శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కీలక రంగాల జాతీయ పథకాలు నూతన టెక్నాలజీతో పరిపుష్టం
Posted On:
24 JAN 2022 4:31PM by PIB Hyderabad
కీలక రంగాల్లో చేపట్టే జాతీయ పథకాలను, కార్యక్రమాలను కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, కొత్తగా ఆవిర్భవిస్తున్న టెక్నాలజీలు ఎంతో పరిపుష్టం చేస్తున్నాయి. ఆయా పథకాలు, కార్యక్రమాల్లో ప్రజా ప్రయోజనాలతో ముడివడిన సమస్యలకు ఈ టెక్నాలజీలు తగిన పరిష్కారాలు చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 25 సృజనాత్మక కేంద్రాల్లో జాతీయ ఇంటర్ డిసిప్లనరీ సైబర్-ఫిజకల్ సిస్టమ్స్ మిషన్ (ఎన్.ఎం.-ఐ.సి.పి.ఎస్.) ద్వారా ఈ పరిష్కారాలకు రూపకల్పన జరుగుతోంది. బహుముఖ జాతీయ కీలక రంగాలు ప్రభావితం కావడానికి ఈ మిషన్ పరిధిలో రూపుదిద్దుకున్న పలు టెక్నాలజీలు, టెక్నాలజీ వేదికలు ఎంతో దోహదపడుతున్నాయి. కీలకమైన ఇలాంటి రంగాల్లో ఆరోగ్య రంగం ఒకటి. కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కీలకమైన ఈ ఆరోగ్య రంగమే ఎక్కువగా దృష్టిని ఆకర్షించింది.
కృత్రిమ మేధో పరిజ్ఞానం (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-ఎ.ఐ.), రొబాటిక్ టెక్నాలజీలకు సంబంధించి బెంగుళూరులోని ఇండియన్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సి.)లో ఏర్పాటైన ఆర్ట్.పార్క్ సంస్థ కృత్రి మేధో పరిజ్ఞానంతో పనిచేసే ఒక సాంకేతిక పరిజ్ఞాన వేదికకు రూపకల్పన చేసింది. వాట్సప్ ద్వారా పంపించిన రొమ్ము ఎక్స్-రే చిత్రాలను కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలను వేగంగా జరిపేందుకు ఈ వేదిక వీలు కల్పించింది. ఎక్స్.రే యంత్రాల సదుపాయంలేని డాక్టర్లకు ఇది ఎంతగానో ఉపయోపడింది. ఎక్స్-రే సెటు (XraySetu) అనే పిలిచే ఈ పరిష్కారం సత్వరం ఫలితాలను అందిస్తుంది. సులభంగా వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోన్ల ద్వారా పంపించే తక్కువ రెజల్యూషన్ చిత్రాల స్క్రీనింగ్ ప్రక్రియకు కూడా ఇది ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధిని పసిగట్టేందుకు ఉపకరిస్తుంది. క్రమసూత్ర యాంత్రిక పద్ధతి అధ్యయన విధానాన్ని వినియోగిస్తూ పనిచేస్తుంది. ఊపిరితిత్తుల్లో అనారోగ్య పరిస్థితిపై ఇది నివేదికను తయారు చేస్తుంది. సంబంధిత వ్యక్తికి కోవిడ్, న్యుమోనియా వంటివి సోకడమో,.. ఇతర అసాధారణ అనారోగ్య పరిస్థితిని సదరు వ్యక్తి ఎదుర్కొనడమో జరిగినపుడు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
కోవిడ్-19 వైరస్ నిర్ధారణ పరీక్షలకోసం వివిధ పరిష్కారాల అమరికతో కూడిన ఒక కొత్త పద్ధతితో కూడిన టెక్నాలజీని బొంబాయి ఇండియన్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి.) సంస్థ శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. కోవిడ్.పై రెమెడియల్ యాక్షన్, నాలెడ్జ్ స్కిమ్మింగ్, హోలిస్టిక్ అనాలిసిస్ (రక్షక్) పేరిట ఈ టెక్నాలజీకి రూపకల్పన చేశారు. జోధపూర్ ఐ.ఐ.టి.లోని సాంకేతిక పరిజ్ఞాన సృజనాత్మక కేంద్రం (టి.ఐ.హెచ్.) సహాయ, సహకారాలతో ఈ కృషి జరిగింది. రక్షక్ అనే ఈ వినూత్న పద్ధతితో ఎక్స్-రే ఆధారిత కోవిడ్ నిర్ధారణ పరీక్షల వ్యవస్థను రూపొందించడానికి అవకాశం ఏర్పడింది. (ప్రస్తుతం ఇది భారతీయ వైద్య పరిశోధనా మండలి-ఐ.సి.ఎం.ఆర్. పరీక్షల పరిధిలో ఉంది). అలాగే, భారతీయ, అంతర్జాతీయ కోవిడ్ కేసులకు సంబంధించిన బహిరంగ సమాచార వేదిక (కోవ్.బేస్), క్యాంపస్ రక్షక్ వంటి వ్యవస్థల రూపకల్పనకు కూడా రక్షక్ పద్ధతి దోహదపడింది.
