ఆర్థిక మంత్రిత్వ శాఖ

పశ్చిమ బెంగాల్‌ లో సోదాలు నిర్వహించిన - ఆదాయపు పన్ను శాఖ

Posted On: 21 DEC 2021 1:34PM by PIB Hyderabad

అసన్‌ సోల్ కేంద్రంగా, ఇనుము, ఉక్కు ఉత్పత్తులు, మౌలిక సదుపాయాలు, సిమెంట్, పాలీ ఫ్యాబ్‌లు, ఆగ్రో-టెక్, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన వివిధ వ్యాపారాలు చేస్తున్న రెండు ప్రముఖ కంపెనీల పై ఆదాయపు పన్ను శాఖ 16.12.2021 తేదీన సోదాలు చేసి, స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ కంపెనీలకు చెందిన 30కి పైగా ప్రాంగణాల్లో ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. 

ఎస్.డి. కార్డులు, వాట్సాప్ సందేశాలు మొదలైన వాటిలో డిజిటల్ సమాచారంతో పాటు, పత్రాల రూపంలో భద్రపరిచిన, నేరారోపణ కు సంబంధించిన  అనేక ఆధారాలు సేకరించి, స్వాధీనం చేసుకోవడం జరిగింది.  లెక్కలు చూపని విక్రయాల యొక్క సమాంతర ఖాతాల వివరాలు, వాస్తవ ఉత్పత్తి సమాచారాన్ని పొందుపరిచిన ఎక్సెల్-షీట్‌ లు, సమాంతర లావాదేవీలకు సంబంధించిన లెక్కల ఖాతాలను పొందుపరిచిన ఫైళ్ళతో పాటు, అనేక మందికి చేసిన నగదు చెల్లింపు వివరాలు మొదలైన సమాచారాన్ని భద్రపరచడానికి ఎస్.డి. కార్డులను ఉపయోగించినట్లు, సోదాలు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారుల బృందం గుర్తించింది.

ఈ సంస్థల డైరెక్టర్లు, యజమానులకు చెందిన కీలక ఉద్యోగుల ద్వారా లెక్కల్లో చూపని ఈ నగదు లావాదేవీలు జరిగినట్లు, స్వాధీనం చేసుకున్న ఎస్.డి. కార్డులతో పాటు, సంబంధిత సాక్ష్యాల ద్వారా వెల్లడయింది.  2020-21 ఆర్థిక సంవత్సరంలో దాని తయారీ యూనిట్ల నుండి అమ్మకాల ద్వారా 66 కోట్ల రూపాయలకు పైగా లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఆర్జించినట్లు, ఈ సంస్థల్లో ఒక సంస్థకు చెందిన కీలక వ్యక్తులు అంగీకరించారు.  అదే విధంగా, కొన్ని సంస్థలలో, నకిలీ కొనుగోళ్ళకు సంబంధించిన ఆధారాలు కనుగొనడం జరిగింది. ఈ కొనుగోళ్ళలో 20 కోట్ల రూపాయల మేర వెల్లడించని ఆదాయం ఉన్నట్లు, డైరెక్టర్లు అంగీకరించారు.

అదేవిధంగా, మరొక సంస్థ నుండి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను విశ్లేషించగా, ఎంట్రీ ఆపరేటర్లు నిర్వహిస్తున్న అనేక నకిలీ కంపెనీలు వాటి ప్రధాన సంస్థల పేరు మీద లావాదేవీలు జరిపినట్లు చూపడానికి ఉపయోగపడినట్లు వెల్లడయ్యింది.   ఈ నకిలీ కంపెనీల వాటా మూలధనం / సురక్షితం కాని రుణాల ముసుగులో గ్రూప్ ఖాతాల్లో లేని నిధులను ఈ కంపెనీల ఖాతా పుస్తకాల్లోకి మళ్లించినట్లు కనుగొనడం జరిగింది.   సంబంధిత సంస్థల డైరెక్టర్ల ప్రమేయంతో, ఈ విధంగా, 40 కోట్ల రూపాయలకు పైగా నిధులను మళ్లించినట్లు, ధ్రువీకరించడం జరిగింది. 

ఈ విధంగా, లెక్కలు చూపని నగదు అమ్మకాలతో పాటు, బోగస్ కొనుగోళ్ళు చేసినట్లు పేర్కొని, ఖర్చులు ఎక్కువగా చూపడం, నకిలీ లావాదేవీల ద్వారా లెక్కలోకి రాని ఆదాయాన్ని దారి మళ్ళించడం వంటి వివిధ పన్ను ఎగవేత వివిధ పద్ధతులను ఈ సంస్థలు అనుసరించినట్లు, ఈ సోదాల్లో బయటపడింది. 

ఈ సోదాల్లో 2 కోట్ల రూపాయలకు పైగా లెక్కల్లో చూపని నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.  దీంతో ఇప్పటివరకు, మొత్తం 125 కోట్ల రూపాయలకు పైగా లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లయ్యింది. 

తదుపరి విచారణ కొనసాగుతోంది. 

*****

 



(Release ID: 1783907) Visitor Counter : 128