రక్షణ మంత్రిత్వ శాఖ
ఎయిర్ ఫోర్స్ అకాడమీ, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ను ఉద్దేశించి సి.ఏ.ఎస్. చేసిన ప్రసంగం : 18 డిసెంబర్, 2021
Posted On:
18 DEC 2021 12:09PM by PIB Hyderabad
* ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, ట్రైనింగ్ కమాండ్, కమాండెంట్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, బోధనా సిబ్బంది, కొత్తగా నియమితులైన అధికారులు, గర్వించదగిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, శిక్షణలో ఉన్న అధికారులు, గౌరవనీయులైన అనుభవజ్ఞులు, విశిష్ట అతిథులు, మీడియా సభ్యులు, సోదర సోదరీమణులారా !
* భారత నౌకాదళానికి చెందిన ఇద్దరు అధికారులతో పాటు, భారత తీర దళానికి చెందిన తొమ్మిది మంది అధికారులు, వియత్నాం నుండి ముగ్గురు క్యాడెట్లు వింగ్స్ అందుకున్న ఈ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొని, 208వ పైలట్ మరియు గ్రౌండ్ డ్యూటీ కోర్సు, 133వ నవ్ కోర్సు లకు చెందిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను సమీక్షించడం, నిజంగా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
* డిసెంబర్, 8వ తేదీన సంభవించిన హెలికాప్టర్ ప్రమాద దుర్ఘటనలో జనరల్ బిపిన్ రావత్, శ్రీమతి మధులికా రావత్ దంపతులతో పాటు పన్నెండు మంది సాయుధ దళాల సిబ్బంది అకాల మరణం పట్ల నా హృదయపూర్వక సంతాపాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. స్వర్గస్తులైన వారిపై గౌరవసూచకంగా ఈ స్నాతకోత్సవ పరేడ్ లో భాగంగా నిర్వహించ తలపెట్టిన అనేక కార్యక్రమాలను కుదించడం జరిగింది.
* స్వచ్ఛమైన, ఖచ్చితమైన ప్రదర్శనలు / డ్రిల్ కదలికలు, అద్భుతమైన కవాతు కోసం గ్రాడ్యుయేటింగ్ అధికారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోని అత్యుత్తమ వైమానిక దళంలో ఒకటిగా ఉన్న దళంలో అధికారులుగా నియమితులు కావడం కోసం, మీరు సెఖోన్ బ్లాక్ యొక్క పవిత్రమైన పోర్టల్స్ గుండా వెళుతున్న సమయంలో, ఈ రోజు మీరు అపారమైన సంతృప్తి, గర్వంతో నిండిన ఉత్సాహంతో ఉండి ఉంటారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.
* మీ వ్యక్తిగత మరియు సామూహిక విజయాలకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ శిక్షణ కాలంలో అసాధారణ రీతిలో వృత్తిపరమైన నిబద్ధత, కృషిని ప్రదర్శించిన అవార్డు విజేతలందరికీ నా అభినందనలు.
* మీ జీవితంలో ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడానికి ఈ అకాడమీలో మీలో ప్రతి ఒక్కరూ చేసిన ప్రయత్నాలను నేను గుర్తించి, అభినందిస్తున్నాను. భారత వైమానిక దళంలో వృత్తి ని చేపట్టడానికి మిమ్మల్ని పెంచి, పోషించి, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
* మీరు ఎంచుకున్న వృత్తి లో నాయకత్వ పాత్ర పోషించడానికి వీలుగా మిమ్మల్ని సిద్ధం చేయడం కోసం రూపొందించిన కఠినమైన శిక్షణా కార్యక్రమంలో భాగంగా, మీరు విస్తృతమైన పాఠ్యాంశాలను అభ్యసించడం జరిగింది. మీరు విజయవంతంగా ఉత్తీర్ణులు అయ్యారంటే, అది, మీరు జ్ఞానాన్ని పొందేటప్పుడు మీరు అభివృద్ధి చేసుకుని, ప్రదర్శించిన నైపుణ్యాలకు ప్రత్యక్ష నిదర్శనం గా భావించాలి. మీకు సలహాలు ఇచ్చి, మార్గదర్శకత్వం వహించి, మీ వృత్తికి సంబంధించిన ప్రాథమికాంశాలతో పాటు, 'లక్ష్యం, సమగ్రత, శ్రేష్ఠత' తో కూడిన ఐ.ఏ.ఎఫ్. తత్వాన్ని మీలో నింపిన వైమానిక అధికారులు, సిబ్బంది కృషి ని నేను అభినందిస్తున్నాను.
