కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

గురుగ్రామ్ (మనేసర్)లో 500 పడకలు, మీరట్‌లో 100 పడకలతో ఇఎస్‌ఐసి ఆసుపత్రుల ఏర్పాటు


దుబ్రి (ఒడిశా), అచ్యుతాపురం, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)లో కొత్త ఇఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణానికి, అస్సాంలోని టిన్సుకియాలోని ఈఎస్ఐఎస్ ఆసుపత్రిని స్వాధీనం చేసుకోవడానికి ఆమోదం తెలిపిన ఇఎస్‌ఐసి 186వ సమావేశం

ఇఎస్‌ఐసి కోవిడ్-19 సహాయ పథకంలో చేరడానికి నిబంధనలు సడలించిన ఇఎస్‌ఐసి


40 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న బీమా చేయబడిన వ్యక్తుల కోసం నివారణ వార్షిక ఆరోగ్య తనిఖీ పై దృష్టి సారించే పైలట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన ఇఎస్‌ఐసి

ఇఎస్‌ఐసి వ్యవస్థను పటిష్టం చేసి, సేవలను మెరుగుపరచడానికి సూచనలు ఇవ్వడానికి ఉన్నతాధికార కమిటీల ఏర్పాటు

దేశంలో కార్మికులు, వారిపై ఆధారపడిన జీవిస్తున్న కుటుంబాలకు మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు మరింత వేగంగా సమర్థంగా పని చేయాలి: శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 04 DEC 2021 6:00PM by PIB Hyderabad

బీమా సౌకర్యం కలిగి 40 సంవత్సరాలు అంతకు మించి వయస్సు కలిగిన వారికి ఏడాదికోసారి వ్యాధుల నిర్ధారణ కోసం ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి రూపొందించిన ప్రత్యేక పథకాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి, ఇఎస్‌ఐసి చైర్మన్ శ్రీ భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ఈ రోజు ప్రారంభించారు.  అహ్మదాబాద్ఫరీదాబాద్హైదరాబాద్ మరియు కోల్‌కతాలో ఉన్న నాలుగు  ఇఎస్‌ఐసి   మెడికల్ కాలేజీలు/ఆసుపత్రులలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేస్తారు. బీమా సౌకర్యం కలిగిన వారిలో ముందుగా వ్యాధులను గుర్తించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. నాలుగు ఇఎస్‌ఐసి   మెడికల్ కాలేజీలు/ఆసుపత్రులలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం అమలును తాను స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి వెల్లడించారు. దశలవారీగా ఈ పథకాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలలో అమలు చేస్తామని అన్నారు. 

 

 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ఇఎస్‌ఐసి  ) 186వ సమావేశంలో శ్రీ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దేశంలో కార్మికులు,  వారిపై ఆధారపడిన జీవిస్తున్న  కుటుంబాలకు మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు మరింత వేగంగా సమర్ధంగా  పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రాంతీయ బోర్డుల సమావేశాలను తరచు నిర్వహించాలని రాష్ట్రాలకు మంత్రి సూచించారు. దీనివల్ల వీటిలో అందే సూచనలు, సలహాలు అమలు చేయడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. ఇకపై ఇఎస్‌ఐసి సమావేశాలను ప్రతి ఏడాది నాలుగుసార్లు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. 

 

ఇఎస్‌ఐసి  వ్యవస్థను పటిష్టం చేసి, సేవలను మెరుగుపరచడానికి సూచనలు ఇవ్వడానికి ఉన్నతాధికార  కమిటీలను  ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈ కింది కమిటీలను మంత్రి ప్రకటించారు. 

 i.  కార్మిక  ఉపాధి శాఖ సహాయ  మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇఎస్‌ఐ భవనాలు, మౌలిక సదుపాయాల అంశాలను పరిశీలిస్తుంది. అమలు జరుగుతున్న  ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయడానికి  కమిటీ చర్యలు తీసుకుంటుంది. 

