ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

మనవరాలి స్నాతకోత్సవానికి హాజరైన ఉపరాష్ట్రపతి దంపతులు


- ప్రేక్షకుల గ్యాలరీలోనే కూర్చుని తన మనవరాలు అవార్డు అందుకున్న క్షణాలను ఆనందించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు.

- విద్యతోనే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు సాధ్యమని సూచన

- నూతన జాతీయ విద్యావిధానం – 2020 ఓ దార్శనిక పత్రం

- విద్యార్థులు ఉన్నతమైన కలలు కనడంతో పాటు వాటి సాకారానికి అహోరాత్రులు శ్రమించాలని సూచన

Posted On: 18 DEC 2021 2:35PM by PIB Hyderabad

గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, శ్రీమతి ఉషమ్మ దంపతులు సాధారణ వ్యక్తుల్లా తమ మనవరాలి స్నాతకోత్సవానికి హాజరయ్యారు. శనివారం నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో తన కుమార్తె దీపావెంకట్ కూతురైన కుమారి ఇమ్మణ్ని సుష్మ చౌదరి స్నాతకోత్సవాన్ని వేదికపైనుంచి కాకుండా ఇతర విద్యార్థుల కుటుంబసభ్యుల్లాగే వేదిక కిందే కూర్చుని తిలకించారు. విద్యాభ్యాసం సందర్భంగా విలువలు పాటించడంతోపాటు నిజాయితీగా ఉంటూ, ఇతరులపట్ల సత్ప్రవర్తన కనబర్చినందుకు కుమారి సుష్మ చౌదరి శ్రీ బల్జిత్ శాస్త్రి అవార్డును అందుకోగా.. ఉపరాష్ట్రపతి దంపతులు చప్పట్లతో అభినందించారు.

అనంతరం విశ్వవిద్యాలయ అధికారుల విజ్ఞప్తి మేరకు, ఓ విద్యార్థి కుటుంబసభ్యుడిగానే స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులను అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడారు. తన మనవరాలు డిగ్రీతోపాటు అవార్డును అందుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. 

సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం విద్య ద్వారానే సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. భారతదేశం విశ్వగురుగా ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కాలానుగుణంగా జరిగిన దండయాత్రలు, దురాక్రమణల అనంతరం అదే వలసవాద ధోరణిని మనవాళ్లు కూడా అలవర్చుకున్నారని అన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మన వైభవోపేతమైన చరిత్రను, మన శక్తి సామర్థ్యాలను గుర్తుచేసుకుంటూ బలమైన, సామరస్యం, సమృద్ధితో కూడిన ఆనందకరమైన భారతదేశ నిర్మాణానికి నేటి యువతరం సిద్ధం కావాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

భారతదేశాన్ని మరోసారి విశ్వగురు చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉందన్న ఉపరాష్ట్రపతి ఇందుకోసం మన విద్యావిధానమే మరొకమారు క్రియాశీలకంగా మారాల్సిన అవసర ఉందన్నారు. నూతన జాతీయ విద్యావిధానం – 2020ని ఓ దార్శనిక పత్రంగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి.. ఈ విధానం భారతీయ విద్యావ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకొస్తుందని ఆకాంక్షించారు.

ఇందుకోసం విద్యార్థులు ఉన్నతమైన కలలను కనడంతోపాటు వాటి సాకారానికి అహోరాత్రులు శ్రమించాలని సూచించారు. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని.. అలాంటి యువత తమ బాధ్యతలను గుర్తుంచుకుని వ్యవహరిస్తే వీలైనంత త్వరగా ‘ఆత్మనిర్భర భారత’ నిర్మాణం సాధ్యం అవుతుందన్నారు.

***



(Release ID: 1783035) Visitor Counter : 174