* నిరంతరం మిమ్మల్ని మీరు ముందు వరుసలో నిలబెట్టుకోడానికి, అదే అంకితభావం, అనుకూలత, సుముఖతను భవిష్యత్తులో మీరు ఎల్లప్పుడూ అనుసరించవలసిన అవసరం ఉందని, గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు చూపిన అదే ఉన్నత ప్రమాణాలు, భవిష్యత్తులో మీ పాత్ర/హోదా ఏమైనప్పటికీ సురక్షితమైన, సమర్థవంతమైన కార్యకలాపాలకు ఆధారం అవుతాయి.
* అధికారికంగా మీ శిక్షణ విజయవంతంగా పూర్తయినప్పటికీ, మీ అభ్యాస ప్రక్రియ కేవలం ఇప్పుడే ప్రారంభమైందన్న విషయాన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఐ.ఎ.ఎఫ్. లో అధికారులుగా మీరు అదనపు బాధ్యతలు చేపట్టాలి. కష్టపడి పనిచేయడం కొనసాగించాలి.
* భారత రాజ్యాంగానికి విధేయత చూపుతూ మీరు చేసిన పవిత్రమైన ప్రమాణం జీవితకాల నిబద్ధత అని మీరు గుర్తుంచుకోవాలి. మీరు మీ వృత్తి జీవితం మొత్తం అత్యంత అంకితభావంతో కూడిన చిత్తశుద్ధితో 'నిజాయితీగా, నమ్మకంగా' పని చేయాలి.
* మీరు ఏ.ఎఫ్.ఏ. నుండి క్షేత్ర స్థాయిలో మీ యూనిట్లకు మారినప్పుడు, మీరు ఖరీదైన, అధునాతన పరికరాలను ఉపయోగించవలసి వచ్చినప్పుడు, దాని కోసం మీరు నైపుణ్యాన్ని, విషయం పరిజ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది. ఇప్పుడు, యుద్ధ స్వభావం ప్రాథమిక మార్పులకు లోనవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త సాంకేతికత పరిజ్ఞానంతో పాటు, సమూలంగా కొత్త సిద్ధాంతాలు ఉద్భవించాయి. భారతదేశ భద్రతా డైనమిక్స్ బహుముఖ బెదిరింపులు, సవాళ్లను కలిగి ఉంది. ఇందుకోసం, బహుళ-డొమైన్ సామర్థ్యాలను రూపొందించడంతో పాటు, మన అన్ని కార్యకలాపాలను ఏకకాలంలో, సంక్షిప్త సమయ వ్యవధిలో అమలు చేయడం, మనకు అవసరం. ఐ.ఎ.ఎఫ్. ని, ఈ దేశాన్ని భవిష్యత్తులోకి నడిపించే నాయకులు మీరే కాబట్టి, వైమానిక దళం మీ నుండి పెద్ద అంచనాలను కలిగి ఉంది.
రాఫెల్, అపాచీ, చినూక్ తో సహా అనేక రకాల ఎస్.ఏ.జి.డబ్ల్యూ. వ్యవస్థల వంటి కొత్త ప్రేరేపణలతో అత్యంత శక్తివంతమైన వైమానిక దళంగా రూపాంతరం చెందే దశలో భారత వైమానిక దళం ఉంది. ఈ రోజు, మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని, సవాళ్లు , సాంకేతికతతో కూడిన వాతావరణం లోకి ప్రవేశిస్తున్న తరుణంలో, మీ కంటే ముందు పనిచేసిన వారు అనుసరించిన వృత్తిపరమైన దృక్పథం, యోగ్యత, స్వభావాల గొప్ప వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, మీ లాంటి యువకులు, క్రియాశీల అధికారుల కోసం ఐ.ఏ.ఎఫ్. ఎదురుచూస్తోంది.
* మంచి అధికారిగా పేరు తెచ్చుకోవాలంటే, మీరు ఐ.ఏ.ఎఫ్. లోని అన్ని శాఖల సూక్ష్మ నైపుణ్యాలను పూర్తిగా మదింపు చేయగలగాలి. అందువల్ల, అన్ని శాఖల పని తీరును అర్థం చేసుకో గల సామర్థ్యం - అది విమానయానం కానీ, సాంకేతికత, లాజిస్టిక్స్, అకౌంట్స్ కానీ, లేదా అడ్మినిస్ట్రేషన్ కానీ, అది మీ ప్రాథమిక వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని పరిపూర్ణం చేస్తుంది. అది, మీరు "పూర్తి స్థాయి వృత్తి నిపుణుడు" గా రాణించడానికి దోహదపడుతుంది.