ii. మానవ వనరులపై ఏర్పాటైన కమిటీ కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి  శ్రీ సునీల్ బర్త్వాల్  అధ్యక్షతన పనిచేస్తుంది. ఇఎస్‌ఐ  రోజువారీ పనితీరు, నియామకాలు, మానవ వనరులు పారదర్శకత మరియు ఇతర ఉత్తమ విధానాలపై  కార్యాచరణ ప్రణాళికను ఈ కమిటీ రూపొందించి సిఫార్సు చేస్తుంది. 

 iii. సామర్థ్య పెంపుదల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెలి-మెడిసిన్ఔషధాల సేకరణ మరియు పంపిణీపై ఆన్‌లైన్ పర్యవేక్షణ కోసం ఏర్పాటైన  ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ  కమిటీకి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి  శ్రీ సునీల్ బర్త్వాల్ నేతృత్వం వహిస్తారు.

ఈ మూడు కమిటీలలో ఉద్యోగులు, యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం, ఇఎస్‌ఐ ప్రతినిధులు సభ్యులుగా నియమింప బడతారు. 

కోవిడ్-19 బారిన పడి మరణించిన బీమా పొందిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఇఎస్‌ఐసి ప్రత్యేకంగా సహాయ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి ఇదివరకు 70 రోజుల పాటు కంట్రిబ్యూటరీ చెల్లింపు చేయాలన్న నిబంధన ఉంది. ఈ వ్యవధిని 35 రోజులకు తగ్గించాలని సమావేశం నిర్ణయించింది. 

 మనేసర్‌లోని హెచ్‌ఎస్‌ఐఐడిసిలో 500 పడకల ఇఎస్‌ఐసి హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి  8.7 ఎకరాల స్థలాన్ని సేకరించేందుకు ఇఎస్‌ఐసి సమావేశం ఆమోదించింది.  మీరట్‌లో 100 పడకల ఇఎస్‌ఐసి ఆసుపత్రి నిర్మాణం కోసం 2.024 హెక్టార్ల భూమిని సేకరించేందుకు కూడా ఆమోదం లభించింది.  ఈ స్థలాన్ని ఉచితంగా అందించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. 

ఒడిశాలోని దుబూరిలో 50 పడకల  ఇఎస్‌ఐ   ఆసుపత్రి (100 పడకలకు విస్తరించే సౌకర్యంతో ) నిర్మించడానికి 5 ఎకరాల  భూమిని సేకరించేందుకు , టిన్సుకియాలో  ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఆసుపత్రిని స్వాధీనం చేసుకుని దానిని  100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడం కోసం  వచ్చిన ప్రతిపాదనలను   ఇఎస్‌ఐసి సమావేశం ఆమోదించింది.   ఒడిశాలోని ఝార్సుగూడలో సబ్ రీజనల్ ఆఫీస్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా సమావేశం  ఆమోదం తెలిపింది.

విశాఖపట్నంలోని అచ్యుతాపురంలో 30 పడకల ఇఎస్‌ఐఎస్   ఆసుపత్రి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన 2.00 ఎకరాల (8089.07 చ.మీ) స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 

2020-21 సంవత్సరానికి   ఇఎస్‌ఐసి   కార్యకలాపాలపై విశ్లేషణతో పాటు వార్షిక నివేదికను సమావేశం ఆమోదించింది. కాగ్   ఆడిట్ చేసిన  2020-21 సంవత్సరం  వార్షిక ఖాతాలను కూడా సమావేశం  ఆమోదించింది.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన, పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ సహాయ మంత్రి ఇఎస్‌ఐసి వైస్-ఛైర్మన్ శ్రీ రామేశ్వర్ తేలి, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ కార్యదర్శి    శ్రీ సునీల్ బర్త్వాల్ఇఎస్‌ఐసి డైరెక్టర్ జనరల్ శ్రీ ముఖ్మీత్ ఎస్ భాటియా, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి సిబానీ స్వైన్ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సంయుక్త  సెక్రటరీ   విభా భల్లాఇఎస్‌ఐసి ఫైనాన్షియల్ కమీషనర్ శ్రీ హేమంత్ జైన్, సభ్యులు,  ఉద్యోగ, యాజమాన్య సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. 

***



(Release ID: 1778137) Visitor Counter : 124


Read this release in: English , Urdu , Hindi