జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జవుళి సంస్కరణలకు సాక్షిగా నిలిచిన 2021.


రూ. 4,445 కోట్లతో 7 పి.ఎం. మిత్రా పార్కుల
ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం..

పి.ఎం. మిత్రాపార్కుల ద్వారా
ప్రపంచ శ్రేణి పారిశ్రామిక సదుపాయాలు..


ఒక్కో పార్కు ద్వారా లక్షమందికి ప్రత్యక్షంగా
, 2 లక్షలమందికి పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి..

2021-22 నుంచి 2025-26 వరకూ
సమీకృత ఉన్నిహేతుబద్ధీకరణ,
అభివృద్ధి కార్యక్రమం..

Posted On: 27 DEC 2021 3:44PM by PIB Hyderabad

    జవుళి పరిశ్రమ, జవుళి ఉత్పత్తులకు సంబంధించి ఇతర దేశాలతో పోల్చితే భారతదేశానికి ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. దుస్తుల ఉత్పాదనకోసం ఇతర దేశాలైతే ముడిపదార్థాలైన నూలు తదితర సరకులను దిగమతి చేసుకోవలసి ఉంటుంది. ఈ విషయంలో భారత దేశానికి సొంతంగా భారీ స్థాయి మార్కెట్టు అందుబాటులో ఉంది. అందుబాటు యోగ్యంగా మానవ వనరులతో భారతదేశ జవుళి ఉత్పత్తుల మార్కెట్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్వదేశీ జవుళి ఉత్పత్తి, వస్త్రాల ఉత్పాదన దాదాపు 140 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉంది. అంటే ఇందులో 40 బిలియన్ల అమెరికన్ డాలర్ల జవుళి ఉత్పాదనలు, దుస్తులు ఎగుమతి అవుతూ వస్తున్నాయి. 2019వ సంవత్సరంలో స్వదేశీ ఉత్పత్తిలో 2శాతం మేరకు జవుళి ఉత్పాదనలు, వస్త్రాల ఉత్తత్తి జరిగింది. మొత్తం విలువల జోడింపులో 11శాతం మేర జవుళి ఉత్పాదనలు, దుస్తుల ఉత్పాదనలు కీలక పాత్ర వహించినట్టు కనిపిస్తోంది.

  దాదాపు అన్ని రకాల ముడి సామగ్రి అందుబాటులో ఉండటం, దేశంలో యువజనుల జనాభా ఎక్కువగా ఉండటం, పారిశ్రామిక రంగాన్ని నడిపేవారిలో ఔత్సాహిక తత్వం, ప్రభుత్వంనుంచి నిరాటంకంగా మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన నవీకరణ, సృజనాత్మకతపై దృష్టిని కేంద్రీకరించడం, మద్దతు ఇచ్చే పరిశ్రమలు ఎక్కువగా ఉండటం... ఇలాంటి సానుకూల పరిస్థితుల కారణంగా దేశంలో జవుళి రంగం రానున్న దశాబ్దంలో ఆరోగ్యకర రీతిలో పురోగతి సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర పరిశ్రమలతో పోల్చినపుడు జవుళి పరిశ్రమలో ఉపాధి కల్పనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో ప్రతి కోటి రూపాయల (1,32,426 అమెరికన్ డాలర్లు) పెట్టుబడికి దాదాపు 70 ఉద్యోగాలు అంటే సగటున 30 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. ఇతర రంగాలతో పోల్చినపుడు ఈ విషయంలో సగటున 12 ఉద్యోగాల కల్పనకు మాత్రమే  అవకాశం ఉంది. జవుళి రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10.5కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంది. దేశంలో అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించడంలో వ్యవసాయం తర్వాతి స్థానం జవుళి రంగానిదే అవుతుంది. దుస్తుల తయారీ రంగంలోని సిబ్బందిలో 70శాతం మంది మహిళలు ఉండగా, చేనేత రంగంలో ఉపాధి పొందే వారిలో 73శాతం మంది మహిళలు ఉన్నారు. జవుళి రంగపు తయారీ కేంద్రంగా భారతదేశం ఎదగడం అనేది, స్వదేశీ మార్కెట్టుకు ఉన్న ఆకర్షణ స్వభావంపై, జవుళి రంగంలో ఎక్కువ నాణ్యత కలిగిన పెట్టుబడులపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి అనంతరం నెలకొన్న పరిస్థితుల్లోరూ. 7,000కోట్లతో పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పి.పి.ఇ.) సూట్ల పరిశ్రమను కేవలం మూడు నెలల కాలంలో నిర్మించడం, పి.పి.ఇ. కిట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవ దేశంగా భారత్ నిలవడం కేంద్ర జవుళి మంత్రిత్వ శాఖ సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు.

