యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

పాఠశాల సందర్శన కార్యక్రమంలో టోక్యో హీరోలు; డిసెంబర్ 4 న అహమ్మదాబాద్ లో సంస్కార ధామ్ సందర్శిస్తున్న నీరజ్ చోప్రా

Posted On: 01 DEC 2021 3:58PM by PIB Hyderabad

ట్విట్టర్ ద్వారా ప్రకటించిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖామంత్రి  శ్రీ అనురాగ సింగ్ ఠాకూర్ 

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలలో భాగమైన ఈ విశిష్ట కార్యక్రమంలో భాగం కావటం ఆనందంగా ఉంది: నీరజ్ చోప్రా

 

ఈ ఏడాది ప్రారంభంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ మన ఒలంపిక్, పారాలింపిక్  పతక విజేతలు పాఠశాలల విద్యార్థులను కలుసుకునే కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సంతులిత ఆహారం, ఫిట్ నెస్, క్రీడలు లాంటి అంశాలమీద మాట్లాడటం ద్వారా భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దేందుకు  ఈ విశిష్ట ప్రచారోద్యమం చేపట్టారు. టోక్యో ఒలంపిక్స్ లో  బంగారు పతాక విజేత, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంటింటా వినిపిస్తున్న పేరు అయిన నీరజ్ చోప్రా ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.  ముందుగా డిసెంబర్ 4 న అహమ్మదాబాద్ లోని సంస్కార్  ధామ్  పాఠశాలోని విద్యార్థులతో సంభాషిస్తారు.

 

నీరజ్  చోప్రా పర్యటన గురించిన కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖామంత్రి శ్రీ అనురాగ ఠాకూర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ప్రధాని నరేంద్ర మోడీ మన ఒలంపియన్లకు , పారాలింపియన్లకు పిలుపునిస్తూ పాఠశాలలను సందర్శించి అక్కడి విద్యార్థులతో సమతుల్యాహారం, శారీరక  దారుఢ్యం,  క్రీడలు తదితర అంశాలగురించి సంభాషించమని చెప్పారు. డిసెంబర్ 4 నుంచి నీరజ్ చోప్రా అహమ్మదాబాద్ లోని సంస్కార ధామ్ పాఠశాలతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, “ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రధాని చొరవతో రూపుదిద్దుకున్న ఈ విశిష్ట కార్యక్రమం వలన పిల్లల్లో దేహ దారుఢ్యం, పౌష్ఠికాహారం, మెరుగైన అవగాహన ఫలితంగా క్రీడా సంస్కృతి వర్ధిల్లుతుంది. దైనందిన జీవితంలో వ్యాయామం పట్ల అవగాహన  పెరుగుతుంది. ఒక క్రీడాకారునిగా యువతను ఆరోగ్యవంతమైన జీవితం వైపు నడిపించవచ్చు. సంస్కార ధామ్ విద్యార్థులతో సంభాషించాలని ఆరాటపడుతున్నాను” అని నీరజ్  వ్యాఖ్యానించారు.

నీరజ తో బాటు తరుణ్ దీప్  ( విలువిద్య), సార్థక్  భయంభ్రీ ( అథ్లెటిక్స్), సుశీలాదేవి ( జూడో), కెసి గణపతి, వరుణ్ ఠక్కర్ (సెయిలింగ్)  వచ్చే రెండు నెలలకాలంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తారు. పారాలింపియన్స్ లో అవని లేఖరా (పారా షూటింగ్), భవానీ పటేల్ ( పారా టేబుల్ టెన్నిస్), దేవేంద్ర జజహారియా (పారా అథ్లెటిక్స్) కూడా పాల్గొంటారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విద్యా మంత్రిత్వశాఖ, యువజనవ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

సాధ్యమైనంత వరకు దేశవ్యాప్తంగా పర్యటించటానికి ఒలంపిక్, పారాలింపిక్  విజేతలు సిద్ధమవుతున్నారు. గొప్ప క్రీడాకారులుగా తయారుకావటానికి విద్యార్థులలో స్ఫూర్తి నింపుతూ వీరి పర్యటనలు సాగుతాయి.

 

****



(Release ID: 1777012) Visitor Counter : 124