గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చెత్త రహితంగా నగర భారతం!
స్టార్ రేటింగ్ ప్రొటోకాల్.తో కొత్త ప్రణాళిక ప్రారంభం..
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆధ్వర్యంలో రోడ్.మ్యాప్ ఆవిష్కరణ
Posted On:
24 DEC 2021 4:49PM by PIB Hyderabad
దేశంలోని నగరాలను చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు సంబంధించిన కొత్త ప్రొటోకాల్ ఈ రోజు ప్రారంభమైంది. ‘చెత్త రహిత నగరాలు-టూల్ కిట్ 2022, ఆజాదీ@75 స్టార్ రేటింగ్ ప్రోటోకాల్' పేరిట ఈ రోడ్.మ్యాప్.ను, టూల్ కిట్.ను ఆవిష్కరించారు. “సుపరిపాలనా దినోత్సవం” సందర్భంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఒ.హెచ్.యు.ఎ.) ఈ నూతన ప్రొటోకాల్.కు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా చెత్త రహిత నగరాలను తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నిర్వహణకు దోహదపడే అతి కీలకమైన పరిపాలనా ఉపకరణంగా ఈ టూల్ కిట్.ను రూపొందించారు.
పట్టణ ప్రాంతాలకోసం ఉద్దేశించిన స్వచ్ఛభారత్-అర్బన్ రెండవ దశ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 అక్టోబరు ఒకటవ తేదీన ప్రారంభించారు. “చెత్త రహిత నగరాలు” (జి.ఎఫ్.సి.) సృష్టించడం, తద్వారా సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణతో, వ్యర్థాల నిర్వహణతో భారతదేశాన్ని నూతన ప్రగతి పథంలో నడిపించడం అన్న దార్శనికతతో ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి కలలను సాకారం చేసేందుకు ప్రతి పట్టణ స్థానిక పరిపాలనా సంస్థనూ చెత్త రహితంగా తీర్చిద్దడంలో 3 స్టార్ రేటింగ్ సాధించడమే స్వచ్ఛ భారత్ అర్బన్ రెండవ దశ ధ్యేయంగా నిర్దేశించుకున్నారు.
చెత్త రహిత నగరాలకు ప్రక్రియకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియ ఇటీవలే ముగిసింది. పట్టణ స్థానిక పరిపాలనా సంస్థల్లో 50శాతం (అంటే 2,238 నగరాలు) ఈ సర్టిఫికేషన్ ప్రక్రియలో పాలుపంచుకున్నాయి. ప్రక్రియలో పాలుపంచుకున్న నగరాల్లో 299 నగరాలకు చెత్తరహిత నగరాలుగా యోగ్యతా పత్రాలను జారీ చేశారు. చెత్త రహిత స్థాయిలో,.. 9 నగరాలకు ఫైవ్ (5) స్టార్ రేటింగ్, 143 నగరాలకు త్రీ (3) స్టార్ రేటింగ్, 147 నగరాలకు వన్ (1) స్టార్ రేటింగ్ లభించింది.
‘చెత్త రహిత నగరాలు’ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వివిధ నగరాల్లో వ్యర్థాల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితిని మెరుగుపరచడంలో స్టార్ రేటింగ్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ప్రభావాన్ని పరిశీలించిన అనంతరం భారత ప్రభుత్వ నిధుల విడుదల ప్రక్రియకు కొన్ని షరతులు విధించింది. ఏదైనా పట్టణ పరిపాలనా సంస్థ కనీసం ఒక్కటైనా స్టార్ సర్టిఫికేషన్ సాధించి ఉండాలన్న షరతును విధించారు. పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ప్రతి పట్టణ స్థానిక సంస్థ కేంద్ర నిధులను పొందాలన్నా, స్వచ్ఛ భారత్ అర్బన్ పథకం రెండవ దశ కింద అనుకున్న లక్ష్యాలు సాధించాలన్నా సదరు స్థానిక పరిపాలనా సంస్థలు ఈ సర్టిఫికేషన్ ప్రక్రియలో పాల్గొని, చెత్తరహిత నగరాల రేటింగ్ సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం చెత్త రహిత నగరాల ఏర్పాటుకు ప్రస్తుతం పాటిస్తున్న నియమ నిబంధనలను పూర్తిగా ప్రక్షాళన చేసి, మధింపు ప్రక్రియను సరళతరం చేయడం అవసరమని భావించారు. తద్వారా జి.ఎఫ్.సి. సర్టిఫికేషన్ ప్రక్రియకోసం దరఖాస్తు చేసుకునేలా ప్రతి పట్టణ స్థానిక సంస్థనూ కార్యోన్ముఖం చేయవచ్చని భావించారు.
