ప్రధాన మంత్రి కార్యాలయం

ఆర్థిక సాంకేతికతపై మేధో నేతృత్వ ‘అనంత వేదిక’ను ప్రారంభించిన ప్రధానమంత్రి


“నిరుడు భారత్‌లో మొబైల్ చెల్లింపులు తొలిసారి
ఏటీఎం నగదు ఉపసంహరణలను మించాయి”

“డిజిటల్ ఇండియా కింద చేపట్టిన పరివర్తనాత్మక చర్యలు పాలనకు
వర్తించే వినూత్న ఆర్థిక సాంకేతిక పరిష్కారాలకు బాటలు వేశాయి”

“ఇది ‘ఫిన్‌టెక్’ చర్యలను విప్లవంగా మార్చే సమయం.. అది దేశంలో
ప్రతి పౌరుడి ఆర్థిక సాధికారత సాధనకు తోడ్పడేది కావాలి”

“విశ్వాసం అంటే మీరు ప్రజా ప్రయోజనాలను సురక్షితంగా ఉంచడం.. ఆర్థిక సాంకేతికతలో భద్రతను ఆవిష్కరించకపోతే ఆర్థిక ఆవిష్కరణలు అసంపూర్ణమే”

“మా ప్రభుత్వ డిజిటల్ మౌలిక పరిష్కారాలు
ప్రపంచ ప్రజానీకం జీవితాలను మెరుగుపరచగలవు”

“గిఫ్ట్ సిటీ కేవలం ఒక ప్రాంగణం కాదు.. ఇది భారత ప్రజాస్వామ్య విలువలు.. డిమాండ్-జనాభా-వైవిధ్యాలకు ప్రతిబింబం.. ఆలోచనలుసహా ఆవిష్కరణలు-పెట్టుబడుల విషయంలో దాపరికంలేని భారతదేశపు వైఖరికి ప్రతీక”

“ఆర్థిక వ్యవస్థకు జీవం ద్రవ్యం.. దానికి వాహకం సాంకేతికత..
అంత్యోదయ లక్ష్య సాధనలో రెండింటికీ సమాన ప్రాధాన్యం ఉంది”

Posted On: 03 DEC 2021 10:53AM by PIB Hyderabad

   ర్థిక సాంకేతికత (ఫిన్‌టెక్‌)పై మేధో నేతృత్వ ‘అనంత వేదిక’ను ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ- చరిత్ర అద్భుత పరిణామాన్ని ద్రవ్యం (కరెన్సీ) మన కళ్లకు కడుతుందని ప్రధాని అన్నారు. నిరుడు భారత్‌లో మొబైల్ చెల్లింపులు తొలిసారిగా ఏటీఎం నగదు ఉపసంహరణలను మించిపోయాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భౌతికంగా ఎలాంటి శాఖా కార్యాలయాలు లేకుండానే డిజిటల్ బ్యాంకులు ఇప్పటికే పూర్తిగా అందుబాటులోకి వచ్చాయని, మరో దశాబ్దంలోగానే ఇవి సర్వసాధారణం కాగలవని పేర్కొన్నారు. “మన లావాదేవీల రూపం కూడా మానవ పరిణామ క్రమం తరహాలోనే మారుతూ వచ్చింది. ఆ మేరకు వస్తు మార్పిడి విధానం నుంచి లోహాలదాకా… నాణేల నుంచి నోట్ల వరకూ.. చెక్కుల నుంచి కార్డులదాకా నేడు ప్రస్తుత దశకు చేరుకున్నాం” అని ఆయన వివరించారు.

   సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం లేదా దానిచుట్టూ సరికొత్త ఆవిష్కరణలు చేపట్టడంలో ఏ దేశానికీ తీసిపోదని భారత్‌ ప్రపంచానికి నిరూపించిందని ప్రధానమంత్రి అన్నారు. డిజిటల్ ఇండియా కింద చేపట్టిన పరివర్తనాత్మక చర్యలు పాలనకు వర్తించే వినూత్న ఆర్థిక సాంకేతిక పరిష్కారాలకు బాటలు వేశాయని చెప్పారు. ఇక ‘ఫిన్‌టెక్’ చర్యలను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “ఈ విప్లవం దేశంలో ప్రతి పౌరుడి ఆర్థిక సాధికారత సాధనకు తోడ్పడేది కావాలి” అని ఆయన స్పష్టం చేశారు.

