భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో తొలిసారిగా ఏర్పాటైన "ఓపెన్ రాక్ మ్యూజియం" ను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


భూమి చరిత్రను తెలియజేసే విధంగా వివిధ ప్రాంతాలకు చెందిన 530 లక్షల నుంచి 33 లక్షల సంవత్సరాల కాలం నాటి 35 రకాల రాళ్లు ప్రదర్శన

జ్ఞాన ఆర్థిక వ్యవస్థలో " బిగ్ ఎర్త్ డేటా" అత్యంత కీలకం.. ఈ రంగంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న భారత్ ... డాక్టర్ జితేంద్ర సింగ్

సిఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ), హైదరాబాద్ అధికారులు, శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి

సాధికార భారతదేశ నిర్మాణ సాధనకు భూగర్భ శాస్త్రం అంశాలు ఎంతగానో సహకరిస్తున్నాయి .. డాక్టర్ జితేంద్ర సింగ్

భూకంపాలు వచ్చే అవకాశం, భూకంపాలను తట్టుకుని నిలిచే వ్యవస్థ, అధ్యయనాలతో రూపొందించిన లక్నో, డెహ్రాడూన్ నగరాల భూకంప ప్రమాద మ్యాప్ లను విడుదల చేసిన మంత్రి.

Posted On: 06 JAN 2022 6:01PM by PIB Hyderabad

 హైదరాబాద్ సిఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లో వినూత్నంగా ఏర్పాటైన "రాక్ మ్యూజియం"ను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ (స్వతంత్ర), భూ శాస్త్ర సహాయ (స్వతంత్ర), ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి,అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ప్రారంభించారు. దేశంలో ఇటువంటి ప్రదర్శన ఏర్పాటు కావడం ఇదే తొలిసారి.  హైదరాబాద్ లో రెండు రోజుల పాటు మంత్రి పర్యటించనున్నారు. మ్యూజియం ను ప్రారంభించిన తరువాత డాక్టర్ జితేంద్ర సింగ్ సిఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 

 

తెలియని అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిని విద్యావంతులను చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన "ఓపెన్ రాక్ మ్యూజియం"లో  దేశం వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 35 రకాల రాళ్లను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో   530 లక్షల నుంచి 33 లక్షల సంవత్సరాల కాలం నాటి కొన్ని రాళ్లు కూడా ఉన్నాయి. భూమి అడుగు భాగాన 175 కిలోమీటర్ల లోతులో బయటపడిన రాళ్లు కూడా వీటిలో ఉన్నాయి. 

 

ఈ సందర్భంగా  శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్ జ్ఞాన ఆధారిత  ఆర్థిక వ్యవస్థలో బిగ్ ఎర్త్ డేటా" అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ అంశాన్ని గుర్తించిన భారతదేశం ఈ రంగంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోందని మంత్రి చెప్పారు. భూ శాస్త్ర రంగ అభివృద్ధికి గల నూతన  అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సాధికార భారతదేశ నిర్మాణ సాధనకు భూగర్భ శాస్త్రం అంశాలు ఎంతగానో సహకరిస్తున్నాయని పేర్కొన్న మంత్రి ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని  వివరించారు. 

వినూత్న విధానాలతో శాస్త్రీయ విధానాన్ని అమలు చేయడం ద్వారా సామాన్య ప్రజలకు  సౌలభ్య జీవన సౌకర్యం అందించవచ్చునని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రం సహకారంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాస్త్రవేత్తల సహకారం అందుతుందన్న ఆశతో ప్రజలు ఉన్నారని అన్నారు. తమపై ప్రజలు పెట్టుకున్న ఆశలు కార్యరూపం దాల్చేలా చూసేందుకు సమస్య పరిష్కారానికి శాస్త్ర, సాంకేతిక పరిష్కార మార్గాలు అన్వేషించాలని మంత్రి అన్నారు. సాధారణంగా కాకుండా వినూత్నంగా ఆలోచించి ప్రజల సమస్యలను పరిష్కరించే అంశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. శాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక ఆధారిత వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టుల అమలుకు పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. 