సవరించిన ప్రొటోకాల్ నిబంధనలు ఇలా ఉన్నాయి. :
- చెత్తరహిత నగరాల సర్టిఫికేషన్ ప్రక్రియకోసం గతంలో పరిశీలించిన 25 అంశాలను/సూచికలను 24కు తగ్గించారు. వాటిలో 1స్టార్, 3 స్టార్ స్థాయిలకోసం కేవలం 16 సూచికలు మాత్రమే తప్పనిసరైనవిగా నిర్దేశించారు. మిగిలిన 8 సూచికలను 5స్టార్, 7స్టార్ స్థాయిలకు అవసరమైనవిగా పేర్కొన్నారు.
- జి.ఎఫ్.సి. నియమ నిబంధనల ప్రొటోకాల్ కోసం గతంలో అమలులో ఉన్న బహుళ దశల లెక్కింపు పద్ధతిని ప్రస్తుతం ఒకే దశకు తగ్గించారు. స్టార్ రేటింగ్.కోసం పట్టణ స్థానిక సంస్థలు దరఖాస్తుకోసం క్షేత్రస్థాయి పరిస్థితిని స్వయంగా సులభంగా మధింపు చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ;
- సవరించిన ప్రొటోకాల్ నియమ నిబంధనలను స్వచ్ఛ భారత్-అర్బన్ 2వ దశ ప్రాధాన్యతలతో ఏకీకృతం చేశారు. ఇంటింటినుంచి వ్యర్థాల సేకరణకు, వనరుల వర్గీకరణకు, వ్యర్థాల తొలగింపునకు, డంప్ సైట్ల నివారణకు మరింత ఎక్కువ స్థాయి వెయిటేజీ (50శాతం)ని కేటాయించారు;
- సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటుగా, తదనంతర మధింపు ప్రక్రియలన్నింటినీ మరింత సరళతరం చేశారు. పూర్తిగా కాగితరహిత పద్ధతిలో డిజిటలీకరణ చేశారు; ఉదాహరణకు.. డిజిటల్ డిక్లరేషన్, వ్యర్థాల తొలగింపు సదుపాయాలను జియో ట్యాగింగ్ చేయడం, ప్రగతిని ఆమూలాగ్రం డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించడం తదితర చర్యలు తీసుకున్నారు;
- సమాచార వ్యాప్తి, అవగాహనా కార్యక్రమం, సామర్థ్యాల నిర్మాణం, చెత్తనుంచి తయారైన ఉప ఉత్పాదనల అమ్మకం ద్వారా ఆదాయం, వంటి అంశాలను కూడా కొత్త ప్రొటోకాల్ నిబంధనల్లో చేర్చారు. వ్యర్థాల నిర్వహణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్య తీసుకున్నారు.
- నగరాల ప్రణాళికా మధింపు ప్రక్రియ ఏడాది కాలం పూర్తిగా సాగేలా చూసేందుకు నిరంతర అంచనా ప్రక్రియను కూడా ప్రొటోకాల్ లో చేర్చారు.
