రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

50ఏళ్ల విజయానికి స్మారకంగా స్వర్ణోత్సవం ప్రారంభం!


వేడుకలకు రక్షణమంత్రి రాజనాథ్ శ్రీకారం..

యుద్ధంలో ఘన విజయాన్ని సాధించిపెట్టిన
భారతీయ సైనికులకు ఘననివాళులు...

సైనికుల త్యాగాలకు దేశం ఎప్పుడూ
రుణపడి ఉంటుందన్న రక్షణమంత్రి

1971 యుద్ధంలో భారత్ విజయానికి సంస్మరణగా
-స్వర్ణిం విజయ పర్వ- పేరిట కార్యక్రమాలు..

Posted On: 12 DEC 2021 2:06PM by PIB Hyderabad

రక్షణమంత్రి ప్రసంగంలో ప్రధానాంశాలు:

  • జనరల్ బిపిన్ రావత్ మృతితో, ధైర్య సాహసాలతో కూడిన సైనికుడిని, సమర్థుడైన సలహాదారును, చక్కని వ్యక్తిని భారత్ కోల్పోయింది.
  • భారత్ ఏదేశంపైనా, ఎప్పుడూ దండెత్తలేదు. ఎవరి భూభాగాన్నీ అంగుళం కూడా ఆక్రమించలేదు.
  • ఉగ్రవాదాన్ని, భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశంలో శాంతిని విచ్ఛిన్నం చేయాలన్నది పాకిస్తాన్ పన్నాగం; ప్రత్యక్ష యుద్ధంలో  ఇప్పటికే మనం గెలిచాం. పరోక్ష యుద్ధంలోనూ గెలుపు మనదే అవుతుంది.
  • మనల్ని విడదీసేందుకు ఎవరైనా ప్రయత్నించే కొద్దీ మనం మరింత సమైక్యంగా బలపడుతున్నాం. శత్రువులను దీటుగా ఎదుర్కొంటున్నాం.
  • ఎలాంటి తీవ్ర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలను సంసిద్దం చేయడమే మన లక్ష్యం.

   1971వ సంవత్సరంలో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో సాయుధ బలగాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, బంగ్లాదేశ్ విముక్తికోసం వారందించిన సేవలను స్మరిస్తూ నిర్వహించే 50ఏళ్ల విజయ స్వర్ణోత్సవాన్ని (స్వర్ణిం విజయ పర్వను) రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ పచ్చిక బయలులో ఈ ఉత్సవం మొదలైంది. ఇండో-పాక్ యుద్ధంలో మనదేశం విజయం సాధించి 50ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని సంవత్సరం పొడవునా నిర్వహిస్తూ వస్తున్న వేడుకలకు ముగింపు సూచనగా ఈ ఉత్సవం ఏర్పాటు చేశారు. డిసెంబరు 8వ తేదీన తమిళనాడులో హెలికాప్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన దేశ త్రివిధ దళాల ప్రధాన అధిపతి (సి.డి.ఎస్.) జనరల్ బిపిన్ రావత్.కు నివాళులు అర్పిస్తూ రాజనాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  “జనరల్ రావత్ అకాల మరణంతో ధైర్యసాహసాలు కలిగిన ఒక గొప్ప సైనికుడిని భారతదేశం కోల్పోయింది. అంతేకాదు, ఒక సమర్థవంతుడైన సలహాదారును, చక్కని వ్యక్తిని కూడా దేశం కోల్పోయింది. వాస్తవానికి ఈ స్వర్ణిం విజయ పర్వ వేడుకలో ఆయన కూడా పాల్గొనే వారే” అని రాజనాథ్ సింగ్ అన్నారు.

   1971వ సంవత్సరపు యుద్ధంలో భారతీయ సాయుధ బలగాల అద్భుత విజయాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే ‘స్వర్ణిం విజయ పర్వ’ను ఒక ఉత్సవంగా రక్షణ మంత్రి అభివర్ణించారు. ఈ విజయం దక్షిణాసియా చరిత్రను, భూగోళ శాస్త్రాన్నే మార్చివేసిందని అన్నారు. 1971 యుద్ధంలో  విజయానికి తోడ్పడిన భారతీయ సైనికులకు, నావికులకు, గగనతల యుద్ధవీరులకు, వారివారి కుటుంబాలకు రాజనాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలకు దేశం ఏప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. “1971నాటి యుద్ధం జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రతి భారతీయుని మదిలో తాజాగానే సజీవంగా ఉన్నాయడానికి ఈ ఉత్సవం ఒక నిదర్శనమని అన్నారు. యుద్ధంలో మన బలగాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ఉత్సాహం, దృఢదీక్షకు ఈ ఉత్సవం ఒక ప్రతీకగా నిలిచిందన్నారు. అంతే ఉత్సాహంతో, దృఢదీక్షతో జాతి విజయపథంలో ముందుకు సాగేందుకు ఈ ఉత్సవం మనకు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు.

