రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

బాలికలకు సైన్యంలో చేరే సదవకాశం!


వంద కొత్త సైనిక్ స్కూళ్లతో
ఇది సాధ్యమేనన్నరాజనాథ్ సింగ్..

విద్యలో నాణ్యత, సృజనాత్మకతల ప్రోత్సాహంకోసం
సైనిక్ స్కూళ్లకు ర్యాంకులివ్వాలని
రక్షణమంత్రి సూచన..

Posted On: 08 JAN 2022 1:18PM by PIB Hyderabad

   “కొత్తగా వంద సైనిక్ స్కూళ్ల ఏర్పాటుతో బాలికలు సాయుధబలగాల్లో చేరేందుకు అవకాశం కలుగుతుంది. జాతీయ భద్రతా సేవల్లో వారూ పాలుపంచుకునేందుకు వీలవుతుంది,” అన్నారు కేంద్ర రక్షణమంత్రి రాజనాథ్ సింగ్. సైనిక్ స్కూళ్లపై ఈ నెల 8వ తేదీన జరిగిన వెబినార్ సదస్సుకు అధ్యక్షత వహించిన సందర్భంగా రాజనాథ్ సింగ్ ఈ అభిప్రాయం వ్యక్తంచేశారు. సాయుధ బలగాల్లో మహిళల పాత్ర పెరుగుతుందున్న నమ్మకం ప్రభుత్వానికి ఉందని, ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నామని చెప్పారు. సైనిక్ స్కూళ్లలో బాలికలకు ప్రవేశం కల్పించేందుకు తగిన మార్గాలను కల్పించడం, మహిళా అధికారుల నియామకంకోసం పర్మనెంట్ కమిషన్.ను ఏర్పాటు చేయడం తదితర చర్యలను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందన్నారు. కొత్తగా సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో దేశానికి బాలికలు సేవలందించాలన్న కలలు సాకారం కాలగలవని ఆయన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

   సైనిక్ స్కూళ్లను విస్తరింపజేయాలన్న నిర్ణయం గత ఆరేళ్లలో ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటని కేంద్రమంత్రి అన్నారు. దేశ పరిపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా బాలలకు అందించే మౌలిక విద్యలో ప్రమాణాలను మెరుగుపరచాలన్న ధ్యేయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సైనిక్ స్కూళ్లలో రక్షణను, విద్యతో మిళతం చేసే కార్యక్రమం, రాబోయే కాలంలో జాతి నిర్మాణంలో కీలకపాత్ర పోషించగలదన్నారు. ‘సైనిక్’ అనే పదం సమైక్యత, క్రమశిక్షణ, అంకిత భావాలకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుందని, ‘స్కూల్’ అనేది, విద్యకు కేంద్రమని అన్నారు. బాలలను సమర్థులైన పౌరులుగా తీర్చిదిద్దడంలో సైనిక్ స్కూళ్లు ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని రాజనాథ్ సింగ్ అన్నారు.

  దేశంలోని యువతకు నాణ్యమైన విద్యను అందించడంపై ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరిస్తోందని, సమాజం బహుముఖ అభివృద్ధికి విద్యే పటిష్టమైన పునాది కాగలదని ఆయన అన్నారు. “ఐక్యరాజ్యసమితి ఆమోదించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో నాణ్యమైన విద్య నాలుగవ లక్ష్యం. ఇక ‘నాణ్యమైన విద్య’  అన్న అంశం పరిధిలో అనేక ఇతర లక్ష్యాలు ఉన్నాయి. ఈ లక్ష్యాలన్నింటనీ సాధించాలన్నదే మా రాజకీయ దృఢ నిశ్చయం. ఇందుకోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ వంటి పథకాలు అమలవుతున్నాయి. వంద సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయడం ఈ దిశగా తీసుకున్న మరో ముఖ్యమైన చర్య.” అని రాజనాథ్ సింగ్ అన్నారు.

   మన దార్శనికులు, మహనీయులైన స్వామి వివేకానంద, మహాత్మగాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలను సైనిక్ స్కూళ్లు అమలు చేయడం అభినందనీయమన్నారు. బాలల విద్యతోపాటుగా, వారి శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆ మహనీయులంతా ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. సాయుధ బలగాలకోసం ఇప్పటివరకూ 7,000మందికి పైగా అధికారుల నియామకం జరగడానికి సైనిక్ స్కూళ్లు దోహదపడటం ఎంతో ప్రశంసనీయమన్నారు. సాయుధ బలగాలకు గతంలో అధిపతులుగా పనిచేసిన రిటైర్డ్ జనరల్ దీపక్ కపూర్, రిటైర్డ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ వంటి అధికారులు, సైనిక్ స్కూళ్లనుంచే వచ్చారన్నారు. అలాగే, నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియూ రియో, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డి. సుబ్బారావు, చలన చిత్రాల దర్శకుడు రాకేశ్ రోషన్ వంటి వారిని కూడా సైనిక్ స్కూళ్లే అందించాయన్నారు.

