ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఐదు తూర్పు రాష్ట్రాల్లో కోవిడ్-19 నివారణకు ప్రజారోగ్య సంసిద్ధత తో పాటు, జాతీయ కోవిడ్-19 టీకాల కార్యక్రమ పురోగతిని సమీక్షించిన - డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


కోవిడ్‌ కి వ్యతిరేకంగా పోరాటం అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రయత్నం; ఉమ్మడి బాధ్యత: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

“మహమ్మారి ముగియలేదు; మనం ‘అప్రమత్తం’గా ఉండాలి మరియు మన రక్షణను తగ్గించుకోకూడదు”;


ఈ.సి.ఆర్. పి-II నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్రాలకు సూచించడం జరిగింది; 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయడం; పరీక్షలను పెంచడం, వైద్యపరమైన మౌలిక సదుపాయాలను పెంచడం; టెలి-కన్సల్టేషన్‌ పై దృష్టి పెట్టడం జరిగింది;

Posted On: 29 JAN 2022 6:25PM by PIB Hyderabad

"కోవిడ్ కి వ్యతిరేకంగా పోరాటం అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రయత్నం, ఉమ్మడి బాధ్యత.  మనం ఈ ప్రజారోగ్య సవాలును సహకార స్ఫూర్తితో ఎదుర్కొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.". అని, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.   ఆయన, ఈ రోజు, ఐదు తూర్పు రాష్ట్రాలు, ఒడిశా, బీహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఆరోగ్య మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు  / అదనపు ముఖ్య కార్యదర్శులు; సమాచార కమీషనర్లతో దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించారు.  కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమక్షంలో దృశ్య మాధ్యమం ద్వారా ఈ సమావేశం జరిగింది. కోవిడ్ నియంత్రణ, నిర్వహణలతో పాటు, జాతీయ కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమానికి సంబంధించిన ప్రచారం పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు.   ఈ కార్యక్రమంలో నీతీ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె. పాల్ కూడా పాల్గొన్నారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయా రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య మంత్రుల్లో శ్రీ బన్నా గుప్తా (జార్ఖండ్); శ్రీ టి.ఎస్.సింగ్ డియో (ఛత్తీస్‌గఢ్); శ్రీ మంగళ్ పాండే (బీహార్) ఉన్నారు.  కోవిడ్ మహమ్మారి నిర్వహణకు భారత ప్రభుత్వం నుండి నిరంతర మద్దతు లభిస్తున్నందుకు కేంద్ర ఆరోగ్య మంత్రికి, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు ఏకగ్రీవంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ,  కోవిడ్ వేరియంట్ల తో సంబంధం లేకుండా, "టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్ తో పాటు కోవిడ్ సముచిత ప్రవర్తనకు కట్టుబడి ఉండటం"  అనేది - కోవిడ్ నిర్వహణ కోసం పరీక్షించబడిన వ్యూహంగా కొనసాగుతోందని, పేర్కొన్నారు.  "చాలా రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు మరియు సానుకూలత రేటు గత రెండు వారాల్లో తగ్గినప్పటికీ, మనం ఇంకా సతార్క్ (అప్రమత్తంగా) ఉండాలి. మన రక్షణను తగ్గించుకోకూడదు" అని ఆయన సూచించారు.  చాలా రాష్ట్రాలు ఆర్.టి-పి.సి.ఆర్. పరీక్షలు చాలా తక్కువ సంఖ్యలో చేస్తున్నందువల్ల, రోజువారీ ప్రాతిపదికన కేసుల పాజిటివిటీ రేటును పర్యవేక్షించడం తో పాటు ఆర్.టి-పి.సి.ఆర్. పరీక్షల సంఖ్యను పెంచాలని ఆయన కోరారు.  అదేవిధంగా ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్యను,  మరణాల సంఖ్యను నిశితంగా పరిశీలించాలని కూడా ఆయన రాష్ట్రాలకు సూచించారు.  "ఆసుపత్రుల్లో చేరిన కేసులు, మరణాల సంఖ్యతో పాటు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందుతున్న వారిలో టీకాలు వేయించుకున్న వారు, టీకాలు వేయించుకోని వారి నిష్పత్తిని రాష్ట్ర స్థాయిలో విశ్లేషించడం చాలా ముఖ్యం" అని ఆయన వారికి సలహా ఇచ్చారు.