   1971వ సంవత్సరపు యుద్ధంలో మన విజయం భారతీయుల మానవత్వానికి, భారతీయుల విశ్వమానవ భాతృత్వ భావనకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.  భూగోళం యావత్తూ ఒక వసుధైక కుటుంబకంగా భరత జాతి పరిగణిస్తుందని, సత్యంకోసం, న్యాయం కోసం ఎప్పటికీ దన్నుగా నిలబడుతుందని ఈ విజయం రుజువు చేసిందన్నారు. ఇండోపాక్ యుద్ధంలో విజయం అమానుషంపై మానవత్వం సాధించిన విజయంగా, అన్యాయంపై న్యాయం సాధించిన గెలుపుగా రాజనాథ్ సింగ్ అభివర్ణించారు. సుప్రసిద్ధ న్యూయార్క్ ప్రసంగంలో మార్టిన్ లూథర్ కింగ్ చేసిన ప్రకటనను  రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘అన్యాయం ఎక్కడ జరిగినా అది అన్నిచోట్లా న్యాయానికి ముప్పుగా తయారవుతుంది'. అప్పటి తూర్పు పాకిస్తాన్.లో ప్రజలపై జరిగిన అత్యాచారాలు, అన్యాయాలు,.. పూర్తి మానవాళికే ముప్పుగా పరిణమించాయి. అందుల్ల అన్యాయంనుంచి దోపిడీనుంచి వారికి విముక్తి కలిగించడం భారత్ తన బాధ్యతగా భావించింది. తన బాధ్యతను నిర్వర్తించింది.... అని రాజనాథ్ సింగ్ అన్నారు.

   ఇండో పాక్ యుద్ధంలో భారతీయ సాయుధ బలగాలు ప్రదర్శించిన దృఢదీక్ష, సమన్వయం, ధైర్యసాహసాలను కేంద్రమంత్రి గర్తుచేసుకున్నారు. “మన సాయుధ బలగాలు ‘ముక్తివాహిని’కి అండగా నిలిచాయి. లక్షలాది శరణార్ధులకు సహాయం అందించాయి. పశ్చిమ, ఉత్తరప్రాంతంనుంచి ఎలాంటి దురాక్రమణ జరక్కుండా నివారించాయి. దీనితో ప్రపంచంలో శాంతి, న్యాయం, మానవత్వం పట్ల భారతదేశానికి ఉన్న విశ్వసనీయత ఏమిటో నిర్ధారణ అయింది” అని ఆయన అన్నారు. భారతదేశం నైతికతకు, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు 1971 యుద్ధం చక్కని ఉదాహరణగా నిలిచిందన్నారు. “ఏదైనా దేశం మరో దేశంపై విజయం సాధించిన తర్వాత ఓడిన దేశంపై విజేత దేశం ఆధిపత్యం చలాయించకపోవడం, ఆ దేశపు రాజకీయ నాయకత్వానికి అధికారాన్ని అప్పగించడం చాలా అరుదుగా జరిగే పరిణామం. కానీ భారతదేశం చేసింది అదే. ఎందుకంటే ఇది మన సంస్కృతిలో భాగం. భారతదేశం ఏ దేశంపైనా, ఎప్పుడూ దాడి చేయలేదు. ఏ ఇతర దేశపు భూమిని అంగుళం మేరకూడా ఆక్రమించలేదు.” అని అన్నారు. బంగ్లాదేశ్.లో ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భారత్ అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. గత 50 ఏళ్లలో బంగ్లాదేశ్ అభివృద్ధి పథంలోవేగంగా ముందుకు సాగిందని. ఇది ప్రపంచ మానవాళికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.

