వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రపంచ సృజనాత్మక సూచీ తొలి 25 స్థానాల్లో భారత్.కు చోటు!


ఇదే మన లక్ష్యం కావాలన్న పీయూష్ గోయల్..

‘స్టార్టప్ ఇండియా’ సృజనాత్మక వారోత్సవాలకు
వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీకారం..

భారతదేశాన్ని ‘ఆరోగ్యవంతం’ చేయాలని
స్టార్టప్ కంపెనీలకు గోయల్ పిలుపు..

వాణిజ్య సానుకూల వ్యవస్థలో
సమానత్వం తెచ్చే ఒ.ఎన్.డి.సి...

స్వావలంబనకు, ఆత్మవిశ్వాసానికి

‘స్టార్టప్ ఇండియా’ ప్రతీకగా మారాలి...

Posted On: 10 JAN 2022 2:21PM by PIB Hyderabad

 ప్రపంచ స్థాయి సృజనాత్మక సూచీ మొదటి 25 స్థానాల్లో భారతదేశానికి చోటు లభించేలా కృషి చేయాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదార్ల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపణీ, జవుళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. సృజనాత్మక సానుకూల వ్యవస్థ భాగస్వామ్య వర్గాలకు ఆయన ఈమేరకు పిలుపునిచ్చారు. 2014వ సంవత్సరం నాటికి ప్రపంచ సృజనాత్మక సూచీలో 76వ స్థానంలో ఉన్న భారతదేశం ఒక్కసారిగా 46వ స్థానానికి ఎదగడంలో మన స్టార్టప్ కంపెనీలు కీలకపాత్ర పోషించాయని ఆయన అన్నారు. “స్టార్టప్ ఇండియా వారోత్సవాల ప్రారంభం” సందర్భంగా నిర్వహించిన తొలి కార్యక్రమంలో కేంద్రమంత్రి వర్చువల్ పద్ధతిలో పాల్గొంటూ ఈ విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా సింగ్ పటేల్, పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డి.పి.ఐ.ఐ.టి.) కార్యదర్శి అనురాగ్ జైన్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి శ్రుతీ సింగ్, అర్బన్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సి.ఇ.ఒ. అభిరాజ్ సింగ్ భల్, ఇన్ఫో ఎడ్జ్ సంస్థ సహ వ్యవస్థాపకడు సంజీవ్ బిఖ్చందానీ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు

 

  ఈ సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ తొలి కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషదాయకమని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, లో భాగంగా సృజనాత్మక సానుకూల వ్యవస్థ విజయవంతం కావడాన్ని ఒక వేడుకగా జరుపుకోవడం అభినందనీయమని,  స్టార్టప్ సానుకూల వ్యవస్థ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని అన్నారు.

  స్టార్టప్ వారోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ఒక ఆనవాయితీగా జరుపుకోవలసిన అసరం ఉందని, తద్వారా, మన స్టార్టప్ సానుకూల వ్యవస్థను సమీక్షించుకోవడానికి, పునఃసృష్టి చేసుకోవడానికి, పునరుజ్జీవింప చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు శక్తివంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. స్టార్టప్ కంపెనీలకు సంబంధించిన మన ఔత్సాహికులను సత్కరించుకోవడంతోపాటుగా, భవిష్యత్తుకు బాటలు వేసేందుకు తగిన దృక్ఫథాన్ని మనం రూపొందింటుకోవలసిన అవసరం ఉందన్నారు.

    ఆజాదీ కా అమృత్ మహోత్సవం పేరిట 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించుకోవడమే వారం రోజుల ఈ వర్చువల్ కార్యక్రమ లక్ష్యమని, దేశవ్యాప్తంగా ఔత్సాహిక వాణిజ్య, వ్యాపారత తత్వం ఎలా రూపుదిద్దుకుందో వివరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన అన్నారు.

