శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెండు భారతీయ స్టార్టప్ కంపెనీలకు గ్లోబల్ వుమెన్స్ హెల్త్ టెక్ అవార్డులు!


డి.బి.టి. పరిధిలోని సంస్థలకు
ఇది ప్రపంచ స్థాయిగుర్తింపు..

Posted On: 12 JAN 2022 2:34PM by PIB Hyderabad

   ప్రస్తుత మార్కెట్ల వాతావరణంలో మహిళల ఆరోగ్య, భద్రతా రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా  స్టార్టప్ కంపెనీలైన నిర్మాయీ (ఎన్.ఐ.ఆర్.ఎం.ఎ.ఐ.) హెల్త్ అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ యాక్సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు గ్లోబల్ వుమెన్స్ హెల్త్ టెక్ పురస్కారాలు లభించాయి.  ప్రపంచబ్యాంకు గ్రూపు, కన్జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్.లనుంచి ఆ సంస్థలకు ఈ అవార్డులు లభించాయి. కేంద్ర బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.) పరిధిలోని బయోటెక్నాలజీ పరిశ్రమల పరిశోధనా సహాయ మండలి (బి.ఐ.ఆర్.ఎ.సి.) సహాయ సహకారాలతో ఈ రెండు స్టార్టప్ కంపెనీలు పనిచేస్తున్నాయి. మహిళల ఆరోగ్య, భద్రతా రంగాల్లో మరింత మెరుగైన ఫలితాలే లక్ష్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సానుకూలంగా, సృజనాత్మకంగా వినియోగించుకోవడంలో ఈ రెండు స్టార్టప్ సంస్థలూ ఎంతో కృషి చేస్తూ వస్తున్నాయి.

 

   నిర్మాయీ హెల్త్ అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్..  ఔత్సాహిక మహిళల సేవారంగంలో పనిచేస్తున్న సంస్థ ఇది. 2019వ సంవత్సరంలో బయోటెక్నాలజీ పరిశ్రమల పరిశోధనా సహాయ మండలి (బి.ఐ.ఆర్.ఎ.సి.) ఔత్సాహిక మహిళా పరిశోధనా అవార్డును అందుకుంది. అన్ని వయస్సుల మహిళలకు సోకే రొమ్ము కేన్సర్.ను ప్రారంభదశలోనే సునాయాసంగా పసిగట్టి, వ్యాధి నిర్ధారణ చేయగలిగే సాఫ్ట్ వేర్ ఆధారిత వైద్య పరికరాన్ని కనుగొనేలా దోహదంపడిన పరిశోధనకు గుర్తింపుగా ఈ సంస్థకు బి.ఐ.ఆర్.ఎ.సి. అవార్డు లభించింది. కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షా సమస్యలను పరిష్కరించేలా ఈ పరికరాన్ని కనుగొన్నారు. ఎలాంటి దుష్ప్రభావాలకూ అవకాశం లేని రీతిలో రేడియేషన్ రహితమైన, కచ్చితమైన, తక్కువ వ్యయంతో కూడిన కేన్సర్ స్క్రీనింగ్ పరికరాన్ని కనుగొనేందుకు ఈ పరిశోధన దోహదపడింది. కృత్రిమ మేధో పరిజ్ఞానం (ఎ.ఐ.) ప్రాతిపదికగా పనిచేసే కంప్యూటర్ డయాగ్నోస్టిక్ ఇంజిన్ ను సృష్టించడమే ఈ పరిశోధనలో ఒక గొప్ప ఆవిష్కరణగా చెప్పవచ్చు. థర్మాలైటిక్స్ అని పిలిచే ఈ పరికరం రొమ్ముల ఆరోగ్య పరిస్థితి, వాటి అసాధారణ స్థితి గురించి సరైన నివేదికను అందించ గలుగుతుంది.  ఇప్పటివరకూ ఈ స్టార్టప్ కంపెనీ అనుబంధంతో 45,000మందికిపైగా మహిళలపై స్క్రీనింగ్ పరీక్షలు  నిర్వహించారు. దేశవ్యాప్తంగా 30 ఆసుపత్రులు, డయాగ్నాస్టిక్ కేంద్రాల్లో ఈ స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాదీ 2వందల కోట్ల మహిళలకు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు జరిపేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. అంటే, ఒక్క భారతదేశంలోనే ప్రతి ఏటా 90,000మంది ప్రాణాలను కేన్సర్ వ్యాధినుంచి కాపాడేందుకు అవకాశం ఉంటుంది. 