 

దేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలు ' అజాది కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్న సమయంలో  సిఎస్ఐఆర్ 80 సంవత్సరాల సేవలు పూర్తి చేసుకుని ప్రగతిపథంలో పయనిస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  శాస్త్ర రంగంతో సంబంధం కలిగి ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు శాస్త్ర సాంకేతిక అన్వేషణలకు ప్రాధాన్యత ఇచ్చి స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణానికి సహకరించాలని ఆయన కోరారు. మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం సాధించేందుకు ఇదే సరైన సమయమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.బలమైన  శాస్త్ర సాంకేతిక పునాదితో రక్షణ రంగం నుంచి ఆర్థిక రంగం వరకు ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉండాలని అన్నారు. 100 సంవత్సర స్వాతంత్రం పూర్తి చేసుకునేందుకు 25 సంవత్సరాల సమయం ఉందనిఈ సమయంలో కలలు సాకారం కావాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

భూమి ఆవిర్భావం,జీవన స్థితిగతుల అభివృద్ధి  అంశాలను లోతుగా అధ్యయనం చేసి నూతన అంశాలను వెలికితీయడానికి భూశాస్త్ర రంగాల్లో సిఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేపట్టనున్న పరిశోధనలను ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్ దేశ అభివృద్ధిలో రెండు సంస్థల కృషి దోహదపడుతుందని అన్నారు. ఈ తరహా పరిశోధనలు జీవరాశి మనుగడ సాగించేందుకు ఉపకరిస్తాయని తెలిపారు. 

 సిఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్  అభివృద్ధి చేసిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హెలి-బర్న్ సర్వే టెక్నాలజీని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి  డాక్టర్ జితేంద్ర సింగ్ గత ఏడాది  అక్టోబర్ నెలలో జోధాపూర్  లో ప్రారంభించారు. ఈ అంశాన్ని గుర్తు చేసుకున్న డాక్టర్ జితేంద్ర సింగ్ . రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తొలుత ఈ అధ్యయనాలు సాగుతున్నాయని చెప్పారు. 

 

నీటిని శుద్ధి చేసేందుకు సిఎస్ఐఆర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం అనేక లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ  సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపొందించిన “హార్ ఘర్ నల్ సే జల్' కార్యక్రమం లక్ష్యాల మేరకు అమలు జరిగేలా చూస్తున్నామని అన్నారు. భూగర్భ జలాల నాణ్యతను పరీక్షించేందుకు సిఎస్ఐఆర్ మరో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసిందని అన్నారు. దీని సహకారంతో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో భూగర్భ జలాలను తాగునీటి అవసరాల కోసం ఉపయోగించడానికి అవకాశం కలుగుతుందని మంత్రి అన్నారు. 

లక్నో మరియు డెహ్రాడన్ నగరాలకు ఉన్న  భూకంప ముప్పుపై రూపొందించిన మ్యాప్ లను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేశారు. వీటిని  యుపిఎస్డిఎంఎ, యుకెఎస్ డిఎంఎ ఛైర్ పర్సన్ లకు / ప్రతినిధులకు మంత్రి అందజేశారు. ఇండో-గాంగెటిక్ మైదాన ప్రాంతాల్లో భవిష్యత్తులో లక్నో, డెహ్రాడున్ నగరాలు భూకంపాలకు గురయ్యే ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. భూకంప ప్రమాద తీవ్రత, భూకంపం వచ్చినప్పుడు అమలు చేయవలసిన చర్యలు, భూకంపాలను తట్టుకునే విధంగా ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు, వంతెనలు, ఆనకట్టలు నిర్మించడం లాంటి అంశాలను ఈ మ్యాప్ లలో పొందుపరిచారని మంత్రి వివరించారు. ఉత్తరఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు యాజమాన్య సంస్థలకు కూడా అందించారు. వీటి ఆధారంగా భూమి వినియోగంలో మార్పులు చేసి, భవన నిర్మాణ అనుమతుల్లో అవసరమైన మార్పులు చేస్తామని అధికారులు వివరించారు. 

సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాలను సిఎస్ఐఆర్,ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ వీఎం త్యాగి వివరించారు. సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే కూడా సమావేశంలో ప్రసంగించారు. 

***


(Release ID: 1788133) Visitor Counter : 261


Read this release in: English , Urdu , Marathi , Hindi