   దేశంలోని కీలకమైన స్టార్టప్ కంపెనీలు, ఔత్సాహికులు, పెట్టుబడిదార్లు, స్టార్టప్ కంపెనీల ఇంక్యుబేటర్లు, నిధులందించే సంస్థలు, బ్యాంకులు, విధాన నిర్ణయ కర్తలు, ఇతర జాతీయ అంతర్జాతీయ భాగస్వామ్య వర్గాలను ఒక తాటిమీదికి తెచ్చే ప్రధాన లక్ష్యంతోనే స్టార్టప్, సృజనాత్మక ఉత్సవం నిర్వహిస్తున్నట్టు పీయూష్ గోయల్ అన్నారు. సృజనాత్మక, ఆవిష్కృత కార్యకలాపాలను ప్రోత్సహించడమే ఈ వేడుకల ధ్యేయమన్నారు.

  అలాగే, స్టార్టప్ సానుకూల వ్యవస్థల అభివృద్ధిపై పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం; ఔత్సాహిక వాణిజ్య, వ్యాపారతత్వానికి  సానుకూలంగా సామర్థ్యాలను పెంపొందించుకోవడం; స్టార్టప్ పెట్టుబడులకోసం ప్రపంచ స్థాయిలో, జాతీయ స్థాయిలో పెట్టుబడులను సమీకరించడం; సృజనాత్మక, ఔత్సాహిక కార్యకలాపాల్లో యువతకు తగిన ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని అందివ్వడం; స్టార్టప్ కంపెనీలకు మార్కెట్ అనుసంధాన అవకాశాలను కల్పించడం; భారతదేశంలో అందుబాటులో ఉన్న ఉన్నత స్థాయి నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతను గురించి తెలియజెప్పడం వంటి లక్ష్యాలకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కేంద్రమంత్రి చెప్పారు. పరిపూర్ణ స్థాయిలో ప్రభుత్వ ప్రమేయం, 30శాఖల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్న సంస్థల సంఖ్య ఇప్పటికే లక్ష దాటిందన్నారు. 

  స్టార్టప్ ఇండియా కార్యక్రమం మొదలై ఈ ఏడాదితో ఆరేళ్లు పూర్తవుతోందని, 2016వ సంవత్సరం జనవరి 16వ తేదీన గౌరవ ప్రధానమంత్రి ‘స్టార్టప్ ఇండియా ఉద్యమం’ ప్రారంభించడం దేశవ్యాప్తంగా ఔత్సాహికులలో ఎంతో స్ఫూర్తిని రగిలించిందని పీయూష్ గోయల్ అన్నారు.

  స్టార్టప్ కంపెనీలు మార్పును తీసుకువచ్చే దూతలుగా గోయల్ అభివర్ణించారు. “చేయగలం” అన్న మానసిక స్థితిని “చేసి తీరుతాం” అన్న ధీమాతో కూడిన స్థాయికి స్టార్టప్ కంపెనీలు తీసుకువచ్చాయన్నారు. సృజనాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఈ రోజున జాతీయ భాగస్వామ్యంతో, జాతీయ సచేతనత్వంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిందని అన్నారు. 

  స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా వివిధ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో ప్రధానమంత్రి ఇష్టాగోష్టి కార్యక్రమం, ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య వేత్తలకు ఎంతో ప్రోత్సహకరంగా ఉంటుందని, మరింత ఉన్నతంగా కలలుగని, వాటిని మరింత ఉన్నతంగా సాకారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుందని అన్నారు. కోవిడ్-19 సంక్షోభాన్ని మన స్టార్టప్ కంపెనీలు తమకు సానుకూల అవకాశంగా మలుచుకున్నాయని, 2021వ సంవత్సరాన్ని యూనికార్న్ సంస్థల (భారీ స్టార్టప్ కంపెనీల)కు సానుకూలమైన సంవత్సరంగా మార్చుకున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనికార్న్ స్టార్టప్ కంపెనీల్లో అత్యధిక కంపెనీలు (82) భారతదేశంలోనే ఉన్నాయని గోయల్ అన్నారు.