కొత్త ప్రొటోకాల్ నిబంధనల టూల్ కిట్.ను ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా మాట్లాడుతూ, విషయాలను సరళతరం చేయడం, సులగ్రాహ్యంగా చేయడం లక్ష్యంగా కొత్త టూల్ కిట్.ను రూపొందించినట్టు చెప్పారు. దేశంలోని నగరాలన్నీ పూర్తి సన్నాహాలతో రేటింగ్ ప్రక్రియలో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. టూల్ కిట్.ను సరళీకృతం చేయడంతో అన్ని నగరాలు కనీసం 3 స్టార్ రేటింగ్.ను అయినా సాధించేందుకు అవకాశం ఉంటుందని, ఎక్కువ నగరాలు మరింత పైస్థాయి రేటింగ్ కోసం ప్రయత్నించే అవకాశాలు కూడా ఉంటాయని ఆయన అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఇందుకు సంబంధించిన ప్రజా చైతన్య, అవగాహనా కార్యక్రమాలను మరింత ఉధృతంచేయాలని నగర పరిపాలనా యంత్రాగాల ప్రతినిధులను, ప్రజా ప్రతినిధులను కోరారు. ప్రత్యేకించి స్థానిక భాషల్లో, మాండలికాల్లో అవగాహనా కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలన్నారు. నగరాలను స్వచ్ఛంగా, పరిశుభ్రంగా తయారు చేయాలన్న ప్రధానమంత్రి కలను సాకారం చేయడంతో భూముల విలువలు, పెట్టుబడులకు అవకాశాలు పెరగడంతో పాటు ప్రజలకు కూడా తాము నివసించే ఆవాసాలు గర్వకారణంగా మారుతాయన్నారు. ఎక్కువ రేటింగ్ పొందిన భారతీయ నగరాలు, ప్రపంచంలోని ఉత్తమ నగరాలతో పోల్చదగినవేనని మిశ్రా అన్నారు.
స్టార్ రేటింగ్ సర్టిఫికేషన్ ప్రక్రియను గురించి మిషన్ డైరెక్టర్ రూపా మిశ్రా వివరించారు. స్టార్ రేటింగ్ ప్రక్రియలో పురోగమన దిశగా కదలిక మొదలైందని, అయితే, చాలా వరకు పట్టణ స్థానిక సంస్థలు మరింత పురోగతి సాధించాల్సి ఉందని, కొత్త టూల్ కిట్ ఇందుకు దోహదపడుతుందని రూపా మిశ్రా చెప్పారు.
నగరాలను చెత్తరహితంగా తయారు చేసేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2వ దశ కార్యక్రమం,..వందశాతం వ్యర్థాల తొలగింపుపై, చెత్త డంపింగ్ కేంద్రాల నిర్మూలనపై దృష్టిని కేంద్రీకరించింది. నిర్మాణ వ్యర్థాలు, కూల్చివేతతో పోగుబడే వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు వంటి వాటిని నివారించే ప్రక్రియపై కూడా ఈ కార్యక్రమంలోనే కింద దృష్టిని కేంద్రీకరించారు. ఏడాది పొడవునా మధింపు జరిగే ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చిన కొత్త ప్రొటోకాల్ నిబంధనలతో నగరాలకు అవసరమైన మేర ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా, చెత్త రహిత నగరాలను ఏర్పాటుచేయాలన్న దార్శనికతను క్షేత్రస్థాయిలో నిజం చేయడానికి వీలుంటుంది.
ఎప్పటికప్పుడు తాజా అంశాలను తెలుసుకునేందుకు స్వచ్ఛభారత్ పథకం అధికారిక వెబ్.సైట్.ను,.. వివిధ సామాజిక మాధ్యమ విభాగాలను సంప్రదించవచ్చు:
ఫేస్ బుక్:Swachh Bharat Mission - Urban | ట్విట్టర్: @SwachhBharatGov |
యూట్యూబ్: Swachh Bharat Mission-Urban | ఇన్.స్టాగ్రామ్ :sbm_urban
****
(Release ID: 1785020)
Visitor Counter : 214