   కిరాతకం, అమానవీయత, బాధ్యతారాహిత్యంతో కూడిన వారిపై యుద్ధాలు చేసిన చరిత్ర భారతదేశానికి ఉందని,.. రామాయణ, మహాభారతాల కాలంనుంచి 1857, 1947, 1965, 1971 యుద్ధాల వరకూ, అలాగే 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం వరకూ భారతదేశానికి ఇదే చరిత్ర అని రాజనాథ్ సింగ్ అన్నారు. భారతదేశంలో జరిగిన ప్రతి సైనిక చర్యకూ ‘ఆపరేషన్ విజయ్’గానే పేరుపెట్టారని,.. 1948లో ఝంగార్.ను బ్రిగేడియర్ ఉస్మాన్ తిరిగి స్వాధీనం చేసుకోవడం, 1961లో గోవా, డామన్-డయ్యూ విమోచనతో పాటుగా, 1999లో కార్గిల్ విజయం వరకూ ఇలాగే జరిగిందని అన్నారు. కార్గిల్ యుద్ధంలో ఘనవిజయాన్ని ‘కార్గిల్ విజయ దివస్’ పేరిట ఉత్సవంగా నిర్వహించుకున్నామని అన్నారు. స్వర్ణిం విజయ పర్వ అనేది ఏదో ప్రత్యేక సైనిక చర్య మాత్రమే కాదని, సాయుధ బలగాల విజయానికి, దేశం విజయానికి స్ఫూర్తిదాయంగా ఇది నిలిచిందని అన్నారు.

  20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత, ఎంతో నిర్ణయాత్మక యుద్ధంగా 1971 ఇండో పాక్ యుద్ధాన్ని అభివర్ణించవచ్చని రాజనాథ్ సింగ్ చెప్పారు. “మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడం చారిత్రాత్మక తప్పిదమని ఈ యుద్ధం మనకు స్పష్టంగా చెబుతోంది. మతంపేరుతోనే పాకిస్తాన్ ఆవిర్భవించింది. అయితే, ఒకేదేశంగా అది నిలవలేకపోయింది. 1971లో పరాజయం తర్వాత, అది పరోక్ష యుద్ధం కొనసాగిస్తూనే వస్తోంది. ఉగ్రవాదంతో, తదితర భారత వ్యతిరేక కార్యకలాపాలతో భారతదేశంలో శాంతిని విచ్ఛిన్నం చేయాలన్నదే పాకిస్తాన్ కోరిక. 1971 యుద్ధంలో వారి కుట్రలన్నింటినీ భారతీయ బలగాలు వమ్ము చేశాయి. మరోవైపు ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకళించి వేయడానికి కృషి జరుగుతూనే ఉంది. ప్రత్యక్షయుద్ధంలో మనం విజయం సాధించాం. ఇక పరోక్ష యుద్ధంలోనూ విజయం మనదే అవుతుంది.” అని ఆయన అన్నారు. “భారతదేశంపై దాడి చేసిన ఘోరీ, ఘజ్నవీ, అబ్దాలీ వంటి వారి పేర్లతో పాకిస్తాన్ వారు తమ క్షిపణులకు నామకరణం చేయడాన్నిబట్టి చూస్తే, పాకిస్తాన్.కు ఏమేరకు భారతీయ వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశం మాత్రం తన క్షిపణులకు ఆకాశ్, పృథ్వీ, అగ్ని వంటి పేర్లు పెడుతోంది. ఇపుడు మన క్షిపణుల్లో ఒకదానికి సంత్ అని నామకరణం చేశాం” అని అన్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి, ఈ నెల 11వ తేదీన పోఖ్రాన్ ప్రాంతంనుంచి ట్యాంకు విధ్వంసక క్షిపణులను విజయవంతంగా పరీక్షించడం హర్షణీయమని ఆయన అన్నారు. ఇందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.)కు ఆయన అభినందనలు తెలిపారు. 