   వైరస్ మహమ్మారి వరుస ఉధృతులతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దగలిగే స్టార్టప్ కంపెనీల నిర్మాణంపై మనం దృష్టిని సారించాలని ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య వేత్తలకు పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూ (నూతన) ఇండియా అనే పేరులోని –న్యూ- అన్న పదం,.. మన స్టార్టప్ కంపెనీలు తీసుకువచ్చే తాజాదనానికి, దృక్పథాలకు, వినూత్న భావనలకు ప్రతీకలుగా నిలుస్తాయని మంత్రి అన్నారు. ఆవిష్కర్తలంతా తమ వైఫల్యాలనుంచి, పొరపాట్లనుంచి అవసరమైన పాఠాలను నేర్చుకుని, తమ విజయాలకు మెట్లుగా తీర్చిదిద్దుకోవాలని గోయల్ పిలుపునిచ్చారు. 

 భారతీయ ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య వేత్తలకు 3 లక్ష్యాలను ఆయన నిర్దేశించారు. ‘భారతదేశంలో తయారీ’, ‘భారతదేశంలో ఆవిష్కరణ’, ‘తదుపరి తరం ఔత్సాహికులకు పథనిర్దేశం చేయడం’ వంటి లక్ష్యాలను కేంద్రమంత్రి సూచించారు. వైరస్ మహమ్మారి వంటి సంక్షుభిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు దీటుగా, మన స్టార్టప్ కంపెనీలను మరింత పటిష్టంగా, దృఢంగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉందన్నారు.

  మన యువ ఔత్సాహిక పారిశ్రామికులు, వాణిజ్యవేత్తలు సాహసోపేతంగా పనిచేసేందుకు ఉత్సాహం చూపుతారని అన్నారు. దేశంలో ప్రతి గంటకూ నాలుగు స్టార్టప్ సంస్థలు గుర్తింపును పొందుతున్నాయని, వాటిలో 45శాతం స్టార్టప్ కంపెనీలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందినవేనని, వాటిలోనూ 46శాతం సంస్థలకు ఔత్సాహిక మహిళలే సారథ్యం వహిస్తున్నారని మంత్రి అన్నారు. దేశంలోని చాలావరకూ స్టార్టప్ కంపెనీల ఐ.పి.ఒ.లు విజయవంతం కావడం,.. కొత్త బహుళజాతి సంస్థలుగా ఎదిగేందుకు వాటికిగల సామర్థ్యాన్ని సూచిస్తోందన్నారు. 2018నుంచి 2021వ సంవత్సరంవరకూ స్టార్టప్ కంపెనీలు ఆరు లక్షల వరకూ ఉద్యోగాలను కల్పించాయని, కేవలం 2021లోనే రెండు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన స్టార్టప్ కంపెనీల కారణంగానే జరిగిందని ఆయన అన్నారు.

  వాణిజ్య సరళీకరణ, సానుకూలత కల్పించడంతో పాటుగా, వాణిజ్య ప్రారంభం, నిర్వహణలను సులభతరం చేయడంపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ప్రభుత్వం ‘సదుపాయాల కల్పనా కర్త’గా వ్యవహరిస్తున్నదని కేంద్రమంత్రి అన్నారు. సులభతర వాణిజ్య నిర్వహణ మెరుగుదలకోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన ఉదహరించారు. పేటెంట్ ఫైలింగ్.పై 80శాతం రాయితీని, ట్రేడ్ మార్క్ ఫైలింగ్ రుసుంలో 50శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తోందని, బహిరంగ సేకరణ నిబంధనలను సడలించిందని, కార్మిక, స్టార్టప్ కంపెనీల నిధులకు సంబంధించి,.. పర్యావరణ రక్షణ చట్టాల కింద సెల్ఫ్ సర్టిఫికేషన్.కు అనుమతిస్తోందని, మూడేళ్లనుంచి పదేళ్ళ వ్యవధివరకూ ఆదాయంపన్నులో మినహాయింపు ఇస్తోందని, సీడ్ ఫండ్ పథకం కింద రూ. 945కోట్లు అందించిందని మంత్రి తెలిపారు. మేధో సంపత్తి హక్కుల (ఐ.పి.ఆర్.) రంగం మెరుగుదలతో గత నాలుగేళ్లలో 1.16మిలియన్ల ట్రేడ్ మార్కుల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సానుకూలత ఏర్పడిందని అన్నారు. ఇదివరకు గత 75 సంవత్సరాల్లో కూడా 11లక్షల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయని మంత్రి అన్నారు. 

