో రీ ఇంబర్స్ మెంట్ మొత్తాన్ని సంబంధిత ఎఫ్.డి.డి.ఐ.కి. విడుదల చేశారు.

 

ఐ.ఎఫ్.ఎల్.ఎ.డి.పి. ప్రభావం

  నాణ్యమైన ఉపాధి కల్పనపై.., ప్రత్యేకించి మహిళలకు ఉపాధి కల్పనపై ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రభావం చూపించింది. నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమను మరింత పర్యావరణహితంగా రూపొందించడం, సుస్థిర ఉత్పాదనా వ్యవస్థను ప్రోత్సహించడం వంటి అంశాలను కూడా ఈ కార్యక్రమం ప్రభావితం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తోళ్ల పారిశ్రామిక యూనిట్ల క్లస్టర్లకు ఈ పథకంతో పలు రకాల ప్రయోజనాలు సమకూరాయి. పేదరికం తగ్గడం, లైంగిక సమానత్వం, ఆయా రంగాలవారీగా నైపుణ్యాభివృద్ధి, విద్యా సదుపాయం వంటి అంశాల్లో ప్రయోజనం చేకూరింది. దీనితో అనేక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అందుకోవడానికి అవకాశం ఏర్పడింది. చాలావరకు జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సమీకృతం అయ్యాయి. ఆర్థిక ప్రగతి, పేదరికం తగ్గుదల, ఉపాధి కల్పన, నాణ్యమైన విద్య/నైపుణ్యాలు, స్త్రీ-పురుష సమానత్వం, మంచి ఆరోగ్యం, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అందుబాటు యోగ్యమైన, స్వచ్ఛ ఇంధనం, పర్యావరణ హితమైన ఇతర ప్రయోజనాలన్నీ ఐ.ఎఫ్.ఎల్.ఎ.డి. కార్యక్రమం వల్ల సాధ్యమయ్యాయి.

 

****



(Release ID: 1796005) Visitor Counter : 213