చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి అత్యంత ప్రభావవంతమైన సాధనంగా ఆవిర్భవించిన - లోక్ అదాలత్
2021 సంవత్సరంలో పరిష్కారమైన మొత్తం కేసుల సంఖ్య : 1,27,87,329
ఇ-లోక్ అదాలత్ వంటి సాంకేతిక పురోగతి కారణంగా పార్టీల లోగిళ్ళకు చేరిన - లోక్ అదాలత్
Posted On:
12 JAN 2022 3:58PM by PIB Hyderabad
జాతీయ న్యాయ సేవల సాధికార సంస్థ (ఎన్.ఏ.ఎల్.ఎస్.ఏ) పౌరులకు సత్వరంగా, చవకైన న్యాయం అందించడానికి కట్టుబడి ఉంది. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాల ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను సమర్థవంతంగా తగ్గించడంలో జాతీయ లోక్-అదాలత్ సహకారంపై మరింత దృష్టి పెట్టాలని, ఇటీవల ఎన్.ఏ.ఎల్.ఎస్.ఏ. నిర్ణయించింది.
ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా, లోక్-అదాలత్‌ల నిర్వహణ కోసం న్యాయ సేవాధికారులు క్రియాశీల వ్యూహాలు చేపట్టారు. సన్నాహక చర్యగా, అటువంటి లోక్-అదాలత్ ల సమయంలో కేసులను గరిష్టంగా పరిష్కరించేందుకు వీలుగా, ఎన్.ఏ.ఎల్.ఎస్.ఏ., అన్ని రాష్ట్రాలకు చెందిన న్యాయ సేవాధికారులుతో ముందస్తు సంప్రదింపులు, సమీక్షా సమావేశాలను నిర్వహించడం ప్రారంభించింది. ప్రతి జాతీయ లోక్-అదాలత్ నిర్వహణకు ముందు, అన్ని రాష్ట్రాలకు చెందిన న్యాయ సేవల సాధికార సంస్థల కార్యనిర్వాహక అధ్యక్షులతో అనేక సార్లు పరస్పర సమావేశాలు నిర్వహించడం జరిగింది. లోక్-అదాలత్ ల నిర్వహణకు బాధ్యత వహించిన భాగస్వాముల మనోధైర్యాన్ని పెంపొందించడంతో పాటు సన్నాహక ఏర్పాట్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా వ్యక్తిగతంగా ఒకరితో ఒకరు నేరుగా సంప్రదింపులు జరపడానికి చర్యలు చేపట్టడం జరిగింది.
అన్ని సన్నాహక మరియు సమీకరణ చర్యల ప్రభావం, 2021 సంవత్సరంలో అసాధారణమైన సంఖ్యలో కేసులు పరిష్కారం కావడానికి దారితీసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన నాలుగు జాతీయ లోక్-అదాలత్ లలో మొత్తం 1,27,87,329 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో, భారీ సంఖ్యలో అంటే, 55,81,117 పెండింగ్ కేసులు మరియు రికార్డు స్థాయిలో అంటే 72,06,212 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. ఈ కార్యకలాపాల ద్వారా న్యాయ సేవల అధికారులు దీర్ఘకాల న్యాయ పోరాటాలను ముగించడం లేదా నిరోధించడం ద్వారా సామాన్య పౌరులకు ఉపశమనం కలిగించే పెద్ద సంఖ్యలో కేసులను పరిష్కరించారు.
ఈ విధంగా అపూర్వమైన రీతిలో కేసులను పరిష్కరించడం అంత తేలికైన పని కాదు. సాంకేతిక పురోగతి ద్వారా లభించిన సహకారమే, ఈ విజయానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. న్యాయ సేవా అధికారులు, 2020 జూన్ నెలలో, వివాద పరిష్కారానికి సంబంధించిన సంప్రదాయ రీతులతో సాంకేతికతను సమగ్రపరిచారు. దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించే ఈ లోక్-అదాలత్ లను ‘ఈ-లోక్-అదాలత్" లని కూడా పిలుస్తారు. అప్పటి నుండి, జాతీయ లోక్-అదాలత్ లతో సహా అన్ని లోక్-అదాలత్ లు దృశ్యమాధ్యమంతో పాటు హైబ్రిడ్ విధానం ద్వారా కూడా నిర్వహించడం జరుగుతోంది.