   ప్రభుత్వం తలపెట్టిన డిజిటల్ వాణిజ్య బహిరంగ వ్యవస్థ (ఒ.ఎన్.డి.సి.) ప్రమేయంతో అనేక మార్పులు రానున్నాయని, మన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, వాణిజ్య వేత్తలకు దీనివల్ల ఖర్చు ఆదా కావడంతోపాటుగా, వారిలో విశ్వాసం పెంపొందుతుందని గోయల్ అన్నారు. భారీ స్థాయి కార్పొరేషన్లకు, చిన్న స్టార్టప్ కంపెనీలకు మధ్య అంతరాలను పూడ్చేందుకు ఒ.ఎన్.డి.సి. దోహదపడుతుందని, వాణిజ్య సానుకూల వ్యవస్థలో సమానత్వం తీసుకువస్తుందని అన్నారు. భాగస్వామ్యం, అన్వేషణ, వృద్ధి, సేవ, సాధికారత అన్నవి స్టార్టప్ కంపెనీల ప్రగతి కారక మంత్రాలుగా గోయల్ అభివర్ణించారు.

  ఔత్సాహిక పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు తమ పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని, ఆలోచనలను పంచుకుని ఇతరులకు మార్గనిర్దేశం, మార్గదర్శనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు అదనపు ఆదాయం అందించేందుకు వీలుగా ఇంతవరకూ అన్వేషణ జరగని,  గ్రామీణ పర్యాటకంపై అన్వేషణకు దృష్టిని కేంద్రీకరించాలని స్టార్టప్ కంపెనీలకు పిలుపునిచ్చారు.  మన చేనేత కార్మికులకు, హస్తకళా నిపుణులకు, రైతులకు సాధికారత కల్పించేందుకు “ప్రశాసన్ గావోఁకీ ఓర్” అన్న భావనపై దృష్టిని కేంద్రీకరించాలని, వారి ముంగిటికి మార్కెట్ అవకాశాలను అందుబాటులోకి తేవాలని గోయల్ పిలుపునిచ్చారు.  మన సృజనాత్మక ఆవిష్కర్తలపై దృష్టిని కేంద్రీకరించేందుకు,.. స్టార్టప్ ఇండియా, సృజనాత్మక వారోత్సవాలు వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం,.. స్వావలంబనకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిపోవాలని కేంద్రమంత్రి గోయల్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

   వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో ప్రధానమంత్రి ఇష్టాగోష్టి సమావేశం, 2021వ సంవత్సరపు జాతీయ స్టార్టప్ పురస్కారాల ప్రకటన, దూరదర్శన్ స్టార్టప్ చాంపియన్స్ 2.0 కార్యక్రమ ప్రారంభం, ప్రపంచ స్థాయి పెట్టుబడిదార్లు, స్వదేశీ నిధి సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం, డిజిటల్ వాణిజ్యం, డిజిటల్ వ్యూహంపై బహిరంగ వ్యవస్థ ప్రారంభం వంటి అంశాలు ఉంటాయి. ఆలాగే, ఈ సందర్భంగా జరిగే పలు సదస్సుల్లో  విద్యా మంత్రిత్వ శాఖ, నీతీ ఆయోగ్, ప్రధాన  విజ్ఞానశాస్త్ర సలహాదారు కార్యాలయం, బయోటెక్నాలజీ శాఖ, సైన్స్ టెక్నాలజీ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ, సాధికారతా మంత్రిత్వ శాఖ పాల్గొంటాయి. ‘మత్స్యశాఖ స్టార్టప్ కంపెనీల గ్రాండ్ చాలెంజ్’ పేరిట ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ స్టార్టప్ కంపెనీలకోసం ఉన్నతస్థాయి సదస్సులు, కార్పొరేట్ అనుసంధాన కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తారు.

*****(Release ID: 1789075) Visitor Counter : 212