ఇటీవలి కాలంలో జవుళి మంత్రిత్వ శాఖ ఈ కింది కీలక చర్యలు తీసుకుంది:

 పి.ఎం. మిత్రా పార్కులు: ప్రధానమంత్రి భారీ సమీకృత జవుళి ప్రాంతం, దుస్తుల పార్కుల (మిత్రాల) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఐదేళ్లలో మొత్తం రూ. 4,445కోట్ల పెట్టుబడితో పి.ఎం. మిత్రా పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పార్కుల ఏర్పాటుకు సంబంధించి ప్రపంచ శ్రేణి పారిశ్రామిక మౌలిక సదుపాయాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సదుపాయాల ఆకర్షణతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు, స్థానిక పెట్టుబడులు ప్రవేశిస్తాయి. 

  పి.ఎం. మిత్రా పార్కులు ‘ఎఫ్’ అనే అక్షరంతో మొదలయ్యే ఐదు విభాగాలను కలిగి ఉంటాయి. ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్...అంటూ ఐదు విభాగాలను ఈ పి.ఎం. మిత్రా పార్కులు ఆవరించి ఉంటాయి. జవుళి పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు ఉన్న ప్రాంతాల్లోనే ఏర్పాటయ్యేలా పి.ఎం. మిత్రా పార్కులను రూపొందించారు.  ఒకే ప్రాంతంలో నూలు వడకటం, నేత, ప్రాసెసింగ్, రంగుల అద్దకం, ప్రింటింగ్ ప్రక్రియలనుంచి దుస్తుల తయారీ వరకూ అన్ని దశల్లో సమీకృత జవుళి విలువల వ్యవస్థను సృష్టించేందుకు తగిన అవకాశాలను పి.ఎం. మిత్రా పార్కులు కల్పిస్తాయి. దీనితో జవుళి పరిశ్రమకు రవాణా, నిల్వ తదితర ఖర్చులు ఆదా అవుతాయి. ప్రతి పార్కు ద్వారా లక్షమందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధిని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జవుళి రంగానికి ఉత్పాదకతతో సంధానించిన ప్రోత్సాహక (పి.ఎల్.ఐ.) పథకం:

   ఉత్పాదకతతో సంధానించిన ప్రోత్సాహక పథకాన్ని (పి.ఎల్.ఐ.పథకాన్ని) ప్రత్యేకించి ఎక్కువ విలువలతో కూడిన జవుళి రంగంకోసం కేంద్రీకరిస్తారు. మానవ తయారీ ఫైబర్ (ఎం.ఎం.ఎఫ్.)నుంచి సాంకేతికంగా అభివృద్ధి చేసిన జవుళి విభాగాలకు దీన్ని విస్తరిస్తారు. ఈ పథకం కింద ఎం.ఎం.ఎఫ్. దుస్తులు, ఇతర జవుళి ఉత్పాదనల తయారీకి ఐదేళ్ల పాటు రూ. 10,683 కోట్ల మొత్తాన్ని అందిస్తారు. దీనితో నూలు, ఇతర సహజ ఫైబర్ ఆధారిత జవుళి పరిశ్రమకు మంచి ఊతం లభిస్తుంది. ఇది ఉపాధికి, వాణిజ్యానికి నూతన అవకాశాలను కల్పిస్తుంది. ఎగుమతులను పెంచుతుంది.

 

రాష్ట్ర, కేంద్ర పన్నులు, సుంకాల్లో రిబేటు పథకం (ఆర్.ఒ.ఎస్.సి.టి.ఎల్. పథకం), సుంకాల నిర్మాణం : భారతీయ తయారీ దుస్తుల ఎగుమతుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు, రాష్ట్ర, కేంద్ర పన్నులు, సుంకాల్లో రిబేటు సదుపాయ పథకాన్ని 2024వ సంవత్సరం మార్చి వరకూ పొడిగించే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎం.ఎం.ఎఫ్. ఫైబర్, ఎం.ఎం.ఎఫ్. నూలు, ఎం.ఎం.ఎఫ్. బట్టలు, దుస్తులపై 12శాతంతో ఏకరూప వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) విధింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మారిన పన్ను రేట్లు 2022 జనవరి ఒకటవ తేదీనుంచి వర్తిస్తాయి. దీనితో ఎం.ఎం.ఎఫ్. కేటగిరీ అభివృద్ధి చెంది ఉద్యోగాల కల్పనలో ప్రధాన పాత్ర వహించే అవకాశం ఉంది.