  మన త్రివిధ దళాల సమైక్య స్వభావానికి, సమగ్రతకు 1971 ఇండోపాక్ యుద్ధం ప్రతీకగా నిలిచిందని రక్షణ మంత్రి అన్నారు. సమైక్యంగా ప్రణాళికలు రచించుకోవడం, శిక్షణ అందించడం, కలసికట్టుగా పోరాటం సాగించడం ఎంత ముఖ్యమో ఈ యుద్ధం తేటతెల్లం చేసిందన్నారు. సాయుధ బలగాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని అన్నారు. “రక్షణ సిబ్బంది ప్రధాన అధిపతి (సి.డి.ఎస్.) పదవిని సృష్టించడం, సైనిక వ్యవహారాలకుప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడం వంటి సంస్కరణలు, సాయుధ బలగాల భవిష్యత్తు అవసరాలను తీర్చగలవు. సేకరణ దశనుంచి ఉత్పాదన దశవరకూ,.. బలగాలను మరింత సమర్థవంతంగా, మరింత స్వావలంబననతో  తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నాం. రక్షణ పరిశోధన, రూపకల్పన, తయారీ రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. రక్షణ రంగంలో స్వావలంబనే లక్ష్యంగా ఆత్మనిర్భర భారత్ అభియాన్ పథకం ద్వారా కృషి జరుగుతోంది. ఎలాంటి విషమ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన సాయుధ బలగాలను సంసిద్ధం చేస్తున్నాం.” అని కేంద్రమంత్రి అన్నారు. 1961లో జరిగిన గోవా విమోచనను ఆయన ప్రస్తావిస్తూ,..“మనల్ని విభజించడానికి ఇతరులెవరో ప్రయత్నించిన ప్రతి సారీ మనం మరింత సమైక్యంగా బలపడుతున్నాం. శత్రువులను దీటుగా ఎదుర్కొంటున్నాం.” అని అన్నారు.

  బంగ్లాదేశ్ విమోచన యుద్ధం వ్యవహారాల మంత్రి మొజమ్మెల్ హఖ్, ముక్తి యోధుల వీడియో సందేశాలను ఈనాటి కార్యక్రమంలో ప్రదర్శించారు. ఆ తర్వాత వాల్ ఆఫ్ ఫేమ్.ను ఆవిష్కరించారు. 1971 యుద్ధంలో ఉపయోగించిన ప్రధాన ఆయుధాలను, యుద్ధ పరికరాలను కూడా ప్రదర్శించారు. కలరిపాయట్టు, గత్కా, ఖుఖ్రీ నృత్య ప్రదర్శనలు, దృశ్య శ్రవణ ప్రదర్శన, శునక ప్రదర్శన, హాట్ ఎయిర్ బెలూనింగ్ వంటి కార్యక్రమాలను వచ్చే రెండు రోజుల్లో నిర్వహించనున్నారు. యుద్ధంపై చలన చిత్రాలను, 1971 యుద్ధానికి సంబంధించి, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో జరిగిన ప్రధాన సైనిక చర్యలను వివరిస్తూ భారీ ప్రదర్శనను కూడా నిర్వహించనున్నారు. అద్భుతమైనవిగా పేర్కొనదగిన నాలుగు సైనిక చర్యలను ఎగ్జిబిషన్ రూపంలోకి పునర్నిర్మించి ప్రదర్శిస్తారు. అలాగే యుద్ధం సంఘటనల త్రీడీ చిత్రాల నమూనాలు, పాకిస్తాన్ స్థావరాలను స్వాధీనం చేసుకునే పి.టి.-76 ట్యాంకుల నమూనాలను కూడా ప్రదర్శిస్తారు. సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల ద్వారా సాగుతూ వస్తున్న విజయ జ్యోతి పయనం కూడా ఈ ఉత్సవంతో ముగుస్తుంది. యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికుల గ్రామాలనుంచి సేకరించిన మట్టి నమూనాలను ఈ నెల 16వ తేదీన జరగనున్న జరిగే మహా ఉత్సవ ప్రదేశానికి చేరుస్తారు.  

  ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి, రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్, సాయుధ బలగాల ప్రధాన అధిపతి జనరల్ ఎం.ఎం. నరవణే, వైమానిగ దళ ప్రధాన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌధరీ, నావికాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ ఆర్. హరి కుమార్, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, మాజీ సైనికుల సంక్షేమ వ్యవహారాల కార్యదర్శి బి. ఆనంద్, రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు సంజయ్ మిట్టల్, రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ సివిల్ అధికారులు, సైన్యాధికారులు, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్.సి.సి.) కేడెట్లు, సాధారణ ప్రజలు హాజరయ్యారు. 

 

****


(Release ID: 1780744) Visitor Counter : 175