ఇక, రోపార్ ఐ.ఐ.టి.లో అవధ్ పేరిట ఏర్పాటైన సాంకేతిక పరిజ్ఞాన సృజనాత్మక కేంద్రం పరిశోధకులు, స్క్రాచ్.నెస్ట్ అనే స్టార్టప్ కంపెనీ శాస్త్రవేత్తలు యాంబీట్యాగ్ (AmbiTag) అనే కొత్త పరికరాన్ని రూపొందించారు. ఇలాంటి పరికరం రూపొందడం దేశంలో ఇదే తొలిసారి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఒ.టి.) ఆధారంగా పనిచేసే ఈ పరికరం ఎంతో ఉపయోగకరం. కోవిడ్ మందులు, వ్యాక్సీన్లు, రక్త నమూనాలు, ఆహార పదార్థాలు, పాల పదార్థాలు, మాసం ఉత్పాదనలు, జంతువుల వీర్యం వంటివి రవాణా చేస్తున్నపుడు వాటి పరిసరాల ఉష్ణోగ్రతను పర్యవేక్షించగలిగే సామర్థ్యం ఈ పరికరానికి ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి పరికరాలను భారతదేశం దిగుమతి చేసుకుంటూ వచ్చింది. కొత్తగా రూపుదిద్దుకున్న యాంబీట్యాగ్ అనే పరికరాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సంస్థ సన్నద్ధమవుతోంది. ఈ పరికరాన్ని 400 రూపాయల తయారీ ధరపై అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని వ్యాక్సీన్ల తయారీ కేంద్రాలనుంచి వాటిని ప్రజలకు అందించే కేంద్రాల వరకూ జరిగే కృషిలో ప్రమేయం ఉన్న అన్ని కంపెనీలకూ ఈ పరికరాన్ని తయారీ ధరపైనే అందుబాటులో ఉంచుతారు.
భారతీయ అంతరిక్ష పరిశోధన సాంకేతిక పరిజ్ఞాన వినియోగ సహవ్యవస్థ కేంద్రం (ఐ.స్టాక్ డి.బి.) పరిధిలో డీప్ టెక్, ఇంజినీరింగ్ రంగంలో ఒక కన్సార్షియంను ఐ.ఐ.టి మద్రాసుకు చెందిన ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్, మరో ఐదు స్టార్టప్ కంపెనీలు కలసి ప్రారంభించాయి. అంతరిక్ష పరిశోధనా సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించి ఆత్మనిర్భర భారత్ స్థాయిని సాధించే పరుపూర్ణమైన సానుకూల వ్యవస్థ రూపకల్పనే ధ్యేయంగా ఈ సహవ్యవస్థ ఏర్పాటైంది. వేగంగా సత్వర ఉపగ్రహ ప్రయోగం, ఉపగ్రహాల స్థితి, సెన్సార్లు, 6-జి వంటి భావి తరాల కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఉపగ్రహాల సమాచారం తదితర అంశాలతో అనుసంధానంపై పూర్తి స్థాయి సానుకూల వ్యవస్థ ఏర్పాటుపై ఈ వ్యవస్థ తన దృష్టిని కేంద్రీకరిస్తుంది.
ఆరోగ్యం, విద్య, ఇంధనం, పర్యావరణం, వ్యవసాయం, వ్యూహాత్మక-భద్రతా రంగం, అధునాతన పారిశ్రామిక రంగం వంటి అంశాల్లో సాంకేతిక పరిష్కారాలను రూపొందిస్తున్న జాతీయ ఇంటర్ డిసిప్లనరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ మిషన్ (ఎన్.ఎం.-ఐ.సి.పి.ఎస్.) ప్రస్తుతం దేశంలో అమలులో ఉంది. ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రతిష్టాత్మకమైన అగ్రశ్రేణి జాతీయ, పరిశోధనా సంస్థల్లోని సాంకేతిక సృజనాత్మక కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నారు. మొత్తం రూ. 3,660కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం 2018 డిసెంబరులో ఆమోదం తెలిపింది. ప్రజా ప్రయోజనాలతో ముడివడిన సమస్యలకు పరిష్కారాల రూపకల్పనకోసమే సాంకేతికపరిజ్ఞాన సృజనాత్మక కేంద్రాలన్నీ పనిచేస్తున్నాయి.
<><><>
(Release ID: 1792394)
Visitor Counter : 146