 

సాంకేతిక పరిజ్ఞాన నవీకరణ నిధి సవరణ పథకం (ఎ.టి.యు.ఎఫ్.ఎస్.):

సాంకేతిక పరిజ్ఞాన నవీకరణ నిధి పథకం (టి.యు.ఎఫ్.ఎస్.) అనేది రుణ పరపతితో అనుసంధానమైన సబ్సిడీ పథకం. భారతీయ జవుళి పరిశ్రమ ఆధునికీకరణ, సాంకేతిక పరిజ్ఞాన నవీకరణ ధ్యేయంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా సులభతర వాణిజ్య నిర్వహణకు ప్రోత్సాహం, ఉద్యోగాల కల్పన, ఎగుమతులకు ప్రోత్సాహం వంటి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎ.టి.యు.ఎఫ్.ఎస్. పథకాన్ని రూ. 5,151కోట్ల కేటాయింపుతో చేపట్టారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎం.ఎస్.ఎం.ఇ.)లకు మద్దతు అదించడంపై దృష్టిని కేంద్రీకరిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

 

సాంకేతిక జవుళి: సాంకేతిక జవుళి అనేది కొత్త తరపు ఉత్పాదన. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు రంగాల్లో దీన్ని వర్తింప జేస్తున్నారు. మౌలిక సదుపాయాలు, నీరు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, రక్షణ రంగం, భద్రతా రంగం, ఆటోమొబైల్ రంగం, పౌరవిమానయాన రంగాల్లో దీన్ని చేపట్టారు. ఆయా రంగాల్లో సామర్థ్యాలను ఇది మెరుగుపరిచి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేలా చూస్తుంది. జవళి రంగంలో పరిశోధనా, అభివృద్ధి ప్రక్రియలను ప్రోత్సహించేందుకు జాతీయ సాంకేతిక జవుళి పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించింది.

.

సమర్థ్ (నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యాల నిర్మాణం): సమర్థ్ అనేది ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కార్యక్రమం. జవుళి వ్యవస్థలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘటిత రంగంలో లాభదాయకమైన ఉపాధి కల్పన, సంప్రదాయ రంగపు నేత సిబ్బంది, కళాకారుల నైపుణ్యాల నవీకరణ ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటివరకూ మొత్తం 71 జవుళి తయారీదార్లకు, 10 పారిశ్రామిక సంస్థలకు, 13 రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలకు, 4 రంగాలవారీ సంస్థలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. 3.45 లక్షలమంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఈ పథకం చేపట్టారు.

  సహజ సిద్ధమైన ఫైబర్లు: జవుళికి సంబంధించి సహజ సిద్ధమైన నూలు, పైబర్లకు భారతదేశం ఎప్పటినుంచో అగ్రగామి దేశంగా ఉంటోంది.

  పట్టు: పట్టు పరిశ్రమకు భారతదేశం పెట్టింది. అద్భుతమైన, విభిన్నమైన, సంప్రదాయబద్ధమైన వివిద రకాల పట్టు వస్త్రాలకు భారతదేశం ఎప్పటినుంచో ప్రసిద్ధి. పట్టు పరిశ్రమలో అగ్రగామిగా స్థానం సంపాదించింది. పట్టు ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారతదేశానిదే. ప్రపంచ పట్టు ఉత్పత్తిలో 32శాతం భారతదేశంనుంచే జరుగుతోంది. భారతదేశపు పట్టు పరిశ్రమ పూర్తి పరిమాణం రూ. 75,000కోట్లుగా అంచనా వేశారు. దేశవ్యాప్తంగా పట్టు పరిశ్రమకు సంబంధించి పెట్టుబడులు, ఉత్పత్తి, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన వంటి రంగాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కేంద్ర రంగ పథకమైన “సిల్క్ సమగ్ర” ద్వారా పట్టు పరిశ్రమకు పరిశోధనా, అభివృద్ధి పరమైన మద్దతు, సాంకేతిక, ఆర్థిక సహాయం లభిస్తోంది. పట్టు నాణ్యతను, ఉత్పత్తిని పెంచేందుకు ఈ మద్దతు అందిస్తున్నారు. సంవత్సరం అంతర్జాతీయ గ్రేడులోని రెండు తరాల పట్టుగూళ్లను ఉత్పత్తి చేయడంలో ఆత్మనిర్భర భారత్ స్థాయిని సాధించడంపైనే ప్రధానంగా దృష్టని కేంద్రీకరిస్తూ ఈ పథకం చేపట్టారు. “భారతీయ. పట్టు” పేరిట బ్రాండు పట్టు ఉత్పాదనను ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రోత్సహిస్తున్నారు.

  పత్తి: కనీస మద్దతు ధరను (ఎం.ఎస్.పి.ని) అమలుచేసే కార్యక్రమంలో భాగంగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ.) ద్వారా 26లక్షల బేళ్ల పత్తిని సేకరించగలిగారు. దాదాపు 6 లక్షల మంది పత్తి రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేయడంతో వారికి రూ. 7,600 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది.   

