ఉప రాష్ట్రపతి సచివాలయం
విధుల నిర్వహణ, కుటుంబ బాధ్యతల మధ్య సరైన సమన్వయం ఉండాలి
• వివిధ రంగాల్లోని నిపుణులు, పారిశ్రామికవేత్తలకు ఉపరాష్ట్రపతి సూచన
• ఉద్యోగ-కుటుంబ బాధ్యతల సమన్వయాన్ని పెంపొందించే దిశగా మానవ వనరుల విధివిధానాల్లో నిబంధనల రూపకల్పన జరగాలి
• యువ పారిశ్రామికవేత్తలు క్రీడలు, ఇతర శారీరక కార్యక్రమాలకు దైనందిన జీవితంలో చోటు కల్పించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన
• భారతదేశ ఘనమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడుకుని, ముందుకు తీసుకెళ్లాలని యువతకు సూచన
• ‘డాక్టర్ వి.ఎల్. దత్ - గ్లింప్సెస్ ఆఫ్ ఎ పయనీర్స్ లైఫ్ జర్నీ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి*
Posted On:
27 DEC 2021 2:39PM by PIB Hyderabad
కుటుంబ జీవితానికి, వృత్తి ఉద్యోగాల్లో విధుల నిర్వహణకు మధ్య సరైన సమన్వయంతో పాటు, ఈ రెండింటికీ సమానమైన ప్రాధాన్యతను అందించే విధంగా జీవన విధానాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అప్పుడే పరిపూర్ణమైన జీవితాన్ని గడిపేందుకు, భవిష్యత్ లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేందుకు వీలవుతుందన్నారు.
సోమవారం చెన్నైలో ‘డాక్టర్ వి.ఎల్. దత్ - గ్లింప్సెస్ ఆఫ్ ఎ పయనీర్స్ లైఫ్ జర్నీ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి, కార్యక్రమానికి హాజరైన పారిశ్రామికవేత్తలు, యువకులు, వివిధ రంగాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ జీవితం, విధుల నిర్వహణను సమన్వయం చేసుకోవడాన్ని ప్రోత్సహించేటటువంటి విధివిధానాలను రూపొందించాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. తద్వారా ఉద్యోగులు మరింత సామర్థ్యంతో, సమన్వయంతో పనిచేయడంతోపాటు, సమాజం ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు కూడా వీలువుతుందని పేర్కొన్నారు.
ఈ దిశగా కృషి చేసిన పారిశ్రామికవేత్త దివంగత శ్రీ వి.ఎల్. దత్ గారి జీవితం నుంచి ఇలాంటి అనేక ఆదర్శాలను అర్ధం చేసుకుని ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి దిశానిర్దేశం చేశారు. కుటుంబాన్ని, విధులను వారు చక్కటి సమన్వయంతో నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన ఆయన శ్రీ దత్ గారు ప్రజల మనిషి అని ప్రశంసించారు. పనిచేసే చోట ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చేవారని, కుటుంబంతోనూ ఇదే తీరుగా వ్యవహరించేవారని పేర్కొన్నారు. నేటి వ్యాపార వాతావరణంలో అన్నింటికీ సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం లోపించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఉపరాష్రపతి సూచించారు.
స్థాయితో, హోదాలతో సంబంధం లేకుండా, ఎలాంటి అంతరాల్లేకుండా అందరినీ ఒకేలా పలకరించే శ్రీ దత్ గారి జీవితాన్ని పుస్తకంగా తీసుకురావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఈ పుస్తకంలో తన భర్త గురించి శ్రీమతి ఇందిరా దత్.. తన జ్ఞాపకాలను, అనుభవాలను మనసుకు హత్తుకునేలా చక్కగా వివరించారన్నారు. ఈ పుస్తకం ఓ మంచి వ్యాపారవేత్త జీవితంలోని మానవత్వపు కోణాన్ని ఆవిష్కరిస్తుందని, ప్రతి పాఠకుడు తనను తాను ఈ పాత్రలో అన్వయించుకునేంత అర్థవంతంగా రాశారని ఆయన ప్రశంసించారు.