* అధికారులుగా, మీరు సైనిక చరిత్ర, భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ వ్యవహారాలను అధ్యయనం చేయడం ద్వారా ఈ సంక్లిష్టమైన, డైనమిక్ ప్రపంచంపై అవగాహన పెంచుకోవాలి. మీ ఉద్యోగ జీవితం ప్రారంభ సంవత్సరాల్లో, మీరు మంచి పఠన అలవాట్లను అలవరచుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ విషయంలో మీకు సంకల్పం, ధీరోదాత్తత ఉంటే. మీ వృత్తిపరమైన సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి, రాణించడానికి, పెంపొందించడానికి, ఐ.ఏ.ఎఫ్. మీకు పుష్కలమైన అవకాశాలను అందిస్తుంది,
* మిలిటరీ అధికారి గా మీరు మీ వృత్తి పరంగా కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కష్టాలు, అడ్డంకులు మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ప్రభావితం చేయడానికి ఎప్పుడూ అనుమతించవద్దు. "వెళ్ళే మార్గం కష్టంగా ఉన్నప్పుడు, ఆ కష్టం దానంతట అదే సమసి పోతుంది"- అని ఒక పాత సామెత ఉంది. జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కోవటానికి, స్వీకరించడానికి, ఇది మీ కెరీర్ కు సంబంధించిన నినాదం కావాలి. మీరు శారీరకంగా, ఆలోచన పరంగా, మానసికంగా దృఢంగా ఉండాలి.
* అధికారులు, కమాండర్లు గా మీ నుండి ఐ.ఏ.ఎఫ్. ఏమి ఆశిస్తోంది? అసాధారణమైన వృత్తి నైపుణ్యం తో పాటు, ఆక్షేపణకు గురికాని సమగ్రతను మేము ఆశిస్తున్నాము. మీరు సాయుధ వృత్తిలో ఉన్న గౌరవాన్ని, గర్వాన్ని ప్రతిబింబించే వ్యక్తిగత ప్రవర్తన, నైతిక విలువలతో కూడిన అత్యున్నత ప్రమాణాలను కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము. మీ శిక్షణ కాలంలో మీలో ఉద్భవించిన విలువలకు అనుగుణంగా జీవించడానికి ధైర్యంతో పాటు, కరుణ, అవగాహన కలిగి ఉండటానికి, మీరు విధి నిర్వహణలో ఉన్నప్పుడు న్యాయంగా, స్థిరంగా, నిస్వార్థంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము.
* ఈ రోజు మీకు, మీ కుటుంబ సభ్యులకు సంతోషకరమైన క్షణం. అలాగే, ఇది మీ ఆశయాలు, ఆలోచనలు రెక్కలు తొడిగి, ఐ.ఏ.ఎఫ్. లో మీ ప్రయాణంలో అంతర్భాగంగా మారే రోజు. ఈ సంస్థ మీ భుజలపై ఉంచిన నమ్మకం మరియు విశ్వాసానికి అనుగుణంగా మీరు ఎల్లప్పుడూ జీవించాలి. "ఈ బాధ్యతను గర్వంగా నిర్వహించండి".
* ఏ.ఎఫ్.ఏ. యొక్క కఠినమైన పాలనా విధానం ద్వారా మిమ్మల్ని నడిపించిన లక్షణాలు మీ వృత్తి జీవితంలో మరింత అభివృద్ధి చెందడంతో పాటు, పరిపక్వత సాధిస్తుందని ఆశిస్తూ, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. సముచితమైన సమర్ధత కలిగిన అధ్యాపక బృందం ఆధ్వర్యంలో మీరు పొందిన శిక్షణ, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు తప్పక విజయం సాధించే విధంగా తోడ్పడుతుందని నేను విశ్వసిస్తున్నాను. గొప్ప సంకల్పం, అసాధారణమైన వృత్తి నైపుణ్యం తో పాటు, కాలాతీత సంప్రదాయాలతో కూడిన గొప్ప వారసత్వాన్ని అనంతమైన అవకాశాల ప్రపంచం లోకి మీరు తప్పకుండా తీసుకు వెళతారని కూడా నేను విశ్వసిస్తున్నాను.
* భారత వైమానిక దళంలో మీకు మంచి జరగాలని నేను మరోసారి కోరుకుంటున్నాను. మీరందరూ “ఆకాశమే హద్దుగా కీర్తి గడించాలని" ఆశిస్తున్నాను.
జై హింద్ !
*****
(Release ID: 1783184)
Visitor Counter : 141