   ఇన్.యాక్సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.,  కేంద్ర బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.)- బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంస్థనుంచి గ్రాండ్ చాలెంజ్ ఎక్స్.ప్లొరేషన్- ఇండియా అవార్డును అందుకున్న సంస్థ ఇది. అధునాతనమైన రేపటి తరం ఫెటల్ లైట్ అనే పరికరం కనుగొన్నందుకు గాను గ్లోబల్ వుమెన్ హెల్త్ టెక్ అవార్డు విజేతగా ఈ సంస్థ ఎంపికైంది. ఆరవవారం గర్భధారణ స్థితిలోని మహిళల గుండె కంపనాల రేటు (ఎఫ్.హెచ్.ఆర్.)ను కొలిచేందుకు ఉపయోగించే కృత్రిమ మేధో పరిజ్ఞానంతో కూడిన మానిటర్.ను కనుగొన్నందుకు ఈ పురస్కారం లభించింది. గర్భధారణ తర్వాత 37 వారాల వరకూ ప్రసవవేదనలో ఉన్న మహిళల కోసం ఇ.సి.జి. సిగ్నల్ ఎక్స్.ట్రాక్షన్ టెక్నాలజీ అధారంగా ఇది పనిచేస్తుంది. మామూలుగా ఉపయోగించే డాప్లర్ ఆధారిత పరికరాలకంటే, ఫెటల్ లైట్ అనే ఈ పరికరం వినియోగం ద్వారా మరింత కచ్చితమైన, విశ్వసనీయమైన ఫలితాలను కనుగొని సులభమైన పద్ధతిలో రిపోర్టును పొందవచ్చు. యూరోపియన్ సి.ఇ. యోగ్యతాపత్రం పొందిన ఈ ఫెటల్ లైట్ ఇప్పటివరకూ 60మంది రోగులపై రెండేసి క్లినికల్ ప్రయోగాత్మక పరీక్షలు పూర్తి చేసింది. అద్భుతమైన ఫలితాలను కూడా సాధించింది. ఇప్పటి వరకూ 30కి పైగా ఆసుపత్రుల్లో ఈ పరికరం పనితీరును ప్రదర్శించారు. ఆసుపత్రిలోనూ, ఇంటిలోనూ పర్యవేక్షణకు, పరీక్షకు ఈ పరికరాన్ని వినియోగించవచ్చు. ఇప్పటివరకూ ఈ పరికరం 5,000కేసుల పర్యవేక్షణ కోసం డాక్టర్లకు సహాయ పడింది. గిరిజన ప్రాంతాల్లో కూడా ఇది సమర్థవంతంగా ఉపయోగపడింది. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 12లక్షలమందిని ప్రాణాలను కాపాడే సామర్థ్యం ఈ పరికరానికి ఉంది.

    "ప్రపంచ బ్యాంకునుంచి ఈ గుర్తింపు లభించడం మాకు సంతోషంగా ఉంది. ప్రపంచానికి అందించిన భారతీయ ఆవిష్కరణకు ఇలా తగిన గుర్తింపు లభించింది." అని నిర్మాయీ సంస్థ వ్యవస్థాపకురాలు గీతా మంజునాథ్ చెప్పారు.

  "రోగులకు ప్రయోజనం కలిగించే లక్ష్యంతో మేం సాగించిన పయనంలో బి.ఐ.ఆర్.ఎ.సి. అందించిన సహాయ, సహకారాలు ఎంతో కీలకపాత్ర వహించాయి. యూరోపియన్ నియంత్రణ సంస్థ ఆమోదం పొందడానికి  కూడా దోహదపడ్డాయి.  కేవలం ఆర్థిక సహాయం అందిండమే కాకుండా, చేదోడువాదోడుగా తగిన సహకారం అందించడంతో మేం అన్ని ఇబ్బందులను అధిగమిచగలిగాం," అని ఇన్.యాక్సెల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నితేశ్ జాంగీర్ అన్నారు. 

