జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్ కేంద్ర గ్రాంటుగా జమ్మూ కాశ్మీర్ కు 604 కోట్ల రూపాయలు విడుదల
2022 ఆగస్టు నాటికి ' హర్ ఘర్ జల్' కేంద్రపాలిత ప్రాంతం గా మారడానికి జమ్మూ కాశ్మీర్ ప్రణాళిక
జల్ జీవన్ మిషన్ అమలుకు 201-22 లో కేంద్ర గ్రాంటుగా జమ్మూ కాశ్మీర్ కు 2,747 కోట్ల రూపాయలు కేటాయింపు
Posted On:
14 DEC 2021 12:17PM by PIB Hyderabad
జమ్మూ కాశ్మీర్ లో జల్ జీవన్ మిషన్ ను వేగంగా అమలు చేయడానికి రాష్ట్రానికి కేంద్రం 604 కోట్ల రూపాయలను గ్రాంటుగా విడుదల చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లో జల్ జీవన్ మిషన్ ను అమలు చేయడానికి 2021-22 సంవత్సరంలో కేంద్ర నిధులుగా 2,747 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 2020-21 తో పోల్చి చూస్తే ఈ కేటాయింపులు నాలుగు రెట్లు
పెరిగాయి.
2022 ఆగస్టు నాటికి 'హర్ ఘర్ జల్' గుర్తింపు పొందడానికి జమ్మూ కాశ్మీర్ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. కేంద్రపాలిత జమ్మూ కాశ్మీర్ గ్రామీణ ప్రాంతంలో 18.35 లక్షల గృహాలు ఉన్నాయి. వీటిలో 10.39 లక్షల (57%) గృహాలు కొళాయి కనెక్షన్ కలిగి ఉన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, క్లిష్ట భూభాగంలో రవాణా సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే, గ్రామాల్లో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరు సరఫరా చేయడానికి చేపట్టిన నీటి సరఫరా పనులు వేగంగా సాగుతున్నాయి. శ్రీనగర్, గందేర్బల్ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న 1,070 గ్రామాల్లో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరు సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందింది.
దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తోంది. దీనికోసం బడ్జెట్ కేటాయింపులు భారీగా పెరిగాయి. 2021-22 లో దీనికోసం 2,747.17 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. గత సంవత్సరం ఈ పథకానికి 681.77 కోట్ల రూపాయలు కేటాయించారు.
వికేంద్రీకృత విధానంలో 'కింద నుంచి పైకి' పద్ధతిలో జల్ జీవన్ మిషన్ అమలు జరుగుతోంది. దీనిలో పనుల గుర్తింపు, అమలు, నిర్వహణలో గ్రామ ప్రజల పాత్ర కీలకంగా ఉంటుంది. దీనికోసం నీటి సంఘాలను పటిష్టం చేయడం, గ్రామ స్థాయి ప్రణాళిక రూపకల్పన, గ్రామానికి అవసరమైన నీటి పథకాలను గుర్తించి వాటిని అమలు చేయాల్సిన విధానాన్ని చర్చించడానికి గ్రామ సభలను నిర్వహించడం లాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి గృహంలో కీలక బాధ్యత వహించే మహిళలు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేలా చూసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కార్యక్రమం పై ప్రజల్లో అవగాహన కల్పించి, సురక్షిత మంచినీటి ప్రాధాన్యత, ప్రజల భాగస్వామ్యం, కార్యక్రమాన్ని అమలు చేయడానికి పంచాయతీరాజ్ సంస్థలకు సహకారం అందించడం లాంటి కార్యక్రమాలను అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ సంస్థలను నియమిస్తుంది.
అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో తాగడానికి,మధ్యాహ్న భోజనం వండడానికి, చేతులు కడుక్కోవడానికి, మరుగుదొడ్లలో వాడుకోవడానికి కుళాయి నీటి లభ్యత ఉండేలా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లో అన్ని 22,421 పాఠశాలలు (100%) మరియు 23,926 (100%) అంగన్వాడీ కేంద్రాలకు కొళాయి ద్వారా నీరు సరఫరా అవుతోంది.
ప్రజారోగ్య పరిరక్షణలో రక్షిత మంచి నీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. నీటి నాణ్యతను పరీక్షించడానికి దేశంలో 2,000 పైగా ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. తక్కువ ధరకు ప్రజలు వీటిలో నీటి నాణ్యత పరీక్షల సౌకర్యాన్ని పొందవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో 97 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి.
2019 లో మిషన్ ప్రారంభం కాకముందు దేశ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 19.20 కోట్ల గృహాలలో కేవలం 3.23 గృహాలు (17%) మాత్రమే కుళాయి కనెక్షన్ కలిగి ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి, లాక్ డౌన్ వల్ల ఎదురైన సవాళ్ళను అధిగమించి మిషన్ ప్రారంభం అయిన నాటి నుంచి ఇంతవరకు 5.42 కోట్లకు పైగా ( 28%) గృహాలకు కుళాయి కనెక్షన్ కల్పించబడింది. ప్రస్తుతం దేశంలో 8.65 కోట్ల గృహాలకు కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా అవుతోంది.
గోవా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ, పుదుచ్చేరి మరియు హర్యానాలు ‘హర్ ఘర్ జల్’ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. వీటిలో 100% గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సరఫరా ఉంది. అందరి సహకారం, నమ్మకం, తోడ్పాటు తో పథకాన్ని అమలు చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచన మేరకు గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్ అందించబడుతుంది. ప్రస్తుతం 83 జిల్లాల్లోని ప్రతి ఇంటికి, 1.28 లక్షలకు పైగా గ్రామాలకు కుళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.
***
(Release ID: 1781317)
Visitor Counter : 181