హోం మంత్రిత్వ శాఖ

మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు

Posted On: 16 DEC 2021 1:27PM by PIB Hyderabad

'పోలీసు' మరియు 'పబ్లిక్ ఆర్డర్' భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌ కింద రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు.  మహిళలపై నేరాల దర్యాప్తు, విచారణలతో సహా శాంతి భద్రతలు, పౌరుల జీవితాలు మరియు ఆస్తుల రక్షణ బాధ్యతలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటాయి. చట్టాల్లో ఉన్న నిబంధనల ప్రకారం అటువంటి నేరాలను ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా ఉంటాయి. అయినప్పటికీ, భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మహిళల భద్రత కోసం, దిగువన పేర్కొన్న విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది: 

i.          లైంగిక నేరాలకు వ్యతిరేకంగా సమర్థవంతమైన నిరోధం కోసం క్రిమినల్ లా (సవరణ), చట్టం 2013 ను రూపొందించడం జరిగింది.  అదేవిధంగా, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నేరానికి మరణశిక్ష తో సహా మరింత కఠినమైన శిక్షా నిబంధనల ను సూచించడానికి క్రిమినల్ లా (సవరణ) చట్టం, 2018 ని రూపొందించడం జరిగింది.  అత్యాచారం జరిగిన కేసుల్లో దర్యాప్తు ను రెండు నెలల్లోగా పూర్తి చేసి, ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో పాటు ట్రయల్స్ కూడా 2 నెలల్లో పూర్తి చేయాలని ఈ చట్టం ఆదేశిస్తుంది.

ii.          అన్ని అత్యవసర పరిస్థితుల కోసం దేశవ్యాప్తంగా ఏర్పాటుచేసిన, అత్యవసర ప్రతిస్పందన సహాయ వ్యవస్థ, ఒకే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నంబర్ (112) ఆధారిత వ్యవస్థ ద్వారా కంప్యూటర్ సహాయంతో క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉన్న సహాయ బృందాలను ఆపద సంభవించిన ప్రదేశానికి పంపుతుంది.

iii.          అశ్లీలమైన సందేశాలు, ప్రవర్తనలకు వ్యతిరేకంగా పౌరులు ఫిర్యాదు చేయడానికి వీలుగా, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఏ) 2018 సెప్టెంబర్, 20వ తేదీన "సైబర్-క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌" ను ప్రారంభించింది.

iv.          "స్మార్ట్ పోలీసింగ్" మరియు భద్రతా నిర్వహణకు సాంకేతికతను వినియోగించుకోవడం లో భాగంగా,  మొదటి దశలో 8 నగరాల్లో (అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై) "సేఫ్ సిటీ ప్రాజెక్టులను" మంజూరు చేయడం జరిగింది. మహిళలపై నేరాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న "హాట్‌-స్పాట్‌" లను గుర్తించాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, అవగాహన కార్యక్రమాల ద్వారా సమాజంలో మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, సామర్థ్యాన్ని పెంపొందించడంతో సహా, వివిధ రంగాలలో క్లిష్టమైన ఆస్తుల అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను సిద్ధం చేశాయి.

v.           దేశవ్యాప్తంగా లైంగిక నేరస్తుల విచారణ మరియు ట్రాకింగ్‌ను సులభతరం చేయడానికి వీలుగా, ఎం.హెచ్.ఏ. 2018 సెప్టెంబర్, 20వ తేదీన “లైంగిక నేరస్థులపై జాతీయ డేటా బేస్ - ఎన్.డి.ఎస్.ఓ." ని ప్రారంభించింది.

vi.          శిక్షాస్మృతి (సవరణ) చట్టం, 2018 ప్రకారం లైంగిక వేధింపుల కేసుల్లో సమయానుకూల దర్యాప్తును పర్యవేక్షించడానికి మరియు ట్రాక్ చేయడానికి వీలుగా ఆన్‌-లైన్ విశ్లేషణాత్మక సాధనం “లైంగిక నేరాల కోసం విచారణ ట్రాకింగ్ విధానాన్ని” ఎం.హెచ్.ఏ. ప్రారంభించింది.

vii. పరిశోధనను మెరుగుపరచడానికి వీలుగా, కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ లలో డి.ఎన్.ఏ. విశ్లేషణ యూనిట్లను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలను ఎం.హెచ్.ఏ. చేపట్టింది.   ఇందులో భాగంగా, చండీగఢ్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ లో అత్యాధునిక డి.ఎన్.ఏ. విశ్లేషణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.  20 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీల్లో డి.ఎన్.ఏ. విశ్లేషణ యూనిట్లు ఏర్పాటు చేయడానికి, అభివృద్ధి చేయడానికి,  కూడా ఎం.హెచ్.ఏ. అనుమతి మంజూరు చేసింది.

viii. లైంగిక వేధింపుల కేసుల్లో ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణతో పాటు, లైంగిక వేధింపుల సాక్ష్యం సేకరణ కిట్‌ లోని ప్రామాణిక కూర్పు కోసం ఎం.హెచ్.ఏ. మార్గదర్శకాలను విడుదల చేసింది.  మానవ శక్తి లో తగిన సామర్థ్యాన్ని సులభతరం చేసేందుకు, విచారణ అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులు, వైద్యాధికారులకు శిక్షణ, నైపుణ్య నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.  శిక్షణలో భాగంగా ఓరియంటేషన్ కిట్‌ రూపంలో, 14,950 లైంగిక వేధింపుల సాక్ష్యాల సేకరణ కిట్‌ లను, పోలీసు పరిశోధన, అభివృద్ధి కార్యాలయం ద్వారా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేయడం జరిగింది. 

ix.          దేశంలోని అన్ని జిల్లాల్లోని పోలీసు స్టేషన్లలో మహిళా సహాయ కేంద్రాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యతిరేక కేంద్రాల ఏర్పాటు, బలోపేతం కోసం, రెండు ప్రాజెక్టులను కూడా, ఎం.హెచ్.ఏ. ఆమోదించింది.

x.          పైన పేర్కొన్న చర్యలతో పాటు, మహిళలపై నేరాలను ఎదుర్కోవడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు ఎం.హెచ్.ఏ. ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలను జారీ చేస్తోంది. వాటిని www.mha.gov.in లో అందుబాటులో ఉంచడం జరిగింది. 

నిన్న రాజ్యసభలో ఒక ప్రశ్నకు హోం మంత్రిత్వ శాఖ లిఖిత పూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొంది.

 

*****



(Release ID: 1782545) Visitor Counter : 2789


Read this release in: English , Urdu , Tamil