మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సవరించిన పి.ఎం.ఎం.వి.వై. లో భర్త ఆధార్ తప్పనిసరి కాదు
प्रविष्टि तिथि:
02 FEB 2022 5:04PM by PIB Hyderabad
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రాయోజిత ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పి.ఎం.ఎం.వి.వై) ని అమలు చేస్తోంది. ఈ పధకం కింద గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు (పి.డబ్ల్యూ. & ఎల్.ఎం) కొన్ని షరతులకు లోబడి, మొదటి సంతానం కోసం 5,000 రూపాయల మేర ప్రసూతి ప్రయోజనాన్ని, మూడు విడతలుగా అందజేయడం జరుగుతోంది. పి.ఎం.ఎం.వి.వై. కింద ప్రసూతి ప్రయోజనాన్ని పొందేందుకు, లబ్ధిపొందుతున్న మహిళ, ఆమె భర్త, డేటా-బేస్ లో పొందుపరచిన ఆధార్ వివరాలను అందజేయవలసి ఉంటుంది.
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న తల్లి లేదా గర్భిణీ స్త్రీలకు ఉద్దేశించిన ఇతర పథకాల క్రింద అలాంటి అవసరం లేదు.
ఒడిశా మరియు తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో, పి.ఎం.ఎం.వి.వై. అమలవుతోంది. కాలానుగుణంగా వలస వచ్చినవారు ఈ పథకాన్ని అమలు చేస్తున్న ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుంచి అయినా ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు.
అదే విధంగా, ఈ పథకం కింద ప్రసూతి ప్రయోజనాల కోసం పేరు నమోదు చేసుకునే సమయంలో, ఆ మహిళ, ఆమె భర్తతో పాటు తన యొక్క వ్రాతపూర్వక సమ్మతిని సమర్పించాల్సి ఉంటుంది.
నీతీ ఆయోగ్ కు చెందిన అభివృద్ధి మరియు పర్యవేక్షణ మూల్యాంకన కార్యాలయం, పి.ఎం.ఎం.వి.వై. తో సహా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలను, మూల్యాంకనం చేసి, సమర్పించిన సిఫార్సులను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. తదనుగుణంగా, ఒంటరి తల్లి మరియు విడిచిపెట్టబడిన తల్లి కి ప్రయోజనం కల్పించడానికి వీలుగా మిషన్ శక్తి కింద, పి.ఎం.ఎం.వి.వై. కి సంబంధించినంత వరకు సవరించిన మార్గదర్శకాలలో భర్త యొక్క వ్రాతపూర్వక సమ్మతి మరియు ఆధార్ తప్పనిసరి ప్రమాణాలుగా పరిగణించకూడదు.
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(रिलीज़ आईडी: 1794928)
आगंतुक पटल : 156