నీతి ఆయోగ్

తొలి అగ్రిటెక్ యూనిట్ ను ప్రకటించిన ఎయిమ్, నీతి ఆయోగ్, ఐరాస మైలురాయి చేరేదాకా నీతి ఆయోగ్ కృషి ఆగదు: డాక్టర్ రాజీవ్ కుమార్

Posted On: 21 DEC 2021 1:56PM by PIB Hyderabad

ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కోవిడ్ సంక్షోభం అనంతరం సన్నకారు రైతులకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించటానికి మొట్టమొదటి అగ్రిటెక్ ఛాలెంజ్ విభాగం  ఏర్పాటైంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎయిమ్),  నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి మూలధన అభివృద్ధి నిధి ( యు ఎన్ సి డి ఎఫ్)  ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, రాబో ఫౌండేషన్ కూడా పాలుపంచుకున్నాయి. ఈ కార్యక్రమం 2021 డిసెంబర్ 21 న జరిగింది.   

వీరు ప్రారంభించిన సౌత్-సౌత్ నవకల్పన వేదిక ద్వారా దేశాలమధ్య నవకల్పనలు, పెట్టుబడులు పరస్పర మార్పిడి సాధ్యమవుతుంది. భారత్, ఇండోనేసియా, మలావి, మలేసియా, కెన్యా, ఉగాండా, జాంబియా లాంటి ఎదుగుతున్న మార్కెట్లు ఈ వేదిక ద్వారా సహకరించుకోవటం సాధ్యమవుతుంది. మొదటి వేదిక అయిన అగ్రి టెక్ ఛాలెంజ్ విభాగం, అగ్రి ఫిన్ టెక్ ఇన్నోవేషన్స్  కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. తమ నవకల్పనలను అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించటం కోసం ఆసక్తి కనబరచే వారు మెయిన్ ట్రాక్, ఎయిమ్ ట్రాక్ అనే  రెండు విధానాలు ఎంచుకోవచ్చు. మొత్తం 100 దరఖాస్తుల్లో అధిక ఎదుగుదలకు అవకాశమున్న పడింటిని మెయిన్ ట్రాక్ కోసం ఎంపిక చేశారు. “ఎంపికచేసిన అంతర్జాతీయ మార్కెట్లో విస్తరణ-పరిష్కార మార్గం చూపటం” ఈ మెయిన్ ట్రాక్ దరఖాస్తుల లక్ష్యం.

ఈ యూనిట్ ను ప్రకటించటం కోసం ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో నీతి ఆయోగ్ వీసీ డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, “భారతదేశంలో  50% పైగా జనాభా వ్యవసాయం మీద ఆధారపడింది. అయితే, స్థూల జాతీయోత్పత్తిలో దీనివాటా 15-18% మాత్రమే. వ్యవసాయరంగమనేది భావోద్వేగపరంగా ప్రజాబాహుళ్యానికి  సంబంధించినది కావటం వల్ల భారతీయ సంస్థలు ఎక్కువగా పరిశ్రమరంగాన్ని ప్రోత్సహించేలా అందుకు అవసరమైన  విధానపరమైన చర్యలకు ప్రేరణ పొందుతున్నాయి.  నీతి ఆయోగ్ లో మేము మాత్రం వ్యవసాయ రంగ ముఖ్య చిత్రాన్ని సమూలంగా మార్చివేయటానికి అందుబాటులో ఉండే ఏ అవకాశాన్నీ వదులుకోవటం లేదు. మైలురాళ్ళను చేరేదాకా మా కృషి ఆగదు” అన్నారు.

