పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పర్యాటక రంగానికి ప్రోత్సాహం:


పర్యాటక రంగ సేవలకు గాను రుణ హామీ పథకం కింద చెక్కులు, మంజూరు పత్రాలు అందజేసిన - కేంద్ర మంత్రి శ్రీ. జి కిషన్ రెడ్డి

Posted On: 26 DEC 2021 7:26PM by PIB Hyderabad

రుణ హామీ పథకం కింద రుణాలు మంజూరైన కోవిడ్ ప్రభావిత పర్యాటక రంగ సేవలకు (ఎల్.జి.ఎస్.సి.ఏ.టి.ఎస్.ఎస్) చెందిన భాగస్వాములకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, డి.ఓ.ఎన్.ఈ.ఆర్. శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి చెక్కులు, మంజూరు పత్రాలు అందజేశారు. 

 

ఈ సందర్భంగా, దక్షిణ ప్రాంత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆదివారం, హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో, కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేవాలయాల పట్టణమైన భద్రాచలంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామనీ,  అది 'రామాయణ సర్క్యూట్' లో చివరి కేంద్రమని, తెలియజేశారు.  పర్యాటక రంగ అభివృద్ధి పై ఒక ముసాయిదా విధానాన్ని రూపొందిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.

 

కోవిడ్ -19 మహమ్మారి వల్ల అత్యంత ప్రతికూలంగా ప్రభావితమైన సేవా రంగాలలో పర్యాటక రంగం ఒకటని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  పర్యాటక పరిశ్రమకు సంబంధించిన భాగస్వాముల జీవనోపాధిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది.  "భాగస్వాముల వ్యాపారాలు, జీవనోపాధిని పునరుద్ధరించడానికి సహాయపడి, వారి కష్టాలను తగ్గించడానికి, రుణ హామీ పథకం కింద రాయితీ ధరలతో రుణ రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారు." అని ఆయన చెప్పారు.  ఈ పథకం కింద, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, పర్యాటక రవాణా నిర్వాహకులు,  రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన స్థానిక గైడ్‌ లతో పాటు,  కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన ప్రాంతీయ స్థాయి టూరిస్ట్ గైడ్‌ లు ప్రధానంగా లబ్దిపొందనున్నారు. 

 

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దక్షిణ ప్రాంత కార్యాలయం గుర్తించిన దాదాపు 32 మంది ఎల్.జి.ఎస్.సి.ఏ.టి.ఎస్.ఎస్. దరఖాస్తుదారులు, ఈ రోజు నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రుణ హామీ పథకం కింద చెక్కులు, మంజూరు పత్రాలు స్వీకరించారు.

ఈ పథకం కింద, పర్యాటక మంత్రిత్వ శాఖ ఆమోదించిన ప్రతి దరఖాస్తుదారునికి 10 లక్షల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందించడం జరుగుతోంది.  అదే విధంగా, పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన ప్రతి ప్రాంతీయ టూరిస్ట్ గైడ్‌ కు, రాష్ట్ర ప్రభుత్వం / కేంద్రపాలిత ప్రాంతం గుర్తించిన ప్రతి టూరిస్ట్ గైడ్‌ కు ఒక లక్ష రూపాయలవరకు ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుంది. 

ఈ కార్యక్రమంలో పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, దక్షిణ భారత రాష్ట్రాల పర్యాటక శాఖల సీనియర్ అధికారులతో పాటు, పర్యాటక పరిశ్రమ లోని వివిధ విభాగాల భాగస్వాములు పాల్గొన్నారు.

*****

 


(Release ID: 1785423) Visitor Counter : 127


Read this release in: Urdu , English , Hindi , Punjabi