   ర్థిక సార్వజనీనతకు సాంకేతికత ఎలా ఉత్ప్రేరకంలా పనిచేసిందో వివరిస్తూ- దేశంలో 2014నాటికి 50 శాతంకన్నా తక్కువమంది భారతీయులకే బ్యాంకు ఖాతా ఉండేదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గడచిన ఏడేళ్లలోనే 430 మిలియన్ల జన్‌ధన్‌ ఖాతాలతో భారత్‌ దాదాపు సార్వజనీనత సాధించిందని శ్రీ మోదీ వివరించారు. అలాగే గత సంవత్సరం 690 మిలియన్‌ ‘రూపే’ కార్డుల ద్వారా 1.3 బిలియన్‌ లావాదేవీలు నిర్వహించినట్లు ఆయన  పేర్కొన్నారు. ఇక గత నెలలో దాదాపు 4.2 బిలియన్ ‘యూపీఐ’ లావాదేవీలు జరిగినట్లు తెలిపారు; జీఎస్టీ పోర్టల్‌లో ప్రతి నెలలోనూ దాదాపు 300 మిలియన్ ఇన్‌వాయిస్‌లు అప్‌లోడ్ చేయబడుతుండగా; మహమ్మారి సమయంలోనూ నిత్యం సుమారు 1.5 మిలియన్‌ రైల్వే టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఇక నిరుడు ‘ఫాస్టాగ్‌’ 1.3 బిలియన్ నిరంతర లావాదేవీలను పూర్తిచేసిందన్నారు. మరోవైపు ‘పీఎం స్వనిధి’ దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులకు రుణలభ్యతను అందుబాటులోకి తెచ్చిందని, అదేవిధంగా ‘ఇ-రుపీ’తో నిర్దిష్ట సేవల ప్రదానంలో అక్రమాలకు తావులేకుండా పోయిందని ప్రధానమంత్రి వెల్లడించారు.

   ర్థిక సాంకేతికత విప్లవానికి చోదకం ఆర్థిక సార్వజనీనతేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దీన్ని గురించి మరింత వివరిస్తూ- ఆర్థిక సాంకేతిక ప్రధానంగా… ‘ఆదాయం, పెట్టుబడులు, బీమా, సంస్థాగత రుణపరపతి’ అనే నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉందని చెప్పారు. ఆ మేరకు “ఆదాయం పెరిగితే పెట్టుబడులు సాధ్యమవుతాయి… బీమా విస్తృతివల్ల మరింత చొరవ తీసుకోగల సామర్థ్యంతోపాటు పెట్టుబడులకు వీలు కల్పిస్తుంది. సంస్థాగత రుణ పరపతి విస్తరణకు రెక్కలు తొడుగుతుంది. తదనుగుణంగా ఈ మూల స్తంభాల్లో ప్రతిదానిపైనా మేమెంతో కృషి చేశాం. ఇవన్నీ కలిసివచ్చినపుడు ఆర్థికరంగంలో చాలామంది పాలుపంచుకుంటున్నట్లు మీరు హఠాత్తుగా కనుగొంటారు” అని ప్రధానమంత్రి విశదీకరించారు.

   సరికొత్త ఆవిష్కరణలకు ప్రజానీకం ఆమోదం లభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక సాంకేతికతపై విశ్వాసానికిగల ప్రాధాన్యం గురించి ప్రధాని నొక్కిచెప్పారు. డిజిటల్‌ చెల్లింపులు, సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవడం ద్వారా సామాన్య భారతీయులు తమ ఆర్థిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థపై ఎనలేని విశ్వాసం చూపారని ఆయన పేర్కొన్నారు. అయితే, “ఈ విశ్వాసం ఒక బాధ్యత. విశ్వాసమంటే మీరు ప్రజా ప్రయోజనాలను సురక్షితంగా ఉంచడం. ఆర్థిక సాంకేతికతలో భద్రతను ఆవిష్కరించకపోతే ఆర్థిక ఆవిష్కరణలు అసంపూర్ణమే” అని ఆయన స్పష్టం చేశారు. ‘ఫిన్‌టెక్’ రంగంలో భారత్‌ అనుభవాన్ని విస్తృతంగా వర్తింపజేయడం గురించి ప్రధానమంత్రి వివరించారు. ఈ మేరకు అనుభవాలు, నైపుణ్యాన్ని ప్రపంచంతో ఇచ్చిపుచ్చుకునే  వైఖరిని భారతదేశ అనుసరిస్తున్నదని ఆయన నొక్కి చెప్పారు. ఆ మేరకు  “మా ప్రభుత్వ డిజిటల్ మౌలిక పరిష్కారాలు ప్రపంచ ప్రజానీకం జీవితాలను మెరుగుపరచగలవు” అంటూ ప్రధానమంత్రి ఆహ్వానం పలికారు.