ఇప్పటికే ఉన్న ఆరోగ్య పరిరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు, అవసరాన్ని బట్టి కొత్త సదుపాయాలను ఏర్పాటు చేసుకోడానికి ఈ.సి.ఆర్.పి-II నిధులను పూర్తిగా, సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, కేంద్ర ఆరోగ్య మంత్రి, అన్ని రాష్ట్రాలకు, తన సలహాను పునరుద్ఘాటించారు.  ఈ.సి.ఆర్.పి-II కింద ఉన్న నిధుల వినియోగానికి గడువు 2022, మార్చి, 31వ తేదీతో ముగియ నున్నందున,  ఈ విషయంలో రాష్ట్రాలు ఎప్పటికప్పుడు, పురోగతిని సమీక్షించాలని ఆయన అభ్యర్థించారు.  ఎందుకంటే, ఈ ఆరోగ్య పరిరక్షణ మౌలిక సదుపాయాలు, ప్రస్తుత మహమ్మారి సమయంలో ఉపయోగపడటం తో పాటు, భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేస్తాయని, ఆయన పేర్కొన్నారు.  అదేవిధంగా, పి.ఎస్.ఏ. ప్లాంట్లు; ఎల్‌.ఎం.ఓ. స్టోరేజీ ట్యాంకులు; ఎం.జీ.పీ.ఎస్‌.లను త్వరగా నెలకొల్పుకుని, ప్రారంభించాలని కూడా ఆయన వారికి గుర్తు చేశారు.

మహమ్మారి నిర్వహణకు టీకాను ఒక కీలకమైన సాధనంగా డాక్టర్ మాండవీయ ప్రత్యేకంగా పేర్కొంటూ, అన్ని అర్హతలు ఉన్న జనాభాకు, ముఖ్యంగా 15 నుంచి 17 సంవత్సరాల వయస్సులో ఉన్న వారికి, రెండవ డోస్ ఇవ్వాల్సిన వారికి టీకాలు వేయడం వేగవంతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.

ఈ-సంజీవని వంటి విధానాల ద్వారా టెలి-కన్సల్టేషన్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ మాండవీయ తెలియజేస్తూ, ప్రతి జిల్లా ఆసుపత్రిలో టెలి-కన్సల్టేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి,  అన్ని ఏ.బి-హెచ్.డబ్ల్యూ.సి. లలో వీలైనంత త్వరగా స్పోక్సుల ఏర్పాటును వేగవంతం  చేయాలని సూచించారు. ఎందుకంటే, ఈ విధానం, ప్రజలకు ఎంతో మేలు చేయడంతో పాటు, దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండే విధంగా చేస్తుందని తెలియజేశారు.  వీటిని, ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి సమయంలో మాత్రమే కాకుండా, కోవిడ్ యేతర ఆరోగ్య సంరక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చునని, ఆయన నొక్కి చెప్పారు.

ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు పెరిగిన పరీక్షలు; వైరస్ వ్యాప్తిని విచ్ఛిన్నం చేయడానికి అనుసరిస్తున్న కఠినమైన నిర్బంధ చర్యలు; ప్రజల్లో కోవిడ్ తగిన ప్రవర్తన పై పూర్తి అవగాహన వంటి కోవిడ్ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర, వివరణాత్మక చర్చ జరిగింది.  ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాలు, తాము అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకున్నాయి.  టీకాలు వేయడం కోసం వలస కార్మికుల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు జార్ఖండ్ తెలియజేసింది.  పాజిటీవ్‌ గా నిర్ధారణ అయిన వారిలో టీకాలు వేయించుకున్న, టీకాలు వేయించుకోని వ్యక్తుల వివరాలను సంపూర్ణంగా విశ్లేషిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్‌ తెలియజేసింది.  హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్ పాజిటివ్ రోగులకు స్పీడ్ పోస్ట్ ద్వారా మందులను వారి ఇంటి వద్దకే నేరుగా అందజేస్తున్నట్లు బీహార్ తెలియజేసింది. 

 

ఈ సమావేశంలో  కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, శ్రీ రాజేష్ భూషణ్;  ఐ.సి.ఎం.ఆర్., డి.జి., డాక్టర్ బలరామ్ భార్గవ;  ఏ.ఎస్. (ఆరోగ్య మంత్రిత్వ శాఖ), డాక్టర్ మనోహర్ అగ్నాని; ఎయిమ్స్ న్యూఢిల్లీ, డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా;  జె.ఎస్. (ఆరోగ్య మంత్రిత్వ శాఖ), శ్రీ లవ్ అగర్వాల్;  డైరెక్టర్ (ఎన్.సి.డి.సి), డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్ తో పాటు,  రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

 

*****



(Release ID: 1793618) Visitor Counter : 99