ఒక ఉన్నతమైన, ధనవంతుల కుటుంబంలో పుట్టిన శ్రీ దత్ గారి నిరాడంబర మనస్తత్వాన్ని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, ఓ గొప్ప కార్పొరేట్ లీడర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంప్రాదించుకున్నప్పటికీ తనకంటే పెద్దవారిని గౌరవించే విషయంలో ఆయన సంకోచించేవారు కాదన్నారు. నేటి యువతరం శ్రీ వీఎల్ దత్ గారి జీవితం నుంచి ప్రేరణ పొందాలని సూచించారు.
ఉమ్మడికుటుంబ వ్యవస్థ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రత్యేకతను ప్రపంచానికి చాటిందన్న ఉపరాష్ట్రపతి, విదేశాల్లోనూ మన కుటుంబ వ్యవస్థపై ఎంతో గౌరవం ఉందన్నారు. నేటి సమాజంలో వివిధ కారణాల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమౌతున్న నేపథ్యంలో, పరస్పర సంరక్షణ, కుటుంబంలో ఒకరి గురించి మరొకరు ఆలోచించే పరిస్థితులు, సంయుక్త నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రోజు రోజుకూ తగ్గిపోతుండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. యువత ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పునరుద్ధరించే దిశగా ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
శ్రీ వి.ఎల్. దత్ గారితో తమ వ్యక్తిగత అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, తమ ఇద్దరి మధ్య క్రీడలు మొదలుకుని ఎన్నో విషయాల్లో ఏకాభిప్రాయం ఉండేదన్నారు. క్రీడల పట్ల అమితాసక్తి కనబరిచే ఆయన, జీవితాన్ని ఎంతో ఉత్సాహంగా గడిపిన విషయాన్ని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో క్రీడలను, ఇతర శారీరక వ్యాయామాలను యువత తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి దిశానిర్దేశం చేశారు.
శ్రీ దత్ గారు పారిశ్రామికవేత్తగా, సామాజికవేత్తగా, సామాజికాభివృద్ధిలో, దేశాభివృద్ధిలో దూరదృష్టి కలిగిన వ్యక్తిగా తమదైన ప్రత్యేకతను సంపాదించుకున్నారన్న ఉపరాష్ట్రపతి, వారి జీవితమంతా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూనే ఉన్నారన్నారు. ఫిక్కీ అధ్యక్షుడిగా ప్రభుత్వం, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే విషయంలో 1991-92 సమయంలో శ్రీ దత్ గారు కీలకమైన పాత్ర పోషించిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
సమాజం నుంచి ఏమీ ఆశించకుండా, ఎలాంటి షరతుల్లేకుండా తాను అనుకున్న దాన్ని ఇవ్వడం శ్రీ దత్ గారి నైజమన్న ఉపరాష్ట్రపతి, వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజికాభివృద్ధికి ఎంతగానో కృషిచేశారన్నారు. కళాశాలల నిర్మాణానికి, నైపుణ్యాభివృద్ధికి, వైద్యవసతుల కల్పనకు తనవంతు సహాయాన్ని అందించారని పేర్కొన్నారు.
వ్యాపారవేత్తగానే గాక, వ్యక్తిగా ఉన్నతమైన జీవన విధానాన్ని గడిపిన శ్రీ దత్ గారి జీవితాన్ని పుస్తకరూపంలో అందుబాటులోకి తీసుకొచ్చిన, ఆయన సతీమణి శ్రీమతి వి.ఎల్. ఇందిరాదత్ గారిని, వారి ఆలోచనలకు చక్కటి అక్షరరూపాన్ని అందించిన శ్రీ యు. ఆత్రేయ శర్మ గారిని, కుమారి అంబికా అనంత్ గారిని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభినందించారు.
****
(Release ID: 1785521)
Visitor Counter : 175