ఈ సాంకేతిక పురోగతి కారణంగా, లోక్ అదాలత్ లు పార్టీల లోగిళ్ళకు చేరాయి. పార్టీలు ఇప్పుడు వారి ఇళ్లు లేదా కార్యాలయాల నుండి నేరుగా లోక్-అదాలత్ కార్యకలాపాలలో పాల్గొనగలుగుతున్నారు. వారికి ప్రయాణం చేయడంలో ఎదురయ్యే ఇబ్బందిని అధిగమించి, నిముషాల వ్యవధిలో పూర్తితయ్యే పనికి రోజంతా, వేచి ఉండవలసిన అవసరం ఉండదు. సమయం బాగా ఆదా అవుతాయి. లోక్-అదాలత్ నిర్వహించిన భౌతిక ప్రదేశానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులు సైతం పెద్ద సంఖ్యలో దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొనడాన్ని అధికారులు గమనించారు. లోక్-అదాలత్ ల తనిఖీ మరియు పర్యవేక్షణకు సమర్థవంతమైన మార్గాలను కూడా అందించడం జరిగింది.
లోక్-అదాలత్ ల విజయానికి మరో ప్రధాన అంశం జాతీయ స్థాయిలో నిర్ణయాత్మక వ్యూహాలను రూపొందించడం. ఈ వ్యూహాల ప్రకారం, రాష్ట్ర న్యాయ సేవాధికారులు, వారి పూర్తి సహకారం, సమన్వయాన్ని నిర్ధారించే లక్ష్యంతో, ప్రతి స్థాయిలో వివిధ భాగస్వాములతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. న్యాయవాదులు స్నేహపూర్వక విధానాన్ని అనుసరించాలని, అలాగే న్యాయపరమైన పరిష్కార ప్రతిపాదనలకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు, అటువంటి వ్యాజ్యదారులను ఒప్పించాలని, అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
వీటితోపాటు, ఎన్.ఐ. చట్టం కింద కేసులు, ఇతర ఆర్థిక విషయాలతోపాటు బ్యాంక్ రికవరీ కేసులు వంటి పరిష్కారానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న చట్టంలోని కొన్ని రంగాలను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. అటువంటి సందర్భాలలో రాజీకి గల అన్ని అవకాశాలను అన్వేషించాలని అధికారులకు సూచించడం జరిగింది. అటువంటి ఆర్థిక విషయాలకు సంబంధించిన ప్రక్రియల జారీ తో పాటు, పూర్తి ప్రక్రియలను ముందస్తుగా పర్యవేక్షించాలని, అలాగే లోక్-అదాలత్ చేపట్టడానికి ముందు సమావేశాలు నిర్వహించి, ఆయా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలని అధికారులకు సూచించారు.
కొనసాగుతున్న కరోనా మహమ్మారి సమయంలో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య పెరిగిందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా, లోక్-అదాలత్ ల ద్వారా పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం కావడంతో, దేశంలోని న్యాయ పరిపాలన లో న్యాయ సేవాధికారుల ద్వారా సమతుల్యత ఏర్పడింది. ఇతర వివాద పరిష్కార యంత్రాంగాల కంటే, లోక్-అదాలత్ లు, ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తద్వారా, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగానికి , ఇది ఒక అత్యంత ప్రభావవంతమైన సాధనంగా ఉద్భవించింది.
ఈ సంవత్సరంలో, కేటగిరీ వారీగా పరిష్కరించబడిన కేసుల జాబితాలో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ విభాగంలో ఇందులో మొత్తం 17,63,233 పెండింగ్ కేసులతో పాటు; 18,67,934 ప్రీ-లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయి. ఆ తర్వాత రెండో స్థానంలో, రెవిన్యూ విభాగంలో, 11,59,794 ప్రీ-లిటిగేషన్ కేసులతో పాటు; 14,99,558 పెండింగ్ కేసులు పరిష్కారమయ్యాయి. వీటితో పాటు తర్వాతి స్థానాల్లో, ఎన్.ఐ. చట్టం కింద చెక్-బౌన్స్ కేసులు; బ్యాంక్ రికవరీ కేసులు; మోటార్ ప్రమాదాల క్లెయిమ్ లు; కార్మికులకు సంబంధించిన కేసులు; వివాహాలకు సంబంధించిన కేసులు మొదలైనవి పరిష్కారమయ్యాయి.
*****
(Release ID: 1789512)
Visitor Counter : 250