యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

రూ. 1575 కోట్లతో జాతీయ క్రీడా సమాఖ్యల సహాయ పథకం కొనసాగింపుకు ప్రభుత్వ ఆమోదం


ఈ పథకం కొనసాగింపుతో క్రీడారంగంలో ఘనత సాధించాలన్న దేశ ఆకాంక్షకు ఊతం లభిస్తుంది: శ్రీ అనురాగ్ ఠాకూర్

Posted On: 02 FEB 2022 7:50PM by PIB Hyderabad

భారతదేశంలో క్రీడలకు మరింత అండగా నిలబడుతూ  కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా సమాఖ్యలకు ఆర్థిక సహాయాన్నిచ్చే పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం 2021-22 నుంచి 2025-26 వరకు 15 వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 1575 కోట్ల బడ్జెట్  కేటాయించింది.   జాతీయ క్రీడా సమాఖ్యలకు ఇచ్చే ఈ ఆర్థిక సహాయ పథకం అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సమాయత్తం కావటానికి ఈ పథకం సహాయకారిగా ఉంటుంది. ఇందులో ఇలంపిక్స్, పారా ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్, పారా ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఇతర  ప్రధానమైన అంతర్జాతీయ టోర్నమెంట్స్ ఉన్నాయి.

ఈ పథకం కొనసాగించటానికి ఆమోదం తెలియజేసినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి, ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు యువజన వ్యవవహారాలు, క్రీడల శాఖామంత్రి శ్రీ అనురాగ్  ఠాకూర్ ధన్యవాదాలు తెలియజేశారు. క్రీడారంగంలో గర్వంగా నిలబడాలన్న దేశ ఆకాంక్షలకు ఇది అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఈ విధంగా క్రీడాసమాఖ్యలకు కేటాయించిన ఈ మొత్తాన్ని 2022-26 మధ్య కాలంలో జరిగే  జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనటానికి వీలుగా క్రీడాకారులకు శిక్షణ ఇవ్వటానికి వినియోగిస్తారు. అందులో ముఖ్యమైనవి  2022 లో జరిగే కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్  2024 లో జరిగే ఒలంపిక్స్, పారాలింపిక్స్, 2026 లో జరిగే ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్.  

ఈ పథకం ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ అందించే ఆర్థిక సహాయాన్ని జాతీయ క్రీడా సమాఖ్యలు జాతీయ శిక్షణాశిబిరాలు నిర్వహించటానికి, క్రీడాపరికరాలు కొనటానికి, క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి కోచింగ్ ఇప్పించటానికి, క్రీడాకారుల పనితీరుమీద డేటా విశ్లేషణకు, స్పోర్ట్స్ సైన్స్ సాయం, గాయపడిన క్రీడాకారులు కోలుకోవటానికి సాయం, విదేశీ కోచ్ ల నియామకం, ఈ సమాఖ్యలలో వృత్తినైపుణ్యంతో కూడిన  యాజమాన్య వ్యవస్థ ఏర్పాటుకు వెచ్చిస్తారు.

అత్యంత నిపుణులైన క్రీడాకారులకు ఈ సమాఖ్యల ద్వారా అండగా నిలవటంతోబాటుగా ప్రతిభాగల క్రీడాకారులను గుర్తించి వారికి అన్నివిధాలా ప్రోత్సాహం ఇవ్వటం కూడా ప్రధానమైన విషయం. అప్పుడే క్రీడల పరంగా భారత్ ఒక శక్తిమంతమైన దేశంగా ఎదిగి పోటీలో నిలబడగలుగుతుంది. 

ఈ పథకం ద్వారా జాతీయ క్రీడా సమాఖ్యలకు అండగా నిలబడటం వలన గత కొన్నేళ్ళుగా అద్భుత ఫలితాలు కనబడుతూ వస్తున్నాయి. భారత్ 2020 టోక్యో ఒలంపిక్స్ లో 6 విభాగాలలో 7 పతకాలు సాధించింది. ఇది దేశానికి వచ్చిన అత్యధిక పతకాల సంఖ్య. 2020 టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు 19 పతకాలు రావటం వల్ల ఇంతకు ముందు అన్ని పారాలింపిక్స్ లోనూ ఉమ్మడిగా సాధించిన మొత్తం 12 పతకాలకంటే అత్యధిక ప్రతిభ కనబరచినట్టయింది. భారత్ కు కామన్వెల్త్ గేమ్స్ లో 2018 లో 66 పతకాలు వచ్చాయి. 2018 ఏషియన్ గేమ్స్ లో అత్యధికంగా వచ్చిన 69 పతకాలు భారత్ కు వచ్చిన పతకాల్లో చాలా ఎక్కువ. 2018 పారా ఏషియన్ గేమ్స్ లో 72 పతకాలు రావటం మరో రికార్డు కాగా యూత్ ఒలంపిక్స్ గేమ్స్ లో 13 పతకాలు లభించాయి.

*******

 



(Release ID: 1794921) Visitor Counter : 138


Read this release in: English , Urdu , Hindi , Punjabi