  జనపనార: దేశంలో ముడి జనపనార నాణ్యతను మెరుగుపరచడానికి, దిగుబడిని పెంచేందుకు  జనపనార ఐకేర్ పథకాన్ని అమలు చేశారు. ఎం.ఎస్.ఎం.ఇ. జనపనార అభివృద్ధి యూనిట్లకు ముడి సరకులను మిల్లు గేటు ధరలకే సరఫరా చేసేందుకు జనపనార ముడి సరకుల బ్యాంకు (జె.ఆర్.ఎం.బి.) పథకాన్ని అమలు చేశారు. జనపనారతో విభిన్నమైన వస్తువుల తయారీ లక్ష్యంగా ఈ పథకం చేపట్టారు.

ఉన్ని: సమీకృత ఉన్ని అభివృద్ధి కార్యక్రమం (ఐ.డబ్ల్యుడి.పి.) హేతుబద్ధీకరణ, కొనసాగింపునకు కేంద్ర జవుళి మంత్రత్వ శాఖ ఆమోదం తెలిపింది. 2021-22నుంచి 2025-26వరకూ మొత్తం 126కోట్ల ఆర్థిక కేటాయింపుతో ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ఉన్ని పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా ‘ఉన్ని ప్రాసెసింగ్ పథకం’ చేపట్టారు.

 

సంప్రదాయబద్ధమైన జీవనోపాధి జవుళి రంగం – చేనేతలు, హస్తకళా ఖండాలు :

చేనేత వస్త్రాల తయారీ పరిశ్రల అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం, దేశవ్యాప్తంగా చేనేత రంగానికి ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా పలు పథకాలను కేంద్ర జవుళి మంత్రిత్వ శాఖ అమలు చేస్తూ వస్తోంది. చేనేత ఉత్పాదనల మార్కెటింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు చేనేత ఎగుమతి ప్రోత్సాహక మండలి (హెచ్.ఇ.పి.సి.) పలు చర్యలు తీసుకుంటోంది.  చేనేత కార్మికులకోసం అంతర్జాతీయ, దేశీయ ప్రదర్శనలు, మార్కెటింగ్ వ్యవహారాలపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది.

  హస్తకళాఖండాల పర్యాటక గ్రామం అనే భావన ద్వారా జవుళి రంగాన్ని పర్యాటక రంగంతో అనుసంధానం చేయడం అధునాతన కాలం భావన. ఈ చర్య ద్వారా హస్తకళలకు ప్రోత్సాహం, పర్యాటక కార్యకలాపాల నిర్వహణ ఒకేసారిగా జరిపిస్తున్నారు. ఇప్పటికే 13 హస్తకళల గ్రామాలను గుర్తించారు.

నేత కార్మికులకు, ఆర్టిసాన్లకు నేరుగా అనుసంధానం కల్పనపై దృష్టి: చేనేత కార్మికులకు, ఆర్టిసాన్లకు, హస్తకళా నిపుణులకు ప్రత్యక్ష మార్కెటింగ్ వేదికను కల్పించేందుకు కేంద్ర జవుళి మంత్రిత్వ శాఖ ఈ కామర్స్ వేదికను రూపొందిస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా ఈ కామర్స్ వేదికను నిర్వహించనున్నారు. తొలిదశలో అమ్మకం కోసం ఈ-కామర్స్ పోర్టల్.లో పొందుపరిచేందుకు దేశవ్యాప్తంగా 205 హస్తకళా ఖండాలకు, చేనేత క్లస్టర్లకు చెందిన వారిని ఎంపిక చేశారు. దీనికి తోడు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ-మార్కెట్ పోర్టల్.లో హస్తకళాకారుల, చేనేత కళాకారుల పేర్లను రిజిస్టర్ చేయిస్తున్నారు. వారి వారి ఉత్పాదనలను నేరుగా ప్రభుత్వం ఆధ్వర్యంలోని మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు విక్రయించేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకూ లక్షన్నర మంది చేనేత కార్మికులను ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోర్టల్.లో రిజిస్టర్ చేశారు.

  భారతీయ ఆటబొమ్మలకు ప్రోత్సాహం: ఆటబొమ్మల ఉత్పత్తికి ప్రోత్సాహం కల్పించడానికి ప్రతి ఒక్కరూ సమైక్యం కావాలంటూ “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు, ఆటబొమ్మల పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిగా ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించింది. హస్తకళా ఖండాలు, చేతి తయారీ ఆటబొమ్మలకు కూడా కూడా దీన్ని వర్తింపజేస్తున్నారు. ఆటబొమ్మల పరిశ్రమకు ప్రోత్సాహం కోసం కేంద్రప్రభుత్వానికి చెందిన 14 మంత్రిత్వ శాఖలు, విభాగాల సహకారంతో ఒక జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళికను కూడా తయారు చేశారు.

****


(Release ID: 1785668) Visitor Counter : 246