ఐక్యరాజ్యసమితి మూలధన అభివృద్ధి నిధి ఇన్ క్లూజివ్ ఫైనాన్స్  ప్రాక్టీస్ ఏరియా డైరక్టర్  హెన్రీ డోమెల్ తన అభిప్రాయాలు వెల్లడిస్తూ, “ఈ డిజిటల్ శకంలో ఎవరూ వెనకబడకుండా ఐక్యరాజ్యసమితి మూలధన అభివృద్ధి నిధి చూస్తోంది.  మరీ ముఖ్యంగా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలమీద దృష్టి సారిస్తోంది.  ఆసియా, ఆఫ్రికా దేశాలలో సహకార చొరవ సాయంతో నిరుపేదల జీవితాలు మెరుగుపడటానికి కృషి చేస్తున్నాం.  సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనే మా ధ్యేయం. ఈ రెండు ప్రాంతాల మధ్య అధ్యయన అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారి నవకల్పనల పర్యావరణం అనేక ఉమ్మడి సవాళ్ళకు సమాధానంగా తయారైంది. ఆ దిశలో సౌత్-సౌత్ ప్లాట్ ఫామ్ విజ్ఞాన మార్పిడికి ఎంతగానో దోహదం చేస్తుంది. అందులో ఆరంభమే అగ్రిటెక్ ఛాలెంజ్. ఇది ఆసియా, ఆఫ్రికా దేశాల సన్నకారు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆశాభావంతో ఉన్నాం” అన్నారు.  

ఎంపికైన వారు రానున్న కొద్ది వారాల్లో వారు నిర్ణయించుకున్న విస్తరణ కోసం సహాయం అందుకుంటారు. నేరుగా పరిశ్రమలతో అనుసంధానం, లక్షిత మార్కెట్లలో  ఆయా రంగాలను అర్థం చేసుకోవటం, ఇన్వెస్టర్లతో సమావేశాలలో నిమగ్నమవుతారు. ఆలా కొనసాగుతున్న క్రమంలోనే ఆర్థిక సహాయం అందుకునే అవకాశం కూడా లభిస్తుంది.  

అటల్ ఇన్నొవేషన్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్  వైష్ణవ్  మాట్లాడుతూ,  గత దశాబ్ద కాలంలో భారత్ లో నవకల్పనల పర్యావరణం బాగా పరిణతి చెందిందని అన్నారు. సృజనాత్మకతలో కూడా భారత పరిశోధకులు, వ్యాపారాభిలాషులూ సమాజంలో కీలకమైన మార్పులు తీసుకురాగల సమస్యల పరిష్కారాలలో పాత్ర పోషిస్తారన్నారు. సన్నకారు రైతుల ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచటం మీద అగ్రి టెక్ ఛాలెంజ్ దృష్టిసారిస్తుందని,  ఇందులో పాల్గొనేవారు కొత్త మార్కెట్ లో తమ పరిష్కార మార్గాలను పరీక్షించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

సుస్థిర అభివృద్ధివ లక్షాల సాధనకోసం ఆసియా, ఆఫ్రికా దేశాలలో తమకృషి గురించి ప్రస్తావిస్తూ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రైవేట్ రంగ భాగస్వామ్య అధిపతి అంజనీ బన్సాల్ ఆశాజనకమైన ఫలితాలు సాధించగలమన్న ధీమా వ్యక్తం చేశారు.  రెండు ప్రాంతాల మధ్య సమన్వయం, సహకారం చాలా అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. ఆగరిటెక్ ఛాలెంజ్ ద్వారా ఉమ్మడి సవాళ్ళకు తగిన పరిష్కారాలు  లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ముందు ముందు మరిన్ని విజయాలు ఈ ప్రాంతంలో కనబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉగాండా ప్రభుత్వ వ్యవసాయ, పశుగణాభివృద్ధి, మత్స్యసంపద శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాన్సోలాటా ఆకాయాయో,  గ్రామీణాభివృద్ధి, బాంకింగ్ సలహాదారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాబోబాంక్ ఆరిందమ్ దత్తా తదితరులు ప్రసంగించారు. ఆసియా, ఆఫ్రికా ఖండ దేశాల పరిశ్రమ, బాంకింగ్ తదితర రంగాల ప్రముఖులతో కూడిన జ్యూరీ సభ్యులు ఇందులో పోటీపడిన దరఖాస్తుదారులతో సంభాషించి ఆగ్రిటెక్ ఛాలెంజ్ యూనిట్ కోసం ఎంపిక చేశారు.

 

*****

 


(Release ID: 1784037) Visitor Counter : 125