   గిఫ్ట్‌ సిటీ అంటే కేవలం ఒక ప్రాంగణం కాదని, ఇది భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ఇది భారత ప్రజాస్వామ్య విలువలు.. డిమాండ్-జనాభా-వైవిధ్యాలకు ప్రతిబింబమని ప్రకటించారు. అలాగే ఆలోచనలుసహా ఆవిష్కరణలు-పెట్టుబడుల విషయంలో దాపరికంలేని భారతదేశపు వైఖరికి ప్రతీకగా నిలుస్తుందని వివరించారు. ప్రపంచ ఆర్థిక సాంకేతికతకు గిఫ్ట్‌ సిటీ ఒక సింహద్వారమని ప్రస్ఫుటం చేశారు. ప్రధానమంత్రి తన ఉపన్యాసం ముగిస్తూ- “ఆర్థిక వ్యవస్థకు జీవం ద్రవ్యం.. దానికి వాహకం సాంకేతికత.. అంత్యోదయ-సర్వోదయ లక్ష్యాల సాధనలో రెండింటికీ సమాన ప్రాధాన్యం ఉంది” అన్నారు.

   కార్యక్రమాన్ని భారత ప్రభుత్వంతోపాటు గిఫ్ట్‌ సిటీ, బ్లూమ్‌బెర్గ్‌ల సహకారంతో డిసెంబరు 3, 4 తేదీలలో ‘ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సెంటర్స్‌ అథారిటీ (ఐఎఫ్‌సీఏ) నిర్వహిస్తోంది. ఈ తొలి సంచిక కార్యక్రమంలో ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, యూకే దేశాల భాగస్వామ్యం కూడా ఉంది. విధానాలు, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానాల్లో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలోగల మేధావులను ఈ ‘అనంత వేదిక’ ఒకచోటకు చేరుస్తుంది. తద్వారా సమ్మిళిత వృద్ధి, మానవాళికి విస్తృత సేవలలో ‘ఫిన్‌టెక్’ పరిశ్రమ ద్వారా సాంకేతికత-ఆవిష్కరణల వినియోగంపై చర్చలు, కార్యాచరణకు అవసరమైన దృక్పథాన్ని రూపొందిస్తుంది.

   ‘సుదూర భవిత’ ప్రధాన ఇతివృత్తంగా ఈ వేదిక దృష్టి సారిస్తుంది. ఇందులో ఆర్థిక సాంకేతికత భవిష్యత్‌ హద్దులుసహా అనేక ఉప ఇతివృత్తాలు చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ప్రభుత్వాలు, వ్యాపారాలు భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ఆర్థిక సార్వజనీనతను ప్రోత్సహించే దిశగా ప్రపంచ అభివృద్ధిపై దృష్టి సారించడం వీటి లక్ష్యం. ఆర్థికానికి అతీతంగా వర్ధమాన రంగాలైన అంతరిక్ష సాంకేతికత, హరిత సాంకేతికత, వ్యవసాయ సాంకేతికతల ద్వారా సుస్థిర ప్రగతిని ప్రోత్సహించడంపై ‘ఫిన్‌టెక్’ దృష్టి పెడుతుంది. అలాగే ‘ఫిన్‌ టెక్‌’ పరిశ్రమ భవిష్యత్తు, కొత్త అవకాశాలపై క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఏ విధంగా ప్రభావం చూపుతుందో ‘ఫిన్‌టెక్డ్‌ బియాండ్‌ నెక్స్ట్’ దృష్టి సారిస్తుంది.

 

ఈ వేదికలో 70కిపైగా దేశాలు పాలుపంచుకున్నాయి.

 

***

***

DS/AK



(Release ID: 1777661) Visitor Counter : 173