   "కేంద్ర బయోటెక్నాలజీ శాఖ సహాయ సహకారాలు అందుకుంటున్న స్టార్టప్ కంపెనీలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో ఆనందం కలిగించింది. ఇలాంటి విజయ గాధలు విన్నపుడు, మేం ఏర్పాటు చేసిన చైతన్యవంతమైన స్టార్టప్ సానుకూల వ్యవస్థ ఆశించిన ప్రభావం చూపించిందని అనిపించింది. మానవాళి ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కారంలో ఈ వ్యవస్థ ఉపయోగపడుతోందని కూడా భావిస్తున్నాం," అని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేశ్ గోఖలే అభిప్రాయపడ్డారు.

 

   ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది వెలువరించిన ప్రకటన ప్రకారం,..ఈ అవార్డులకు 35 దేశాలకు చెందిన 70కిపైగా కంపెనీలనుంచి స్పందన లభించింది. ఈ అవార్డులకోసం మూడు వర్గాల కింద తమ సృజనాత్మక ఆవిష్కరణలను, సేవలను ఆ కంపెనీలు సమర్పించాయి.: ప్రత్యుత్పత్తి ఆరోగ్యం, గర్భధారణ, మహిళ, కిశోర ప్రాయపు బాలికల ఆరోగ్యం, మహిళల భద్రత అన్న వర్గాల కింద ఈ ఆవిష్కరణలను,సేవలను పంపించాయి.

 

 

కేంద్ర బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.) గురించి...:

   1986వ సంవత్సరంలో బయోటెక్నాలజీ శాఖ ఏర్పాటైంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది పనిచేస్తోంది. భారతదేశంలో అధునాతన జీవశాస్త్రం, జీవసాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల అభివృద్ధి, వాణిజ్య, పారిశ్రామికపరంగా జరిగే పరిణామాలను పర్యవేక్షించే బాధ్యతలను డి.బి.టి. నిర్వర్తిస్తుంది. వ్యవసాయం, ఆరోగ్య రక్షణ, జంతు శాస్త్రాలు, పర్యావరణం, పరిశ్రమలు వంటి స్థూల రంగాల్లో బయోటెక్నాలజీ వినియోగం, పరిణామాలకు సంబంధించి డి.బి.టి. ఎన్నో గణనీయ విజయాలను సాధిస్తూ వచ్చింది. బయోటెక్నాలజీ శాఖకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇంటర్నెట్.పై http://dbtindia.gov.in/  అనే వెబ్ లింకును సందర్శించవచ్చు.

 

బి.ఐ.ఆర్.ఎ.సి. గురించి..:

   బయోటెక్నాలజీ పరిశ్రమల పరిశోధనా సహాయ మండలి (బి.ఐ.ఆర్.ఎ.సి.) అనేది, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.) పరిధిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ. బయోటెక్నాలజీ సంస్థలను మరింత బలోపేతం చేసి, వాటికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పాటైంది. ఆయా సంస్థలు వ్యూహాత్మక పరిశోధన, సృజనాత్మక ఆవిష్కరణలు జరిపేందుకు, జాతీయస్థాయిలో ఉత్పాదనా రూపకల్పన అసరాలను తీర్చేందుకు బి.ఐ.ఆర్.ఎ.సి. కృషి చేస్తుంది. బి.ఐ.ఆర్.ఎ.సి. గురించిన మరింత సమాచారం కోసం ఇంటర్నెట్.పై, https://birac.nic.in/ అనే లింకును సందర్శించచ్చు.

ట్విట్టర్ - @DBTIndia; @BIRAC_2012

ఫేస్.బుక్ - Department of Biotechnology, India

 

<><><><>


(Release ID: 1789511) Visitor Counter : 211


Read this release in: English , Urdu , Hindi , Bengali