  విద్య ఎంతో కీలకమైన రంగమని, అనేక ఇతర రంగాల అభివృద్ధిలో కూడా విద్యారంగానికి పాత్ర ఉంటుందని రాజనాథ్ సింగ్ అన్నారు. బాలలు పరిపూర్ణ అభివృద్ధిని సాధించి, తద్వారా దేశం ‘ఆత్మనిర్భర భారత్’ కలను సాకారం చేసుకునేందుకు వీలుగా ప్రైవేటు రంగం ప్రభుత్వంతో చేయికలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “ప్రతి రంగంలో స్వావలంబన సాధించే దిశగా దేశం ఈ రోజు వేగంగా పురోగమిస్తోంది. రక్షణ, ఆరోగ్య, కమ్యూనికేషన్, పారిశ్రామిక, రవాణా రంగాల్లో దేశం నూతన శిఖరాలను అందుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేటురంగాల మధ్య చక్కని సమన్వయమే ఇందుకు కారణం. విద్యారంగంలో, చిన్నారుల బహుముఖ అభ్యున్నతిలో ఒక విప్లవం రావలసిన అవసరం ఉంది. రక్షణ, విద్యా రంగాలు, ప్రైవేటు రంగం మధ్య బలమైన సహాయ సహకారాలున్నపుడే ఇది సాధ్యమవుతుంది.” అని ఆయన అన్నారు. సైనిక్ స్కూళ్లను విస్తరింపజేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేందుకు ప్రైవేటు రంగం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

  దేశంలోని యువతకు తగినన్ని అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని కేంద్రమంత్రి పునరుద్ఘాటించారు. జాతీయ విద్యా విధానం-2020, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్.సి.సి.)లో ఖాళీలను పెంచడం, ఖేలో ఇండియా నిర్వహణ, స్టార్టప్ ఇండియా, ఫిట్ ఇండియా వంటివి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలని అన్నారు. యువజనులు, ఔత్సాహికులు తమ కలలను సాకారం చేసుకునేందుకు, తద్వారా దేశాన్ని నూతన ప్రగతి శిఖరాలకు చేర్చేందుకు ఈ కార్యక్రమాలన్నీ ఎంతగానో దోహదపడ్డాయన్నారు. సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయడం ఈ దిశగా గొప్ప మైలురాయివంటి పరిణామమేనని అన్నారు.

   దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్ల పనితీరు, ఆడిటింగ్ ప్రాతిపదికగా ఆ స్కూళ్లకు ర్యాంకులు కేటాయించేందుకు తగిన వ్యవస్థను రూపొందించాలని రక్షణ శాఖకు, సైనిక్ స్కూళ్ల సొసైటీకి రాజనాథ్ సింగ్ సూచన చేశారు. దీనివల్ల స్కూళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని, విభిన్నమైన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు వీలు కలుగుతుందని అన్నారు. పాఠ్యాంశాలతో పాటుగా, జాతీయ వాదం, దేశంపట్ల నిజాయతీ వంటివి పిల్లలకు అలవర్చాలని, వారి వ్యక్తిత్వ నిర్మాణానికి, దేశ ప్రయోజనాలకు ఇది దోహదపడుతుందని కేంద్రమంత్రి అన్నారు.

   ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు (ఎన్.జి.ఒ.లు), ప్రైవేటు స్కూళ్లు, వివిధ రాష్ట్రాల ఆధ్వర్యంలోని స్కూళ్ల భాగస్వామ్యంతో సైనిక్ స్కూళ్లను ప్రారంభించాలన్న ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతలోని కేంద్ర మంత్రివర్గం గత ఏడాది అక్టోబరు 12వ తేదీన ఆమోదించింది. ప్రస్తుత సైనిక్ స్కూళ్లకు భిన్నమైన రీతిలో ఈ స్కూళ్లు ప్రత్యేక శైలిలో పనిచేస్తాయి.

  ఈ సైనిక్ స్కూళ్లకు సంబంధించి, ఒక వెబ్.సైట్ ( https://sainikschool.ncog.gov.in )ను కూడా ప్రారంభించారు. భాస్కరాచార్య నేషనల్ ఇన్.స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ (బిశాగ్-ఎన్.) సహకారంతో ఈ వెబ్.సైట్ కు రూపకల్పన జరిగింది. అఫిలియేషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2021, అక్టోబరు 12న ప్రారంభమైంది. వెబ్ పోర్టల్.లో ఇప్పటివరకూ 137మంది దరఖాస్తుదారులు రిజిస్టర్ చేసుకున్నారు.

  సాయుధ బలగాల ప్రధాన అధిపతి జనరల్ ఎం.ఎం. నరవణే, వైమానికదళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌధరి, నావికాదళం అధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్, కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి అనితా కర్వాల్ తదితరులు వర్చువల్ పద్ధతిలో ఆన్.లైన్ ద్వారా ఈ వెబినార్ సదస్సుకు హాజరయ్యారు.

 

****


(Release ID: 1788638) Visitor Counter : 248